close

ప్ర‌త్యేక క‌థ‌నం

ప్రాథమిక వైద్యమే గుండెకాయ

అధిక నిధులు కేటాయించాల్సింది ఇక్కడే
దీన్ని విస్మరించి ఉన్నత వైద్యానికి అధిక ప్రాధాన్యం
‘అందరికీ ఆరోగ్యమే’ ప్రపంచ ఆరోగ్యసంస్థ నినాదం
నేడు ప్రపంచ ఆరోగ్య దినం
ఈనాడు - హైదరాబాద్‌

ప్రాంతీయ ఆసుపత్రుల్లోనూ అత్యాధునిక రక్తశుద్ధి కేంద్రాలొచ్చాయి.. జిల్లా ఆసుపత్రుల్లో ఐసీయూల్లో వైద్యసేవలు అందుతున్నాయి. ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల ఆరోగ్య పథకాల ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో దాదాపు 900 రకాల చికిత్సలు ఉచితంగా లభిస్తున్నాయి. గుండెజబ్బో, పక్షవాతమో, క్యాన్సరో, మరేదైనా శస్త్రచికిత్స అవసరమైతే ప్రభుత్వ ఖర్చుతో ఉచితంగా చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వ వైద్యంలో ఈ స్థాయిలో ఇది కచ్చితంగా ప్రగతే. అయితే ‘అందరికీ సమగ్ర ఆరోగ్యం’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇస్తున్న నినాదానికి కేవలం ఉన్నత స్థాయి సేవలు సరిపోవు. ప్రజారోగ్యానికి గుండెకాయలాంటి ప్రాథమిక వైద్యాన్ని బలోపేతం చేయకుండా ‘అందరికీ సమగ్ర ఆరోగ్యం’ సాధ్యం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ నొక్కి చెబుతోంది. ‘అందరికీ ఆరోగ్యం’ అనే నినాదంతో ఈ ఏడాది ఏప్రిల్‌ 7న(ఆదివారం) ‘ప్రపంచ ఆరోగ్య దినం’ సందర్భంగా విస్తృతంగా ప్రచారం చేస్తోంది. దీనిపై ‘ఈనాడు’ ప్రత్యేక కథనం.

చిన్న జబ్బు వచ్చినా జేబుకు చిల్లే
ఉన్నత స్థాయి వైద్యంలో ఉచిత చికిత్స పొందే వెసులుబాటు లభిస్తోంది కానీ.. మలేరియా వచ్చి పీహెచ్‌సీకి వెళ్తే అక్కడ వైద్యుడు అందుబాటులో లేని పరిస్థితులున్నాయి. వైద్యుడు ఉండి పరీక్షలు, మందులు రాసిచ్చినా.. వాటికోసం మళ్లీ ప్రైవేటుకు వెళ్లాల్సిందే. చిన్న జబ్బులకు సైతం రూ.3 వేలకు పైగా ఖర్చవుతోంది. అధిక రక్తపోటు, మధుమేహం వంటి వాటికి నెలనెలా మందులు వాడలేని దుస్థితుల్లో గ్రామీణులు గుండెపోటు, పక్షవాతం వంటి జబ్బులతో ఉన్నత వైద్యానికి వెళ్లాల్సి వస్తోంది. ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం పొందినా.. అదనంగా జేబుల్లోంచి సుమారు రూ.4 వేలు ఖర్చవుతోందని జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వే-4 వెల్లడించింది.

మీకు తెలుసా
* కలుషిత నీటిని తాగడం వల్ల, పరిసరాల అపరిశుభ్రం వల్ల కలిగే వ్యాధుల భారం చైనా కంటే భారత్‌లో 40 రెట్లు అధికంగా ఉన్నట్లు నమోదైంది.
* 2014 గణాంకాల ప్రకారం.. ఔషధాలు కొనలేక, ధరల భారం మోయలేక 3.8 కోట్ల మంది ప్రజలు పేదరికంలోకి జారుతున్నారు.
* మన పొరుగునున్న శ్రీలంకలో తక్కువ ధరలో ఔషధాలు లభ్యమవుతున్నాయి.
* మొత్తం ఆరోగ్యానికయ్యే ఖర్చులో రోగి తన జేబుల్లోంచి ఖర్చు పెట్టుకుంటున్న దేశాల జాబితాలో.. మొత్తం 191 దేశాలకు గాను భారత్‌ 182వ స్థానంలో ఉంది.

