close

ప్ర‌త్యేక క‌థ‌నం

విశ్రాంత జీవితానికి సుప్రీం భరోసా

వాస్తవిక వేతనంపై పింఛను లెక్కింపు
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు భారీ ప్రయోజనం
ఉద్యోగి, యజమాని ఎప్పుడైనా ఆప్షన్‌ ఇవ్వొచ్చు
ఇప్పటికే 2014 సెప్టెంబరు ముందు పదవీవిరమణ చేసిన వారికి వర్తింపు
తాజా తీర్పుతో 2014 తరువాత వారికీ ఊరట

ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా వేతన జీవులకిది శుభవార్త. ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు పదవీవిరమణ సమయంలో అధిక పింఛను పొందేందుకు సుప్రీంకోర్టు వీలుకల్పించింది. గతంలో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ.. ఈపీఎఫ్‌వో దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి,

న్యాయమూర్తులు జస్టిస్‌ దీపక్‌గుప్తా, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాలతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. దీంతో ఇకనుంచి ఉద్యోగులు పదవీవిరమణ సమయానికి తీసుకునే చివరి సగటు వాస్తవిక మూలవేతనం, డీఏపై ఈపీఎఫ్‌ పింఛను లెక్కించేందుకు మార్గం సుగమమయింది. అధిక పింఛను కోసం ఉద్యోగి, యజమాని సంయుక్తంగా ఆప్షన్‌ ఇవ్వాలని సూచించింది. దీనికి గడువేమీ లేదని తేల్చిచెప్పింది. ఈ తీర్పుతో ఈపీఎఫ్‌ పరిధిలో వేతన జీవులకు వారు పొందుతున్న వేతనాల మేరకు పింఛను లభించనుంది.

ఇదీ సెక్షన్‌ 11(3)
ఈపీఎఫ్‌వో చట్టంలోని పేరా 11(3) ప్రకారం.. ఉద్యోగి వేతనం రూ.6,500 కంటే ఎక్కువగా ఉంటే, ఆ వేతనంపై ఈపీఎస్‌ చెల్లించేందుకు అనుమతి ఉంటుంది. ఈ మేరకు యజమాని, ఉద్యోగి 2004 డిసెంబరు ఒకటో తేదీలోగా ఆప్షన్‌ ఇవ్వాలి. ఈ విషయమై పెద్దగా ప్రచారం చేయకపోవడంతో అప్పట్లో పలు యాజమాన్యాలు, పలువురు ఉద్యోగులు ఆప్షన్‌ ఇవ్వలేదు. ఆప్షన్‌ ఇచ్చేందుకు గడువు నిర్ణయించడం సరికాదని కొందరు ఉద్యోగులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 2014 సెప్టెంబరులో గరిష్ఠ అర్హత వేతనాన్ని (మూలవేతనం, డీఏ కలిపి) రూ.6,500 నుంచి రూ.15 వేలకు పెంచారు. అదే సమయంలో ‘కనీస పింఛను రూ.వెయ్యి’ పేరిట సంస్కరణలు తీసుకువచ్చారు. పింఛను లెక్కించేందుకు వార్షిక సగటు వేతనానికి బదులుగా, ఐదేళ్ల సగటు వేతనం తీసుకుని లెక్కిస్తామని ఈపీఎఫ్‌వో పేర్కొంది. పేరా 11(3) కింద అదనపు పింఛను తీసుకునేందుకు వీలుగా ఈపీఎస్‌ పెంచేందుకు ఆప్షన్లు నిరాకరించింది. దీనిపై ఉద్యోగులు వివిధ రాష్ట్రాల్లో న్యాయస్థానాల్ని ఆశ్రయించారు.

