close

ప్ర‌త్యేక క‌థ‌నం

గురుకులాల్లో నిశ్శబ్ద విప్లవం

అద్భుత ఫలితాలు సాధిస్తున్న ఆశ్రమ పాఠశాలలు
ఐదేళ్లలో కొత్తగా 664 విద్యాలయాల ఏర్పాటు
సి.నాగరాజు
ఈనాడు - హైదరాబాద్‌

ఇక్కడ సర్కారీ విద్యలో గుణాత్మక మార్పు సాక్షాత్కరిస్తోంది. నిరుపేదల స్వప్నం సాకారమవుతోంది. సామాజిక పరివర్తన సాధ్యమవుతోంది. నాణ్యమైన ఆంగ్ల మాధ్యమ విద్యను అందించేందుకు  తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన గురుకుల విద్యాలయాలు మంచి ఫలితాలు సాధిస్తున్నాయి.  ‘కేజీ టు పీజీ’ కార్యక్రమంలో భాగంగా ఐదేళ్ల వ్యవధిలో కొత్తగా ఏర్పాటు చేసిన 664 గురుకుల పాఠశాలలు, జూనియర్‌, డిగ్రీ కళాశాలలు సకల వసతుల విద్యాకేంద్రాలుగా మారాయి.  గురుకులాల్లో నిశ్శబ్ద విప్లవంపై ప్రత్యేక కథనం...

గురుకులాల్లో సీటు పొందితే చాలు తమ పిల్లలకు చక్కటి చదువు అందుతుందన్న భరోసా తల్లిదండ్రుల్లో నెలకొంది. దీంతో పిల్లల్ని చేర్పించేందుకు పోటీపడుతున్నారు. రాష్ట్రంలోని గురుకులాలతో దాదాపు రెండున్నర లక్షల పేద కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. వీటిలో చదువుతున్న విద్యార్థులు చదువులో, క్రీడల్లో మంచి ప్రతిభ చూపుతున్నారు. దేశ, విదేశాల్లోని ప్రఖ్యాత విద్యాలయాల్లో సీట్లు పొందుతున్నారు. ఇప్పటి వరకు ఏర్పాటుచేసిన గురుకులాలు మంచి ఫలితాలు ఇవ్వడంతో మండలానికొకటి నెలకొల్పి అందరికీ ఉచిత విద్యను చేరువ చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది.

ఏటా కొత్తగా...

దేళ్ల క్రితం వరకూ గురుకుల విద్య అందని ద్రాక్షగా ఉండేది. పాఠశాలల సంఖ్య తక్కువగా ఉండటంతో చాలా మందికి నాణ్యమైన ఉచిత విద్య అందుబాటులో లేకుండా పోయింది. తెలంగాణ ఏర్పాటైన వెంటనే కేజీ టు పీజీలో భాగంగా మండలానికో గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా ఐదేళ్ల వ్యవధిలో వీటి సంఖ్య భారీగా పెరిగింది. కొత్త కళాశాలలు అందుబాటులోకి వచ్చాయి. యువతీ, యువకులకు వేర్వేరుగా 53 గురుకుల డిగ్రీ కళాశాలలు స్థాపించారు.

సన్న బియ్యం.. కోడికూర..

తంలో ప్రభుత్వ వసతి గృహాలు, గురుకులాల్లో భోజనం అధ్వానంగా ఉండేది. ఈ పరిస్థితిని గుర్తించిన సర్కారు.. ప్రస్తుతం పిల్లలకు సన్నబియ్యంతో కూడిన భోజనం అందిస్తోంది. రెండేళ్ల క్రితం విద్యార్థుల కిచ్చే డైట్‌ ఛార్జీల్ని కూడా గణనీయంగా పెంచింది. పిల్లలు బలంగా ఉండాలన్న లక్ష్యంతో ప్రతి రోజూ కోడిగుడ్డు, నెలలో నాలుగు రోజులు కోడికూర భోజనం, రెండుసార్లు మటన్‌, నాణ్యమైన ఆహారం వండిపెడుతున్నారు. విద్యార్థులకు వైద్యం కోసం ఇప్పటికే ప్రత్యేక ఆరోగ్య ప్రాజెక్టును అమలు చేస్తున్నారు.

