close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఉద్దండ రహిత.. ద్రవిడ యుద్ధం

తమిళనాడులో జయలలిత, కరుణానిధి లేని ఎన్నికలివే
మధుర మీనాక్షమ్మ ఆశీస్సులు ఎవరికో!

ద్రవిడ భావజాలానికి ప్రతిబింబంగా, దేశ రాజకీయాల్లో విలక్షణతకు ప్రతిరూపంగా నిలిచే తమిళనాడు ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో కీలకంగా మారనుంది. 39 లోక్‌సభ నియోజకవర్గాలున్న ఈ దక్షిణాది పెద్ద రాష్ట్రం ఏప్రిల్‌ 18న రెండో విడతలో సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఇదే సమయంలో 18 అసెంబ్లీ స్థానాల్లో  జరగనున్న ఉపఎన్నికలు రాష్ట్రంలో మైనారిటీ ప్రభుత్వం నడుపుతున్న అన్నాడీఎంకే పార్టీకి  చావో రేవోగా  మారాయి. కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజ నేతలు లేకుండా జరగనున్న ఈ సార్వత్రిక ఎన్నికలపై అందరి దృష్టి నిలిచింది. లోక్‌సభతోపాటు అసెంబ్లీ ఉపఎన్నికలనూ రెండు ప్రధాన పార్టీలు కీలకంగా తీసుకోవడంతో ఎప్పుడూ లేనంతగా చిన్న పార్టీలకు ప్రాధాన్యమిస్తూ కూటములు కట్టాయి.


వ్యక్తిస్వామ్య రాజకీయాలకు పెట్టింది పేరైన తమిళనాట ఆరంభంలో కాంగ్రెస్‌ ఆధిపత్యం చాటింది. ద్రవిడ పార్టీల ప్రభావం మొదలయ్యాక జాతీయ పార్టీలు నామమాత్రంగా మారాయి. దాదాపు ఐదు దశాబ్దాలకుపైగా   అన్నాడీఎంకే, డీఎంకేలు రాష్ట్రంలో అధికారాన్ని పంచుకుంటూ మూడో పార్టీకి అవకాశం ఇవ్వడం లేదు. ఐదేళ్లకోమారు అధికార పార్టీ మారడం, ప్రజల తీర్పు కూడా అలాగే ఉండటంతో రాష్ట్రంలో అదో సంప్రదాయంగా మారింది. అన్నాడీఎంకే వ్యవస్థాపకులు ఎంజీఆర్‌, ఆయన రాజకీయ వారసురాలు జయలలిత మాత్రమే వరుసగా రెండుసార్లు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి రికార్డు సృష్టించారు. 1977 నుంచి 1987 వరకు ఎంజీఆర్‌ ముఖ్యమంత్రిగా కొనసాగారు. మరోసారి 2011, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత నేతృత్వంలో రెండు పర్యాయాలు అన్నాడీఎంకే వరుసగా అధికారంలోకి వచ్చింది. ఈ ఇద్దరు నేతలూ వరుసగా పార్టీని రెండోసారి అధికారంలోకి తీసుకొచ్చాకే, ఒకేలా ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ మృతిచెందడం గమనార్హం.

ఎన్డీయే X యూపీయే

అన్నాడీఎంకే, భాజపా నేతృత్వంలోని మొత్తం ఎనిమిది పార్టీలతో కూడిన ఎన్డీయే... డీఎంకే, కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని తొమ్మిది పార్టీలతో యూపీయే బరిలో నిలిచాయి. బహుముఖ పోరు ఉన్నప్పటికీ ప్రధాన పోటీ ఎన్డీయే, యూపీయేల మధ్యనే సాగనుంది. ముందస్తు సర్వేలు డీఎంకే, కాంగ్రెస్‌ వైపే మొగ్గు చూపడంతో... దాన్ని తగ్గించేందుకు అన్నాడీఎంకే, భాజపా సంక్షేమ పథకాలు, బ్యాంకు ఖాతాల్లో నగదు జమ వంటి పథకాలతో ముందుకెళ్తున్నాయి. రెండు కూటములు అభ్యర్థులను, మేనిఫెస్టోలను సిద్ధం చేసుకుని ఎన్నికల ప్రచారంలోకి దిగాయి.

జనాభా, రాజకీయ ప్రాధాన్యాల పరంగా దక్షిణాదిలో తమిళనాడు ముందుంది. ఆధ్యాత్మిక, పర్యాటక, సామాజిక, భౌగోళిక విశేషాల సమాహారంగా విశిష్టతను చాటుతోంది. ఇక్కడి రాజకీయ వైచిత్రి యావత్‌ దేశాన్ని ఆకర్షిస్తుంటుంది.

