close

ప్ర‌త్యేక క‌థ‌నం

కలెక్టర్‌.. ఇక జిల్లా పాలనాధికారి! 

రెవెన్యూ పేరు మార్పునకు ప్రభుత్వం కసరత్తు 
వ్యవసాయ శాఖకు అనుబంధంగా చేర్చే అవకాశాలు! 
భూ యాజమాన్య హక్కు చట్టం తేవడంలో భాగంగా సంస్కరణలు 
ఇప్పటికే నీటి తీరువా రద్దు చేసిన సర్కారు 
కొత్త చట్టం అమలుకు సర్వే చేస్తామని మహబూబాబాద్‌ సభలో పేర్కొన్న సీఎం

ఈనాడు, హైదరాబాద్‌: కలకటేరు అని గ్రామీణులు పిలిచినా.. కలెక్టర్‌ అని ఉచ్ఛరించినా.. రానున్న రోజుల్లో ఈ పదం తెరమరుగయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. శిస్తు వసూళ్లకు అనుగుణంగా రెవెన్యూ పేరుతో పురుడుపోసుకున్న రెవెన్యూ శాఖ.. తహసీళ్లను పాలించిన తహసీల్దార్ల వ్యవస్థలు కూడా మార్పులకు లోనుకానున్నాయి. పాలనాపరమైన సంస్కరణల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న మార్పుల్లో జిల్లా కలెక్టర్‌ పేరు జిల్లా పాలనాధికారి (జిల్లా అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌)గా మారనున్నట్లు సమాచారం. ఆదాయం వసూలు చేసే విధుల నుంచి భూ, సాధారణ పరిపాలన సేవలకు అనుగుణంగా మార్పులకు లోనైన రెవెన్యూ శాఖ కూడా మున్ముందు సాధారణ పరిపాలన శాఖగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. భూములపై పూర్తిస్థాయిలో హక్కులు కల్పించేందుకు భూ దస్త్రాల ప్రక్షాళన కార్యక్రమం (ఎల్‌ఆర్‌యూపీ) అమలు, ధరణి పోర్టల్‌ ఏర్పాటు లాంటి సంస్కరణలు చేపట్టిన ప్రభుత్వం కొద్దిరోజుల్లో మరిన్ని చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. 
వ్యవసాయశాఖకు అనుబంధంగా 
రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న రెవెన్యూ శాఖను వ్యవసాయశాఖకు అనుబంధంగా చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అమల్లో ఉన్న ఆర్‌ఓఆర్‌ (రైట్స్‌ ఆఫ్‌ రికార్డ్స్‌) చట్టం స్థానంలో భూ యాజమాన్య హక్కు చట్టం (కన్‌క్లూజివ్‌ టైటిల్‌ యాక్ట్‌) తీసుకురానున్నట్లు రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి. భూ పరిపాలనను నిర్వహిస్తున్న భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) విభాగాన్ని ఈ అనుబంధ శాఖల్లో విలీనం చేయనున్నారు. అనంతరం రెవెన్యూ విభాగాన్ని మార్చి సాధారణ పరిపాలన విభాగం కింద కూర్పు చేయడం.. అనంతరం భూములతో ముడిపడి ఉన్న వ్యవసాయశాఖకు అనుబంధంగా మార్చే అవకాశాలు ఉన్నట్లు రెవెన్యూ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆదాయంతో సంబంధం లేకపోవడంతో జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌ కింద రెవెన్యూను చేర్చాలని కొన్ని సంఘాలు గతంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన దాఖలాలు ఉన్నాయి. 
భూపరమైన సంస్కరణలు 
రెవెన్యూశాఖ పరిధిలో ఉన్న నీటితీరువా ఇప్పటికే రద్దు అయింది. ఎకరానికి రూ.200 చొప్పున రైతుల నుంచి ఏటా తీరువా వసూలు చేసేవారు. రాష్ట్రవ్యాప్తంగా 2009 నుంచి 2016 వరకు రూ.674.66 కోట్ల డిమాండ్‌ ఉంటే వసూలైన మొత్తం 18శాతం అంటే రూ.119.94 కోట్లు మాత్రమే. ఈ క్రమంలో రైతులపై ఒత్తిడిని తగ్గించేందుకు గతేడాది మే నెలలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీరువాను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు భూములపై యజమానులకు పూర్తిస్థాయి హక్కులు కల్పించేందుకు భూ యాజమాన్య హక్కు చట్టం చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇది ఒక్కసారి అమల్లోకి వస్తే భూ యజమానికి చట్టపరంగా పూర్తిస్థాయి హక్కులు వర్తిస్తాయని భూ చట్టాల నిపుణులు చెబుతున్నారు. దీనికి అనుగుణంగా టైటిల్‌ గ్యారంటీ అథారిటీ, టైటిల్‌ రిజిస్ట్రేషన్‌, వివాద పరిష్కార బోర్డులు ఏర్పాటు చేసే వీలుంది. టైటిల్‌ గ్యారంటీ అథారిటీ పరిధిలోని భూములకు బీమా వర్తింపచేసే అవకాశాలున్నాయి. దీనివల్ల భూముల ధరలు పెద్దఎత్తున పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. కొత్త చట్టం అమలుకు అవసరమైతే క్షేత్రస్థాయిలో సర్వే కూడా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం మహబూబాబాద్‌ బహిరంగ సభలో పేర్కొనడం మార్పులను సూచిస్తోంది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.