close

ప్ర‌త్యేక క‌థ‌నం

నిజమవుతున్న ఆంధ్రుల కల.. అమరావతి

అసలే అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కి అంత పెద్ద రాజధాని అవసరమా? 35 వేల ఎకరాలు కావాలా? ఓ నాలుగైదొందల ఎకరాల్లో నాలుగు భవనాలు కట్టుకుంటే చాలదా? అయినా అమరావతిలో అన్నీ గ్రాఫిక్కులు, సెట్టింగులే..!  ఇలాంటి ఎకసెక్కాలు, వెటకారపు మాటలు గత నాలుగేళ్లలో ఎన్నో విన్నాం.. ఇప్పుడూ వింటున్నాం! కానీ సారథికి సంకల్ప శుద్ధి ఉంటే.. ఎంత మంది ఎంత నవ్వినా.. అసాధ్యమనుకున్నది సాధ్యమై తీరుతుంది. అందుకు తార్కాణమే..  అర్ధరాత్రి కూడా పండు వెన్నెల్లా.. శరవేగంగా పనులు జరుగుతున్న ఈ పక్క చిత్రం! ఆంధ్రులు తరతరాలు సగౌరవంగా తలెత్తుకుని అపురూపంగా చెప్పుకొనేందుకు సిద్ధమవుతున్న అజరామర నగరం!!

జె.కల్యాణ్‌బాబు
ఈనాడు - అమరావతి

ఈ రోజు గురించి ఎవరైనా ఆలోచిస్తారు..! కొన్ని దశాబ్దాలు, శతాబ్దాల దూరం భవిష్యత్తులోకి చూసి, అప్పటి ప్రజల అవసరాలకు తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించడమే దార్శనికుల లక్షణం...! అదే అసలు సిసలు నాయకత్వం..! దానికి అసలు సిసలు నిదర్శనమే అమరావతి నగర నిర్మాణం.

అక్కడ ఇప్పుడు శరవేగంగా, రేయింబవళ్లు ఒక మహా నిర్మాణ యజ్ఞం జరుగుతోంది. ఒక విశ్వనగరం రూపుదిద్దుకుంటోంది. ప్రపంచంలోని అగ్రశ్రేణి నగరాలతో పోటీ పడేలా... ఆర్థిక కార్యకలాపాలకు వేదికగా... పర్యాటక ప్రదేశంగా... లక్షల మందికి ఉపాధి కేంద్రంగా అలరారే నగరం పురుడుపోసుకుంటోంది. ఇదేమీ నల్లేరు మీద ప్రయాణం కాదు. ఒకవైపు అసలు రాజధాని ఎలా కడతారో చూస్తామని సవాళ్లు! మరోవైపు కోర్టులకు వెళ్లి పదే పదే సృష్టించిన ప్రతిబంధకాలు!! దిల్లీని మించిన రాజధాని కట్టేందుకు మాదీ సాయం అంటూనే మట్టీ, నీరూ ఇచ్చి సరిపెట్టుకున్న వాళ్లు ఒకరైతే.. అప్పులు తెచ్చుకుందామన్నా అడ్డుకుంటూ కుట్రలు చేసినవాళ్లు మరి కొందరు. అయినా ముఖ్యమంత్రి చంద్రబాబు అకుంఠిత దీక్షతో, చెక్కుచెదరని సంకల్పంతో ముందుకు సాగటంతోనే.. ఈ అద్భుత రాజధాని ఇప్పుడు సాకారం కాబోతోంది.

రికార్డు సమయంలో...

అమరావతిలో సచివాలయ భవనాల్ని ఏడు నెలల రికార్డు సమయంలో నిర్మించారు. ఇందుకోసం మొత్తం రూ.526.57 కోట్లు వెచ్చించారు. 2016 అక్టోబరు నుంచి సచివాలయ ఉద్యోగులు ఇక్కడి నుంచే విధులు ప్రారంభించారు. సచివాలయం ప్రాంగణంలోనే శాసనసభ భవనాన్ని 2016 ఆగస్టు 18న ప్రారంభించి, 192 రోజుల రికార్డు సమయంలో పూర్తి చేశారు. సచివాలయం, శాసనసభ భవనాల తర్వాత... రాజధానికి విద్యా సంస్థలు వచ్చాయి. ప్రఖ్యాత ఎస్‌ఆర్‌ఎం, విట్‌-ఏపీ యూనివర్సిటీలు రికార్డు సమయంలో తొలిదశ నిర్మాణాలు పూర్తిచేసుకుని, తరగతులను ప్రారంభించాయి. జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ నిర్మాణాన్నీ ప్రభుత్వం శరవేగంగా పూర్తై హైకోర్టు విధులు అక్కడి నుంచే సాగుతున్నాయి.

