close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఇదేం మాయరోగం!

ఆషామాషీగా రోగ నిర్ధారణ పరీక్షలు
సాంకేతిక సహాయకులతోనే సంతకాలు
కొన్ని ప్రయోగశాలల్లో అక్రమ ధోరణి
ఫలితాల్లో పొరపాట్లు దొర్లే ప్రమాదం
భారతీయ వైద్య మండలి తీవ్ర ఆగ్రహం
ఇకపై స్పెషలిస్టు వైద్యుల సంతకాలే  చెల్లుబాటు అవుతాయని ఆదేశాలు
ఈనాడు - హైదరాబాద్‌

వైద్యరంగంలో అత్యంత కీలకమైన రోగనిర్ధారణ పరీక్షల విషయంలో కొన్ని ప్రయోగశాలలు (ల్యాబోరేటరీలు) ఆషామాషీగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. ఏ రకమైన జబ్బులొచ్చినా మల, మూత్ర, రక్త పరీక్షలు చేయాల్సి వస్తుంది. ఒక్కో పరీక్షతో ఒక్కో రకమైన జబ్బు లక్షణాలు కనిపించే అవకాశాలుంటాయి. ఆయా పరీక్షల ఫలితాలే చికిత్సకు కీలకంగా మారతాయి. ఇంతటి కీలకమైన పరీక్షలు నిర్వహించే ప్రయోగశాలల్లో (ల్యాబోరేటరీలు) అన్నీ సక్రమంగానే జరుగుతున్నాయా? అంటే లేదనే  సమాధానం  వస్తుంది. కొన్ని ప్రయోగశాలల్లో రోగుల నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. స్పెషలిస్టు వైద్యుడు పరిశీలించి ఇవ్వాల్సిన ఫలితాలను సాధారణ సాంకేతిక సహాయకులే ఇచ్చేస్తున్నారు. ఈ విపరీత ధోరణి వల్ల కొన్నిసార్లు ఫలితాలు తారుమారైన సందర్భాలూ ఉన్నాయి. ప్రయోగశాలలు చేస్తున్న ఈ తరహా అక్రమ దందాపై భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

అంతేకాకుండా నిర్ధారణ పరీక్షల ఫలితాలను స్పెషలిస్టు వైద్యుడు చూసి సంతకం చేస్తేనే అవి చెల్లుబాటు అవుతాయని స్పష్టీకరించింది. ఈ మేరకు తాజాగా ఎంసీఐ ఆదేశాలు వెలువరించింది.

చికిత్సకు అవే కీలకం
ఇంతటి కీలకమైన పరీక్షలను నిర్వహించడంలో ప్రధానంగా ముగ్గురు స్పెషలిస్టు వైద్యనిపుణులు సేవలందిస్తుంటారు. 1. పాథాలజీ 2. బయోకెమిస్ట్రీ 3. మైక్రోబయాలజీ. ఈ మూడూ కూడా ఎంబీబీఎస్‌ అనంతరం పీజీ వైద్యవిద్యలో భాగంగా అభ్యసించేవే. మూడేళ్ల పాటు స్పెషలిస్టు వైద్యవిద్యను పూర్తిచేస్తే తప్ప.. నిర్ధారణ పరీక్షల్లో మెరుగైన ఫలితాలను అందించలేరు. ప్రయోగశాలల్లో అవసరమైన పరీక్షలను చేయడంలో సహాయపడేది సాంకేతిక సహాయకులైతే.. పరీక్షల ఫలితాలను ఇచ్చేది పరికరమే. అయితే ఆ పరికరమిచ్చిన ఫలితాలను క్రోడీకరించి సరైన రీతిలో జబ్బు లక్షణాలను వివరించగలిగే సామర్థ్యం ఒక్క స్పెషలిస్టు వైద్యుడికే ఉంటుంది. ఎందుకంటే పరికరం కూడా కొన్నిసార్లు తప్పుడు ఫలితాలనివ్వొచ్చు. ముఖ్యంగా రక్తనమూనాలను సేకరించిన దగ్గర్నించి ఫలితాల వెల్లడి వరకూ క్షణక్షణం రక్త కణాల్లో మార్పులు జరుగుతుంటాయి. వాటిని పరిశీలిస్తూ ఉండాలి. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఫలితాలు తారుమారు కావచ్చు. ఉదాహరణకు రక్తంలో సోడియం, పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్స్‌ అనూహ్యంగా ఎక్కువగా చూపిస్తుంటే.. మరోసారి పరిశీలించి పరీక్షించాల్సిన అవసరముంటుంది. మూత్రంలో ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించడానికి జరిపే పరీక్షలోనూ జాగ్రత్తగా పరిశీలించి ఇన్‌ఫెక్షన్‌ కారక బ్యాక్టీరియాను ఇవ్వకపోతే తప్పుడు చికిత్స జరిగే ప్రమాదముంటుంది.

