close

ప్ర‌త్యేక క‌థ‌నం

పార్టీలకు బంధమే దిక్‌సూచి!

తూర్పు, పశ్చిమ, దక్షిణాది రాష్ట్రాల్లో 242 స్థానాలు
కుదిరిన చోట పార్టీల పొత్తుల వ్యూహాలు

ఉత్తరాది పార్టీగా ముద్రపడిన భాజపా దక్షిణాదిపైనా, అలాగే తూర్పు, పశ్చిమ రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఈ రాష్ట్రాలన్నింటా కలిపి ఏకంగా 242 లోక్‌సభ స్థానాలున్నాయి. మరో జాతీయ పార్టీ కాంగ్రెస్‌ కూడా గత వైభవాన్ని సాధించేందుకు కృషి చేస్తోంది.

ఈ క్రమంలో ఎన్‌డీయే, యూపీయేలకు నేతృత్వం వహిస్తున్న ఆ పార్టీలు పలు రాష్ట్రాల్లో ప్రాంతీయపార్టీలతో పొత్తులు కుదుర్చుకుని సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. బలం ఉన్న, పొత్తులు కుదరని రాష్ట్రాల్లో మాత్రం ఒంటరిగానే ముందుకుసాగుతున్నాయి. కేంద్రంలో ఏ పార్టీకీ, ఏ కూటమికీ మెజారిటీ దక్కని పరిస్థితుల్లో దిల్లీలో చక్రం తిప్పాలని భావిస్తున్న ప్రాంతీయపార్టీలు తమ సొంతబలాన్ని పెంచుకునేందుకు పాటుపడుతున్నాయి.

ఎవరి దారి వారిదే

రాష్ట్రంలో తెరాస, కాంగ్రెస్‌, భాజపా, ఎంఐఎం, సీపీఐ, సీపీఎం, జనసేన, తెజస తలపడుతున్నాయి. తెరాస, ఎంఐఎం మధ్య స్నేహపూర్వక పోటీ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌, తెదేపా, తెలంగాణ జన సమితి, సీపీఐ పొత్తుపెట్టుకున్నా లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఎవరిదారిన వారు సాగుతున్నారు. కాంగ్రెస్‌, తెరాస, భాజపా ఇప్పటికే అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. తెదేపా మాత్రం లోక్‌సభ నియోజకవర్గాలవారీగా కాంగ్రెస్‌ అభ్యర్థన మేరకు ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతిచ్చేందుకు అంగీకరించింది. సీపీఐ, సీపీఎం జట్టుగా ముందుకెళ్తున్నాయి.

* 2014లో..తెరాస: 11, కాంగ్రెస్‌: 2, భాజపా: 1, తెదేపా: 1, ఎంఐఎం: 1, వైకాపా: 1

ఒంటరిగా 4.. కూటమిగా 4

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో తెదేపా, వైకాపా, జనసేన, భాజపా, కాంగ్రెస్‌ ఎన్నికల గోదాలోకి దిగినా ప్రధాన పోటీమాత్రం తెదేపా, వైకాపా, జనసేన కూటమి మధ్యే కనిపిస్తోంది. తెదేపా ఒంటరిగా అన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది. వైకాపా, కాంగ్రెస్‌, భాజపా ఒంటరిగానే గోదాలోకి దిగాయి. జనసేన మాత్రం బీఎస్పీ, సీపీఐ, సీపీఎంలతో పొత్తుపెట్టుకొంది. బీఎస్పీకి 3 లోక్‌సభ, 21 అసెంబ్లీ, సీపీఐ, సీపీఎంలకు 7 అసెంబ్లీ, రెండు లోక్‌సభ సీట్లచొప్పున కేటాయించి మిగిలిన అన్ని స్థానాల్లో తన అభ్యర్థులను రంగంలోకి దింపుతోంది.

* 2014లో.. లోక్‌సభ.. తెదేపా: 15, వైకాపా: 8, భాజపా: 2 శాసనసభ.. తెదేపా: 102, వైకాపా: 67, భాజపా: 4, ఇతరులు: 2

నువ్వా నేనా

పశ్చిమ రాష్ట్రమైన ఇక్కడ గల రెండు లోక్‌సభ స్థానాలకు ప్రధానంగా భాజపా, కాంగ్రెస్‌ల మధ్యే పోటీ ఉంది. ఈ రెండు పార్టీల బలం సమానంగా ఉండటంతో హోరాహోరీ పోరు జరగనుంది.

