close

ప్ర‌త్యేక క‌థ‌నం

ధీర ధీర ధీర
తొమ్మిదోసారి పోటీ చేస్తున్న కోడెల సత్తెనపల్లికి ఏం చేశారు?
ప్రతిసారి కొత్త స్థానంలో గెలుస్తున్న మంత్రి గంటా బలాలేంటి?
చినరాజప్ప బరి.. పెద్దాపురంలో పెత్తనం బయటివారిదేనంట!
హిందూపురంలో బాలయ్యబాబు పాలనపై ఓటర్లు ఏమంటున్నారు?
రామసుబ్బారెడ్డి, ఆది వర్గాలు కలిశాక.. జమ్మలమడుగులో పరిస్థితి ఏంటి?
టెక్కలిలో అచ్చెన్న బలమెంత?
చంద్రగిరి, బొబ్బిలి కోటల్లో పోటీ ఎలా ఉంది?
వైకాపా.. జనసేనకు లాభించే అంశాలు ఏవి?

రెండు పక్షాల అభ్యర్థులూ సమ ఉజ్జీలైతే పోటీలో ఉండే కిక్కే వేరు! రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొందిప్పుడు! దీంతో రాష్ట్రమంతటా ఈ స్థానాలపై ప్రత్యేక ఆసక్తి వ్యక్తమవుతోంది. ప్రత్యర్థి పార్టీల కంచుకోటలను బద్దలు కొట్టాలని ఉవ్విళ్లూరేవాళ్లు.. స్థాన బలాన్ని నిలబెట్టుకోవాలని తొడగొట్టే వాళ్లు.. గత ఓటమి చరిత్రని ఎలాగైనా తిరగరాయాలని తంటాలుపడుతున్నవాళ్లు..

ఇలా.. ప్రతి ఒక్కరూ ఏదో ఒక లక్ష్యంతో బరిలో భీకరంగా తలపడుతున్నారు. సరికొత్త సమీకరణలతో.. రసవత్తర వ్యూహాలతో.. ఎన్నికల సమరాంగణం రక్తికడుతోంది!

సభాపతి వేదిక సత్తెనపల్లి
వైకాపా నుంచి అంబటి..
జనసేన అభ్యర్థి వెంకటేశ్వరరెడ్డి

నవ్యాంధ్ర తొలి శాసనసభ సభాపతి, గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు 35 ఏళ్ల రాజకీయ జీవితాన్ని పూర్తి చేసుకుని.. సరికొత్త ప్రస్థానం వైపు అడుగులు వేస్తున్నారు. మరోసారి సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తున్నారు. కోడెల అసెంబ్లీ ఎన్నికల్లో తలపడటం ఇది తొమ్మిదోసారి. వైకాపా తరఫున గత ఎన్నికల్లో బరిలో నిలిచిన అంబటి రాంబాబు మరోసారి పోటీపడుతున్నారు. జనసేన తరఫున మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి పోటీలో ఉన్నారు. జనసేన ప్రభావంపై తెదేపా, వైకాపాల్లో అంతర్లీనంగా ఆందోళన ఉంది.

కోడెల కృషి ఇదీ..
గత ఎన్నికల్లో కోడెల నరసరావుపేట నుంచి ఈ నియోజకవర్గానికి మారారు. కోడెల స్వగ్రామం కండ్లకుంట సత్తెనపల్లి పరిధిలోనే ఉంది. 2014 ఎన్నికల్లో పొత్తులో భాగంగా నరసరావుపేట స్థానాన్ని భాజపాకు కేటాయించడంతో కోడెల సత్తెనపల్లి నుంచి పోటీ చేశారు.

సత్తెనపల్లి నియోజకవర్గంలోరూ.1250కోట్లతో అభివృద్ధి, సంక్షేమం, మౌలికవసతుల కల్పనకు పెద్దపీట వేసి చేపట్టిన పనులే తనను మరోసారి గెలిపిస్తాయనే ధీమాతో ప్రచారం చేస్తున్నారు.

ప్రతి ఇంటికి మరుగుదొడ్డి కట్టించి స్వచ్ఛ సత్తెనపల్లిగా గుర్తింపు తీసుకువచ్చారు. గ్రామాల్లో చెరువుల పూడిక తొలగించడం, శ్మశానాల అభివృద్ధి, సిమెంట్‌ రహదారుల నిర్మాణం పెద్ద ఎత్తున చేపట్టారు.

