close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఓట్ల పరవళ్లు ఎవరికో..!

కృష్ణాజిల్లాలో మెజార్టీ స్థానాల్లో త్రిముఖ పోరు
సంక్షేమ పథకాలపై తెదేపా ఆశలు
ప్రభుత్వ వ్యతిరేకతపై వైకాపా ప్రచారం
ఓట్ల చీలికలో కీలకం కానున్న జనసేన
కృష్ణా జిల్లా క్షేత్రపరిశీలన కథనం
ఇట్టా సాంబశివరావు, చిరుతాని శ్రీనివాసరావు
ఈనాడు, అమరావతి

ఓవైపు కృష్ణానది ప్రవాహం.. మరోవైపు కొండపై కొలువుదీరిన కనకదుర్గమ్మ.. వీటితో పాటు రాజకీయంగా.. సామాజికంగా.. ఆర్థికంగా కూడా ఎన్నో ప్రత్యేకతలు కలిగిన కృష్ణా జిల్లాలో రాజకీయం వాడీవేడిగా ఉంది. ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. భౌగోళికంగా డెల్టా, తీర, మెట్ట ప్రాంతం కలిసి.. తలసరి ఆదాయం, స్థూల ఉత్పత్తిలో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉన్న ఈ జిల్లాలో 16 నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, నియోజకవర్గాల వారీగా చేసిన అభివృద్ధి పనులతో గెలుస్తామని తెదేపా అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, సానుభూతితో గెలుస్తామని వైకాపా ఆశాభావంతో ఉంది. జనసేన ఏ మేరకు ఓట్లు చీలుస్తుందనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో ఉత్కంఠ రేపుతున్న కృష్ణా జిల్లాలో ‘ఈనాడు’ ప్రతినిధులు 16 నియోజకవర్గాల్లో పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితులపై అందిస్తున్న ప్రత్యేక కథనం..

మైలవరం: ఎవరి ధీమా వారిదే!

ఈ స్థానం నుంచి తెదేపా అభ్యర్థిగా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పోటీలో ఉన్నారు. 2009, 2014లో గెలిచిన ఆయన మూడో సారి బరిలో నిలిచారు. నియోజకవర్గంలో చేపట్టిన సీసీ రోడ్లు, ఎత్తిపోతల పథకాలు, గృహాల నిర్మాణాలు, ఇళ్ల స్థలాల పంపిణీ వంటివి గెలిపిస్తాయని విశ్వస్తున్నారు. సీఎం సహాయ నిధి నుంచి పెద్దఎత్తున సాయం అందించేలా చేయగలిగారు. ‘దేవినేని ఉమా ఇప్పటికే ఎన్నో అభివృద్ది పనులు చేశారు. ఆయన గెలిస్తే మళ్లీ మంత్రి అయ్యి మరింత అభివృద్ధి చేస్తారు’ అని గొల్లపూడికి చెందిన చిరు వ్యాపారి నాగేశ్వరరావు తెలిపారు. వైకాపా అభ్యర్థిగా వసంత కృష్ణప్రసాద్‌ పోటీ ఉన్నారు. ఆర్థికబలం కూడా ఉండటంతో దేవినేనికి గట్టి పోటీ ఇస్తున్నారు.

జగ్గయ్యపేట: అభివృద్ధా..? సానుభూతా..?

ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సానుభూతి.. ఈ రెండింట్లో జగ్గయ్యపేట వాసులు ఎటు మొగ్గుచూపుతారనేది ఆసక్తికరంగా మారింది. 2009, 2014లో గెలిచిన తెదేపా సిట్టింగ్‌ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్‌(తాతయ్య) హ్యాట్రిక్‌ కొట్టాలన్న ఉద్దేశంలో ఉన్నారు. అయిదేళ్లలో చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ఈసారీ విజయం సాధిస్తానని ధీమాగా ఉన్నారు. ఇదే నియోజకవర్గం నుంచి ఐదుసార్లు పోటీచేసి, మూడుసార్లు గెలుపొంది మంత్రిగా పనిచేసిన నెట్టెం రఘురాం నుంచి రాజగోపాల్‌కు మద్దతు లభిస్తుండటం కలిసొచ్చే అంశంగా మారింది. ఇక వైకాపా తరఫున సామినేని ఉదయభాను బరిలో ఉన్నారు. ఈయన 1999, 2004 ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచి, 2009(కాంగ్రెస్‌), 2014(వైకాపా)లో పోటీ చేసి ఓడిపోయారు. తనపై ఉన్న సానుభూతితో గెలుస్తానన్న ధీమాలో ఉన్నారు. ‘నేను బస్సులో వెళ్లి పోలవరం ప్రాజెక్టు పనులు చూశాను. రాజధాని ప్రాంతంలో జరుగుతోన్న అభివృద్ధి పనులు గమనించాను. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు వంటి వ్యక్తి సీఎంగా ఉండాలి’ అని దేచుపాలెంకు చెందిన డి.రవికుమార్‌ ‘ఈనాడు’తో అన్నారు.

గుడివాడ: నానికి అడ్డుకట్ట పడేనా..!

గుడివాడ నుంచి తెదేపా అభ్యర్థిగా దేవినేని నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్‌ పోటీ చేస్తున్నారు. విజయవాడకు చెందిన వ్యక్తి అయినప్పటికీ స్థానికేతరుడనే ముద్ర పడకుండా గుడివాడలో ఇల్లును కొనుగోలు చేసి.. ఉంటానంటూ ప్రచారంలో పాల్గొంటున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని)కి గట్టి పోటీనిస్తున్నారు. విద్యావంతుడు, ఆర్థికంగా బలవంతుడైన అవినాష్‌ సీనియర్‌ నేతలతో కలిసి ప్రచారం సాగిస్తున్నారు. గుడివాడలోని మండపాడు ప్రాంతానికి చెందిన డ్వాక్రా సభ్యురాలు భూపతి నారాయణమ్మ మాట్లాడుతూ ‘ పసుపు కుంకుమ పథకం కింద డబ్బులు వచ్చాయి. ఈసారి నా ఓటు తెదేపాకే..’ అని చెప్పారు. ఇప్పటికే మూడు సార్లు గెలిచిన నాని నాలుగోసారి గెలిచి తన పట్టు నిరూపించుకోవాలన్న ప్రయత్నంలో ఉన్నారు. ఇక్కడ జనసేన అభ్యర్థి నామపత్రం తిరస్కరణకు గురవ్వడం విశేషం.

పెనమలూరు: ప్రసాద్‌ పార్థసారథి

పెనమలూరు నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ రెండోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున గెలిచి మంత్రిగా పనిచేసిన కె.పార్థసారథి వైకాపా నుంచి పోటీ చేస్తున్నారు. ఇద్దరూ హోరాహోరీగా పోరాడుతున్నారు. ఉయ్యూరు మండలానికి చెందిన అన్నగాని దత్తుడు మాట్లాడుతూ ‘తెదేపా పథకాలతో లబ్ధి పొందాం.. మళ్లీ తెదేపానే రావాల్సిన అవసరం ఉంది.’ అన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, వైకాపా ప్రకటించిన హామీలతో గెలుస్తామన్న ధీమాలో పార్థసారథి ఉన్నారు.

పామర్రు: నువ్వా.. నేనా..

రిజర్వు స్థానం అయిన పామర్రులోనూ పోరు నువ్వా.. నేనా అన్నట్లు సాగుతోంది. ఇక్కడ రాజకీయ సమీకరణాలు మారాయి. తెదేపా తరఫున సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన పోటీలో ఉన్నారు. 2014లో వైకాపా నుంచి గెలిచి.. తర్వాత ఆమె సైకిల్‌ ఎక్కారు.   ఇప్పుడు తిరిగి టికెట్‌ దక్కించుకుని పోటీలో ఉన్నారు. వైకాపా నుంచి అనిల్‌కుమార్‌ పోటీలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే డీవై దాస్‌ జనసేనలో చేరి టికెట్‌ రాలేదని స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. ఆ తర్వాత వైకాపాకు మద్దతు ప్రకటించి పోటీ నుంచి వైదొలిగారు.

