close

ప్ర‌త్యేక క‌థ‌నం

7 రోజులు 17 స్థానాలు

మోహరిస్తున్న బలగాలు

సభలు, సమావేశాల హోరు
తుది దశకు చేరిన ప్రచారం
రోజంతా పర్యటనలే
ఈనాడు - హైదరాబాద్‌

రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల ప్రచారం వేగం పుంజుకుంది.. సరిగ్గా మరో వారం రోజుల్లో ప్రచారం ముగియనుంది. ఎన్నికల కోసం అన్ని పార్టీలు తమ బలగాలను పూర్తి స్థాయిలో మోహరిస్తున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌, కేంద్రమంత్రులు, మంత్రులు, ఇతర ముఖ్యనేతల సభలు, సమావేశాలు పోటాపోటీగా సాగుతున్నాయి. చివరి వారం రోజులు అన్ని పార్టీలకు కీలకం కావడంతో ప్రచారం ఊపందుకుంది.

తెరాస ప్రచారం ఉద్ధృతం
తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెరాస ప్రచారానికి కేంద్ర బిందువుగా ఉన్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ... అన్ని శ్రేణుల కార్యకర్తలు ఎన్నికల రంగంలో దిగారు. సీఎం గత నెల 29న  మిర్యాలగూడలో నల్గొండ నియోజకవర్గ సమావేశంతో ఎన్నికల తుడివిడత ప్రచారం ప్రారంభించారు. తర్వాత నాగర్‌కర్నూలు, మహబూబ్‌నగర్‌, రామగుండం, భువనగిరి సభల్లో పాల్గొన్నారు. 3న అందోలు, నర్సాపూర్‌, 4న మహబూబాబాద్‌, ఖమ్మం సభల్లో పాల్గొంటారు. మరోవైపు కేటీఆర్‌ ముమ్మరంగా, సభలు సమావేశాలు, రోడ్‌ షోలతో ప్రచారం నిర్వహిస్తున్నారు. గత నెల ఆరో తేదీ నుంచి అవి సాగుతున్నాయి. మంగళవారం ఆయన ఉప్పల్‌, మల్కాజ్‌గిరి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. 3న  సికింద్రాబాద్‌ కంటోన్మెంటు, మేడ్చల్‌ , 4న అంబర్‌పేట, ముషీరాబాద్‌,  5న సికింద్రాబాద్‌, సనత్‌నగర్‌,  6న జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్‌, నాంపల్లి,  7న రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లి, 8న కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌, 9న మధ్యాహ్నం నల్గొండ సభల్లో పాల్గొంటారు. మరోవైపు తెరాస మంత్రులు 11 మంది ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కార్పొరేషన్ల ఛైర్మన్లు, రాష్ట్ర కమిటీలు, అనుబంధవిభాగాలు,  స్థానిక సంస్థల ప్రతినిధులు ప్రచారం జరుపుతున్నారు.

ఎండలను లెక్క చేయకుండా...
ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ అభ్యర్థులు లెక్క చేయకుండా రోజంతా ప్రచారంలో సాగుతున్నారు. ఉదయం అయిదు గంటలకే ఇంటి నుంచి బయల్దేరి రాత్రి పది గంటల వరకు వరకు పల్లెలు, పట్టణాలు, వార్డులను సందర్శిస్తున్నారు. స్థానికంగా ఉన్న నేతలకు ప్రచార బాధ్యతలను తెరాస అప్పగించింది. నగరాల్లో డివిజన్లలోని కార్పొరేటర్లు, పట్టణాల్లోని కౌన్సిలర్ల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు.గ్రామాల్లో సర్పంచులు, వార్డు సభ్యులు పర్యటిస్తున్నారు. బూత్‌ కమిటీలతో కలిసి వీరి పర్యటనకు సాగిస్తున్నారు.