పట్టణంలో ప్రధాన రహదారి విస్తరణతో పాటు రక్షిత చెరువును ఆధునికీకరించి హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌లా తయారు చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన 36 అడుగుల ఎన్టీఆర్‌ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

వంద పడకల ఆసుపత్రిని నిర్మించారు. రైల్వే ఓవర్‌ బ్రిడ్జి (ఆర్‌ఓబీ) నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు. సత్తెనపల్లి మీదుగా వెళ్లే హైదరాబాద్‌ మార్గాన్ని పేరేచర్ల నుంచి కొండమోడు వరకు నాలుగు వరుసలుగా విస్తరణకు నిధులు తీసుకువచ్చారు.

పెన్నా-గోదావరి అనుసంధాన పనులు ఈ నియోజకవర్గంలోనే ప్రారంభించారు. కేంద్రీయ విద్యాలయం, ఎస్సీ, బీసీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారు.

నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాలతో నిత్యం ప్రజల్లో ఉంటున్నారు.

 

ద్వితీయశ్రేణి నాయకులను ఆకట్టుకోలేకపోవడం.

 అభివృద్ధి పనుల్లో కుటుంబ సభ్యుల జోక్యంపై ఆరోపణలు.

కొందరు నేతలు తెదేపాను వీడి వైకాపాలో చేరడం.

 

అంబటి బలమేంటి?
ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, అభివృద్ధి పనుల్లో కోడెల కుటుంబ సభ్యుల జోక్యమే తనను గెలిపిస్తాయనే నమ్మకంతో ఉన్నారు.

అధికార పార్టీతో పాటు కోడెల కుటుంబంపై తాను చేసే ఆరోపణల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళుతున్నారు.

నియోజకవర్గంలో పాదయాత్ర ద్వారా పార్టీ కార్యక్రమాలను చురుగ్గా నిర్వహిస్తున్నారు.

* సొంత సామాజికవర్గం ఓటర్లు అధికంగా ఉండటం కలిసి వస్తుందని భావిస్తున్నారు.

స్థానికేతరుడు కావడం. ఇక్కడ నివాసాన్ని ఏర్పాటు చేసుకోకపోవడం.

సొంత పార్టీలో అసమ్మతివాదులు.

 

వెంకటేశ్వరరెడ్డి ప్రభావం..
గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లి బలపరచాలని కోరుతున్నారు.
పవన్‌కల్యాణ్‌ కరిష్మా, అభిమానుల మద్దతుపై ఆశలు పెట్టుకున్నారు.

-ఈనాడు, గుంటూరు

వీర బొబ్బిలి కోటలో...

బొబ్బిలి గడ్డపై ఎన్నికల యుద్ధం సాగుతోంది. బొబ్బిలి రాజకుటుంబ వారసుడు.. సిట్టింగ్‌ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి సుజయ్‌కృష్ణరంగారావు తెదేపా తరఫున.. శంబంగి వెంకట చినఅప్పలనాయుడు వైకాపా అభ్యర్థిగా తలపడుతున్నారు. భాజపా తరఫున ద్వారపురెడ్డి రామ్మోహనరావు, జనసేన నుంచి గిరడ అప్పలస్వామి బరిలో ఉన్నారు.

సుజయ్‌కృష్ణ 2004, 2009లో కాంగ్రెస్‌ నుంచి, 2014లో వైకాపా అభ్యర్థిగా గెలుపొందారు. రెండేళ్ల క్రితమే తెదేపాలో చేరి రాష్ట్ర గనులశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం నాలుగోసారి గెలుపుపై ధీమాగా ఉన్నారు. సుజయ్‌కృష్ణకు అండగా ఆయన సోదరుడు, బొబ్బిలి మున్సిపాలిటీ మాజీ ఛైర్మన్‌ బేబినాయన, బొబ్బిలి పట్టణాభివృద్ధి సంస్థ (బుడా) ఛైర్మన్‌ తెంటు లక్ష్మునాయుడు పనిచేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తెదేపా గెలుపు చారిత్రక అవసరమని ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ అభివృద్ధితో పాటు ఆది నుంచి వ్యక్తిగతంగా రాజ కుటుంబం చేసిన సేవా కార్యక్రమాలపై నమ్మకం పెట్టుకున్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించి బొబ్బిలి కోటపై తెదేపా జెండా ఎగరేస్తామని బహిరంగ సవాల్‌ విసిరారు. విజయనగరం, బొబ్బిలి రాజవంశాల వారసులు పూసపాటి అశోక్‌గజపతిరాజు, సుజయ్‌కృష్ణ ఈ ఎన్నికల్లో తెదేపా విజయం కోసం కలిసి పనిచేస్తుండడం విశేషం.