చట్టరీత్యా చర్యలు
నిర్ధారణ పరీక్షల్లో తాము కీలక పాత్ర పోషిస్తున్నామని, తామిచ్చే నివేదికలూ చెల్లుబాటు అయ్యేలా ఆదేశాలివ్వాలని గతంలో ప్రయోగశాలల్లోని సాంకేతిక సహాయకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై న్యాయస్థానం కూడా స్పష్టమైన ఆదేశాలిచ్చింది. నిర్ధారణ పరీక్షల ధ్రువపత్రాలను జారీచేసే అర్హత వారికి లేదంటూ పిటిషన్‌ను కొట్టివేసింది. దీన్ని ఆధారం చేసుకునే ఎంసీఐ తాజా ఆదేశాలు జారీచేసింది. అరకొర పరిజ్ఞానంతో ఇచ్చే నిర్ధారణ పరీక్షల ఫలితాలు రోగి జీవితాన్ని తలకిందులు చేసే ప్రమాదాలుంటాయని, ఈ విషయంలో స్పెషలిస్టు వైద్యుల సంతకానికే అర్హత ఉంటుందని తేల్చిచెప్పింది. ఇక నుంచి ప్రయోగశాలలన్నీ కూడా కచ్చితంగా ఈ నిబంధనలనే పాటించాలని, లేకపోతే క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ నిబంధనల కింద చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

అవి ఫలితాలే కావు.. శరీర స్పందన
ఆచార్య డాక్టర్‌ వేము లక్ష్మి, మైక్రోబయాలజీ

రక్తం తీస్తారు.. పరికరంలో పెడతారు.. ఫలితాలొస్తాయి.. ఇందులో స్పెషలిస్టు వైద్యుడు చేసేదేముందిలే అనిపించవచ్చు. కానీ నిజానికి అవి కేవలం ఫలితాలు మాత్రమే కావు. రోగి శరీర స్పందనలు. జబ్బుకు రోగి శరీరం ఎలా స్పందిస్తుందో ఆ ఫలితాలే వెల్లడిస్తాయి. ఒక్కోసారి ఫలితాలూ అనూహ్యంగా రావచ్చు. అయితే ఆ ఫలితాలు రోగి ప్రస్తుత ఆరోగ్యస్థితికి వర్తిస్తాయా? అని సునిశితంగా పరిశీలించాల్సి వస్తోంది. అంటే ఫలితాలను రోగి జబ్బుకు అన్వయించుకోకుండా తుది నివేదికను ఇవ్వడంలోనే నిపుణుల పాత్ర ఉంటుంది. ఇది సాధారణ సాంకేతిక సహాయకులు చేయలేరు.

ఫలితాల అన్వయం ప్రధానం
డాక్టర్‌ పుట్టా శ్రీనివాస్‌, మహబూబ్‌నగర్‌ వైద్యకళాశాల సంచాలకులు

కొన్నేళ్ల కిందట ఒక ప్రయోగశాలలో ఒక వ్యక్తి రక్తపరీక్షలు చేయించుకున్నాడు. ఫలితాల్లో హెచ్‌ఐవీ ఉన్నట్లుగా వెల్లడించారు. మనోవేదనతో ఆ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శవనివేదికలో అతడికి హెచ్‌ఐవీ లేదని తేలింది. తప్పుడు ఫలితమిచ్చిన ఆ ప్రయోగశాలపై అప్పట్లో కేసు కూడా నమోదైంది. ఇలాంటి తప్పుడు ఫలితాలు సాధారణంగా అర్హత లేని వ్యక్తులు పరీక్షలు జరిపినప్పుడు వెల్లడవుతుంటాయి. ఒక ఫలితం బహిర్గతంగా వెల్లడించేటప్పుడు ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాల్సి ఉంటుంది. వెల్లడైన ఫలితాన్ని రోగి శరీరానికి అన్వయించుకోవాలి. ఇది సాధారణ సాంకేతిక సహాయకుడు చేయలేరు. కేవలం స్పెషలిస్టు వైద్యుడు మాత్రమే ఈ తరహా ఆలోచించగలరు. అందుకే నిర్ధారణ పరీక్షలకు అంత ప్రాధాన్యముంటుంది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.