మచిలీపట్నం..: పోటీ త్రిముఖం

మచిలీపట్నం నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది. తెదేపా అభ్యర్థిగా కొల్లు రవీంద్ర, వైకాపా అభ్యర్థిగా పేర్నినాని, జనసేన నుంచి బండి రామకృష్ణ పోటీచేస్తున్నారు. గత ఎన్నికల్లో తెదేపా నుంచి గెలిచిన కొల్లు రవీంద్ర మంత్రిగా పనిచేశారు. 2004, 2009 ఎన్నికల్లో గెలిచిన పేర్ని నాని వైకాపా నుంచి బరిలో ఉన్నారు. అయితే బందరు పోర్టు పనులు ప్రారంభం కావడం, శాశ్వత నీటి సమస్య పరిష్కారం, మురుగునీటి సమస్యను తీర్చడం, గృహ నిర్మాణాలు, పింఛన్లు, పసుపు కుంకుమ, పోర్టు పనుల ప్రారంభంతో తనకు కలిసి వస్తుందని కొల్లు రవీంద్ర ధీమాగా ఉన్నారు. పొలాటితిప్ప గ్రామానికి చెందిన రమాదేవి మాట్లాడుతూ ‘మా ఊళ్లో చాలా మంది ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందారు. అందుకే తెదేపా వైపే చూస్తున్నాం’ అన్నారు. వైకాపా అభ్యర్థి పేర్ని నానికి నియోజకవర్గంపై పట్టు ఉండటం కలిసొచ్చే అంశం మారింది. మరోవైపు హోటల్స్‌ పరిశ్రమకు చెందిన బండి రామకృష్ణ జనసేన అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. గతంలో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన వేదవ్యాస్‌కు 30వేల ఓట్లు వచ్చాయి.

విజయవాడ తూర్పు: విజేతగా ఉదయించేదెవరు.?

విజయవాడ తూర్పులో సీనియర్‌ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వైకాపా అభ్యర్థిగా బొప్పన భవకుమార్‌ బరిలో నిలిచారు. ముందుగా మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవికుమార్‌ను సమన్వయకర్తగా నియమించారు. అయితే ఆఖరి నిమిషంలో భవకుమార్‌కు టికెట్‌ దక్కింది. దీంతో యలమంచిలి సహాయ నిరాకరణ చేశారు. ఆయన గన్నవరంలో ప్రచారం చేస్తున్నారు. ఇది వైకాపాకు ఇబ్బందిగా మారింది. జనసేన నుంచి బత్తిన రాము గట్టి పోటీ ఇస్తున్నారు.

విజయవాడ పశ్చిమం: మైనార్టీలే కీలకం

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మైనార్టీల ఓట్లు కీలకంగా మారాయి. తెదేపా, వైకాపా, జనసేన అభ్యర్థులతో ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. మరోవైపు స్వతంత్ర అభ్యర్థి కొరడా విజయకుమార్‌ వైకాపా ఓట్లపై ప్రభావాన్ని చూపిస్తారని భావిస్తున్నారు. తెదేపా ఈ సారి టికెట్‌ను ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ కూతురు షబానాకు కేటాయించింది. జలీల్‌ఖాన్‌ గత ఎన్నికల్లో వైకాపా నుంచి గెలిచి సైకిల్‌ ఎక్కిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో భాజపా నుంచి పోటీ చేసిన వెల్లంపల్లి శ్రీనివాసరావు వైకాపా నుంచి పోటీ చేస్తున్నారు. జనసేన కూటమి తరఫున పోతిన మహేష్‌ రంగంలో ఉన్నారు.

గన్న‘వరం’ ఎవరికీ..!