పరిధి వేరు.. సేవలు వేరు
అందరికీ ఆరోగ్యాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ సునిశితంగా నిర్వచించింది. ‘ఏ కారణంతోనైనా అనారోగ్యానికి గురైనప్పుడు.. ఏ ఒక్కరు కూడా పేదరికమనే కారణంతో చికిత్సకు దూరం కాకూడదు’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. దీన్ని మూడు రకాలుగా పేర్కొంది. 1. ఎంతమంది జనాభాకు వైద్యసేవలు అందుతున్నాయి? 2. ఎన్నిరకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి? 3. ఎంత వ్యయం పెడుతున్నారు?.. ఈ కోణాల్లో 100 శాతం అందించగలగాలి. అంటే జనాభాకు 100 శాతం రకాల జబ్బులకూ మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరించడం. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు.

* ఇతరుల్లో స్వీయ బీమాల్లో లబ్ధి పొందుతున్న వారు కొందరైతే.. వీరిలోనూ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రయోజనం పొందుతున్న వారూ ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం.. రాష్ట్రంలో దాదాపు 98 లక్షల కుటుంబాలు (అంటే దాదాపు 98శాతం) ఏదో ఒక ప్రభుత్వ ప్రయోజన పథకం ద్వారా వైద్యసేవలు పొందుతున్నాయి. ఏటా ఈ పథకాల కింద దాదాపు రూ.1700 కోట్లు ప్రభుత్వం వెచ్చిస్తోంది. ఈ నిధుల్లో 90 శాతానికి పైగా ఉన్నత స్థాయి వైద్యానికే ఖర్చవుతోంది. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన రెండో సూచనలో.. ‘ఎన్ని రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి? వాటి కోసం ఎంత వ్యయం చేస్తున్నారు?’ అనే విషయాల్లో మాత్రం ఇంకా లక్ష్యాన్ని చేరాల్సి ఉందనేది నిపుణుల అభిప్రాయం.

ప్రాథమిక వైద్యానికి 70 శాతం నిధులివ్వాలి
-డాక్టర్‌ శ్రీనాథరెడ్డి, భారతీయ ప్రజారోగ్య సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు

ప్రాథమిక వైద్యానికి మానవ వనరులను గణనీయంగా పెంచాలి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వైద్య బడ్జెట్‌ను రెట్టింపు చేయాలి. ఇందులో 70 శాతం నిధులు ప్రాథమిక వైద్యానికే కేటాయించాలి. ప్రభుత్వం వేర్వేరు రూపాల్లో అమలు చేస్తున్న ఆరోగ్య బీమా పథకాలను ఒక్క తాటిపైకి తేవాలి. తప్పనిసరి, అత్యవసర ఔషధాలను, నిర్ధారణ పరీక్షలను ఉచితంగా అందించాలి. ప్రజారోగ్య పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలి. ఆరోగ్య ఉపకేంద్రాలనూ బలోపేతం చేయాలి. ఆ స్థాయిలోనే నాన్‌ ఫిజీషియన్‌ కేంద్రాలుగా చికిత్స అందించాలి. ఆరోగ్య ఉప కేంద్రాల స్థాయి నుంచే ఆన్‌లైన్‌ వ్యవస్థను ఉన్నతస్థాయికి అనుసంధానం చేయాలి. క్షేత్ర స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రోగిని పంపించేటప్పుడు ఆ సమాచారం సంబంధిత ఆసుపత్రికి ముందే చేర్చే విధంగా పటిష్ఠ ఆన్‌లైన్‌ విధానం రూపొందించాలి. 2020 వరకూ రోగి సొంత ఖర్చును కనీసం 50 శాతానికి తగ్గించాలి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.