close

ప్ర‌త్యేక క‌థ‌నం

మళ్లీ స్టెంటు పోటు

మందు పూత ఉన్నవి ప్రియం 
ఒక్కోదాని ధర రూ. 2,190 పెంపు 
తాజాగా సవరించిన ఎన్‌పీపీఏ 
ఈ నెల 1 నుంచే పెంపు అమల్లోకి 
ఆసుపత్రుల్లో యథావిధిగా బాదుడు 
ఈనాడు - హైదరాబాద్‌

గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడినప్పుడు వినియోగించే స్టెంటు ధరలు పెరిగాయి. గతంలో స్థిరీకరించిన ధరల కంటే ఒక్కో మందుపూత స్టెంటుపై రూ. 2,190 పెంచుతూ తాజాగా జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ (ఎన్‌పీపీఏ) నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలు ఈనెల 1 నుంచే అమల్లోకి వచ్చాయి. ఆసుపత్రులు స్టెంటు ధరలను అడ్డగోలుగా వసూలు చేస్తూ రోగులపై ఆర్థిక భారాన్ని మోపుతుండడాన్ని గమనించిన కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల కిందట వీటి ధరల నియంత్రణపై దృష్టిపెట్టింది. దేశంలో ఎక్కువగా ఉపయోగిస్తున్న స్టెంట్లు రెండు రకాలు. 
ఒకటి మందుపూత లేని స్టెంటు.. రెండోది మందుపూత కలిగిన స్టెంటు.. ఈ రెండింటిలో ఎక్కువగా వినియోగంలో ఉన్నది మందుపూత స్టెంటే. రెండేళ్ల కిందట తొలుత మందుపూత లేని స్టెంటుకు రూ. 7,260, మందుపూత కలిగిన స్టెంటుకు రూ. 29,600గా నిర్ణయించింది. వీటికి పన్నులు  అదనం. ఏడాది తర్వాత 2018 ఫిబ్రవరిలో మరోసారి వీటి ధరలను స్థిరీకరించింది. మందుపూత లేని స్టెంటు ధర రూ. 7,660గా, మందుపూత ఉన్నవి రూ. 27,890గా మార్చింది. పన్నులు కలుపుకొని ఆసుపత్రులు సుమారుగా రూ.31,000 వసూలు చేస్తున్నాయి. ఏడాదిగా ఈ ధరలే అమల్లో ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మరోసారి స్టెంటు ధరలను కేంద్రం స్థిరీకరించింది. మందుపూత లేని స్టెంటు ధర రూ. 8,261గా, మందుపూత ఉన్నవాటి ధర రూ. 30,080గా నిర్ణయించింది. ఈ ధరలకు జీఎస్టీ అదనం. 
చికిత్స మరింత భారం 
కార్పొరేట్‌ ఆసుపత్రుల గిమ్మిక్కులతో రోగులకు స్టెంటు పోటు తప్పడంలేదు. స్టెంట్ల ధర తగ్గిందని ఆశపడిన రోగులకు చాన్నాళ్లుగా నిరాశే ఎదురవుతోంది. ఎక్కువశాతం కార్పొరేట్‌ ఆసుపత్రులు ఒకపక్క స్టెంటు ధరను తగ్గిస్తూనే.. మరోవైపు వేర్వేరు రూపాల్లో ఇతరత్రా ధరలను పెంచి వసూలు చేస్తున్నాయి. అంటే స్టెంటు ధరల్లో తగ్గిన లోటును ఇతర రూపాల్లో పూడ్చుకుంటున్నాయన్నమాట. స్టెంటు ధరను ప్రభుత్వం సూచించినట్లుగానే వసూలు చేస్తూ.. కార్డియాలజిస్టు, సహాయ కార్డియాలజిస్టు, అనస్థిటిస్టు, క్యాత్‌ల్యాబ్‌, ఐసీయూ, గది.. తదితరాలకు ధరలను అనూహ్యంగా మూణ్నాలుగింతల వరకూ పెంచేశాయి. రెండేళ్ల కిందట యాంజియోప్లాస్టీ ధర సుమారు రూ. 1.5 లక్షల నుంచి రూ. 2 లక్షలుంటే.. ఇప్పుడు కూడా దాదాపు అదే ఖరీదును రోగి భరించాల్సి వస్తోంది. ఇప్పుడు స్టెంటు ఖర్చు రూ. 2,190 పెరగడంతో.. దీన్ని అడ్డం పెట్టుకొని కార్పొరేట్‌ ఆసుపత్రులు ఆ మేరకు యాంజియోప్లాస్టీ చికిత్స వ్యయాన్ని కూడా పెంచనున్నట్లు తెలిసింది. 
కొన్ని ఆసుపత్రుల్లో ఇప్పటికే దీనికి సంబంధించిన ధరల మార్పు ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ప్రభుత్వం స్టెంటు ధరనైతే నియంత్రిస్తుంది కానీ.. ఆసుపత్రిలో వేర్వేరు రూపాల్లో ధరలను పెంచడంపై నియంత్రణ లేకపోవడం రోగికి ఆర్థికంగా పెనుభారంగా పరిణమిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.