close

ప్ర‌త్యేక క‌థ‌నం

మేము జనంతో.. జయం మాతో 

గతం కంటే ఘనంగా గెలుస్తాం 
ప్రజలు గుండెల మీద చేయి వేసుకునేలా విశ్వాసం కలిగించాం 
పోలవరానికి పూర్తిగా నిధులిస్తాం 
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం 
‘ఈనాడు’ ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 
మానుకొండ నాగేశ్వరరావు, చల్లా విజయభాస్కర్‌, రాజీవ్‌ రాజన్‌ 
దిల్లీ నుంచి ‘ఈనాడు’ ప్రతినిధులు

ఈ ఐదేళ్లలో యావద్దేశానికి తన శక్తి సామర్థ్యాలేంటో తెలిశాయని, ఈ సారి ఘనమైన విజయాన్ని సొంతం చేసుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీయే ప్రభుత్వ విధానాల ఫలితంగా దేశాభివృద్ధి, ఉపాధి కల్పన జోరందుకున్నాయని అన్నారు. ప్రజలు గుండెల మీద నిబ్బరంగా చేతులు వేసుకునేంత భరోసా కల్పించామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి విషయంలో తామిచ్చిన వాగ్దానాలను పూర్తిగా నెరవేరుస్తామని, పోలవరం ప్రాజెక్టుకు పూర్తిగా సాయం అందిస్తామని అన్నారు.ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించే విషయమై ప్రశ్నించగా... తాము ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ వల్లే ఎక్కువ ప్రయోజనమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శాసనసభలో అంగీకరించారని ప్రధాని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారం కోసమే గవర్నర్‌ను కొనసాగిస్తున్నట్టు మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పించే విషయాన్ని నిశితంగా అధ్యయనం చేసి ముందుకెళ్తామని, తెలుగు రాష్ట్రాల అభ్యున్నతికి దృఢ సంకల్పంతో కృషి చేస్తామని అన్నారు. మైనార్టీల భద్రత విషయంలో ప్రపంచానికి భారత్‌ ఆదర్శంగా నిలుస్తోందని, ఉగ్రవాదులు ఎక్కడున్నా తుదముట్టిస్తామని మోదీ ఉద్ఘాటించారు. 
మునుపటి సార్వత్రిక ఎన్నికల కంటే అత్యధిక స్థానాలతో కేంద్రంలో మరోసారి సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ధీమా వ్యక్తం చేశారు. సుస్థిర ప్రభుత్వంతోనే దేశాభివృద్ధి సాధ్యమని ఉద్ఘాటించారు. దేశానికి సుదృఢ భద్రత కల్పించడంతో పాటు చివరి పంక్తిలో కూర్చున్న నిరుపేదకూ న్యాయం చేస్తామన్నారు.  సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయన సోమవారం ‘ఈనాడు’ ప్రతినిధులకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. 30 ఏళ్ల తర్వాత గత ఎన్నికల్లో కేంద్రంలో ఏర్పడిన సుస్థిర ప్రభుత్వం 125 కోట్ల మంది ప్రజల్లో పాలన పట్ల విశ్వాసం, నమ్మకం కలిగించిందన్నారు. వ్యవస్థల దుర్వినియోగానికి పాల్పడి తననే బాధితుడిగా మార్చిన కొన్ని పార్టీలు ఇప్పుడు వ్యవస్థల భద్రతపై ఆందోళన వెలిబుచ్చడం హాస్యాస్పదమన్నారు.

వివిధ అంశాలపై ముఖాముఖి వివరాలు ఆయన మాటల్లోనే...

సొంతంగానే మెజారిటీ 
2014నాటికి దేశ రాజకీయాలకు నేను పూర్తిగా కొత్త. ఇప్పుడు దేశ ప్రజలు నా అయిదేళ్ల పాలనచూశారు. నా ప్రాధాన్యాలను, నా జీవనశైలిని, ప్రభుత్వ పనితీరును పరిశీలించారు. దేశానికి నా శక్తిసామర్థ్యాల గురించి పూర్తిగా తెలిసివచ్చింది. మరోవైపు దేశం 30 ఏళ్ల రాజకీయ అస్థిరతను చవిచూసింది. స్థిరమైన ప్రభుత్వం అధికారంలో ఉంటే ఎలాంటి ప్రయోజనం ఉంటుందన్న  అంశం ప్రజలకు తెలిసివచ్చింది. భారత్‌లాంటి దేశానికి సుస్థిరమైన, బలమైన ప్రభుత్వం అవసరం అన్న భావన సామాన్య ప్రజల్లోనూ ఉంది. స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవడానికి, తద్వారా ఫలితాలు అందుకోవడానికి ప్రధాన కారణం స్థిరత్వమే. గత ఎన్నికల్లో భాజపాకు సంపూర్ణ మెజారిటీ వచ్చినప్పటికీ మేం ప్రాంతీయ ఆకాంక్షలకు స్థానం కల్పించాం. అన్ని పార్టీలను కలుపుకొని స్వచ్ఛమైన స్ఫూర్తితో బలమైన ప్రభుత్వాన్ని అందించాం. ఈ విధానం ఆధారంగా ప్రజలు ఓటేస్తారని నేను నమ్ముతున్నా. గతంలో ప్రజలకు ప్రభుత్వం పట్ల కోపం ఉండేది. ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సమానాభివృద్ధి జరుగుతోంది. ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలు, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణల్లోకూడా ఎన్నో పనులు జరుగుతున్నాయి. అందువల్ల దేశ గతిశీలత పెంచే పనులు జరుగుతున్నాయని ప్రజలకు తెలిసివచ్చింది. అందువల్ల భాజపాతోపాటు, ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు ఇదివరకటి కంటే అధిక సీట్లను కైవసం చేసుకుంటాయని నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది.