గన్నవరం నియోజకవర్గం నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే, తెదేపా అభ్యర్థి వల్లభనేని వంశీ మోహన్‌ మరోసారి బరిలో నిలిచారు. ఈయనకు ఎన్నారై, వైకాపా అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు గట్టి పోటీ ఇస్తున్నారు. నిత్యం నియోజకవర్గవాసులకు వంశీ అందుబాటులో ఉంటూ ఏ సాయం కావాలన్నా చేస్తారన్న పేరుంది. రామవరప్పాడు వంతెన పూర్తి, గన్నవరంలో రైతుబజార్‌, బ్రహ్మయ్య లింగం చెరువు రిజర్వాయరుగా మార్పు, విమానాశ్రయ  భూసేకరణ సమస్యల పరిష్కారం వంటి పనులతో విజయంపై వంశీ ధీమాగా ఉన్నారు. ఉంగుటూరు మండలం బొక్కినేల చిన్న మారయ్య మాట్లాడుతూ ‘ఏ సమస్య ఉన్నా వంశీకి చెబితే వెంటనే పరిష్కరిస్తుంటారు. పోలవరం నిర్మాణం పూర్తి కావాలంటే మళ్లీ చంద్రబాబు సీఎం కావాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు. వైకాపా అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఏడాదిన్నర కిందట నియోజకవర్గ ఇంఛార్జిగా నియమించడంతో స్థానికంగా పర్యటిస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు.

విజయవాడ మధ్య: ముగ్గురూ ముగ్గురే

విజయవాడ మధ్య నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది. ఇక్కడ సమీకరణాలు మారడంతో అసమ్మతి గళాలు ఉన్నాయి. సిట్టింగ్‌ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దాదాపు రూ.1200 కోట్లకుపైగా అభివృద్ధి పనులు జరిగాయని బోండా ఉమా ప్రచారంలో పాల్గొంటున్నారు. వైకాపా నుంచి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు బరిలోకి దిగారు. కాంగ్రెస్‌ నుంచి ఆయన వైకాపాలో చేరడంతో ఇక్కడ టికెట్‌ ఆశించిన వంగవీటి రాధాకృష్ణ తెదేపాలో చేరారు. మరోవైపు వైకాపా నేత గౌతంరెడ్డి సహాయ నిరాకరణ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో విష్ణు ప్రధానంగా తన సామాజిక వర్గ ఓట్లపై ఆశలు పెట్టుకున్నారు. జనసేన బలపరిచిన సీపీఎం అభ్యర్థి చిగురుపాటి బాబూరావు కొంత కాలంగా ప్రచారం చేస్తున్నారు.

నూజివీడు: మళ్లీ వారి మధ్యనే పోటీ

నూజివీడు నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, వైకాపా అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు పోటీ పడుతున్నారు. అప్పారావు ప్రజలకు అందుబాటులో ఉంటారన్న పేరుంది. అప్పారావుకు ప్రధాన అనుచరుల్లో ఒకరైన బసవ భాస్కరరావు సతీమణి రేవతి ప్రస్తుతం మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఈమె పదవిలో కొనసాగించే విషయంలో వచ్చిన మనస్పర్థలతో అప్పారావు వర్గం నుంచి బయటకొచ్చి భాస్కరరావు జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈయన ఏ పార్టీ ఓట్లు చీలుస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. తెదేపా తరఫున రెండోసారి వెంకటేశ్వరరావు మళ్లీ ఇక్కడి నుంచే పోటీకి దిగారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు విజయానికి చేరువ చేస్తాయని తెదేపా వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

కైకలూరు: ఆసక్తికర పోరు

గత ఎన్నికల్లో మిత్ర పక్షాలకు కేటాయించిన ఈ స్థానం నుంచి ఇప్పుడు తెదేపా పోటీ చేస్తోంది. తెదేపా శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. తెదేపా నుంచి మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ, వైకాపా నుంచి దూలం నాగేశ్వరరావు తలపడుతున్నారు.  గత ఎన్నికల్లో తెదేపా మద్దతుతో భాజపా తరఫున కామినేని శ్రీనివాస్‌ గెలుపొందారు. ఆ సమయంలో తెదేపా శ్రేణులు కొంత అసంతృప్తితో ఉండేవి. ప్రస్తుతం వెంకటరమణకు టికెట్‌ ఇవ్వడంతో ఉత్సాహంగా ప్రచారం చేస్తున్నారు. గత ఎన్నికల్లో పెడనకు చెందిన ఉప్పాల రాంప్రసాద్‌కు టికెట్‌ ఇచ్చిన వైకాపా ఈసారి స్థానికుడు దూలం నాగేశ్వరరావునే బరిలో దించింది. జనసేన చీల్చే ఓట్ల ప్రభావంపై చర్చ జరుగుతోంది.