రైతు బిడ్డనంటూ శంబంగి
వైకాపా అభ్యర్థి శంబంగి వెంకట చినఅప్పలనాయుడు తెదేపా తరఫున 1983, 1985, 1994లో ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రభుత్వ విప్‌గానూ పనిచేశారు. రైతు బిడ్డనని, సామాన్యుడినైన తనకే పదవి కట్టబెట్టాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఈసారి బొబ్బిలి రాజుల్ని ఓడించాలని వైకాపా నేత బొత్స సత్యనారాయణ వర్గం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.
 

సుజయ్‌కృష్ణ

బొబ్బిలి రాజవంశానికి స్థానికంగా ప్రజల్లో ఉన్న ఆదరణ.
సోదరుడు బేబినాయన రాజకీయ చాతుర్యం. గెలుపునకు తెంటు చేస్తున్న కృషి.

రాజవంశం దానధర్మాలు, సేవా కార్యక్రమాలు.
సుజయ్‌కృష్ణ ప్రజలతో ఎక్కువగా మమేకం కాకపోవడం.
కార్యకర్తలకు కూడా అంతగా అందుబాటులో ఉండకపోవడం.

శంబంగి బలాబలాలు

బొత్స సత్యనారాయణ, ఆయన మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు అండదండలు.
నియోజకవర్గంలో కీలక సామాజికవర్గానికి చెందిన నేత కావడం.
1994 తర్వాత ఒక్క ఎన్నికలోనూ గెలవకపోవడం.
పార్టీకి గ్రామస్థాయిలో సరైన నాయకత్వం లేకపోవడం.

-ఈనాడు, విజయనగరం

ఉప్పు.. నిప్పు కలిశాయి
* జమ్మలమడుగులో సరికొత్త సమీకరణలతో తెదేపా జోరు
* వైకాపా నుంచి కొత్త అభ్యర్థి

కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలో తెదేపా సరికొత్త సమీకరణాలతో ముందుకు వెళుతోంది. ఇక్కడ విజయం  ఖాయమని భావిస్తోంది. గత ఎన్నికల్లో తెదేపా నుంచి పోటీ చేసి ఓటమి చవి
చూసిన రామసుబ్బారెడ్డి ఇక్కడ మరోసారి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. నాటి ప్రత్యర్థి ఆదినారాయణరెడ్డి తెదేపా కడప ఎంపీగా పోటీ చేస్తుండడం, రామసుబ్బారెడ్డి వర్గంతో కలిసి పనిచేయడం తెదేపా గెలుపునకు దోహదపడుతుందని భావిస్తున్నారు. వైకాపా తరఫున సుధీర్‌రెడ్డి తొలిసారి పోటీ చేస్తున్నారు.

నియోజకర్గంలో ఆదినారాయణరెడ్డి - రామసుబ్బారెడ్డి కుటుంబాల మధ్య దశాబ్దాల ఫ్యాక్షన్‌ వైరం ఉంది. వైకాపా ఎమ్మెల్యేగా గెలిచిన ఆది.. తరువాత తెదేపాలోకి వచ్చి రాష్ట్ర మంత్రి అయ్యారు. అయినా రామసుబ్బారెడ్డి వర్గంతో ఎడమొహం పెడమొహంగానే కొనసాగారు. ఈ ఎన్నికల్లో జమ్మలమడుగు టికెట్‌ కోసం ఇద్దరి మధ్య తీవ్రస్థాయి పోటీ నడిచింది. చంద్రబాబు చేసిన ‘సర్దుబాటు’తో ఇద్దరు నేతలు ఒకే తాటిపైకి వచ్చారు. కడప లోక్‌సభ నుంచి ఆదినారాయణ.. జమ్మలమడుగు అసెంబ్లీ నుంచి రామసుబ్బారెడ్డి బరిలో నిలిచారు. 1994, 99 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన రామసుబ్బారెడ్డి మంత్రిగానూ పనిచేశారు. 2004, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా ఓటమి చవిచూశారు.
అనస్థీషియా వైద్యుడిగా ప్రొద్దుటూరులో పనిచేసిన సుధీర్‌రెడ్డి.. ఆదినారాయణరెడ్డి తెదేపాలోకి వెళ్లడంతో వైకాపా నియోజకవర్గ బాధ్యుడిగా తెరపైకి వచ్చారు. రాజకీయ అనుభవం లేకున్నా సీనియర్‌ నేత మైసూరారెడ్డికి బంధువు కావడం, సుధీర్‌రెడ్డి తల్లి ఎర్రగుంట్ల ఎంపీపీగా ఉండడం కలిసొచ్చే అంశాలు.