పక్కా ప్రణాళిక

అమరావతిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ లక్ష్యం. దానికి తగ్గట్టే పక్కా ప్రణాళికతో నగర నిర్మాణం చేపట్టింది. దాన్ని కేవలం పరిపాలన నగరంలా కాకుండా, వాణిజ్య, ఉపాధి కార్యకలాపాలకు వేదికగా, పర్యాటక నగరంగా తీర్చిదిద్దేందుకు సంకల్పించింది. దీనిలో దేశ, అంతర్జాతీయ సంస్థలు భాగస్వాములయ్యాయి... అవుతున్నాయి. చంద్రబాబు విజ్ఞప్తి మేరకు... మొత్తం సీఆర్‌డీఏ ప్రాంతానికి, రాజధాని నగరానికి, సీడ్‌ ఏరియాకు సింగపూర్‌ ప్రభుత్వం ఉచితంగా మాస్టర్‌ ప్లాన్‌లు రూపొందించింది. పరిపాలన నగరం ప్రణాళికను, ఐకానిక్‌ భవనాలుగా నిర్మిస్తున్న శాసనసభ, హైకోర్టు, సచివాలయం, హెచ్‌ఓడీ కార్యాలయ టవర్ల ఆకృతుల్ని లండన్‌కు చెందిన ప్రఖ్యాత నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ రూపొందించింది. మౌలిక వసతుల ప్రణాళికల్ని జీఐఐసీ, ఆర్వీ అసోసియేట్స్‌ సిద్ధం చేశాయి. విద్యుత్‌, నీటి సరఫరా, వంట గ్యాస్‌, ఐసీటీ, మురుగు పారుదల వంటివన్నీ... భూగర్భంలోనే ఉంటాయి.

ఒక్క ఇటుకా..

అసలు అక్కడ ఒక్క ఇటుకా వేయలేదంటున్న వారికి... రాజధానిలో నిర్మిస్తున్న భవనాల్లో అసలు ఇటుకలే వాడాల్సిన అవసరం లేదని తెలియకపోవడం విచిత్రం! అమరావతిలో అన్ని భవనాల్నీ షియర్‌వాల్‌ టెక్నాలజీతో నిర్మిస్తున్నారు. దీన్లో సిమెంటు, ఇసుక, కాంక్రీట్‌, ఇనుప చువ్వలు తప్ప ఇటుకల అవసరమే ఉండదు.

ఈ ప్రభుత్వం కొనసాగితేే... పెట్టుబడుల వరద

ప్రభుత్వం నాలుగేళ్లలో చేసిన కృషి, ప్రణాళికల వల్ల అమరావతి ‘మోస్ట్‌ హ్యాపెనింగ్‌ ప్లేస్‌’గా పలు జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులు, సంస్థల దృష్టిని ఆకర్షించింది. పెట్టుబడులకు అత్యంత అనుకూల ప్రదేశంగా అమరావతిని ఆయా సంస్థలు భావిస్తున్నాయి. ఆస్ట్రేలియా, జపాన్‌, జర్మనీ, సింగపూర్‌, బ్రిటన్‌ వంటి దేశాలు అమరావతిలో భాగస్వామ్యానికి ఉవ్విళ్లూరుతున్నాయి. ఆయా దేశాల బృందాలు ఇప్పటికే పలు దఫాలు ఇక్కడ పర్యటించాయి. మళ్లీ ఈ ప్రభుత్వమే వస్తే రాజధానికి పెట్టుబడులు వరదలా వచ్చే అవకాశముంది. గత రెండు భాగస్వామ్య సదస్సుల్లోనూ రాజధానిలో పెట్టుబడులకు పలు సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఆయా సంస్థలు ఎన్నికల ఫలితాల కోసం వేచి చూస్తున్నాయి. మళ్లీ ఈ ప్రభుత్వం వస్తే సరే... లేకపోతే రాజధానిపై కొత్తగా వచ్చే ప్రభుత్వ వైఖరి, విధానం ఎలా ఉంటుందోనన్న సందిగ్ధతలో ఆయా సంస్థలు ఉన్నాయి.

