close

ప్ర‌త్యేక క‌థ‌నం

మోదీని గద్దె దించితేనే.. ప్రజాస్వామ్య పునరుద్ధరణ

అయితరాజు రంగారావు
ఈనాడు - హైదరాబాద్‌

దేశంలో ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని, రాజ్యాంగాన్ని పునరుద్ధరించి పరిరక్షించాల్సిన ఆవశ్యకత ఉందనీ, అహంకారంతో పాలన సాగిస్తున్న నరేంద్రమోదీని గద్దె దించితేనే ఇది సాధ్యమవుతుందని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకీ ఆధిక్యత రాదని, ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలే కీలక పాత్ర పోషిస్తాయన్నారు. కేంద్రంలో భాజపాయేతర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడంలో సీపీఐ తన వంతు పాత్రను నిర్వహిస్తుందని, పార్లమెంటులో ప్రజల గొంతుకను వినిపించడానికి నిబద్ధత, అంకితభావం గల వామపక్ష అభ్యర్థులను గెలిపించాలని కోరారు. లోక్‌సభ ఎన్నికల్లో సీపీఐ అనుసరిస్తున్న వైఖరి, జాతీయ స్థాయిలో పార్టీలతో పొత్తులు తదితర అంశాలపై సురవరంతో ‘ఈనాడు’ జరిపిన ‘ముఖాముఖి’ అంశాలివి..

ఎన్నికల తర్వాత ఏ ప్రధాన పార్టీకి పూర్తి ఆధిక్యం రాకపోతే.. కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో మీ పాత్ర ఎలా ఉంటుంది
రాబోయే పార్లమెంటులో ఏ పార్టీకీ ఆధిక్యత రాదు. అత్యధిక స్థానాలు దక్కించుకున్న అతి పెద్ద పార్టీగా కొందరి అంచనాల ప్రకారం భాజపాకు ఎక్కువ అవకాశాలుండొచ్చు. కానీ వారికి పూర్తి ఆధిక్యత రాదు. తెరాస లాంటి ఒకట్రెండు పార్టీలు మద్దతిస్తే భాజపా అధికారంలోకి రావచ్చు. ఎన్నికల్లో ఏదైనా సాధ్యమే. భాజపాయేతర ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అందరినీ కలపడానికి ప్రయత్నిస్తాం.

లోక్‌సభ ఎన్నికలకు సీపీఐ ఎలా సన్నద్ధమవుతోంది
ప్రచారంలో మా పార్టీ సానుకూల అంశాలను చెప్పడం కంటే భాజపా నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వ దుర్మార్గాలను ప్రజలకు చెప్పడమే ముఖ్యమైన అంశంగా భావిస్తున్నాం. కార్పొరేట్లకు అనుకూలంగా భాజపా ప్రభుత్వ విధానాలున్నాయి. పేద, ధనిక ప్రజల మధ్య వ్యత్యాసం విపరీతంగా పెరిగిపోయింది. దారిద్య్రం, ధరలు, నిరుద్యోగం ఓ వైపు విలయతాండవం చేస్తుంటే.. మరోవైపు కోటీశ్వరుల ఆస్తులు రెట్టింపవుతున్నాయి. మోదీ కార్పొరేట్లకే చౌకీదార్‌ తప్ప దేశానికి, ప్రజలకు కాదు. అందుకే ఆయన్ను గద్దె దింపాలి. మేం శ్రామిక వర్గం, రైతులు, వ్యవసాయ కూలీలు, నిరుద్యోగ యువత తరఫున పార్లమెంటులో గళం విప్పడానికి, సమస్యల పరిష్కారానికి కృషిచేస్తాం. ప్రజల్లోకి ఈ అంశాలనే తీసుకెళ్తాం.

జాతీయ స్థాయిలో సీపీఐ ప్రాభవం కోల్పోవడానికి కారణం?
పెరుగుతున్న జనాభా, ఓటర్ల దామాషా పద్ధతుల్లో పార్టీ నిర్మాణం జరగడం లేదు. దీనివల్ల ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలకు కొంత నష్టం జరిగితే.. మొత్తం నష్టం జరిగిందన్న భావాన్ని కల్పిస్తున్నారు. మా ప్రజాసంఘాలు, వాటి ఉద్యమాలు, సభ్యత్వం తగ్గలేదు. ఎన్నికల ఎత్తుగడల్లో ఈ మధ్య కాలంలో మాపై కార్పొరేట్లు ఎక్కుపెట్టారు. బిహర్‌లో ఈ మధ్య ఒప్పందం కుదరకపోవడానికి కారణమిదే. కాంగ్రెస్‌ సహా ఇతర పార్టీలు ఈ రకమైన ఒత్తిళ్లకు గురికావడంతోనే పొత్తులు సాధ్యం కాలేదు.

