close

ప్ర‌త్యేక క‌థ‌నం

సుజలదృశ్యం!

గ్రామాల్లో తాగునీటి కష్టాలు కనుమరుగవుతున్నాయ్‌
‘మిషన్‌ భగీరథ’తో బిందెల గోస బంద్‌
పిళ్లా సాయికుమార్‌
ఈనాడు - హైదరాబాద్‌

ఖాళీ బిందెలతో కిలోమీటర్లకొద్ది నడిచివెళ్లి గుక్కెడు నీళ్లు తెచ్చుకునే ఆడపడచుల గోసకు తెరపడుతోంది. గల్లీలోని బోరింగు వద్ద పంచాయితీలకు కాలం చెల్లుతోంది. ఫ్లోరైడ్‌ రక్కసితో కాళ్లు, చేతులు చచ్చుబడి జీవచ్ఛవాలుగా బతుకుతున్న కుటుంబాలకు శుద్ధజల సాంత్వన లభిస్తోంది. అల్లంత దూరాన నదులు, జలాశయాల సిగలో ఉన్న గంగమ్మ తల్లి.. తెలంగాణ గ్రామాల్లోకి.. ఇళ్లల్లోకి తరలివస్తోంది. ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మిషన్‌ భగీరథ’ ఎన్నో ప్రత్యేకతల సమాహారం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మానసపుత్రిక అయిన ఈ పథకం తెలంగాణ గ్రామీణ ప్రజల తాగునీటి అవసరాలను తీర్చుతూ.. సరికొత్త సు‘జలదృశ్యాన్ని’ ఆవిష్కరిస్తోంది.

21వ శతాబ్దంలోనూ మహిళలు తాగునీటి అవసరాలకు వీధుల్లో తిరిగే పరిస్థితి ఉండొద్దు. ఏ ఆడబిడ్డా ఖాళీ బిందెలతో రోడ్డు మీదకు రావొద్దు. మిషన్‌ భగీరథ ద్వారా కృష్ణా, గోదావరి నీళ్లతో ఆడబిడ్డల కాళ్లు కడుగుతాం
 - ముఖ్యమంత్రి కేసీఆర్‌

ఎన్నెన్ని ప్రత్యేకతలో...

* భగీరథ నీళ్లు ఇంటింటికీ చేరే క్రమంలో 98 శాతం మేర విద్యుత్‌ అవసరం లేకుండా కేవలం గురుత్వాకర్షణ ద్వారానే ప్రవహించడం విశేషం. నదుల నుంచి నీటిని తోడి ఎత్తయిన ప్రాంతాలకు పంపడానికి మాత్రమే 235 మెగావాట్ల విద్యుత్‌ అవసరం.
* శుద్ధి చేసేటప్పుడు వృథాగా బయటకొచ్చే నీళ్లను సైతం తిరిగి శుద్ధి చేసి ఉపయోగించే విధానం ప్రాజెక్టులో ఉంది.
* అంతర్గత పైపులైన్లకు నియంత్రణ వాల్వులు ఉండటం వల్ల గ్రామంలోని అన్ని ఇళ్లకు ఒకే ఒత్తిడితో నీటి సరఫరా ఉంటుంది.
* పైపులైన్లతోపాటు  ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ వేస్తున్నందున ఇంటింటికీ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందించే అవకాశం ఉంటుంది.
* 2048 నాటికి 86.11 టీఎంసీల సామర్థ్యాన్ని తట్టుకొనేలా ప్రాజెక్టు రూపకల్పన చేశారు. తలసరి లెక్కల ఆధారంగా ప్రస్తుతం 60 టీఎంసీల నీళ్లు అవసరం. ఇవి కృష్ణా, గోదావరి, మేజర్‌ రిజర్వాయర్ల నుంచి తరలిస్తున్నారు.
* గ్రామాల్లోని పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల నీటి సమస్యలను కూడా భగీరథ తీరుస్తోంది.
* ఇజ్రాయెల్‌  సాంకేతిక  పరిజ్ఞానం వినియోగం
* బెల్‌ కంపెనీ  నుంచి మోటార్లు

భగీరథ పైప్‌లైన్ల పొడవు 1.05 లక్షల కిలోమీటర్లు
(పాతవాటితో కలిపి మొత్తం 1.47 లక్షల కిలోమీటర్లు)

 

 


భగీరథ బలగం..

ప్రభుత్వ, ప్రైవేటు ఇంజినీర్లు 4500
కూలీలు, ఇతర సిబ్బంది 26000

ప్రాజెక్టు పర్యవేక్షణకు సీఎం ఛైర్మన్‌గా ‘భగీరథ కార్పొరేషన్‌’ ఏర్పాటైంది. 2016, ఆగస్టు 7న భగీరథ ప్రాజెక్టును గజ్వేల్‌లోని కోమటిబండ వద్ద ప్రధాని మోదీ లాంఛనంగా ప్రారంభించారు. అంచెలంచెలుగా మిగతా సెగ్మెంట్లలోనూ అందుబాటులోకి వచ్చింది.

భగీరథ అంచనా వ్యయం రూ.43,963కోట్లు
ఇంతవరకూ అయిన పనుల విలువ రూ.35,000కోట్లు

* నీరు మనిషికి ప్రాణాధారం. పరిశుద్ధమైన జలం సేవిస్తే ఎన్నో రోగాల బారినపడకుండా ఉండొచ్చు. మిషన్‌ భగీరథ నీరు వచ్చాక రాష్ట్రంలో నీటి సంబంధిత వ్యాధులు గణనీయంగా తగ్గాయని.. వైద్యంపై చేసే వ్యయం తగ్గిందని యునిసెఫ్‌ అధ్యయనం పేర్కొంది.
* నీటి కోసం ఆడవాళ్లు, పిల్లలు సుదూర ప్రాంతాలకు వెళ్లే శ్రమ తప్పింది. దీంతో మహిళలు పనులు చేసుకుంటూ ఆదాయం పొందుతున్నారు. పాఠశాలల్లో డ్రాపౌట్లు తగ్గాయి

భగీరథ రాకముందు

23 వేల ఆవాసాల్లో కేవలం 20 శాతానికే నల్లాలు ఉండేవి.. అదీ భూగర్భ (బోర్‌) జల సరఫరా జరిగేది

నీరు చేరిన ఆవాసాలు 20,252
అందాల్సినవి 3,416

ఒక్కొక్కరికి రోజుకు అందాల్సిన నీళ్లు (లీటర్లలో)
గ్రామాల్లో   100
పట్టణాల్లో   135
నగరాల్లో   150

గంగ తరలుతోందిలా..

నదుల వద్ద నీటి సేకరణకు ఇన్‌టేక్‌ వెల్స్‌, సేకరించిన నీటిని శుభ్రపరిచేందుకు శుద్ధి కేంద్రాలు, అక్కడి నీరు గ్రామాలకు చేరేందుకు సరఫరా గొట్టాలు, ఆ నీటిని ప్రతి ఇంటి నల్లాల్లోకి పంపేందుకు గ్రామాల్లో అంతర్గత పైపులైన్లు.. ఉపరితల జలబాండాగారాలు అవసరం.. ఇదీ భగీరథ స్వరూపం.  మచ్చుకు నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రాజెక్టు వివిద దశలివి.. ఇతర చోట్లా ఇదే క్రమంలో శుద్ధ జలం సరఫరా అవుతోంది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.