రామసుబ్బారెడ్డి బలాలు
వరుస ఓటములతో ప్రజల్లో సానుభూతి.
నియోజకవర్గంలోని గండికోటకు ప్రభుత్వం కృష్ణా జలాలు తరలించడం. మైలవరానికి నీళ్లు రావడం.
ఉక్కు పరిశ్రమకు ఇక్కడే బీజం పడటం.
ఆది, రామసుబ్బారెడ్డి వర్గాలు క్షేత్రస్థాయిలో పూర్తిగా సహకరించుకుంటాయా అనే సందేహాలు.

సుధీర్‌రెడ్డి బలాలు..
వైఎస్‌ కుటుంబ అభిమానులు ఎక్కువగా ఉండటం.
వైఎస్‌ అవినాష్‌రెడ్డి సహకారం.. ప్రచారం.
కొత్త వ్యక్తిగా ఆదరిస్తారన్న నమ్మకం.
వాక్చాతుర్యం లేకపోవడం.
తొలిసారి బరిలోకి దిగడం.. వ్యూహాల లేమి.

-ఈనాడు, కడప

హిందూపురం.. నందమూరి వారి నమ్మకం
హిందూపురం నుంచి మరోసారి బాలయ్య పోటీ
వైకాపా నుంచి రిటైర్డ్‌ ఐజీ ఇక్బాల్‌

ప్రఖ్యాత లేపాక్షి ఆలయానికి నిలయమైన.. హిందూపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడ తెదేపాదే గెలుపు. ఎన్టీఆర్‌ మూడుసార్లు, హరికృష్ణ ఒకసారి, 2014లో బాలకృష్ణ ఇక్కడి నుంచి విజయం సాధించారు. బాలయ్య మరోసారి పోటీ చేస్తుండగా.. వైకాపా నుంచి మాజీ ఐపీఎస్‌ అధికారి ఇక్బాల్‌ రంగంలోకి దిగారు.

మన రాష్ట్రానికి, అనంతపురం జిల్లాకు చివరన కర్ణాటకకు ఆనుకొని ఉండే హిందూపురం నియోజకవర్గంలో మైనార్టీలతో పాటు బీసీలు గెలుపోటములను శాసించే స్థాయిలో ఉన్నారు. 1983లో తొలిసారి తెదేపా తరఫున పి.రంగనాయకులు గెలుపొందారు.  అప్పట్లో ఎన్టీఆర్‌ స్థానంలో నాదెండ్ల భాస్కర్‌రావు సీఎం పీఠం ఎక్కగా.. దాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు జరిగాయి. హిందూపురం నియోజకవర్గం అట్టుడికింది. ఇక్కడ పలువురు ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి ఎన్టీఆర్‌ ఈ స్థానంపై అభిమానం పెంచుకున్నారు.
 

బాలయ్య కృషితో తొలగిన తాగునీటి ఎద్దడి

హిందూపురాన్ని దశాబ్దాలుగా తాగునీటి సమస్య వేధిస్తోంది. బాలకృష్ణ ప్రత్యేక చొరవ చూపించి, రూ.194 కోట్లతో గొల్లపల్లి జలాశయం నుంచి పైప్‌లైన్‌ వేయించి, పట్టణంలో తాగునీటి ఎద్దడి తీర్చారు. ఇటీవలే ఈ పథకం ద్వారా తాగునీటి సరఫరా మొదలైంది. ఇది బాలయ్యకు కలిసి రానుంది.
రహదారుల విస్తరణ, మార్కెట్‌ యార్డ్‌, అంబేడ్కర్‌ భవనం నిర్మాణం, రూ.5 కోట్లతో లేపాక్షి అభివృద్ధి, ఇతర పనులు చేపట్టారు.
బాలయ్య చాలా తక్కువగా నియోజకవర్గానికి వస్తారనే అభిప్రాయం ఉంది. కోటరీగా ఉండే కొందరు నాయకులు, వ్యక్తిగత సహాయకు (పీఏ)ల పెత్తనంపై విమర్శలు ఉన్నాయి. ఈ విషయంలో ద్వితీయ శ్రేణి నాయకులూ కొంత అసంతృప్తితో ఉంటున్నారు.


