close

ప్ర‌త్యేక క‌థ‌నం

రణక్షేత్రం.. రైతు అస్త్రం

దశాబ్ద కాలంగా అపరిష్కృతంగా సమస్య
దిల్లీకి సెగ తగులుతూనే ఉన్నా చలనం లేని పాలకులు
కేంద్రం నుంచి శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా ఇందూరులో పసుపు రైతుల ఎన్నికల పోరు
జత కలిసిన ఎర్రజొన్న రైతులు
ఎం.ఎల్‌.నరసింహారెడ్డి
నిజామాబాద్‌ నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి

ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకుంటే..
ఏళ్లకేళ్లుగా అదే ధర వస్తుంటే.. అప్పులు, అష్టకష్టాలే మిగులుతుంటే..
ప్రభుత్వాలు, పార్టీలు పట్టించుకోకుంటే..
కడపు మండిన రైతు కన్నెర్ర జేశాడు..
సమస్యను జాతీయస్థాయికి తీసుకెళ్లేందుకు నామపత్రాన్ని సంధించాడు..
మద్దతు కోసం ఎన్నికల రణక్షేత్రంలో నిలచి నినదిస్తున్నాడు..

నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ రైతుల వినూత్న నిరసనలో సమస్యకు కేంద్రం నుంచి శాశ్వత పరిష్కారం సాధించాలనే పట్టుదల కనిపిస్తోంది. వారి ఆవేదన, ఆక్రోశంలో అదే లక్ష్యం ప్రస్ఫుటమవుతోంది. ఇక్కడ అత్యధిక సంఖ్యలో నామినేషన్లు వేసిన పసుపు, ఎర్రజొన్న రైతులు ఇప్పుడు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో సమస్య పూర్వాపరాలను తెలుసుకునేందుకు క్షేత్ర స్థాయికి వెళ్లి పలువురు రైతులతో ‘ఈనాడు’ మాట్లాడగా.. ఆవేదనాభరిత అంతరంగాలు ఆవిష్కృతమయ్యాయి. గద్గదస్వరంతో.. చెమ్మగిల్లిన కనులతో అన్నదాతలు తమ అనుభవాలను పంచుకున్నారు. ‘ప్రతి సంవత్సరం ఉద్యమాలు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. అయితేగియితే తాత్కాలిక ఉపశమనం, లేదంటే హామీ ఇచ్చి చేతులు దులిపేసుకోవడం షరా మామూలైపోయింది. మా గోడు కేంద్రానికి వినిపించడానికే లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగాం. ఇంతటితో ఆగం. వచ్చే మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికల్లోనూ పోటీ చేస్తాం’ అని నిజామాబాద్‌ నుంచి పోటీలో ఉన్న పలువురు పసుపు, ఎర్రజొన్న రైతులు అంటున్నారు.

* దిల్లీలో ధర్నా చేస్తున్నా..
ప్రస్తుత ఎన్నికల సందర్భంగా నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో చర్చనీయాంశమైన పసుపు, ఎర్రజొన్న రైతుల సమస్య ఈనాటిది కాదు. దాదాపు దశాబ్దకాలం నాటిది. వారి ఆందోళన సెగలు అప్పటి నుంచి దిల్లీకి తాకుతూనే ఉన్నా పాలకుల్లో చలనం రాలేదు. ‘పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని, పంటకు మద్దతు ధర ఇవ్వాలని 2009 నుంచి వరుసగా దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా చేశాం. ప్రతి సంవత్సరం భాజపా నాయకులు వచ్చి పాల్గొని అధికారంలోకి వస్తే డిమాండ్లు తీరుస్తామన్నారు. కానీ, అధికారంలోకి వచ్చినా ఏర్పాటు చేయలేదు’ అని రైతు ముత్యాల మనోహర్‌రెడ్డి తెలిపారు. నిజామాబాద్‌ స్థానానికి దాఖలైన మొత్తం 185 నామినేషన్లలో 176 పసుపు, ఎర్రజొన్న రైతులవే కావడం గమనార్హం. ఈ జిల్లా నుంచే కాదు, ఈ లోక్‌సభ పరిధిలోకి వచ్చే జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, జగిత్యాల సెగ్మెంట్లకు చెందిన రైతులూ ఇదే సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అందుకే వారు కూడా పోటీలో ఉన్నారు. మరింత ఒత్తిడి పెంచేందుకు అందరూ కలిసి ఒకరిని అభ్యర్థిగా ప్రకటించే           ఆలోచనతో ఉన్నారు.