ఆఖరి అస్త్రాలు సంధిస్తున్న కాంగ్రెస్‌
కాంగ్రెస్‌ అభ్యర్థుల తమ ప్రచార వేగాన్ని పెంచారు. ఆఖరి ప్రచార అస్త్రాలను సంధిస్తున్నారు. శాసనసభ నియోజవర్గాల వారీగా మండలస్థాయి సమావేశాలు ఇప్పటికే ఒకసారి పూర్తికాగా మరోసారి ముఖ్యనేతలతో అభ్యర్థులు సమావేశం కానున్నారు. పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ జహీరాబాద్‌, హుజూర్‌నగర్‌, వనపర్తి సభల్లో పాల్గొనివెళ్లారు. 9లోపు మరోసారి రాహుల్‌ పర్యటనకు ప్రయత్నం చేస్తున్నారు. తమ ఓటర్లుగా భావిస్తున్న వారందరిని ఎన్నికల రోజున పోలింగ్‌ బూత్‌కు తీసుకువచ్చే కార్యాచరణ రూపొందిస్తోంది. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్‌రెడ్డి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తదితర కాంగ్రెస్‌ ముఖ్య అభ్యర్థులు పార్టీలో అందరినీ కలుపుకొంటూ వెళుతూ ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఈ వారం రోజులు కీలక కావడంతో కాంగ్రెస్‌ అభ్యర్థులు ప్రతి రోజును సద్వినియోగం చేసుకునేలా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. మేనిఫెస్టోలోని రుణమాఫీ, కనీస ఆదాయ పథకం తదితర అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం కాంగ్రెస్‌ నేతలు చేస్తున్నారు. ముఖ్య నేతలు బరిలో ఉన్న స్థానాల్లో పోటాపోటీగా సాగుతోంది. కొన్ని స్థానాల్లో మాత్రం ఇంకా క్షేత్రస్థాయికి చేరలేదు.

చెమటోడుస్తున్న అభ్యర్థులు
శాసనసభ ఎన్నికల అనంతరం పలు నియోజకవర్గాల్లో పార్టీ ముఖ్యనేతలు, నియోజకవర్గాల్లో కీలక నేతలు పార్టీకి దూరం కావడం సమస్యగా మారింది.ఈ నేపథ్యంలో అభ్యర్థులే స్వయంగా చెమటోడ్చాల్సిన పరిస్థితి ఉంది. కొన్నిచోట్ల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. కార్యకర్తల్లో కొంత అయోమయం ఉన్నా సర్దుబాటు చేసుకుని ముందుకు వెళ్తున్నట్లు కాంగ్రెస్‌నేతలు పేర్కొంటున్నారు. అభ్యర్థులు సీపీఐ, జనసమితి ఇతర పార్టీలు, సంఘాల మధ్దతును అభ్యర్థించారు. బహిరంగ సభలు ముగిసిన తర్వాత నేతలు, కార్యకర్తల ప్రచారం సాగనుంది.