ఇప్పటికే అమలు చేస్తున్న ఈపీఎఫ్‌వో
గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు 2014 సెప్టెంబరు కంటే ముందుగా పదవీవిరమణ చేసిన ఉద్యోగులకు అధిక పింఛను పొందేందుకు అవకాశం ఇచ్చింది. ఉద్యోగి, యజమాని సంయుక్తంగా ఆప్షన్‌ ఇస్తే, ఈపీఎస్‌ లోటును లెక్కించి 8.55% వడ్డీతో కలిపి ఈపీఎస్‌ నిధి తీసుకుంది. ఆయా ఉద్యోగులకు పింఛను లెక్కించి, పింఛను బకాయిలు చెల్లించింది. ఈ ఉద్యోగులకు అధిక పింఛను కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు ఈపీఎఫ్‌వో సంస్థ సవాలక్ష కోర్రీలు వేస్తూ కాలక్షేపం చేస్తూ వచ్చింది. చివరకు ఉద్యోగ సంఘాల ఒత్తిడితో, కోర్టు చీవాట్లు పెట్టడంతో అనుమతిస్తోంది. ఒక్కో అర్జీని పరిశీలించి పూర్తిచేసేందుకు నెలల తరబడి సమయం తీసుకుంటోంది.

తాజా తీర్పుతో..
సుప్రీం కోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో 2014 తరువాత పదవీవిరమణ చేసే వేతన జీవులు అధిక పింఛను పొందవచ్చు. ప్రస్తుత ఈపీఎఫ్‌వో నిబంధనల ప్రకారం వేతనం రూ.50 వేలు ఉన్నప్పటికీ, కేవలం రూ.15 వేల గరిష్ఠ పరిమితి పరిగణనలోకి తీసుకుని పింఛను లెక్కిస్తున్నారు. దీంతో పింఛను మొత్తం తక్కువగా ఉంటోంది. తాజా తీర్పుతో రూ.50 వేలపై పింఛను సర్వీసు ప్రకారం లెక్కిస్తే, వచ్చే పింఛను రెండు, మూడు రెట్లు పెరగనుంది.

అదనపు ఈపీఎస్‌ చెల్లించాల్సిందే..
ఈపీఎస్‌పై గరిష్ఠ పరిమితి ఉండటంతో అధిక వేతనాలున్నప్పటికీ పరిమితికి మించి చెల్లించేందుకు వీలు లేదు. తాజాగా సుప్రీం నిర్ణయంతో ఇప్పటివరకు సర్వీసుకు సంబంధించి అదనపు ఈపీఎస్‌ మొత్తాన్ని ఉద్యోగి చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగి, యజమాని కలిసి సంయుక్తంగా ఆప్షన్‌ ఇచ్చినపుడు.. వేతన లెక్కలు పరిశీలించి ఈపీఎఫ్‌వో ఉద్యోగి చెల్లించాల్సిన ఈపీఎస్‌ డిమాండ్‌ నోటీసు ఇస్తుంది. ఇప్పటికే సర్వీసులో ఉన్న ఉద్యోగులకు యజమాని ఖాతా నుంచి మినహాయిస్తారా? ప్రత్యేకంగా చెల్లించాలని చెబుతారా? ఈపీఎఫ్‌వో వెలువరించే నిబంధనల్లో వెల్లడి కావాల్సి ఉంటుంది. ఉద్యోగి ప్రత్యేకంగా చెల్లించాల్సి వస్తే, ఈపీఎస్‌ డిమాండ్‌కు అదనంగా వడ్డీతో సహా నిర్ణీత గడువులోగా కట్టాలి. లేకుంటే వడ్డీ పెరుగుతూ ఉంటుంది.

ఈపీఎస్‌ లెక్కింపు ఇలా..

ఉద్యోగి పీఎఫ్‌ ఖాతాలో మూడు విభాగాలు ఉంటాయి. ఒకటి ఉద్యోగి చందా, రెండోది యజమాని ఉద్యోగి పేరిట జమ చేసే చందా, మూడోది ఉద్యోగుల పింఛను నిధి. ఉద్యోగి, యజమాని చందాలను పదవీవిరమణ సమయంలో ఉద్యోగికి ఇస్తారు. ఇక పింఛను నిధి (ఈపీఎస్‌) కింద జమచేసిన సొమ్ముతో పదవీవిరమణ తరువాత ఉద్యోగికి, ఆయన మరణానంతరం జీవిత భాగస్వామికి పింఛను చెల్లిస్తారు.