నియామకాల కోసం ప్రత్యేక బోర్డు

కొత్తగా గురుకుల పాఠశాలలు ఏర్పాటైన నేపథ్యంలో బోధనాసిబ్బంది నియామకాలు కూడా చకచకా జరుగుతున్నాయి. తొలుత టీఎస్‌పీఎస్సీ ద్వారా దాదాపు 7 వేల ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసింది. నియామక ప్రక్రియ సొంతగా చేపట్టేందుకు వీలుగా ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలో గురుకుల నియామక బోర్డు ఏర్పాటయింది. ఈ బోర్డు ఇప్పటికే 3679 పోస్టులకు ప్రకటనలు జారీ చేసి, పరీక్షలు నిర్వహించి మెరిట్‌ జాబితాలను ప్రకటించింది.

చదువుల్లో ఉత్తమం..

గురుకుల విద్యార్థులు అద్భుత విజయాలు సాధిస్తున్నారు. ఏటా పదో తరగతి ఫలితాల్లో గురుకుల సొసైటీలదే హవా. పాఠశాలలు 90 శాతం, కళాశాలలు 85-90 శాతం ఉత్తీర్ణత నమోదు చేస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ సొసైటీల విద్యార్థులు ఐఐటీ, ఐఐఎం, ఇతర ప్రఖ్యాత సంస్థల్లో ప్రవేశాలు పొందుతున్నారు. విద్యార్థుల్లో దాగిన ప్రతిభను వెలికి తీసేందుకు సొసైటీలు సమ్మర్‌ సమురాయ్‌ పేరిట ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నాయి. ఏదో ఒక రంగంలో రాణించేలా ప్రోత్సహిస్తున్నారు. ఈ ప్రోత్సాహంతోనే మలావత్‌ పూర్ణ ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కిన తొలి గిరిజన బాలికగా రికార్డు సృష్టించింది. గురుకుల  విద్యార్థులు పర్వతారోహణ, ఇతర క్రీడల్లో రాణిస్తున్నారు. గురుకులాల్లో పైలెట్‌ ప్రాజెక్టు కింద వర్గల్‌లో ఏర్పాటు చేసిన డిగ్రీ కళాశాల తొలిబ్యాచ్‌ గత ఏడాది అత్యద్భుత ఫలితాలు నమోదు చేసింది. పరీక్ష రాసిన 141 మందిలో 140 మంది మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. వీరిలోనూ 124 మంది డిస్టింక్షన్‌ సాధించడం విశేషం.

సీట్లకు డిమాండ్‌

గురుకులాల్లో సీటు కోసం డిమాండ్‌ భారీగా ఉంటోంది. 2019-20 ఏడాదికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకులాల్లో ఐదో తరగతిలో 49 వేల సీట్ల కోసం 1.46 లక్షల మంది పోటీపడుతున్నారంటే వీటికున్న ఆదరణను అర్థం చేసుకోవచ్చు.
ఇంటి తరహా వాతావరణం, ప్రమాణాలతో కూడిన విద్యాబోధన, అందరికీ ఆరోగ్యం, పౌష్టికాహారం అన్న నాలుగు ప్రధాన నినాదాలతో రాష్ట్రంలో గురుకులాలు విజయవంతంగా నడుస్తున్నాయి.
ఏడాదికి ఒక్కో విద్యార్థిపై ఖర్చు : రూ.1.02 లక్షలు
2021 నాటికి గురుకులాల్లో చదివే విద్యార్థులు : 9 లక్షలకుపైగా
విద్యాలయాల్లో బోధనకు సిబ్బంది నియామకం: దాదాపు 10 వేలు

తెలంగాణ ఆవిర్భావ సమయానికి గురుకులాలు 296
ప్రస్తుతం 960
2019-20లో మరో 119 ప్రారంభం

ఫొటోలు: ఈనాడు యంత్రాంగం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.