ఊపందుకున్న భాజపా ప్రచారం
భాజపా లోక్‌సభ అభ్యర్థుల ప్రచారం ఊపందుకుంది. ప్రచారానికి ఇంకా వారమే ఉండటంతో వ్యూహాలకు పదును పెడుతున్నారు. రోడ్‌షోలు, సభలతో అభ్యర్థులు ఓవైపు ప్రచారం చేస్తుండగా.. మరోవైపు మోదీ, అమిత్‌షా వంటి అగ్రనేతలు.. కేంద్ర మంత్రులు, ఓ ముఖ్యమంత్రి.. ఇలా తన బలగాలను మొత్తం కమలదళం మోహరిస్తోంది. ప్రధాని మోదీ మహబూబ్‌నగర్‌లో, హైదరాబాద్‌లో 2 సభల్లో పాల్గొని వెళ్లారు. ఇప్పటికే నిజామాబాద్‌ సభకు హాజరైన అమిత్‌షా మరో రెండు విడతలు ప్రచారానికి రానున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ మంగళవారం నిజామాబాద్‌, మహబూబాబాద్‌లో ప్రచారం చేశారు. 3 నుంచి 9వ తేదీ వరకు దాదాపు మరో 10 మంది కేంద్ర మంత్రులను భాజపా రప్పిస్తోంది. జాతీయ నేతలు, కేంద్రమంత్రుల ప్రచారంలో కమలదళం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. పార్టీ విజయావకాశాలు, ఆయా నియోజకవర్గాల్లో ప్రభావిత ఓటర్లను దృష్టిలో పెట్టుకుంటోంది. మల్కాజిగిరి స్థానం పరిధిలో రక్షణశాఖ ఉద్యోగులు, మాజీ సైనికులు అధికంగా ఉంటారు. ఇక్కడ రక్షణశాఖమంత్రి నిర్మల సీతారామన్‌తో ప్రచారం చేయించింది. భాజపాకు అత్యంత కీలకమైన రాష్ట్రంగా భావిస్తున్న ఉత్తరప్రదేశ్‌లో 80 లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తీరికలేకుండా ఉన్నప్పటికీ ఒక రోజు తెలంగాణకు వచ్చి ప్రచారం చేసి వెళ్లాలని రాష్ట్ర పార్టీ ఒత్తిడి చేసింది. యోగి ప్రచారానికి వ్యూహాత్మకంగా ఆదిలాబాద్‌, జహీరాబాద్‌ నియోజకవర్గాలను భాజపా ఎంపిక చేసింది. అమిత్‌షా 4న కరీంనగర్‌, వరంగల్‌ సభల్లో.. 6న నల్గొండ, హైదరాబాద్‌లో రోడ్‌షోల్లో పాల్గొనున్నారు. చేవెళ్లలో కూడా అమిత్‌షా సభకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రతి రోజు..ప్రతి గంట..
లోక్‌సభ నియోజకవర్గ పరిధి పెద్దది కావడం.. ప్రచారానికి సమయం తక్కువగా ఉండటంతో బరిలో ఉన్న భాజపా అభ్యర్థులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. హైదరాబాద్‌లో అయితే ఉదయం ఆరుగంటలకల్లా పార్కులు, క్రీడామైదానాల్లో వాలిపోతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం రోడ్‌షాలు, మధ్యాహ్నం కార్యకర్తలతో..కాలనీల పెద్దలతో సమావేశాలతో ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. రాత్రి 9 గంటల వరకు ప్రచారం కొనసాగిస్తున్నారు. ఆ తర్వాత అసలు వ్యూహాలకు పదును పెడుతున్నారు. శాసనసభ నియోజకవర్గాలు, మండలాలు, కాలనీల వారీగా పార్టీ బలబలాలను సమీక్షించుకుంటూ ఏం చేయాలన్నదానిపై నాయకులతో మంత్రాంగం జరుపుతుతున్నారు. బస్తీలు, మైనార్టీలు అధికంగా ఉన్న ప్రాంతాలపై భాజపాలో కొంత కలవరం ఉంది. అక్కడ తమ మద్దతు పెంచుకోవడం.. విద్యావంతులు ఉన్న చోట వారిని పోలింగ్‌ కేంద్రాలకు రప్పించడంపై దృష్టిపెట్టింది. రాత్రి 8, 9 గంటకల్లా ప్రచారం పూర్తవుతున్నప్పటికీ భాజపాలో కొందరు అభ్యర్థులు అర్ధరాత్రి 1, 2 గంటల తర్వాత గానీ నిద్రపోవడం లేదు. నగర పరిధిలోనివారైతే తెల్లవారుజామును 5 గంటలకే నిద్రలేస్తున్నారు. ఎంపీగా విజయం సాధిస్తే, కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం వస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని భావిస్తున్న నేతలు అయితే గెలుపుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.