మైనార్టీ ఓటు బ్యాంక్‌పై ఇక్బాల్‌ దృష్టి

రాయలసీమ ఐజీగా పదవీ విరమణ పొందిన ఐపీఎస్‌ అధికారి ఇక్బాల్‌.. వైకాపా అభ్యర్థిగా తొలిసారి పోటీ చేస్తున్నారు. హిందూపురంలో ఎక్కువ సంఖ్యలో ఉండే మైనార్టీ ఓట్లపై ఆయన ఆశలు పెట్టుకున్నారు. పార్టీలో విభేదాలున్న నాయకులు అందరినీ ఓ గూటికి తీసుకురావడం కొంత కలిసి రానుంది. గెలిపిస్తే స్థానికంగా అందరికీ అందుబాటులో ఉంటానని ఓటర్లకు హామీ ఇస్తున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన వైకాపా అభ్యర్థి నవీన్‌నిశ్చల్‌ నియోజకవర్గ సమన్వయకర్తగా ఇంతకాలం పనిచేశారు. ఆయనకు బదులు ఇటీవల తెదేపా నుంచి వైకాపాలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ఘనీకి నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలు ఇచ్చారు. ఆయనకు టికెట్‌ ఇవ్వాలని వైకాపా పెద్దలు భావించినా.. చివరి నిమిషంలో ఇక్బాల్‌ను తెరపైకి తీసుకొచ్చారు. ఈ పరిణామాలతో అలక చెందిన నవీన్‌కు హిందూపురం పార్లమెంట్‌ సమన్వయకర్త బాధ్యతలు అప్పగించారు. నవీన్‌నిశ్చల్‌తోపాటు, ఇతర నాయకులు ఇక్బాల్‌కు ఎంత మేరకు సహకరిస్తారనేది చూడాల్సి ఉంది. మొత్తానికి ఇక్కడ గట్టి పోటీ కనిపిస్తోంది.

-ఈనాడు, అనంతపురం

విశాఖ ఉత్తరం.. గంటా ప్రవేశం

అనకాపల్లి ఎంపీగా; చోడవరం, అనకాపల్లి, భీమిలి ఎమ్మెల్యేగా వరుస విజయాల్ని సొంతం చేసుకున్న రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు.. ఈ ఎన్నికల్లో విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. భాజపా నుంచి ఆ పార్టీ శాసనసభాపక్ష నేత, సిట్టింగ్‌ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు; వైకాపా, జనసేనల నుంచి కొత్త అభ్యర్థులు బరిలో ఉన్నారు.

వ్యూహాల కొండ.. గంటా

మంత్రి గంటా శ్రీనివాసరావుకు రాజకీయాలు, ఎన్నికల విషయాల్లో మంచి వ్యూహకర్తగా పేరుంది. తీవ్రమైన విషయాలనూ గుట్టుచప్పుడు కాకుండా పరిష్కరించి అనుకూలంగా మలచుకోవడంలో దిట్ట. అత్యంత సన్నిహితంగా ఉండే వారితో పొరపాట్లకు తావులేకుండా ఎన్నికల ప్రచార కార్యక్రమాలు చేయిస్తుంటారు. గంటా తరఫున స్వచ్ఛందంగా పనిచేసే స్నేహితుల బలం, బలగం ఉంది. సొంత సామాజికవర్గ ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండడం ఆయనకు కలిసొస్తున్న మరో అంశం.

లోటుపాట్లు.. నియోజకవర్గంలో చతుర్ముఖ పోరు నెలకొంది. జనసేన అభ్యర్థిని పసుపులేటి ఉషాకిరణ్‌.. మంత్రి గంటా సామాజిక వర్గీయుల ఓట్లనే చీలుస్తారనే ప్రచారం సాగుతోంది.

భాజపా: విష్ణుకుమార్‌రాజు

2014 ఎన్నికల్లో 12 రోజుల ముందు టికెట్‌ సంపాదించిన రాజు.. తెదేపా, జనసేన అండతో,  వాక్పటిమతో జనాల్ని ఆకర్షించి  విజయం సాధించారు.
తనను కలవడానికి వచ్చేవారికి సంవత్సర కాలంగా అల్పాహారాలు, భోజనాలు ఏర్పాటు చేస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు.
శాసనసభలో పలు సమస్యలు ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేశారు. అయితే భాజపాపై నగరంలో తీవ్ర అసంతృప్తి ఉంది.

