close

ప్ర‌త్యేక క‌థ‌నం

వినరా సోదర వీర కుమారా వీరి నేర చరిత!

ఏపీ లోక్‌సభ అభ్యర్థుల్లో 20 మందిపై కేసులు
అత్యధికంగా 12 మంది వైకాపా నేతలపై తీవ్ర అభియోగాలు
తెదేపా నుంచి నలుగురు, జనసేన నుంచి నలుగురిపై నేరారోపణలు
గేదెల భరత్‌కుమార్‌
ఈనాడు, అమరావతి

హత్యా యత్నాలు, భూ కబ్జాలు, వరకట్న వేధింపులు, గృహహింస, దౌర్జన్యం, దళితులను కులం పేరుతో దూషించటం, మోసం, మారణాయుధాలతో అల్లర్లకు పాల్పడటం, మనీలాండరింగ్‌ తదితర కేసుల్లో నిందితులు ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులుగా బరిలో  నిలిచారు. ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ స్థానాలకు తెదేపా, వైకాపా, జనసేన పార్టీల నుంచి 67 మంది పోటీలో ఉండగా, వారిలో 20 మందిపై వివిధ కేసులు నమోదై ఉన్నాయి. ఆయా  అభ్యర్థులు ఎన్నికల సంఘానికి సమర్పించిన ప్రమాణ పత్రాల్లో తమపై ఉన్న కేసుల వివరాలను పేర్కొన్నారు. ‘ఆయా కేసులు ఇంకా దర్యాప్తు, విచారణ దశల్లోనే ఉన్నాయని, ఇంకా నేర నిరూపణ కాలేదని’ ప్రమాణపత్రాల్లో వివరించారు.

వైకాపా అభ్యర్థుల్లో 25 మందికి గానూ సగం మందిపై తీవ్ర నేరారోపణలున్నాయి. శ్రీకాకుళం వైకాపా అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌పై అందరికంటే ఎక్కువగా 13 కేసులున్నాయి. తెదేపా, జనసేన అభ్యర్థుల్లో నలుగురు చొప్పున స్వల్ప, తీవ్ర నేరాల్లో అభియోగాలు ఎదుర్కొంటున్నారు.

అభ్యర్థి : దువ్వాడ శ్రీనివాస్‌
కేసుల సంఖ్య 13
స్థానం: శ్రీకాకుళం   పార్టీ : వైకాపా

నేరాల వివరం
* నేరపూరిత చొరబాటు, మారణాయుధాలతో అల్లర్లకు పాల్పడటం
* ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కల్గించి అవమానించడం, నేరపూరిత బెదిరింపు
* నేరపూరిత కుట్ర, హత్యాయత్నం
* ప్రభుత్వోద్యోగిపై దాడి, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయటం, ప్రభుత్వ అధికారులు జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘించటం
* ఎన్నికలకు సంబంధించి అక్రమ చెల్లింపులు, మోసం, బెదిరింపులు
* పర్యావరణ పరిరక్షణ చట్టం ఉల్లంఘన
* మోసానికి పాల్పడటం కోసం పత్రాలను ఫోర్జరీ చేయటం
* అనుమతి తీసుకోకుండా ఖనిజాలను చోరీ చేయటం, ఖనిజ సంపద వెలికితీతలో నిబంధనల ఉల్లంఘన
* చెక్‌బౌన్సు
* ఇంటిని ధ్వంసం చేయాలనే ఉద్దేశంతో పేలుడు పదార్థాలను వినియోగించటం.

అభ్యర్థి : మోదుగుల వేణుగోపాలరెడ్డి
కేసుల సంఖ్య 3
స్థానం: గుంటూరు  పార్టీ : వైకాపా

నేరాల వివరం: 1. పరువు నష్టం 2. శాంతిభద్రతలకు భంగం కలిగించే ఉద్దేశంతో చట్ట విరుద్ధంగా గుమిగూడటం, ప్రభుత్వోద్యోగి విధులకు ఆటంకం కల్పించటం, వ్యక్తిని కదలనీయకుండా అడ్డుకోవడం, 3.మారణాయుధాలతో అల్లరకు పాల్పడటం, హత్యాయత్నం, చొరబాటు

అభ్యర్థి : వల్లభనేని బాలశౌరి
కేసుల సంఖ్య  2
స్థానం: మచిలీపట్నం పార్టీ: వైకాపా
నేరాల వివరం: 1. చెక్‌ బౌన్సు, 2. అక్రమాస్తుల కేసులో పట్టుబడ్డ ఓ ప్రభుత్వోద్యోగి బాలశౌరి బ్యాంకు ఖాతాలోకి నగదు బదిలీ చేయగా.. ఆ సొమ్ముతో ఆయన దిల్లీలో వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్టు అభియోగాలు.