* నలుగురు ముఖ్యమంత్రులతో లేఖలు రాయించిన కవిత
‘‘పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తామని గత ఎన్నికల్లో ఎంపీ కవిత హామీ ఇచ్చారు. దీనిపై ప్రధానమంత్రికి, కేంద్రమంత్రులకు పలుసార్లు ఆమె విజ్ఞప్తి చేశారు. నలుగురు ముఖ్యమంత్రులతో కూడా లేఖలు రాయించారు. అయినా హామీ ఇవ్వడం తప్ప కేంద్రం ఏర్పాటుకు నిర్ణయం తీసుకోలేదు. గత ఏడాదిలా ఈ సంవత్సరం కూడా ప్రభుత్వమే జొన్నలు కొనేలా ఆమె గట్టి ప్రయత్నం చేసి ఉంటే బాగుండేది’’ అని కొందరు రైతులు అభిప్రాయపడ్డారు. పసుపు బోర్డు, మద్దతు ధర, ఎర్రజొన్న కొనుగోలు కోసం తాము ఆందోళన చేస్తే ప్రభుత్వం కేసులు పెట్టి జైల్లో వేసిందని ఈ ఉద్యమంలో ముఖ్యపాత్ర పోషిస్తున్న అన్వేష్‌రెడ్డి తెలిపారు. పక్కనే ఉన్న మహారాష్ట్రలోని సాంగ్లీ, ఇక్కడి ధరలో చాలా వ్యత్యాసం ఉందన్నారు. రైతులు ఉద్యమించినపుడు ఒకసారి బోనస్‌ ఇవ్వడం కాకుండా సమస్య పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.

* ఎర్రజొన్న.. రైతు కడుపు ‘తరుగు’తోంది
వ్యాపారులు కుమ్మక్కవడంతో ఎర్రజొన్న క్వింటాలుకు రూ.1,500- రూ.1,600 మించి ధర రావడం లేదు. దీనికి తోడు తరుగు కింద ఆరు నుంచి ఎనిమిది కిలోలు తీసుకుంటున్నారు. ఆ లెక్కన రైతుకు రూ.1,400కు మించి దక్కడం లేదు. గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం రూ.2,300కు కొనుగోలు చేసింది. గత ఏడాది ప్రభుత్వం కొన్నప్పుడు వారం రోజుల్లో రైతులకు మొత్తం చెల్లించారు. ఇప్పుడు వ్యాపారులు రెండు నెలలకు కూడా చెల్లించడం లేదు. ధర లేకపోవడంతో ఎక్కువ మంది రైతులు ఎర్రజొన్న ఉత్పత్తిని కళ్లాల్లోనే కప్పి పెట్టారు. గత ఏడాది కొన్నట్లుగానే ఈ ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎర్రజొన్న కొనుగోలు చేయాలని కోరుతున్నారు. ఎర్రజొన్న వేయొద్దంటే తమకు ప్రత్యామ్నాయం లేదని పలువురు పేర్కొన్నారు.