పెడన: సామాజిక సమరం

పెడనలో సామాజిక సమీకరణాలు కీలకంగా మారాయి. ఇక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు తనయుడు కాగిత కృష్ణప్రసాద్‌ తెదేపా నుంచి పోటీ చేస్తున్నారు. జోగి రమేష్‌ వైకాపా అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. జనసేన నుంచి లక్ష్మీశ్రీనివాస్‌ పోటీ చేస్తున్నారు. ముగ్గురూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఇక్కడ పోరు ఆసక్తికరంగా మారింది. వైకాపాలో అసమ్మతి నెలకొంది. ఆ పార్టీ నుంచి ఉప్పాల రాంప్రసాద్‌ టికెట్‌ ఆశించినప్పటికీ.. అనూహ్యంగా జోగి రమేష్‌ను సమన్వయకర్తగా నియమించడంతో రెండు వర్గాలకు మధ్య పొసగడం లేదు.

అవనిగడ్డ : ఎవరి అడ్డా..!

అవనిగడ్డ నియోజకవర్గంలో త్రిముఖ పోరు నడుస్తోంది. ఇక్కడ తెదేపా అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్‌ రెండుసార్లు కాంగ్రెస్‌ పక్షాన, మూడోసారి తెదేపా తరఫున పోటీచేసి గెలుపొందారు. రైతుల రుణమాఫీ, పింఛన్లు, పసుపు కుంకుమ పథకాలు, సీసీ రోడ్ల నిర్మాణంపై బుద్ధప్రసాద్‌ ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. మోపిదేవి మండలానికి చెందిన సీతారామయ్య మాట్లాడుతూ ‘సీఎం చంద్రబాబు పేదల అభివృద్ధికి బాగా కష్టపడుతున్నారు. నేను మాత్రం తెలుగుదేశానికి ఓటేస్తా’ అన్నారు. గత ఎన్నికల్లో మండలి బుద్ధప్రసాద్‌తో పోటీపడి ఓడిపోయిన సింహాద్రి రమేష్‌ మరోమారు వైకాపా నుంచి పోటీ పడుతున్నారు. రమేష్‌ గెలుపునకు సానుభూతి పనిచేస్తుందని భావిస్తున్నారు. జనసేన నుంచి ముత్తంశెట్టి కృష్ణారావు పోటీచేస్తున్నారు.

తిరువూరు: స్థాన మార్పు కలిసొచ్చేనా..?

మంత్రి కెఎస్‌ జవహర్‌ సిట్టింగ్‌ స్థానం కోవూరు(ప.గో.జిల్లా) నుంచి మారి తిరువూరులో పోటీలో దిగారు. ఈయనకు స్థాన మార్పు కలిసి వస్తుందా.. రాదా.. అన్నది తేలాల్సి ఉంది. తెదేపా సంక్షేమ పథకాలు, ఎంపీ కేశినేని నాని ఆధ్వర్యంలో టాటా ట్రస్టు ద్వారా జరుగుతోన్న సేవ కార్యక్రమాలపై జవహర్‌ ఆశలు పెట్టుకున్నారు. మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసుకు టికెట్‌ ఇవ్వకపోవడంతో కొంత అసంతృప్తితో ఉన్నారు. మంత్రితో కలిసి ప్రచారంలోనైతే పాల్గొంటున్నారు. 1994, 1999 గెలిచిన స్వామిదాస్‌ ఆ తర్వాత వరుసగా  మూడు సార్లు ఓడిపోవడంతో అభ్యర్థిని మార్చారు.  వైకాపా అభ్యర్థిగా బరిలో ఉన్న రక్షణ నిధి.. తెదేపా అసమ్మతివాదులను కూడగట్టేందుకు ప్రయత్నిస్తూ ముందుకు సాగుతున్నారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.