Latest Telugu News, Headlines - EENADU
close

ప్ర‌త్యేక క‌థ‌నం

పింఛను పెరగాలంటే.. భవిష్య‘నిధి’ తగ్గుతుంది

వేతనంలో 8.33శాతం ఈపీఎస్‌కే
ఈనాడు - హైదరాబాద్‌

ప్రైవేటు రంగంలో అధిక వేతనాలు పొందుతూ రిటైరయ్యాక ఎక్కువ పింఛను కావాలనుకునే వారికి ప్రతినెలా వారి ప్రావిడెంట్‌ ఫండ్‌(పీఎఫ్‌) ఖాతాలో జమయ్యే నగదు నిల్వలు తగ్గనున్నాయి. యజమాని ఉద్యోగి వాస్తవిక వేతనం(మూలవేతనం, డీఏ)పై 12 శాతం ఈపీఎఫ్‌వోకు జమ చేయాల్సి ఉండగా ఇందులో 8.33 శాతం ఈపీఎస్‌కు(ఉద్యోగుల పెన్షన్‌ పథకానికి), 3.67 శాతం ఉద్యోగి ఖాతాకు వెళ్తుంది. ఈపీఎఫ్‌వో నిబంధనల ప్రకారం పింఛనుకు నిర్దేశించిన గరిష్ఠ వేతనం రూ.15వేలుగా ఉన్నందున 8.33 శాతం అంటే రూ.1,250 మాత్రమే ఇప్పటిదాకా ఈపీఎస్‌కు జమచేస్తుండగా, మిగతా సొమ్ము ఉద్యోగి పీఎఫ్‌ ఖాతాలో వేస్తున్నారు. అధిక పింఛను కోసం ఆప్షన్‌ ఇస్తే వాస్తవిక వేతనం(మూలవేతనం, డీఏ)పై 8.33 శాతం పూర్తిగా ఎంతైతే అంత ఈపీఎస్‌కు వెళ్తుంది. ప్రతి ఏడాది పెరిగే వేతనం మేరకు ఈ మొత్తం కూడా పెరుగుతుంది. ఇప్పటికే పదవీ విరమణ చేసినవారికైనా, సర్వీసులో కొనసాగుతున్న వారికైనా అధికవేతనం ఉంటే అప్పటి నుంచి వడ్డీతో సహా ఈపీఎస్‌ బకాయిలు ఈపీఎఫ్‌వోకు జమ చేయాల్సి ఉంటుంది. ఇలా చేసిన వారికే అదనపు పింఛను ప్రయోజనాలు దక్కనున్నాయి. తాజా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో దీనికి సంబంధించి ఈపీఎఫ్‌వో కేంద్ర కార్యాలయం రూపొందించే విధివిధానాల కోసం ప్రైవేటు రంగంలోని విశ్రాంత ఉద్యోగులు.. ప్రస్తుత ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తక్కువ వేతనాలున్నా పెరగనున్న పింఛను
వేతనం రూ.15వేలకు తక్కువగా ఉన్నప్పటికీ 2014 తరువాత పదవీ విరమణ చేసిన వారికి మేలు జరగనుంది. 2014 సెప్టెంబరు తరువాత పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పింఛను లెక్కించేప్పుడు చివరి ఐదు సంవత్సరాల సగటు వేతనం పరిగణనలోకి తీసుకున్నారు. సుప్రీంకోర్టు చివరి ఏడాది వేతనం పరిగణనలోకి తీసుకోవాలని సూచించడంతో... ఆయా ఉద్యోగులకు పింఛను పెరగనుంది.

ఉదాహరణకు ఒక ఉద్యోగి 2017 సెప్టెంబరులో పదవీ విరమణ చేశారు. చివరి వేతనం రూ.15వేలుగా ఉంది. పింఛను లెక్కించేపుడు చివరి ఐదేళ్ల వేతన సగటును తీసుకున్నపుడు 2014 సెప్టెంబరు కన్నా ముందుగా రెండేళ్లు రూ.6,500 చొప్పున, ఆ తరువాత మూడేళ్లకు రూ.15వేల చొప్పున వేతనం లెక్కిస్తే సగటు వేతనం రూ.11,600 అవుతుంది. సర్వీసు 18ఏళ్లు అయితే పింఛను రూ.2,982 అవుతుంది. సుప్రీం తీర్పు అమలైతే చివరి ఏడాది సగటు వేతనం రూ.15వేలపై పింఛను లెక్కించాలి. ఈ లెక్కన చేతికి అందే పింఛను రూ.3,857 అవుతుంది.

ప్రభుత్వ వాటా ఎలా?
పింఛను చెల్లించేందుకు ప్రతినెలా యజమాని చెల్లించే వాటాకు అదనంగా కేంద్ర ప్రభుత్వం 1.16 శాతం వాటాను ఈపీఎఫ్‌వోకు జమ చేస్తుంది. రూ.15వేలకు వేతన పరిమితి ఉన్నవారికి మాత్రమే ఈ చెల్లింపులు జరుగుతున్నాయి. రూ.15వేలకు మించితే ఆ వాటాను ఇవ్వడం లేదు. 2014 సెప్టెంబరు కన్నా ముందు అధిక వేతనాలపై పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పింఛను లెక్కించేపుడు ఈ మొత్తాన్ని ఉద్యోగుల నుంచి వసూలు చేశారు. తాజాగా సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో 1.16శాతం ఎవరు భర్తీచేయాలన్న విషయమై సందిగ్ధం నెలకొంది. కేంద్రం భర్తీచేస్తుందా? యజమాని లేదా ఉద్యోగి నుంచి తీసుకుంటారా నిబంధనల్లో తెలియాల్సి ఉంది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.