* 2014లో.. భాజపా: 2

ఢీ అంటే ఢీ

ఉత్తర్‌ప్రదేశ్‌ తర్వాత అత్యధిక లోక్‌సభ స్థానాలున్న రాష్ట్రం ఇది. ఇక్కడ భాజపా, శివసేనలు వరుసగా 25, 23 స్థానాల్లో పోటీచేయాలని ఒప్పందం చేసుకున్నాయి. మరోవైపు కాంగ్రెస్‌-26, ఎన్సీపీ-22 స్థానాల్లో పోటీకి నిర్ణయించాయి. ఈ కూటమికి 56 పార్టీలు సంస్థలు మద్దతిస్తున్నట్టు ఆయా పార్టీల రాష్ట్ర అధ్యక్షులు పేర్కొన్నారు. ఎన్సీపీకి కేటాయించిన సీట్లలో స్వాభిమాని శేత్కరీ సంఘటన్‌, యువస్వాభిమాన్‌ పార్టీలు ఒక్కో స్థానం నుంచి పోటీ చేస్తాయి. బహుజన వికాస్‌ అగాడీ, స్వాభిమాని శేత్కరీ సంఘటన్‌ పార్టీలు కాంగ్రెస్‌ సీట్ల నుంచి ఒక్కో స్థానంలో బరిలో నిలవనున్నాయి. మరోవైపు అంబేడ్కర్‌ మనవడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌ నేతృత్వంలోని భారీపా బహుజన్‌ మహాసంఘ్‌ హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎంతో కలిసి పోటీచేయడానికి సిద్ధమైంది.

* 2014లో.. భాజపా- 23, శివసేన- 18, ఎన్సీపీ- 04, కాంగ్రెస్‌- 02, స్వాభిమాన పక్ష- 01

ఎవరికి వారే

రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలుచుకొని ప్రధానమంత్రి పదవిని కైవసం చేసుకోవాలని అగ్గిబరాటా మమతాబెనర్జీ రాజకీయ ఎత్తులు వేస్తున్నారు. అందుకే ఎవ్వరితోనూ పొత్తులు పెట్టుకోకుండా ఇప్పటికే 42 మంది అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల గోదాలోకి దిగిపోయారు. కాంగ్రెస్‌, లెఫ్ట్‌పార్టీలు ఎన్నికల అవగాహనతో వెళ్లాలని తొలుత భావించినా అది సాధ్యంకాలేదు. ఇప్పటికే వామపక్షాలు 25, కాంగ్రెస్‌ 27 మంది అభ్యర్థులను ప్రకటించి బరిలోకి దూకేశాయి. తమతో చర్చించకుండా సీపీఎం అభ్యర్థులను ప్రకటించేయడంతో కాంగ్రెస్‌ కూడా ఒంటరిగానే పోటీకి సిద్ధమైంది. ఆ పార్టీ సీపీఎం సిట్టింగ్‌ స్థానాలైన రాయ్‌గంజ్‌, ముర్షీదాబాద్‌లో అభ్యర్థులను నిలిపింది. కాంగ్రెస్‌ సిట్టింగ్‌ స్థానాలైన బెర్హంపూర్‌, మాల్దా నార్త్‌, మాల్దా సౌత్‌, జంగీపూర్‌లోనూ సీపీఎం అభ్యర్థులను నిలబెట్టే అవకాశం కనిపిస్తోంది. ఆ రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ వేడిని ఆసరాగా చేసుకొని గత రెండు ఎన్నికల్లో డార్జిలింగ్‌ స్థానాన్ని భాజపా కైవసం చేసుకొంది. ఈసారి అక్కడ తృణమూల్‌ కాంగ్రెస్‌ స్థానిక గూర్ఖా కమ్యూనిటీకి సంబంధించిన అభ్యర్థిని ప్రకటించడంతో భాజపా పునరాలోచనలో పడింది.

* 2014లో.. తృణమూల్‌ కాంగ్రెస్‌- 34, సీపీఎం- 02, భాజపా- 02, కాంగ్రెస్‌- 04

లోక్‌సభకే పొత్తులు..

ఈ రాష్ట్రంతోపాటు, పక్కనే ఉండే పుదుచ్చేరిని కలుపుకుంటే ఇక్కడ 40 స్థానాలవుతాయి. దక్షిణ భారతదేశంలో లోక్‌సభ స్థానాల్లో అతిపెద్ద రాష్ట్రం ఇదే కావడంతో కేంద్రంలో పాగావేయడానికి అటు కాంగ్రెస్‌, ఇటు భాజపా స్థానిక పొత్తులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి పళనిస్వామి ఆధ్వర్యంలోని ఏఐఏడీఏంకే, వన్నియార్‌ సామాజికవర్గానికి ప్రాతినిధ్యం వహించే పీఎంకే, విజయకాంత్‌ నేతృత్వంలోని డీఎండీకే, జీకే వాసన్‌ నేతృత్వంలోని టీఎంసీ, పుదయ తమిళగం, పుదియ నీధి కచ్చి, న్యూ జస్టిస్‌ పార్టీలతో భాజపా కూటమి కట్టింది. డీఎంకే, కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ, విడుదలై చిరుతైగల్‌ కచ్చి(వీసీకే), ఎండీఎంకే , కొంగునాడు మక్కల్‌ దేశీయకచ్చి, ఎంఎల్‌పార్టీ కూటమిగా పోటీచేయనున్నాయి. మరోవైపు టీటీవీ దినకరన్‌ అటు లోక్‌సభ, 18 అసెంబ్లీ ఉప ఎన్నికల స్థానాలకు ఒంటరిగానే అభ్యర్థులను నిలబెట్టబోతున్నారు. లోక్‌సభ ఎన్నికలకు పొత్తులు కుదుర్చుకున్న డీఎంకే, ఏఐఏడీఎంకేలు 18 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో మాత్రం ఒంటరిగానే రంగంలోకి దిగుతున్నాయి.