రేయింబవళ్లు ఒకటే వేగం.. వేగం

రాజధానిలో ప్రస్తుతం ఎటు చూసినా నిర్మాణ సంరంభం కనిపిస్తోంది. యుద్ధ ప్రాతిపదికన పనులు సాగుతున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన సుమారు 20 వేల మంది నిర్మాణరంగ కార్మికులు, వందల సంఖ్యలో ఇంజినీర్లు, ఆర్కిటెక్ట్‌లు, ఇతర నిర్మాణరంగ నిపుణులు ఈ క్రతువులో పాలుపంచుకుంటున్నారు. ప్రతి రెండు వారాలకూ ఎంతో పురోగతి కనిపిస్తోంది. ఎమ్మెల్యేలు, అఖిల భారత సర్వీసుల అధికారులు, ఇతర ప్రభుత్వ అధికారులకు, ఉద్యోగుల నివాసాల కోసం నిర్మిస్తున్న టవర్లు... ముంబయి, హైదరాబాద్‌లోని గేటెడ్‌ కమ్యూనిటీలను తలదన్నేలా ఉన్నాయి. మొత్తం 61 టవర్ల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. కొన్ని ఇప్పటికే దాదాపు పూర్తయ్యాయి. మరోపక్క ప్రధాన రహదారుల నిర్మాణ పనులు, రైతులకు స్థలాలు కేటాయించిన ఎల్‌పీఎస్‌ లేఅవుట్‌లలో మౌలిక వసతుల పనులు వేగంగా సాగుతున్నాయి. ఎన్‌ఐడీ, అమృత యూనివర్సిటీ వంటి విద్యా సంస్థల నిర్మాణాలు వేగం పుంజుకున్నాయి. సచివాలయం, హెచ్‌ఓడీ భవనాలు, శాశ్వత హైకోర్టు నిర్మాణ పనులూ వేగంగా సాగుతున్నాయి. రాత్రిపూట వేల ఫ్లడ్‌లైట్ల వెలుగుల్లో నిర్మాణ దశలోనే అమరావతి వింత శోభతో మెరిసిపోతోంది.

ఆదాయానికీ రాజధానే

అమరావతి నిర్మాణం పూర్తయితే... రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా మారుతుంది. ఆంధ్రప్రదేశ్‌కు అమరావతే చుక్కాని అవుతుంది. రాజధానిలో ఇప్పటికే రూ.38 వేల కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయి. మరో రూ.12 వేల కోట్ల పనులు టెండర్లు, ప్రణాళికల దశలో ఉన్నాయి. వాటిలో కేంద్రం ఇచ్చింది రూ.1500 కోట్లు మాత్రమే...! కానీ అమరావతిలో జరిగే రూ.50 వేల కోట్ల పనులపై కేంద్రానికి జీఎస్టీ, ఇతర పన్నుల రూపంలో వెళుతున్న ఆదాయం సుమారు రూ.6,500 కోట్లని అంచనా! రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేక ఆర్థిక ప్రణాళికతో సమకూర్చుకుంటోంది. రైతులకు అభివృద్ధి చేసిన ఫ్లాట్లు తిరిగి ఇవ్వగా... వివిధ సంస్థలకు భూములు కేటాయించగా... ప్రభుత్వం దగ్గర మిగిలే భూములకు విలువ పెరిగాక... వాటిని విక్రయించి అప్పులు తీర్చాలన్నది ప్రభుత్వ యోచన. అమరావతి తన సొంత కాళ్లపై నిలబడి నిర్మించుకుంటున్న నగరం ఇది..! స్వయంసమృద్ధిగల రాష్ట్రంగా అవతరించేందుకు అమరావతి అసలు సిసలు ఊతకర్రగా నిలుస్తుంది. ఆ రోజు ఎంతో దూరంలో లేదు!