లోక్‌సభ ఎన్నికల సమయంలో పార్టీల మధ్య ఒప్పందాలు జాతీయ స్థాయిలో కాకుండా రాష్ట్ర స్థాయిల్లో ఎక్కువగా జరుగుతున్నాయి. వీటి ఫలితాలు సానుకూలంగా ఉంటాయా?
‘మనమందరం ఎన్నికల తర్వాత కలుద్దాం... ఎన్నికలకు ముందు సాధ్యమైనంత వరకు పరస్పరం సహకరించుకుందాం..’ అన్న అవగాహనతో ముందుకెళ్తున్నాం. కొన్ని రాష్ట్రాల్లో మేం ఆశించినట్లు అది సాధ్యం కాలేదు. ఉత్తర్‌ప్రదేశ్‌లో పొత్తు కుదురుతుందని అనుకున్నా.. సాధ్యమవలేదు. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ ఎన్నికల్లో బీఎస్పీతో కాంగ్రెస్‌ ఒప్పందం కుదుర్చుకోనందుకు.. వారు(బీఎస్పీ) ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌తో కలవడానికి ఇష్టపడలేదు. వారు ఎంతసేపూ ‘మనం గెలిస్తే చక్రం తిప్పొచ్చు’ అనే ఆలోచనతోనే ఉన్నారు. తెలంగాణలోనూ కేసీఆర్‌ చక్రం తిప్పుతానంటారు. ఇది సాధ్యమయ్యే పని కాదు. భాజపా కంటే భాజపా వ్యతిరేక పార్టీలు, ప్రాంతీయ పార్టీలకు ఎక్కువ సీట్లు వస్తాయని మేం భావిస్తున్నాం.

తెలంగాణలో గత శాసనసభ ఎన్నికల్లో వామపక్షాలు ఒక్కసీటునూ గెలుచుకోలేక పోయాయి. ఈ ప్రభావం లోక్‌సభ ఎన్నికలపై  ఏమేరకు ఉంటుంది?
పార్లమెంటు ఎన్నికలు వేరు.. అసెంబ్లీ ఎన్నికలు వేరు. తెలంగాణలో గత శాసనసభ ఎన్నికల్లో మూడు స్థానాల్లోనే పోటీ చేశాం. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాల ప్రభావాన్ని మేం లోతుగా అంచనా వేయలేకపోయాం. దానివల్ల నష్టం జరిగింది. ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన మా సిద్ధాంతాలు, రాజకీయాలు, ప్రతిపక్ష పాత్రను.. ప్రజలు విస్మరించే పరిస్థితి లేదు. సీపీఐ, సీపీఎం సహా ఇతర వామపక్షాలు ఐక్యంగా ఒక పార్టీగా లేము కానీ.. మేము ఐక్య  కార్యాచరణ నిర్వహిస్తున్నాం.

మోదీ పాలనకు, అంతకుముందున్న యూపీయే పాలనకు తేడాలేంటి?
కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీయే- 1కు, యూపీయే- 2కూ తేడా ఉంది. కనీస ఉమ్మడి ప్రణాళికను అమలు చేసిన యూపీయే- 1 ప్రభుత్వం ప్రజానుకూలమైన కొన్ని కార్యక్రమాలు చేపట్టింది. సమాచార హక్కు, అటవీ హక్కులు, గృహహింస, జాతీయ ఉపాధి హామీ తదితర అంశాల్లో చట్టాలు తీసుకొచ్చారు. యూపీయే- 2 ఒక లక్ష్యం లేని ప్రభుత్వమనే చెప్పాలి. అవినీతి పెరిగింది. ఇక.. మోదీ ప్రభుత్వ హయాంలో రాజ్యాంగం, రాజ్యాంగ సంస్థలు విధ్వంసమయ్యే  పరిస్థితి వచ్చింది. మతోన్మాదం, అవినీతి పెరిగిపోయాయి.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలపై..
ముఖ్యమంత్రి కేసీఆర్‌ అహంకారపూరితమైన వ్యక్తి. ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన.. ఆయన చేసిన తప్పులన్నింటినీ ప్రజలు ఆమోదించినట్లు కాదు. తెలంగాణలో ముఖ్యమంత్రికి, ఆయన కార్యక్రమాలకు దాదాపు 50 శాతం మంది వ్యతిరేకమే. ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో.. ఎవరు ఓడుతారో చెప్పలేని క్లిష్ట పరిస్థితి. పవన్‌కల్యాణ్‌తో సీపీఐ, సీపీఎం, బీఎస్పీ జతకట్టాయి. మూడో ప్రత్యామ్నాయాన్ని మేం సూచిస్తున్నాం. అక్కడ  ప్రతిపక్షమూ, అధికార పార్టీ మధ్య పెద్ద తేడా లేదు. ప్రజా సమస్యలపై పోరాటాలు చేయగలిగే ప్రతిపక్షం ఆంధ్రా అసెంబ్లీలో లేకపోవడం దురదృష్టకరం. ఈ సారి ఆ లోటు ఉండదని, వామపక్షాలకు ప్రాతినిధ్యం లభిస్తుందని విశ్వసిస్తున్నాం.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.