* పసుపు.. గరిష్ఠం రూ.6 వేలే
జనవరి నుంచి ఇప్పటివరకు సుమారు 5.3 లక్షల క్వింటాళ్ల పసుపును రైతులు విక్రయిస్తే ఇందులో అత్యధికంగా క్వింటాలుకు లభించింది రూ.ఆరువేల వరకు మాత్రమే. ఎక్కువ మంది రూ.4,500-5,000 మధ్య అమ్ముకున్నారు. కేంద్రం ముందుకు వచ్చి పసుపుబోర్డు ఏర్పాటు చేయాలని, మద్దతు ధర ప్రకటించాలని, గత ఏడాది మాదిరే ఎర్రజొన్నను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నదే తమ డిమాండ్‌ అని ఎన్నికల్లో పోటీకి దిగిన రైతులు తెలిపారు. ఐదారేళ్ల క్రితంతో పోలిస్తే ఖర్చుల్లో చాలా తేడా వచ్చిందన్నారు. ‘లారీ పశువుల పేడ అప్పట్లో రూ.5 వేలుంటే ఇప్పుడు రూ.16 వేలు. కూలీల ఖర్చు కూడా రూ.40 వేల నుంచి రూ.లక్షకు పెరిగింది. డీఏపీ ధర, ట్రాక్టర్‌ కిరాయి అధికమయ్యాయి. అన్నీ కలిసి ఎకరా పసుపు పంట సాగు చేయడానికి అయ్యే ఖర్చు రూ.లక్ష దాటుతుంది. ధర మాత్రం క్వింటాలుకు రూ.ఐదారువేలకు మించడం లేదు. కనీస ధర రూ.15 వేలుగా నిర్ణయించి కొనుగోలు చేయాలని ఏళ్ల తరబడి కోరుతున్నా పట్టించుకోవడం లేదు. ఏటా తీవ్రంగా నష్టపోతున్నాం’ అని వివరించారు.

పసుపు బోర్డు ఏర్పాటైతే..

* ప్రత్యేకంగా నిధుల కేటాయింపు జరుగుతుంది
* సాగు, ధరల నియంత్రణకు ఓ వ్యవస్థ ఉంటుంది
* గిట్టుబాటు దక్కేలా కొనుగోలుకు సర్కారు చొరవ తీసుకుంటుంది. 
* పంట నిల్వకు శీతల గిడ్డంగులు, ప్రత్యేక రాయితీలుంటాయి
* పరిశోధనలు పెరిగి నాణ్యమైన వంగడాలు అందుబాటులోకి వస్తాయి

నామినేషన్లు వేసేందుకు వ్యయప్రయాసలు

ప్రతి గ్రామంలో రైతులకు కమిటీలు ఉన్నాయి. అందులో చర్చించుకొని ఎవరు నామినేషన్‌ వేయాలో నిర్ణయించుకున్నారు. కమిటీ సభ్యులు నామినేషన్‌కు అయ్యే ఖర్చును భరించారు. మరికొందరు రైతులు కూడా ఎన్నికల బరిలోకి దిగుదామనుకున్నా.. నామినేషన్ల దాఖలుకు రుసుం ఎక్కువగా ఉండడంతో వెనక్కి తగ్గారు. 

కత్తెర పురుగుతో మరింత ఖర్చు

పసుపు పది ఎకరాల్లో, ఎర్రజొన్న పది ఎకరాల్లో సాగు చేశా. పసుపుపై ఎకరాకు రూ.లక్షా 30 వేల దాకా పెట్టుబడి పెట్టా. ఎకరాకు రూ.30 వేలకుపైగా నష్టం వచ్చింది. ఎర్రజొన్న 200 క్వింటాళ్లు వచ్చింది. ధరలేదని అమ్మలేదు. ఈ సంవత్సరం కత్తెర పురుగు వల్ల సాగుకు మరింత ఎక్కువగా ఖర్చయింది. 
- కొమ్మల సంతోష్‌రెడ్డి, చౌటుపల్లి, బాల్కొండ