అభ్యర్థి ఎం. వీర వెంకట సత్యనారాయణ
కేసుల సంఖ్య  1
స్థానం: విశాఖపట్నం పార్టీ : వైకాపా
నేరాల వివరం: భూ కబ్జా, నేరపూరిత చొరబాటు

అభ్యర్థి : పొట్లూరి వీరప్రసాద్‌
కేసుల సంఖ్య  1
స్థానం: విజయవాడ   పార్టీ : వైకాపా
నేరాల వివరం: మనీలాండరింగ్‌ (ఈ కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) దర్యాప్తు చేస్తోంది)

అభ్యర్థి : పి.వి.మిథున్‌రెడ్డి
కేసుల సంఖ్య  3
స్థానం: రాజంపేట  పార్టీ : వైకాపా
నేరాల వివరం: 1. తన వినతిని పరిగణనలోకి తీసుకోలేదంటూ ఓ వ్యక్తిని చెంప దెబ్బ కొట్టడం,    2. సంబంధిత అధికారుల ముందస్తు అనుమతి లేకుండా పీహెచ్‌సీ భవనాన్ని ప్రారంభించడం
3. వాహనాన్ని ధ్వంసం చేసి, ఎంవీ.కృష్ణారెడ్డి అనే వ్యక్తితో పాటు మరో నలుగురిని రక్తం వచ్చేలా గాయపరచటం.

అభ్యర్థి : రఘురామకృష్ణంరాజు
కేసుల సంఖ్య 6
స్థానం: నర్సాపురం   పార్టీ : వైకాపా

నేరాల వివరం
* చెక్‌బౌన్స్‌ కేసులు
* రఘురామకృష్ణంరాజు డైరెక్టర్‌గా ఉన్న కంపెనీ గెయిల్‌లోని ఓ అధికారితో కుమ్మక్కై ఆ సంస్థకు రూ.241.95 కోట్లు నష్టం కలిగించిన వ్యవహారంపై సీబీఐ కేసు.
* ఇంద్‌ భారత్‌ పవర్‌ లిమిటెడ్‌కు సంబంధించిన దివాలా కేసులు.
* రఘురామకృష్ణంరాజు వాటాదారుగా, హామీదారుగా ఉన్న పలు కంపెనీలకు సంబంధించిన దాదాపు రూ.318.03 కోట్ల విలువైన రుణాల రికవరీకి సంబంధించి రుణ రికవరీ ట్రైబ్యునల్‌ (డెబ్ట్‌ రికవరీ ట్రైబ్యునల్‌)లో కేసులు.
* రఘురామకృష్ణంరాజు హామీదారుగా ఉన్న పలు కంపెనీలకు సంబంధించిన దాదాపు రూ.170 కోట్ల విలువైన రుణాల రికవరీకి సంబంధించి చెన్నై హైకోర్టులో కేసులు.
* రూ.58 కోట్ల విలువైన రుణ రికవరీలకు సంబంధించిన హైదరాబాద్‌లోని సివిల్‌ కోర్టుల్లో కేసులు.
* ఐటీ ఎగవేతలకు సంబంధించి పలు కేసులున్నప్పటికీ జరిమానాలు చెల్లించిన మీదట వాటిని కొట్టేశారు.
అభ్యర్థి : బెల్లాన చంద్రశేఖర్‌
కేసుల సంఖ్య 4
స్థానం: విజయనగరం పార్టీ: వైకాపా
నేరాల వివరం: మహిళ ఇంట్లోకి చొరబడి ఆమెను బెదిరించి అవమానించటం, వారి ఇంట్లోని గృహోపకరణాలు ధ్వంసం చేయటం, భయభ్రాంతులకు గురిచేయడం

అభ్యర్థి :  పోచ బ్రహ్మానందరెడ్డి
కేసుల సంఖ్య 1
స్థానం: నంద్యాల పార్టీ: వైకాపా
నేరాల వివరం: బి.చిన్నారెడ్డి అనే వ్యక్తి బ్రహ్మానందరెడ్డికి చెందిన గొణిగనూరులోని భారతి రూరల్‌ గోదాములో శనగలు నిల్వ చేశారు. బ్రహ్మానందరెడ్డి వాటిని చిన్నారెడ్డికి తిరిగి ఇవ్వకుండా నేరపూరిత విశ్వాస ఘాతుకానికి, మోసానికి పాల్పడ్డారనేది కేసు. భారతి రూరల్‌ గోదాముకు తాను యజమానినిగానీ, భాగస్వామినిగానీ కాదని ప్రమాణపత్రంలో బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు.