* ఉద్యోగి పీఎఫ్‌ ఖాతాలో ఉద్యోగి మూలవేతనం, డీఏ కలిపి ఆ మొత్తంపై 12% అతని వేతనం నుంచి తీసుకుని జమ చేస్తారు. అంతే మొత్తంలో యజమాని తనవంతు వాటాగా చెల్లిస్తారు.
* ఉద్యోగి మూలవేతనం, డీఏ కలిపి రూ.25,000 అయితే... అందులో 12% వాటా కింద రూ.3 వేలు ఉద్యోగి వేతనం నుంచి తీసుకుంటారు. అంతే మొత్తంలో యజమాని రూ.3 వేలు జమ చేస్తారు. అయితే యజమాని జమచేస్తున్న 12%లో.. 8.33% ఉద్యోగి పింఛను పథకంలో, మిగతా సొమ్ము ఉద్యోగి ఖాతాలో జమ చేస్తారు.

* 2014కు ముందు గరిష్ఠ వేతన పరిమితి రూ.6,500గా ఉండటంతో ఈపీఎస్‌పై గరిష్ఠ పరిమితి రూ.541గా ఉండేది. 2014 సెప్టెంబరు తరువాత వేతన గరిష్ఠ పరిమితి రూ.15 వేలుగా ఉండటంతో అందులో 8.33%.. రూ.1,250 పరిమితిగా విధించారు. అంటే గరిష్ఠ ఈపీఎస్‌ పరిమితి కన్నా 8.33% వాటా ఎక్కువగా ఉంటే ఆ మొత్తం ఉద్యోగి ఖాతాలో జమ చేసేవారు. ఈ లెక్కన రూ.25 వేలలో 8.33%.. రూ.2,082 అయినప్పటికీ... 1,250 తీసివేయగా మిగతా రూ.832 ఉద్యోగి ఖాతాలోకి వెళ్లేది. అలాగే మిగతా (3.67% వాటా) రూ.918 కూడా కలిపేవారు. తాజాగా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో 8.33% మొత్తం రూ.2,082 ఈపీఎస్‌ ఖాతాలోకి వెళ్తుంది.

పింఛను ఇలా లెక్కిస్తారు

ఇక ఉద్యోగి వాస్తవిక మూలవేతనం, డీఏ కలిపి పింఛను గరిష్ఠ అర్హత వేతనంగా నిర్ణయించాలి. ఆ ఉద్యోగి సర్వీసు ఆధారంగా పింఛను లెక్కించాలి. ఒకవేళ ఉద్యోగి 20 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకుంటే.. వారికి అదనంగా మరో రెండేళ్ల సర్వీసు కలిసి వస్తుంది.

పింఛను లెక్కింపు సూత్రం: గరిష్ఠ అర్హత వేతనం సర్వీసు/70

ఉదాహరణకు పాత పద్ధతిలో.. ఒక ఉద్యోగి పదవీ విరమణ వేతనం రూ.35 వేలు అనుకుందాం. సర్వీసు 22 ఏళ్లు. ప్రస్తుత గరిష్ఠ అర్హత వేతన పరిమితి రూ.15 వేలు ఉన్నందున ఉద్యోగికి పింఛను లెక్కిస్తే రూ.4,714 వస్తుంది. రెండేళ్ల బోనస్‌ కలిపి 24 ఏళ్ల సర్వీసు అవుతుంది.
* 15,000 x 24/70  = రూ.5,142
* సుప్రీం తీర్పు మేరకు వాస్తవిక వేతనంతో లెక్కించినపుడు..
* 35,000 x 24/70  = రూ.12,000
* ఇలా వేతనం, సర్వీసు పెరిగే కొద్దీ.. పదవీవిరమణ తరువాత విశ్రాంత సమయంలో అందే పింఛను పెరుగుతుంది. ఇది అధిక వేతనాలతో పనిచేస్తున్న వారందరికీ ఊరటనిచ్చే విషయం.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.