9 థీమ్‌ సిటీలు, 27 టౌన్‌షిప్‌లుగా అమరావతి ప్రణాళికను రూపొందించారు. 5-10-15 కాన్సెప్ట్‌తో దీన్ని తీర్చిదిద్దారు. అత్యవసర సేవలకు 5 నిమిషాల్లో, వినోద, విహార ప్రదేశాలకు 10 నిమిషాల్లో, కార్యాలయాలకు 15 నిమిషాల్లో ప్రజలు కాలి నడకన చేరుకేనేలా వసతులు కల్పించడమే దీని ప్రత్యేకత.

రాష్ట్రం నలుమూలల నుంచీ వచ్చి సుమారు 80 వేల మంది ఇప్పటి వరకూ అమరావతిని సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనుల్ని కళ్లారా చూసి... మనమూ ఓ ఆధునిక మహానగరం నిర్మించుకుంటున్నామన్న తృప్తితో, సగర్వంగా తిరిగి వెళ్లారు.

నమూనాలు కాదు... కాంక్రీట్‌ నిర్మాణాలే


భావితరాలను... అబ్బురపరుస్తుంది
దేశంలోనే అతిపెద్ద రాజధాని

మండవ ప్రభాకరరావు
సీఆర్‌డీఏ సలహా కమిటీ సభ్యుడు

* దాదాపు 35 వేల ఎకరాలను సేకరించి, కొత్త రాజధానిని నిర్మించిన, నిర్మిస్తున్న  రాష్ట్రం... స్వాతంత్య్రం వచ్చాక భారతదేశంలో ఎక్కడా లేదు. అమరావతి రాత్రికి రాత్రి నిర్మించే నగరం కాదు. దీన్ని భావితరాల కోసం ప్రణాళికతో డిజైన్‌ చేశారు. దేశంలోనే ఇది సరికొత్త ప్రణాళిక.

* రాజధాని ఆ స్థాయిలో ఎందుకు అనే వాదన అర్థరహితం. అమరావతి ప్రణాళికను ఇప్పటి అవసరాలు, నిధుల కొరత వంటి వాటితో ముడిపెట్టి చూడకూడదు. వందేళ్ల తర్వాత అప్పటి జనాభా అవసరాల ప్రకారం నగరం ఉండేలా ప్రణాళిక అవసరం.

* మౌలిక సదుపాయాల అభివృద్ధికి జపాన్‌, కొరియా, చైనా తదితర దేశాల వారు పెట్టుబడులు పెట్టి అమరావతి నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారు.
రాష్ట్రం ఆర్థికాభివృద్ధి సాధించాలంటే సుస్థిర రాజకీయ ప్రభుత్వం ఉండాలి.

భూసమీకరణ ఓ అద్భుత ప్రక్రియ

- తాడికొండ శాసనసభ్యుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌

భూసమీకరణ ఓ అద్భుత ప్రక్రియ రాజధాని నిర్మాణంలో రైతులూ భాగస్వాములే ఒక్క గ్రామాన్నీ కదిలించకపోవడం విశేషం భూమిలేని పేదల్నీ ప్రభుత్వం ఆదుకుంది

రాజధాని నిర్మాణంలో మొదటి నుంచీ మమేకమై, రైతులకు ఈ విధానం గురించి వివరించి... ఒప్పించి... వారిలో ఉన్న సందేహాల్ని తొలగించి... ప్రభుత్వానికి, రైతులకు మధ్య ఒక వారధిలా పనిచేశారు తాడికొండ శాసనసభ్యుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌. ఆ అనుభవాలు ఆయన మాటల్లోనే...

రాజధాని నిర్మాణానికి భూసమీకరణ ద్వారా భూములు తీసుకోవాలన్నది గొప్ప ఆలోచన.  అందులో రైతులను భాగస్వాముల్ని చేయడం, వారే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు ఇవ్వడం ఈ విధానంలోని విశిష్టత. భూసమీకరణ ప్రక్రియ ప్రారంభించాక... రెండు నెలల వ్యవధిలోనే సుమారు 33 వేల ఎకరాల భూములు ఇచ్చేందుకు రైతులు అంగీకారపత్రాలు ఇచ్చారంటేనే దీని గొప్పతనం అర్థమవుతుంది. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా, వారి భూములు తీసుకుని అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన నివాస, వాణిజ్య స్థలాలు వారికివ్వడం ఈ విధానం ప్రత్యేకత. దీనివల్ల అప్పటి వరకు గరిష్ఠంగా రూ.15-20 లక్షలు ఉన్న ఎకరం భూమి విలువ రూ.2 కోట్లు దాటింది.