వైకాపా: కె.కె.రాజు

వైకాపా అభ్యర్థి కె.కె.రాజుకు జగన్‌తో సన్నిహిత సంబంధాలుండడంతో ఆరు నెలల క్రితమే టికెట్‌పై స్పష్టమైన హామీ పొందారు. నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులై ఇప్పటికే మూడుసార్లు నియోజకవర్గంలోని అత్యధిక ఇళ్లకు వెళ్లి మద్దతు అభ్యర్థించారు. ప్రచారంలో ముందంజలో ఉన్నారు. ఆర్థికంగా స్థితిమంతుడైనా.. రాజకీయ అనుభవం లేదు.

జనసేన: ఉషాకిరణ్‌

జనసేన అభ్యర్థిని పసుపులేటి ఉషాకిరణ్‌ ఎమ్మెస్సీ చదివి అధ్యాపకురాలిగా పనిచేశారు. 2008లో ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాల్లోకి వచ్చారు. అనంతరం వైకాపాలో చేరారు. ఆరు నెలల క్రితం జనసేనలోకి మారారు. సొంత సామాజికవర్గ ఓటర్లు, పార్టీ ఎంపీ అభ్యర్థిగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఉండడం, పవన్‌కల్యాణ్‌ అభిమానులు ఎక్కువగా ఉండడం తనకు లాభించే అంశాలుగా భావిస్తున్నారు. తనకు ఓటేస్తే మహిళల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇస్తున్నారు.
-ఈనాడు, విశాఖపట్నం

అచ్చెన్న గురి టెక్కలి

రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సొంత స్థానం టెక్కలి.. 1994లో ఎన్టీఆర్‌ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ‘బ్లూగ్రానైట్‌’కు ఈ ప్రాంతం ప్రసిద్ధి. రాష్ట్రంలోనే
అత్యధికంగా ఉప్పు పండించే నౌపడ ఉప్పుగల్లీ, భావనపాడు తీరం ఇక్కడివే. గత ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌పై విజయం సాధించి.. చంద్రబాబు మంత్రివర్గంలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న అచ్చెన్నాయుడు మరోసారి బరిలో ఉన్నారు. వైకాపా నుంచి పేరాడ తిలక్‌ పోటీ చేస్తున్నారు.

అచ్చెన్న అభివృద్ధి మంత్రం

ఈ అయిదేళ్లలో సుమారు రూ.2 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. 16 ఎత్తిపోతల పథకాల ద్వారా వందలాది ఎకరాలకు సాగునీటిని అందించే ప్రయత్నం చేశారు.
విపక్షానికి పట్టున్న ప్రాంతాల్లోనూ పనులు చేశారు.
టెక్కలిలో అత్యాధునిక సౌకర్యాలతో జిల్లా ఆస్పత్రిని ప్రారంభించారు.
నియోజకవర్గ ప్రజలతో మంచి అనుబంధం ఉంది. స్వపక్షం, విపక్షం తేడా లేకుండా అందరికీ పనులు చేస్తారు.
అట్టడుగు స్థాయి వర్గాల్లో ఆయన సోదరుడు కింజరాపు ప్రసాద్‌కు పట్టుంది.
ఎంపీ అభ్యర్థి రామ్మోహన్‌ పట్ల యువతలో ప్రత్యేక అభిమానం ఉంది.
ఆరోపణలు ఉన్నవారికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం.
జన్మభూమి కమిటీ సభ్యుల ఏకపక్ష వైఖరిపై విమర్శలు.

పేరాడ తిలక్‌..

2014లో టెక్కలి నియోజకవర్గం నుంచి వైకాపా అభ్యర్థిత్వానికి పోటీ పడిన తిలక్‌.. 2016లో నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులయ్యారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థిగా ఎంపికయ్యారు. బలమైన సామాజిక వర్గం; ఓటర్లలో జగన్‌ అభిమానులు; పార్టీ శ్రేణులు ఐకమత్యంతో పని చేయడం ఆయనకు సానుకూల అంశాలు.

సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండలాల్లో తిలక్‌కు అంతగా పరిచయాలు లేవు.
కొండల ప్రాంతంలో ప్రభుత్వ భూములకు పట్టాలు సృష్టించి రుణాలు తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
భాజపా, జనసేన అభ్యర్థులు తిలక్‌ సామాజిక వర్గ ఓట్లను చీల్చే అవకాశం.