రాజకీయ వారసుల పోరు

అన్నాదురై, ఎంజీఆర్‌, కరుణానిధి, జయలలిత లాంటి ఉద్దండ నేతల రాజకీయ వారసులుగా ప్రధాన పార్టీల నుంచి పలువురు నేతలు ఎన్నికలకు సిద్ధమయ్యారు. డీఎంకే నుంచి పార్టీ అధినేత ఎంకే స్టాలిన్‌, కరుణానిధి కుమార్తె కనిమొళి ప్రధాన ఆకర్షణగా ఉన్నారు. అన్నాడీఎంకే నుంచి ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం ఈ ఎన్నికల్లో సత్తా చాటి అమ్మ జయలలిత రాజకీయ వారసులం తామేనని చాటాలనుకుంటున్నారు. ఇదే సమయంలో ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురై ఏఎంఎంకేను స్థాపించిన శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్‌.. అమ్మకు అసలైన రాజకీయ వారసులం తామేనంటున్నారు. ఆర్కేనగర్‌ ఉపఎన్నికల ఫలితాన్ని రాష్ట్రం అంతటా రాబడతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సినీనటుడు కమల్‌హాసన్‌ ఈ ఎన్నికల్లోనే తొలిసారి తన పార్టీ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలు, శాసనసభ ఉపఎన్నికల్లో బరిలో దిగడం లేదని స్పష్టం చేసిన సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌... ఎవరికీ మద్దతు ఇవ్వకపోవడం చర్చనీయాంశమైంది.

చిన్న పార్టీల పొత్తుతో బరిలోకి దిగనున్న వారు..

* కమల్‌హాసన్పార్టీ ఎంఎన్‌ఎం
* టీటీవీ దినకరన్‌ పార్టీ ఏఎంఎంకే
* సీమాన్‌పార్టీ నామ్‌ తమిళర్‌ కట్చి

ప్రభావం చూపే అంశాలు

* కర్ణాటక, కేరళతో కావేరీ, మేకెదాటు ఆనకట్ట, ముళ్లపెరియార్‌ జల వివాదాలు
* గజ తుపాను సహాయక చర్యల వ్యవహారం
* తూత్తుకుడి స్టెరిలైట్‌ ఆందోళనకారులపై పోలీసు కాల్పులు
* పొల్లాచ్చి లైంగిక వేధింపుల మాఫియా
* పాలనలో భాజపా జోక్యం, రాష్ట్ర హక్కులు కాలరాస్తోందని, తమిళ వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందన్న విపక్షాల ఆరోపణలు
* జయలలిత మరణం వ్యవహారం, జయలలిత లేని అన్నాడీఎంకేలో నాయకత్వ వివాదాలు
* కరుణానిధి లేని డీఎంకేలో పార్టీ అధ్యక్షుడి సామర్థ్యం, కుటుంబ పాలనపై విమర్శలు

ఎంత కీలకం అంటే..

* ప్రస్తుతం మైనార్టీ ప్రభుత్వం నడుపుతున్న అన్నాడీఎంకే పూర్తికాలం అధికారంలో కొనసాగాలంటే 18 అసెంబ్లీ ఉప ఎన్నికల్లోనూ గెలుపు తప్పనిసరి.
* ఏకకాలంలో లోక్‌సభ ఎన్నికలు, శాసనసభ ఉపఎన్నికల్లో జయకేతనం ఎగురవేయాలన్నది డీఎంకే వ్యూహం. అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు డీఎంకే దక్కించుకుంటే అన్నాడీఎంకే ప్రభుత్వం మనుగడ సాగించడం కష్టమవుతుంది.
* అన్నాడీఎంకే బహిష్కృత నేత టీటీవీ దినకరన్‌ ఆర్కేనగర్‌ ఉపఎన్నికల్లో సంచలన విజయం సాధించారు. ఆయన పార్టీ ఏఎంఎంకేతో ప్రధాన పార్టీలేవీ పొత్తు పెట్టుకోలేదు. ఉనికి చాటేందుకు ఆయనకూ ఈ ఎన్నికలు అగ్ని పరీక్షే.
* తమిళనాట దశబ్దాలుగా కాంగ్రెస్‌, భాజపా  పాగా వేయడానికి పడరాని పాట్లు పడుతున్నాయి. ఇన్నాళ్లుగా వారి ఆశలు నెరవేరలేదు. ఇప్పుడు పొత్తులతో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాయి.

ప్రస్తుత అసెంబ్లీలో బలాబలాలు

* అన్నాడీఎంకే 115, డీఎంకే 88, కాంగ్రెస్‌ 8
* ఐయూఎంఎల్‌ 1, ఏఎంఎంకే 1, నామినేటెడ్‌1, ఖాళీలు 21
* మొత్తం అసెంబ్లీ సీట్లు 234

ఎన్డీయే

* అన్నాడీఎంకే, డీఎండీకే, భాజపా, పీఎంకే, టీఎంసీ, పుదియ తమిళగం (పీటీ), న్యూ జస్టిస్‌ పార్టీ (ఎన్‌జేపీ), ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ (ఏఐఎన్‌ఆర్‌సీ).

కీలక నేతలు

* ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్‌సెల్వం, రామదాసు, విజయకాంత్‌, పొన్‌ రాధాకృష్ణన్‌, జీకే వాసన్‌, తమిళిసై సౌందరరాజన్‌

యూపీయే

* డీఎంకే, కాంగ్రెస్‌, ఎండీఎంకే, కేఎండీకే, సీపీఐ, సీపీఎం, ఐజేకే, ఐయూఎంఎల్‌, వీసీకే.

కీలక నేతలు

* ఎంకే స్టాలిన్‌, కనిమొళి, టీఆర్‌ బాలు, ఎ.రాజా, పి.చిదంబరం, కేఎస్‌ అళగిరి, తిరునావుక్కరసర్‌, వైగో
- ఈనాడు డిజిటల్‌, చెన్నై

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.