* 2014లో.. అన్నాడీఎంకే- 37, భాజపా- 01, పీఎంకే-01, పుదుచ్చేరి : ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌- 01

ఏకపక్షమేనా?

రాష్ట్రంలో ప్రస్తుతం బిజు జనతా దళ్‌(బిజద), కాంగ్రెస్‌, భాజపాల మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. 2014లో ఇక్కడ 20 స్థానాల్లో బిజద, ఒకస్థానంలో భాజపా గెలిచాయి. కాంగ్రెస్‌కు ఏమీ రాలేదు. ఈసారి బిజద, భాజపా ఒంటరిగా పోటీకి సిద్ధమయ్యాయి. కాంగ్రెస్‌ సీపీఐ, సీపీఎం, జేఎంఎంతో స్నేహపూర్వక అవగాహన కుదుర్చుకొనే అవకాశం ఉంది. అందులో భాగంగా ఆస్కా సీటు సీపీఐకి, భువనేశ్వర్‌ సీటు సీపీఎంకు, మయూర్‌భంజ్‌ స్థానం జేఎంఎంకు వదిలిపెట్టే అవకాశం ఉంది.  అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లోనూ నవీన్‌పట్నాయక్‌ నేతృత్వంలోని బిజద అయిదోసారి జయకేతనం ఎగురవేస్తుందని అంచనాలున్నాయి.

* 2014లో.. బిజద: 20, భాజపా: 1

భాజపా ఒంటరిగా..కాంగ్రెస్‌ జతగా!

రాష్ట్ర శాసనసభకు 2018లో జరిగిన ఎన్నికల అనంతరం భాజపాను అధికారానికి దూరంగా ఉంచాలన్న ఏకైక లక్ష్యంతో అనూహ్యంగా ఏర్పడిన కాంగ్రెస్‌, జేడీఎస్‌ పొత్తు తాజా లోక్‌సభ ఎన్నికల్లోనూ కొనసాగుతోంది. ఆ ప్రకారం కాంగ్రెస్‌-20, జేడీఎస్‌-8 స్థానాల్లో పోటీపడాలని నిర్ణయించాయి. భాజపా ఒంటరిగా 27 స్థానాల్లో పోటీ చేస్తోంది. మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్‌గౌడ పోటీ చేస్తున్న మండ్య లోక్‌సభ స్థానంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన ప్రముఖ నటి సుమలతకు మద్దతివ్వాలని నిర్ణయించింది. దక్షిణాదిలో భాజపాకు పట్టున్న ఏకైక రాష్ట్రమైన కర్ణాటకలో కనీసం 22 స్థానాల్లో గెలుపు సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.

* 2014లో.. భాజపా: 17, కాంగ్రెస్‌: 9, జేడీఎస్‌: 2

ఇరు కూటముల మధ్యలో భాజపా

రాష్ట్రంలో త్రిముఖ పోటీ నడుస్తోంది. యూడీఎఫ్‌ ఛత్రం కింద కాంగ్రెస్‌, ముస్లిం లీగ్‌, కేరళ కాంగ్రెస్‌(ఎం), ఆర్‌ఎస్‌పీ, జనతాదళ్‌ ఎస్‌ ఒకవైపు. ఎల్‌డీఎఫ్‌ కూటమిగా సీపీఎం, సీపీఐ ఇంకోవైపు తలపడుతున్నాయి. ఈ రెండింటికి పోటీగా భాజపా ఒంటరిగా బరిలోకి దిగుతోంది. మొత్తం 20 సీట్లలో కాంగ్రెస్‌ 16, ముస్లిం లీగ్‌ 2, కేరళ కాంగ్రెస్‌(ఎం) 1, ఆర్‌ఎస్‌పీ ఒక స్థానంలో కూటమిగా పోటీ చేస్తున్నాయి. మరోవైపు వామపక్షాల కూటమిలో సీపీఎం 16, సీపీఐ 4 స్థానాల్లో పోటీచేస్తున్నాయి. భాజపా ఒంటరిగా 20 స్థానాల్లో పోటీకి దిగుతోంది.

* 2014లో.. కాంగ్రెస్‌: 8, సీపీఎం: 5, ఇండియన్‌ ముస్లిం లీగ్‌: 2, సీపీఐ: 1, కేరళ కాంగ్రెస్‌(ఎం): 1, ఆర్‌ఎస్‌పీ: 1, ఐఎన్‌డీ: 2

- ఈనాడు, దిల్లీ

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.