ఇదీ చరిత్ర
దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు ప్రాతినిధ్యం వహించిన హరిశ్చంద్రాపురం పునర్విభజన తరువాత టెక్కలి నియోజకవర్గంగా ఏర్పడింది. 1996లో ఎర్రన్నాయుడు ఎంపీగా గెలుపొంది.. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో హరిశ్చంద్రాపురం శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరిగాయి. నాడు తొలిసారి అచ్చెన్నాయుడు పోటీ చేసి గెలుపొందారు. 1999, 2004లోనూ భారీ మెజార్టీతో విజయం సాధించి హ్యాట్రిక్‌ నమోదు చేసుకున్నారు. 2009లో టెక్కలి నియోజకవర్గం ఏర్పాటయ్యాక.. జరిగిన ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. తరవాత జరిగిన ఉప ఎన్నికల్లోనూ మరోసారి ఓటమి చవి చూశారు.

-ఈనాడు, శ్రీకాకుళం

చంద్రగిరి కోటకు రాజెవరో?
వైకాపా తరఫున మరోసారి చెవిరెడ్డి
బరిలో తెదేపా జిల్లా అధ్యక్షుడు నాని

హంపీ విజయనగర సామ్రాజ్యంలో ఓ వెలుగు వెలిగిన ప్రాంతం చంద్రగిరి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాజకీయ ప్రస్థానానికి నాంది పలికింది ఈ నియోజకవర్గమే. వైకాపా తరఫున ప్రస్తుత ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, తెదేపా తరఫున పార్టీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి వెంకటమణి ప్రసాద్‌ అలియాన్‌ పులివర్తి నాని బరిలో ఉన్నారు. జిల్లాలో విస్తీర్ణం, ఓటర్ల పరంగా అతి పెద్దదైన ఈ నియోజకర్గంలో ఎన్నికల పోరు ఆసక్తి రేపుతోంది.

ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇద్దరు నేతలు చురుగ్గా వ్యవహరిస్తున్నారు. దీపావళి పండుగకు చెవిరెడ్డి ఇంటింటికీ టపాసులు, కొత్త దుస్తులు పంచారు. క్రిస్మస్‌ సందర్భంగా క్రైస్తవులకు, కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని అన్ని కుటుంబాలకు స్వీట్లు పంపిణీ చేశారు. సంక్రాంతి సమయంలో ఇద్దరు నాయకులు పోటాపోటీగా స్వీట్లు, దుస్తులు పంచిపెట్టారు. చెవిరెడ్డి కొన్ని మహిళా సంఘాల సభ్యులకు వ్యక్తిగతంగా రూ.2 వేల చొప్పున అందించారు. ఓటర్లను ఆకర్షించేందుకు ఇద్దరూ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. తమ నేత, తమ పార్టీ గెలిస్తే మంత్రి పదవి దక్కుతుందంటూ ఇద్దరి అనుచరులు ప్రచారం చేస్తున్నారు. నాని తరఫున ఆయన భార్య సుధారెడ్డి, కుమారుడు ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు.

ఇదీ చరిత్ర..
1978లో చంద్రగిరి నియోజకవర్గం ఆవిర్భవించింది. ఇక్కడి నుంచి తొలిసారిగా చంద్రబాబు కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎన్నికయ్యారు. తెదేపా ఆవిర్భావం తర్వాత 1983 ఎన్నికల్లో చంద్రబాబు ఇక్కడ తెదేపా అభ్యర్థి ఎం.వెంకట్రామనాయుడు చేతిలో ఓడిపోవడం గమనార్హం. 1985లో ఎన్నికల్లో ఎన్‌.ఆర్‌.జయచంద్రనాయుడు తెదేపా తరఫున గెలుపొందారు. 1989 నుంచి జరిగిన ఎన్నికల్లో అత్యధిక సార్లు కాంగ్రెస్‌ పార్టీని ఇక్కడి ప్రజలు ఆదరించారు. 1994 ఎన్నికల్లో చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడు గెలిచారు. 1989, 1999, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన గల్లా అరుణకుమారి రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత అరుణకుమారి తెదేపాలో చేరారు. 2014 ఎన్నికల్లో ఆమె పరాజయం పాలయ్యారు.

పులివర్తి నాని..

ఇన్‌ఛార్జిగా బాధ్యతలు అప్పగించాక నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించడం.
ఏడాది కాలంగా పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టడం.
తన భార్య సామాజికవర్గం కలిసి వస్తుందన్న నమ్మకం.
ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న శెట్టిపల్లి గ్రామ భూముల సమస్యను పరిష్కరించడం.
ఈ ఐదేళ్లలో పార్టీకి దూరమైన శ్రేణులను సమీకరించడంలో ఇబ్బందులు.
జిల్లాఅధ్యక్షుడిగా చిత్తూరు నుంచి రాజకీయాలు చేస్తుండటంతో నియోజకవర్గ ప్రజలతో సంబంధాలు తక్కువగా ఉండటం.

చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

ప్రజలకు అందుబాటులో ఉండటం.
తరచూ గ్రామాల్లో పర్యటించడం. స్థానికులతో మమేకం కావడం.
అభివృద్ధి కంటే వివాదాలకే ప్రాధాన్యమివ్వడం.

-ఈనాడు, తిరుపతి

పెద్దాపురం ఎవరిదప్పా!
నిన్నటి వరకూ ఒకే పార్టీలో.. నేడు వైరి పక్షాలుగా...

ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మరోసారి తూ.గో.జిల్లా పెద్దాపురం నుంచి బరిలో ఉన్నారు. ఎంపీ తోట నరసింహం సతీమణి వాణి వైకాపా తరఫున ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నారు. అమలాపురానికి చెందిన చినరాజప్ప 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఆదేశాల మేరకు పెద్దాపురం నుంచి పోటీ చేసి వైకాపా అభ్యర్థి తోట సుబ్బారావునాయుడుపై విజయం సాధించారు. నియోజకవర్గంలో రూ.కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. గెలుపుపై చినరాజప్ప ధీమాగా ఉన్నారు. ఇక్కడ తెదేపా టికెట్‌ ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే బొడ్డు భాస్కరరామారావు ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఆయన వర్గీయులు వైకాపాలో చేరుతుండడం పార్టీలో ఆందోళన కలిగిస్తున్న అంశం.

ఇన్నాళ్లు లోక్‌సభలో తెదేపా శాసనసభాపక్ష నాయకుడిగా ఉన్న కాకినాడ ఎంపీ తోట నరసింహం అనారోగ్య కారణాలతో పోటీకి దూరంగా ఉన్నారు. అనంతరం వైకాపాలో చేరడంతో.. ఆయన సతీమణి వాణికి ఆ పార్టీ ఇక్కడ పోటీకి నిలిపింది. ‘చినరాజప్ప మా కుటుంబాన్ని అవమానించారు.. ఓడించి ప్రతీకారం తీర్చుకుంటాం’ అనే నినాదంతో ఆమె ఎన్నికల్లో తలపడుతున్నారు. పుట్టింటి.. అత్తింటి కుటుంబాల రాజకీయ నేపథ్యం తనకు కలిసి వస్తుందన్న ఆశతో ఉన్నారు. భర్త అనారోగ్య పరిస్థితుల నేపథ్యంలో బరిలో నిలిచిన ఈమె సెంటిమెంట్‌ అస్త్రాన్ని సంధిస్తున్నారు. తన భార్య విజయానికి ఎంపీ నరసింహం తెదేపాలో ఉన్న పరిచయాలను వినియోగించుకుంటున్నారు. సామాజికవర్గం నుంచి సానుకూలత పొందేలా పావులు కదుపుతున్నారు.

స్థానికేతరుల మధ్యే పోరు
పెద్దాపురం నియోజకవర్గంలో 1955లో గెలిచిన సీపీఐ అభ్యర్థి డి.వి.సుబ్బారావు మినహా ఇప్పటివరకు అన్ని ఎన్నికల్లో ఇక్కడ స్థానికేతరులే గెలవడం గమనార్హం. ప్రస్తుతం బరిలో ఉన్న తెదేపా, వైకాపా అభ్యర్థులూ స్థానికేతరులు కాగా.. జనసేన అభ్యర్థి తుమ్మల రామస్వామి, కాంగ్రెస్‌ అభ్యర్థి తుమ్మల దొరబాబు ఈ నియోజకవర్గానికి చెందినవారే. ప్రధానంగా తెదేపా- వైకాపా మధ్యే  పోటీ ఉంది. ఈ రెండు పార్టీల అభ్యర్థులు ఒకే సామాజికవర్గానికి చెందినవారు కావడం.. జనసేన ఏ పార్టీ ఓట్లు చీలుస్తుందో తెలియక పోటీ ఆసక్తిగా మారింది.

* ఇక్కడ ఆరు సార్లు కాంగ్రెస్‌, అయిదుసార్లు తెదేపా, రెండుసార్లు సీపీఐ, ఒకసారి ప్రజారాజ్యం అభ్యర్థులు గెలిచారు. నియోజకవర్గంలో పెద్దాపురం, సామర్లకోట మున్సిపాలిటీలు ఉన్నాయి.

-ఈనాడు, కాకినాడ

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.