అభ్యర్థి :  వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి
కేసుల సంఖ్య  4
స్థానం: కడప పార్టీ: వైకాపా
నేరాల వివరం: మారణాయుధాలతో అల్లర్లు సృష్టించటం, ప్రభుత్వోద్యోగి విధులకు ఆటంకం కల్గించి అల్లర్లకు పాల్పడటం, నేరపూరిత దుష్ప్రవర్తనతో వ్యక్తిని అడ్డుకోవడం, ప్రభుత్వోద్యోగి ప్రాణానికి ముప్పు తెచ్చేలా వ్యవహరించడం

అభ్యర్థి : మార్గాని భరత్‌రామ్‌
కేసుల సంఖ్య  2
స్థానం: రాజమహేంద్రవరం పార్టీ: వైకాపా
నేరాల వివరం: వరకట్న వేధింపులు, గృహహింస


అభ్యర్థి గోరంట్ల మాధవ్‌
కేసుల సంఖ్య 1
స్థానం: హిందూపురం పార్టీ : వైకాపా
నేరాల వివరం: నేరపూరిత బెదిరింపు

తెదేపా అభ్యర్థుల నేర వివరాలు

అభ్యర్థి : కె. రామ్మోహన్‌నాయుడు
కేసుల సంఖ్య:  1
స్థానం: శ్రీకాకుళం
నేరం : ముందస్తు అనుమతి లేకుండా ద్విచక్ర వాహన ప్రదర్శన నిర్వహించటం

అభ్యర్థి : వి. వెంకట శివరామరాజు
కేసుల సంఖ్య: 1
స్థానం: నర్సాపురం
నేరం : ఎస్సీ కులానికి చెందిన వ్యక్తిని అవమానపరచడం


అభ్యర్థి : మాగంటి వెంకటేశ్వరరావు
కేసుల సంఖ్య: 1
స్థానం: ఏలూరు
నేరం : ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తిని కులం పేరుతో దూషించటం, రాజకీయ విభేదాల నేపథ్యంలో ఓ వ్యక్తిపై దాడి చేయడం


అభ్యర్థి : నిమ్మల కిష్టప్ప
కేసుల సంఖ్య:  1
స్థానం: హిందూపురం
నేరం: కె.వెంకటరామిరెడ్డి అనే వ్యక్తి ప్రతిష్ఠకు భంగం  కలిగించేలా తప్పుడు ప్రకటన జారీ చేయడం
శిక్ష పడినవి: 3 (ధర్మవరం రైల్వేస్టేషన్‌లో రైలు రోకో, హిందూపురం రైల్వేస్టేషన్‌లోకి ప్రవేశించి రైలును అడ్డుకోవటం, హిందూపురంలో ఓ రైలులోని ప్రయాణికులను అడ్డుకోవటం)

జనసేన అభ్యర్థుల నేర వివరాలు

అభ్యర్థి : వాంపురు గంగులయ్య
కేసుల సంఖ్య:  1
స్థానం: అరకు
నేరం: చెక్‌బౌన్స్‌
శిక్ష: ఆరు నెలల జైలు, రూ.5,000 జరిమానా (పై కోర్టుకు అప్పీలుకు వెళ్లారు)


అభ్యర్థి: డీఎంఆర్‌.శేఖర్‌
కేసుల సంఖ్య:  1
స్థానం: అమలాపురం
నేరం: చమురు బావిలో పేలుడు
సెక్షన్లు:  మైన్స్‌ చట్టంలోని 72 (ఏ), 72సీ (1)
(ఏ) 72 సీ (1) (బీ)


అభ్యర్థి: బోనబోయిన శ్రీనివాసరావు
కేసుల సంఖ్య:  1
స్థానం: గుంటూరు
నేరం: ఫోర్జరీ, మోసం


అభ్యర్థి : ఎస్పీవై రెడ్డి
కేసుల సంఖ్య:  1
స్థానం: నంద్యాల
నేరం: ఎన్నికల సమయంలో హస్తం గుర్తు ఉన్న కీచైన్‌లు పంపిణీ చేయడం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.