రూ.రెండు వడ్డీకి ప్రైవేటు అప్పు తెచ్చా

మాకు మూడెకరాలుంది. ఎకరం పసుపు, మిగిలింది జొన్న వేశా. మొత్తం రూ.లక్షా యాభైవేలు ఖర్చయింది. అంతా ప్రైవేటు అప్పే. బ్యాంకులో రీషెడ్యూలు కోసం వడ్డీకి, బీమాకు రూ.15 వేలు కట్టా. కొత్తగా ఏమీ ఇవ్వలేదు. దీంతో రూ.రెండు వడ్డీకి ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పు తెచ్చా. వీఆర్వో రెండెకరాలు పాసుపుస్తకంలో ఎక్కించకపోవడంతో ఎకరాకు మాత్రమే రైతుబంధు వచ్చింది. దీనిపై అనేకసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. పసుపు పది క్వింటాళ్లు రాగా రూ. నాలుగువేల చొప్పున అమ్మా. జొన్నలు 15 క్వింటాళ్లు వచ్చాయి. రూ.1,500కు అడుగుతుండటంతో అమ్మలేదు.
- అరె సాయన్న, మునిపల్లి, నిజామాబాద్‌ రూరల్‌

20 ఏళ్ల క్రితం ఎంత వచ్చిందో ఇప్పుడూ అంతేనా?

నాకు ఐదు ఎకరాల భూమి ఉంది. రెండేసి ఎకరాల్లో పసుపు, ఎర్రజొన్న, ఎకరాలో కూరగాయలు సాగు చేశా. పసుపు 21 క్వింటాళ్లు వచ్చింది. క్వింటా రూ.4000 - రూ.4,300 మధ్య అమ్మా. అప్పులు చేసి పెట్టుబడి పెట్టా. సగం కూడా రాలేదు. 20 ఏళ్ల క్రితం పసుపు పండిస్తే క్వింటాలుకు ఎంత వచ్చిందో ఇప్పుడూ అంతే వస్తే ఎలా? 30 క్వింటాళ్ల జొన్న వచ్చింది. పొలంలోనే ఉన్నాయి. వ్యాపారులు సిండికేట్‌ అయ్యి రూ.1,600కు అడుగుతున్నారు.
- చింతలపల్లి మోహన్‌రెడ్డి, మునిపల్లి, నిజామాబాద్‌ రూరల్‌

మా గ్రామ సంఘం నుంచి ఇద్దరం

నాలుగు ఎకరాల్లో పసుపు, నాలుగు ఎకరాల్లో జొన్న సాగుచేశా. పసుపు 90 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. క్వింటా రూ.5,300కు అమ్మాను. మంచి పంట రావడం వల్ల సాగు ఖర్చుకు నష్టం రాకుండా బయటపడ్డా. జొన్నలు 57 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. పోయిన సంవత్సరానికి ఇప్పటికి క్వింటాలుకు రూ.600 నష్టం వచ్చింది. ప్రతి సంవత్సరం కష్టపడి పండించి ధరకోసం ఆందోళన చెందాల్సి వస్తోంది. ఈ పరిస్థితి పోవడానికే ఎన్నికల బరిలోకి దిగాం. మా గ్రామ సంఘం నుంచి ఇద్దరం నామినేషన్‌ వేశాం.
- పాశ్యపు రాజ వెంకట్‌, కొత్తపల్లి, బాల్కొండ

ఎకరాకు రూ.40 వేలు నష్టం వస్తే ఎలా బతికేది?

నాకు మూడు ఎకరాలుంది. రెండెకరాల్లో పసుపు, ఎకరాలో జొన్న సాగు చేశా. పసుపు సాగుకు ఖర్చులు భారీగా పెరిగాయి. తెగుళ్లు, పంట పెట్టుబడికి వడ్డీలు ఇలా అన్నింటిని తట్టుకొని ఎంతో కొంత దిగుబడి సాధిస్తే ధర ఉండటం లేదు. ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు నష్టం వస్తే ఎలా బతికేది? పసుపు పంటకు క్వింటాలుకు రూ.15 వేలు, ఎర్రజొన్నకు రూ.మూడువేలు ఇస్తే గిట్టుబాటు అవుతుంది.
- బాయి సాయన్న, మునిపల్లి, నిజామాబాద్‌ రూరల్‌

 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.