close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఇది నవ్యాంధ్ర పవర్‌

కోతల నుంచి విముక్తి
రైతులకు పెద్ద ఊరట
పేదలకు ఉచితం
వీరగంధం శ్రీనివాసరావు
ఈనాడు - అమరావతి

రాష్ట్ర విభజన అనంతరం తెదేపా ప్రభుత్వం కఠోరశ్రమ, పకడ్బందీ ప్రణాళికతో విద్యుత్తు కష్టాలను అధిగమించింది. ఇంధన సామర్ధ్యం, సరఫరా, పంపిణీ విభాగాల్లో మెరుగైన పనితీరుతో జాతీయస్థాయిలోనే ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్తు సంస్థలు అనేక అవార్డులు అందుకున్నాయి. ఇంటింటికీ ఎల్‌ఈడీ దీపాలొచ్చాయి.. పట్టణాలు, పల్లెల్లోనూ ఇవే వీధి దీపాలను అమరుస్తున్నారు. రాష్ట్రంలో సౌర, పవన విద్యుదుత్పత్తీ క్రమంగా ఊపందుకుంటోంది.

అయిదేళ్ల కిందట..
పగలు ఇంట్లో పంఖా తిరగదు..
రాత్రయితే పల్లెల్లో చీకటి భయం..
రోజులో గంటల తరబడి కోతలే కోతలు..
పరిశ్రమలకు శుక్రవారం విద్యుత్తు సెలవు..
వారానికి మూడు రోజులు కోతలు ..
అరకొర సరఫరాతో పరిశ్రమలకు భారం...
కర్మాగారాల మూతతో కార్మికులు వీధిన పడిన వైనం
వ్యవసాయానికి విద్యుత్తు అందక చేతికొచ్చే పంటలు ఎండుముఖం పట్టాయి..
అర్ధరాత్రి మోటార్ల దగ్గరకు వెళ్లి వందల మంది రైతులు మృత్యువాత పడ్డారు.
పట్టణాల్లో ఇంటింటికీ ఇన్వర్టర్లొచ్చాయి..
నెల నెలా చెల్లించే బిల్లులకు ఈ ఖర్చు అదనం..
వీటన్నిటికి తోడు విద్యుత్తు ఛార్జీల బాదుడు..
ఇప్పుడు..
కరెంటు పోతుందనే దిగుల్లేదు..
విద్యుత్తు ఛార్జీల పెంపు లేదు..
రేయింబవళ్లు నిరంతర సరఫరా..
పరిశ్రమలకు అవసరమైనంత విద్యుత్తు..
వ్యవసాయానికి పగలే 9 గంటలు సరఫరా..
వంద శాతం కుటుంబాలకు విద్యుత్తు ఇచ్చిన ఘనతను ఆంధ్రప్రదేశ్‌ దక్కించుకుంది.

కోతలు లేని విద్యుత్తు సరఫరా ఇప్పుడు అన్నివర్గాలకు అనుభవంలోకి వచ్చింది. ఇరవై నాలుగు గంటల కరెంటు కల నిజమైంది. కేంద్రం చేపట్టిన ఉదయ్‌ పథకంలో రాష్ట్రం చేరింది. 2015 సెప్టెంబరు నాటికి పంపిణీ సంస్థల రూ.8,892 కోట్ల నష్టాలను రాష్ట్రం భరించింది. ఉత్పాదక వ్యయం తగ్గింపు ప్రయత్నాలు చేపట్టడంతోపాటు ఇంధన సామర్ధ్య పెంపుపై దృష్టి పెట్టారు. పునరుత్పాదక ఇంధన వనరులు, సౌర, పవన విద్యుత్తు ఉత్పత్తికి పెద్దపీట వేశారు. వీటన్నిటి ఫలితంగా కొద్ది రోజుల్లోనే పరిస్థితిలో మార్పు వచ్చింది. 22వేల మిలియన్‌ యూనిట్ల లోటుతో నవ్యాంధ్ర ప్రయాణం మొదలైంది. సర్కారు చర్యలతో ఇప్పుడు 870 మిలియన్‌ యూనిట్ల మిగులు స్థాయికి చేరింది. గ్రామాలు, పట్టణాల్లో ఎల్‌ఈడీ దీపాల ఏర్పాటుతో ఇంధన పొదుపు సాధ్యమైంది. వివిధ రకాల విద్యుత్తు రాయితీల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.8,963 కోట్లు విద్యుత్తు సంస్థలకు చెల్లిస్తోంది. అనంతపురం, కర్నూలు, కడపలో 4వేల మెగావాట్ల సామర్ధ్యంతో సౌర విద్యుత్తు పార్కులు ఏర్పాటు చేస్తున్నారు.

కేటాయింపుల్లోనూ వివక్ష
పునర్విభజన చట్టం ప్రకారం..ఆంధ్రప్రదేశ్‌కు 47.88 శాతం వాటా రావాలి. అయితే 2006-07 ఆర్థిక సంవత్సరం నాటి విద్యుత్తు వినియోగాన్ని పరిగణనలోకి తీసుకోవడంతో 54 శాతం జనాభా ఉన్న రాష్ట్రానికి 46.11 శాతం వాటా మాత్రమే దక్కింది. విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలపై హక్కులను భౌగోళిక హద్దుల ఆధారంగా నిర్ణయించినా.. విద్యుత్తును మాత్రం ఆ ప్రాతిపదికన కేటాయించలేదు. ఈ కారణంగా ఏడాదికి 8,700 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు కొరత ఎదుర్కోవాల్సి వచ్చింది.

