close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఏం చేద్దాం

నేడు సీఎల్పీ అత్యవసర భేటీ 
నెలలోపే పదిమంది ఎమ్మెల్యేలు పార్టీకి దూరం 
లోక్‌సభ ఎన్నికలపై చర్చించనున్న నేతలు

ఈనాడు, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ శాసనసభాపక్షం శుక్రవారం అత్యవసరంగా సమావేశం కానుంది. ఎమ్మెల్యేలు పార్టీని వీడి తెరాసలో చేరుతుండటంతోపాటు ముఖ్యనేతలు సైతం కాంగ్రెస్‌కు దూరమవుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు, లోక్‌సభ ఎన్నికలు, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రచార సభలపై చర్చించనున్నట్లు తెలిసింది. కాంగ్రెస్‌ శాసనసభాపక్షనేత మల్లు భట్టివిక్రమార్క నేతృత్వంలో శుక్రవారం గాంధీభవన్‌లో జరిగే ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జి ఆర్‌.సి.కుంతియా, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. శాసనసభ ఎన్నికల్లో 19 మంది కాంగ్రెస్‌ తరఫున విజయం సాధించగా ఇప్పటి వరకు వారిలో పదిమంది తెరాసలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఉన్న తొమ్మిదిమందిలో కూడా మరికొందరు తెరాసలో చేరతారనే ప్రచారం నేపథ్యంలో సమావేశం నిర్వహిస్తున్నారు. నెల లోపే పదిమంది ఎమ్మెల్యేలు సహా కాంగ్రెస్‌ ముఖ్యనేతలు పార్టీని వీడారు. లోక్‌సభ ఎన్నికల ముంగిట ఈ పరిణామం పార్టీ నేతల్ని గందరగోళంలో పడేస్తోంది. శాసనమండలిలో కాంగ్రెస్‌ శాసనసభాపక్షాన్ని తెరాసలో విలీనం చేసినట్లు, శాసనసభలో కూడా కాంగ్రెస్‌ శాసనసభాపక్షాన్ని తెరాసలో విలీనం చేసే దిశగా కార్యాచరణ జరుగుతోందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు దూరమై తెరాసలో చేరితేనే విలీనం సాధ్యమవుతుంది. మరోవైపు ఇప్పుడున్న కాంగ్రెస్‌ శాసనసభ్యుల్లో ఎవరూ పార్టీని వీడరనే విశ్వాసాన్ని ఆ పార్టీ ముఖ్యనేతలు వ్యక్తం చేస్తున్నారు. 
అప్పుడు 19 మంది.. నేడు 9 మంది 
ఫిబ్రవరి 22న జరిగిన సీఎల్పీ సమావేశానికి 19 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు వచ్చారు. అనంతర పరిణామాల నేపథ్యంలో పార్టీ శాసనసభ్యులు ఆత్రం సక్కు, రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్య, హరిప్రియ, ఉపేందర్‌రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, సబితా ఇంద్రారెడ్డి, సుధీర్‌రెడ్డి, హర్షవర్దన్‌రెడ్డి, జాజల సురేందర్‌లు తెరాసలో చేరుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సహా  శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పొదెం వీరయ్య, గండ్రవెంకట్రమణారెడ్డి, సీతక్క, రోహిత్‌రెడ్డి ఉన్నారు. 
పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై.. 
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ప్రచారానికి మరో 12 రోజులే గడువు ఉండటంతో ప్రచార కార్యాచరణను సమీక్షించనున్నారు. నేతలు పార్టీని వీడిన నియోజకవర్గాల్లో  కాంగ్రెస్‌ను బలోపేతం చేయడం తదితర అంశాలను చర్చిస్తామని ఆ పార్టీ ముఖ్యనేత ఒకరు స్పష్టం చేశారు. ఏప్రిల్‌ ఒకటో తేదీన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ జహీరాబాద్‌, వనపర్తి, హుజూర్‌నగర్‌ బహిరంగసభల్లో పాల్గొంటున్నందున సభల ఏర్పాట్లపై చర్చించనున్నారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.