Latest Telugu News, Headlines - EENADU
close

ప్ర‌త్యేక క‌థ‌నం

పాఠం తగ్గింది.. ఉత్తీర్ణత పెరిగింది

బీటెక్‌లో సిలబస్‌ తగ్గింపుతో విద్యార్థులపై తగ్గిన ఒత్తిడి 
మొదటి ఏడాది ప్రథమ సెమిస్టర్‌లో ఉత్తీర్ణత పెరుగుదల 
ఏఐసీటీఈ నిర్ణయాలు...జేఎన్‌టీయూహెచ్‌ ఆచరణతో ఊరట 
ఈనాడు - హైదరాబాద్‌

అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) మార్గదర్శకాలను జేఎన్‌టీయూహెచ్‌ అమలు చేయడంతో బీటెక్‌ విద్యార్థులపై ఒత్తిడి తగ్గి ఉత్తీర్ణత శాతం గణనీయంగా మెరుగుపడింది. పాఠ్యాంశాల భారాన్ని తగ్గించడంతోపాటు మరికొన్ని ఇతర చర్యలు విద్యార్థులకు ఊరట కలిగించాయని ఆచార్యులు విశ్లేషిస్తున్నారు. 
ఇంటర్‌మీడియట్‌ వరకు ఉపాధ్యాయులు, అధ్యాపకుల పర్యవేక్షణలో... రెసిడెన్షియల్‌ కళాశాలల్లో చదివి పరీక్షలు పాసైన విద్యార్థులు ఇంజినీరింగ్‌లో చేరి కొత్త వాతావరణానికి అలవాటు పడలేక సతమతమయ్యేవారు. అప్పటి వరకు తెలుగు మాధ్యమంలో చదివిన వారి పరిస్థితి మరీ ఘోరం. బీటెక్‌లో అధ్యాపకులు పాఠం చెబుతూపోతారు. కేవలం మార్గదర్శకం చేయడం తప్ప ఇంటర్‌ తరహాలో కూర్చోబెట్టి చదివించడం ఉండదు. పరీక్షలు, అసైన్‌మెంట్లు లాంటివి గందరగోళానికి గురిచేస్తాయి. దానికితోడు అప్పటి వరకు జైలు పక్షుల్లా ఉన్న విద్యార్థులకు బీటెక్‌లో చేరగానే స్వేచ్ఛ లభించి చదువుపై కొంత నిర్లక్ష్యమూ పెరుగుతుంది. ఒకవేళ తప్పినా నాలుగు సంవత్సరాలలో పూర్తి చేసుకోవచ్చన్న అతి విశ్వాసానికి పోతారు. వీటన్నిటి కారణంగా మొదటి ఏడాది 30 శాతం ఉత్తీర్ణత మించడం లేదు. ఏఐసీటీఈ మార్గదర్శకాల ప్రకారం జేఎన్‌టీయూహెచ్‌ అమలు చేసిన పలు చర్యలు విద్యార్థులకు ఉపశమనం కలిగించిందని జేఎన్‌టీయూహెచ్‌ ఉపకులపతి ఆచార్య వేణుగోపాల్‌రెడ్డి చెప్పారు. 
పెరిగిన ఉత్తీర్ణత శాతం 
2015-16 విద్యా సంవత్సరం వరకు బీటెక్‌ మొదటి ఏడాదిలో ఉత్తీర్ణత 28-30 శాతం దాటేది కాదు. 2016-17 నుంచి పలు చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. ఆ ఏడాది మాత్రం కేవలం 28.53 శాతం ఉత్తీర్ణత ఉండగా తాజాగా విడుదలైన ప్రథమ సెమిస్టర్‌ ఫలితాల్లో ఒకేసారి 45.52 శాతానికి పెరగడం గమనార్హం.

ఏఐసీటీఈ, జేఎన్‌టీయూహెచ్‌లు చేసింది ఏమిటంటే?

ఛాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టమ్‌(సీబీసీఎస్‌) అమలులో భాగంగా 2016-17 విద్యా సంవత్సరం బీటెక్‌ ప్రథమ సంవత్సరంలోనూ సెమిస్టర్‌ విధానం అమలు చేశారు. ఏడాది సిలబస్‌ను రెండు భాగాలుగా మార్చి రెండు సెమిస్టర్లు చేశారు. రెండు సార్లు పరీక్షలు నిర్వహించారు. 
ఏఐసీటీఈ రూపొందించిన ఆదర్శ పాఠ్య ప్రణాళికను 2017-18 నుంచి జేఎన్‌టీయూహెచ్‌ అమలు చేసింది. అందులో భాగంగా అప్పటి వరకు ఉన్న సబ్జెక్టులు ఆరు నుంచి నాలుగుకు తగ్గాయి.  
బీటెక్‌ నాలుగేళ్ల క్రెడిట్లు 196 నుంచి 160కు తగ్గించారు. అంటే పాఠ్యాంశాలు తగ్గిపోయాయి. అధిక సబ్జెక్టులు, పాఠ్యాంశాల కారణంగా విద్యార్థులు పుస్తకాల పురుగులుగా మారిపోతే తప్ప ఉత్తీర్ణులయ్యే పరిస్థితి లేదని ఏఐసీటీఈ భావించి తగ్గించాలని సూచించడంతో జేఎన్‌టీయూహెచ్‌ ఆ మేరకు పాఠ్యాంశాలను కుదించింది. 
ప్రథమ సెమిస్టర్‌లో చేరగానే పాఠాలంటే బెదిరిపోతారని, అందుకు భిన్నంగా ఇంజినీరింగ్‌పై అవగాహన పెంచాలని, విద్యార్థులు, అధ్యాపకుల మధ్య పరిచయాలు, వ్యక్తిత్వం, విలువలు పెంచేలా మూడు వారాలపాటు ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని ...ఆ 21 రోజుల్లో పాఠాల బోధన ఉండరాదని ఏఐసీటీఈ మార్గదర్శకాలు జారీచేసింది. వాటిని జేఎన్‌టీయూహెచ్‌ అమలు చేయడంతో విద్యార్థులపై భారం తగ్గి ఉత్తీర్ణత పెరిగింది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.