* రాజధాని నిర్మాణం వంటి భారీ ప్రాజెక్టు చేపట్టినప్పుడు వేల సంఖ్యలో ప్రజలు నిర్వాసితులవుతారు. కానీ రాజధాని పరిధిలోని ఒక్క గ్రామాన్ని కూడా కదిలించలేదు. రాజధానిలోని 29 గ్రామాల్నీ అలాగే ఉంచి... పెద్ద ఎత్తున మౌలిక వసతులు కల్పిస్తున్నాం. గ్రామాలకు ఇబ్బంది లేకుండా రహదారుల అలైన్‌మెంట్‌ కూడా మార్చాం. మరీ తప్పనిచోట కొన్ని ఇళ్లు తొలగించాల్సి వస్తే... వారికి దేశంలో ఎక్కడా లేనంత మెరుగైన ప్యాకేజీ ఇచ్చాం. పక్కనే ఇళ్ల స్థలాలు కేటాయించాం. వారు ఇల్లు కట్టుకునేంత వరకు సీఆర్‌డీఏ అద్దె కూడా చెల్లిస్తోంది.

* రాజధానికి భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన స్థలాలు కేటాయించడంతో పాటు, పదేళ్లపాటు ప్రభుత్వం కౌలు చెల్లిస్తోంది. ఏటా మెట్ట భూములకు ఎకరానికి రూ.30 వేలు, మూడు పంటలు పండే జరీబు భూములకు రూ.50 వేలు చొప్పున కౌలు ఇవ్వడంతో పాటు, ఈ మొత్తాన్ని ఏటా 10 శాతం చొప్పున పెంచుతోంది. ఎకరం కంటే తక్కువ భూమి ఉన్నవారికి కూడా... ఎకరం భూమికిచ్చే కౌలు ఇస్తోంది. అస్సైన్డ్‌ భూములకూ ప్యాకేజీ వర్తింపజేశాం.

* భూమిలేని పేదలు, వ్యవసాయ కూలీల కుటుంబాలకు ప్రతి నెలా రూ.2,500 పింఛను ఇచ్చాం.. దాన్ని ఏటా పెంచుతున్నాం.
* రాజధానిలో ఇళ్లులేని పేదలకు ప్రభుత్వమే నివాస గృహాలు నిర్మిస్తోంది. రాజధాని ప్రజలందరికీ ఉచిత విద్య, వైద్యం వంటి సదుపాయాలు కల్పిస్తోంది.

కళ్లుండీ చూడలేని వాళ్లను ఏమీ చేయలేం
రాజధాని నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. గంట గంటకూ పురోగతి కనిపిస్తోంది. అక్కడ ఒక్క ఇటుక కూడా పెట్టలేదని వైకాపా నాయకులు చేస్తున్న విమర్శ అర్ధరహితం. కళ్లుండీ చూడలేని వాళ్లను ఏమీ చేయలేం. సచివాలయం అక్కడే ఉంది. శాసనసభ సమావేశాలు అక్కడే జరుగుతున్నాయి. ఇప్పుడు హైకోర్టు కూడా అక్కడి నుంచే పనిచేస్తోంది. సుమారు రూ.50 వేల కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయి. అఖిలభారత సర్వీసుల అధికారులు, శాసనసభ్యులు, ప్రభుత్వ ఉద్యోగులకు అపార్ట్‌మెంట్లు, మంత్రులు, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు, న్యాయమూర్తులకు బంగ్లాల నిర్మాణం అవుతోంది. హైకోర్టు, సచివాలయం టవర్ల నిర్మాణాలూ వేగంగా సాగుతున్నాయి.

ఫొటోలు
బండారు మరిడయ్య ఎం.పి.ఎస్‌.కె.దుర్గాప్రసాద్‌

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.