100 యూనిట్లు ఉచితం
జగ్‌జీవన్‌ జ్యోతి పథకం కింద గతంలో ఎస్సీ, ఎస్టీలకు నెలకు 75 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందించేవారు. దీన్ని ప్రభుత్వం నెలకు 100 యూనిట్లకు పెంచింది. ఈ పథకం ద్వారా   5.50 లక్షల మంది లబ్ధిదారులకు ఉచిత విద్యుత్తు ఇస్తోంది. తాజాగా లాండ్రీలు నిర్వహించే రజకులు, స్వర్ణకార వృత్తి చేసేవారితోపాటు అత్యంత వెనకబడిన కులాల వారితోపాటు క్షౌరశాలలకు కూడా ఉచిత విద్యుత్తు పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించి ఫిబ్రవరి 15న ఉత్తర్వులు జారీ చేసింది.

9 గంటల

తంలో పొలం పనులన్నీ మానుకుని కరెంటెప్పుడు వస్తుందో అని రైతులు ఎదురు చూడాల్సి వచ్చేది. 2014 తర్వాత సరఫరా మెరుగుపడింది. మొదట్లో రాత్రిపూట రెండు గంటల పాటు సరఫరా ఇచ్చినా.. తర్వాత పగటి పూట సరఫరా కొనసాగించారు. రోజుకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తామని సంక్రాంతి సందర్భంగా సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఫిబ్రవరి నుంచి ఇది అమల్లోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

 

పొదుపు ఇంత

రైతులకు మేలైన 44,874 పంపుసెట్లు అందించటం, ఎల్‌ఈడీ దీపాల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో పెద్దఎత్తున విద్యుత్తు ఆదా అవుతోంది.

రైతులపై తగ్గిన భారం
- బూసనబోయిన శివరాజు, మందవల్లి, కైకలూరు మండలం, కృష్ణా జిల్లా

రొయ్యల చెరువులకు గతంలో యూనిట్‌కు రూ.6 ఉండేది. ఇప్పుడు యూనిట్‌కు రూ.2 మాత్రమే. విద్యుత్తు బిల్లుల భారం తగ్గింది. ఆరెకరాల రొయ్యల చెరువుకు గతంలో రూ.50వేలు వచ్చేది. ఇప్పుడు రూ.22వేలే వస్తోంది.

నాణ్యమైన విద్యుత్తు ఇస్తున్నారు
- పేర్ని వీరనారాయణ, వైస్‌ఛైర్మన్‌, ఆల్‌ఇండియా కాటన్‌ సీడ్‌ క్రషర్స్‌ అసోసియేషన్‌

దేళ్ల కిందట విద్యుత్తు కోతలతో వారానికి రెండు మూడు రోజులు పరిశ్రమకు సెలవు ప్రకటించాల్సి వచ్చేది. ఉత్పత్తి నిలిచి సిబ్బందికి జీతాలు ఇవ్వలేకపోయే వాళ్లం. ఇప్పుడు ఏ ఇబ్బందీ లేదు. కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్తు ఇస్తున్నారు. ఛార్జీలూ పెంచలేదు.

సౌర కిరణం వెలుగు పవనం
దేశంలోనే పెద్ద సౌర పార్కు
ఈనాడు డిజిటల్‌ - కర్నూలు

సంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 2021-22 నాటికి పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా 18వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సాధించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే ప్రపంచంలోనే పెద్ద సోలార్‌ పార్కుల్లో ఒకటైన గని-శకునాల సౌరవిద్యుత్తు పార్కును ఏర్పాటు చేసింది.
* కర్నూలు జిల్లా గని-శకునాలలో ఆల్ట్రా మెగా సోలార్‌ పార్కు ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్‌ పార్కుల్లో ఒకటిగా రికార్డుకెక్కింది. 6 వేల ఎకరాల్లో రూ.6 వేల కోట్లతో ఈ ప్రాజెక్టు పూర్తి చేశారు. 45లక్షలపైగా సోలార్‌ ఫలకాలు ఏర్పాటు చేసి వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. దీన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు.
* పిన్నాపురం ఇంటిగ్రేటెడ్‌ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు (ఐఆర్‌ఈపీ) మరో కలికితురాయిగా నిలవనుంది. 4,766 ఎకరాల్లో 2750 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయనున్నారు. ఒకేచోట వెయ్యి మెగావాట్ల సౌర, 550 మెగావాట్ల పవన, 1200మెగావాట్ల స్వతంత్ర పంపు నిల్వ సామర్థ్యంతో విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం దేశంలోనే ప్రథమం. రూ.15వేల కోట్లతో గ్రీన్‌కో ఎనర్జీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులూ వచ్చాయి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.