Latest Telugu News, Headlines - EENADU
close

ప్ర‌త్యేక క‌థ‌నం

రోదసిలో రక్షణ కవచం!

రోదసిలోని ఉపగ్రహాన్ని స్వదేశీ పరిజ్ఞానంతో ఢీ కొట్టే సామర్థ్యం తమకు ఉందని ఎన్నో ఏళ్ల నుంచి చెబుతున్న భారత్‌ తాజాగా దాన్ని ప్రయోగపూర్వకంగా చేసి చూపింది. చాలా సంక్లిష్టమైన ఈ ప్రయోగానికి అత్యంత ఎక్కువ కచ్చితత్వం, సాంకేతిక సామర్థ్యం అవసరం. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) శాస్త్రవేత్తలు దీన్ని అద్భుతంగా ప్రదర్శించారు. తాజా పరీక్షను ఆ సంస్థ అధిపతి జి.సతీశ్‌ రెడ్డి పర్యవేక్షించారు. 
ఎందుకీ పరీక్ష? 
భారత్‌ అంతరిక్ష కార్యక్రమం వేగంగా వృద్ధి చెందుతోంది. చంద్రుడు, అంగారకుడి వద్దకు ఉపగ్రహాలను ప్రయోగించింది. కమ్యూనికేషన్‌, భూ పరిశీలన, ప్రయోగాత్మక, దిక్సూచి, సైనిక  అవసరాల కోసం దాదాపు 102 ఉపగ్రహాలను పంపింది. శత్రువులు వీటిని తమ క్షిపణులతో నాశనం చేస్తే దేశం స్తంభించిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల మన అంతరిక్ష ఆస్తులను రక్షించుకోవడానికి ఇలాంటి సత్తాను చాటాల్సిన అవసరం ఏర్పడింది. 
ఏ క్షిపణిని వాడారు? 
శత్రుదేశాల క్షిపణులు, యుద్ధవిమానాల నుంచి రక్షించేందుకు డీఆర్‌డీవో బాలిస్టిక్‌ క్షిపణి రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. అందులో భాగంగా రూపొందించిన ఇంటర్‌సెప్టర్‌ అస్త్రాన్ని ఉపగ్రహ విధ్వంసక (ఏశాట్‌) క్షిపణిగా భారత్‌ ఉపయోగించింది. ఈ అస్త్రంలో ఘన ఇంధనంతో పనిచేసే మూడు దశలు ఉంటాయి. క్షిపణి బరువు 19 టన్నులు. పొడవు 13 మీటర్లు. 
ప్రయోగం ఎలా? 
దిగువ భూ కక్ష్యలో సంచరిస్తున్న ఒక పాత, వినియోగంలో లేని ఉపగ్రహాన్ని ఈ క్షిపణికి లక్ష్యంగా శాస్త్రవేత్తలు నిర్దేశించారు. ఆ  శాటిలైట్‌ గమనాన్ని ఈ ఆయుధ వ్యవస్థ ఎప్పటికప్పుడు పరిశీలించింది. దాని ఆధారంగా బంగాళాఖాతానికి ఎగువన ఈ శాటిలైట్‌ను ఏ ప్రాంతంలో ఢీ కొట్టవచ్చన్నదానిపై లెక్కలు కట్టింది. అన్నీ పూర్తికాగానే ఒడిశాలోని అబ్దుల్‌ కలాం దీవి నుంచి ఉదయం 11.10 గంటలకు ఏశాట్‌ క్షిపణి నింగిలోకి దూసుకెళ్లింది. 
బూస్టర్ల ప్రజ్వలన పూర్తయ్యాక ‘కిల్‌ వెహికల్‌’ (కేవీ) విడిపోయింది. అధునాతనమైన ఈ కేవీకి లక్ష్యాన్ని నేరుగా ఢీ కొట్టే సామర్థ్యం ఉంది. 
లక్షిత ఉపగ్రహం వద్దకు కేవీ చేరుకోగానే అందులోని అధునాతన టెర్మినల్‌ గైడెన్స్‌ వ్యవస్థ, ఇమేజింగ్‌ ఇన్‌ఫ్రా రెడ్‌ (ఐఐఆర్‌) సీకర్‌, ఆర్‌ఐఎన్‌జీఎస్‌ దిక్సూచి వ్యవస్థలు మార్గనిర్దేశం చేశాయి. ఉపగ్రహానికి మరింత చేరువయ్యాక అందులోని ఢీ కొట్టడానికి అనువైన బిందువును కేవీ గుర్తించి ఢీ కొట్టింది. 
ఉపగ్రహ శకలాలతో నష్టమా? 
ఏశాట్‌ పరీక్షలతో అంతరిక్షంలో శకలాల సంఖ్య పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తమవుతోంది. కక్ష్యలో చిన్నపాటి వస్తువు కూడా తూటా కన్నా ఎన్నో రెట్లు వేగంగా దూసుకెళుతుంది. అవి ఢీ కొడితే ఉపగ్రహాలకు ప్రమాదం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కూడా ఈ శకలాలను తప్పించుకోవడానికి తరచూ తన కక్ష్యను మార్చుకోవల్సి వస్తోంది. అయితే తాజా పరీక్షలో చాలా దిగువన 280 కిలోమీటర్ల ఎత్తులోని ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు ఎంచుకున్నారు. దీని శకలాల వల్ల ఇతర ఉపగ్రహాలకు నష్టం లేకుండా చూసేందుకే ఈ చర్యను చేపట్టారు. కొద్దిరోజులకే ఆ శకలాలు  భూవాతావరణంలోకి జారిపోయి మండిపోతాయని శాస్త్రవేత్తలు చెప్పారు. 
ఏయే దేశాలు పరీక్షించాయి? 
ఏశాట్‌ పరీక్షను తొలిసారిగా అమెరికా 1959లో పరీక్షించింది. ఆ తర్వాత 1960లు, 1970లలో సోవియట్‌ యూనియన్‌ కూడా ఇలాంటి పరీక్షలను నిర్వహించింది. 1985లో అమెరికా ఏజీఎం-135 క్షిపణిని ఎఫ్‌-15 యుద్ధ విమానం నుంచి ప్రయోగించింది. సోల్‌విండ్‌ పీ78-1 అనే ఉపగ్రహాన్ని ధ్వంసం చేసింది. 2007లో చైనా తన పాత వాతావరణ ఉపగ్రహాన్ని ఏశాట్‌ క్షిపణితో ఢీ కొట్టించింది. ఇది ఎగువ, ధ్రువ కక్ష్యలో జరిగింది. దీనివల్ల 3వేలకు పైబడి శకలాలు వెలువడ్డాయని అంచనా. అవి పెద్ద తలనొప్పిగా మారాయి. 2008లో అమెరికా ఒక యుద్ధనౌక నుంచి ఎస్‌ఎం-3 క్షిపణితో ఒక ఉపగ్రహాన్ని ఢీ కొట్టింది. ఆ తర్వాత ఇప్పుడు భారత్‌ ఇలాంటి పరీక్షను చేపట్టింది.

- ఈనాడు ప్రత్యేక విభాగం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.