గణాంకాలు వేరు.. రాజకీయాలు వేరు

గణాంకాల ఆధారంగా రాజకీయాలు నడవవు. ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల్లో ఎస్పీ-కాంగ్రెస్‌ కలిసి పోటీచేసినప్పుడు చాలామంది ఇలాగే గణాంకాలు వారికి అనుకూలంగా ఉన్నాయి కదా? అని అడిగేవారు. కానీ ఫలితాలు భిన్నంగా వచ్చాయి. నాయకులు ఎటువెళ్తే ప్రజలు అటు వెళ్తారన్నది పూర్వకాలం మాట. దేశం యువ, తొలి ఓటర్లతో నిండిపోయింది. వాళ్లు తమకు నచ్చిన విధంగా జీవించాలని, కలలను సాకారం చేసుకోవాలని అనుకుంటారు. ఇంత పెద్ద దేశాన్ని ఎవరు నడిపించాలన్నది వారు నిర్ణయిస్తారు. మహాకూటమి పూర్తి దేశానికి ప్రాతినిధ్యం వహించడం లేదు. మమతా, అఖిలేష్‌, మాయావతి, చంద్రబాబు దేశ ముఖచిత్రాన్ని మార్చేయలేరు. వీరంతా విభిన్న పార్టీలకు చెందినవారు కావడంతో ప్రజలకు ఇప్పటి నుంచే అనుమానాలు మొదలయ్యాయి. ఇప్పుడే పరస్పరం పోటీపడుతున్న వారు మున్ముందు ఎలా ఒక్కటవుతారన్న ప్రశ్న ప్రజల మదిలో ఉదయిస్తోంది.

మైనారిటీల భద్రతలో భారత్‌ ఆదర్శం 

దేశంలోని ఒక వర్గం తమ మనుగడ కోసం, స్వార్థంతో తప్పుడు ఎజెండా రూపొందిస్తోంది. దీనివల్ల వారికి రాజకీయ ప్రయోజనం దక్కినా, దక్కకపోయినా దేశంలో ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను అది కమ్మేస్తోంది.  కాంగ్రెస్‌ హయాంలోనే అల్లర్లు అధికంగా జరిగాయి. వారి హయాంలోనే సిక్కుల ఊచకోత జరిగింది. ఇప్పుడు దేశంలో అందరికీ అనుకూల వాతావరణం ఉంది. 

కాంగ్రెస్‌ అలా ఎందుకు కోరింది?

రామమందిరం గురించి కోర్టుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అబద్ధాలు చెప్పేవి. రాముడు కాల్పనికమని చెప్పాయి. మా మేనిఫెస్టోలో చెప్పినట్లే ప్రభుత్వం తరఫున పూర్తిస్థాయి వాదనను కోర్టుముందుంచాం. తీర్పు కోసం ఎదురు చూస్తున్నాం.  2019 ఎన్నికలు పూర్తయ్యేవరకూ ఈ సమస్యను పరిష్కరించకూడదని కాంగ్రెస్‌ పార్టీ కోర్టును ఎందుకు కోరింది? వీరు రామజన్మభూమి అంశాన్ని ఎందుకు రాజకీయం చేశారు? న్యాయవ్యవస్థపై రాజకీయపరమైన ఒత్తిడి ఎందుకు తీసుకొచ్చారన్న దానిపై చర్చ జరగాలి.

సంస్కరించు.. మార్పు చూపించు

మా ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం వచ్చింది. మన్మోహన్‌సింగ్‌ హయాంలో పాలకుల నోటి నుంచి కేవలం ‘నరేగా నరేగా’ (జాతీయ ఉపాధి హామీ పథకం) అన్న మాటే వినిపించేది. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగానూ పనిచేసిన అనుభవం నాకు ఉంది. బహుముఖ కోణాల్లో, విభిన్న నిర్ణయాలు తీసుకోవడం నాకు అలవాటు. దేశాన్ని ముందుకు నడిపించాలంటే అన్ని సమస్యలనూ, కొత్త తరహాలో పరిష్కరించాలి. అదికూడా నిర్దుష్ట గడువులోగా పూర్తిచేసే దిశగా ముందుకు వెళ్లాలి. మా హయాంలో జరిగిన పనులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రతిదీ పెద్ద అంశమే. ప్రజల జీవితంలో మార్పుతెచ్చేదే. సంస్కరించు...(రిఫామ్‌), పనితీరు కనబరుచు...(పెర్ఫామ్‌), మార్పు చూపించు (ట్రాన్స్‌ఫామ్‌) అన్నదే నా మంత్రం.

ఐదేళ్లలో అత్యంత సంతోషం కలిగించిన విషయం

ప్రభుత్వ పనితీరును తెలుసుకోవాలంటే 2014కి ముందునాటి పరిస్థితులను గమనించాలి. అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర నిరాశలు అలుముకున్నాయి. అంతటా నిరాశావాదం వినిపించేది. అవినీతి పతాక శీర్షికల్లో కనిపించేది. విధానపరమైన ప్రతిష్టంభన ఉండేది. ఈ రోజు ప్రతి ఒక్కరి గుండెల నిండా ఆశ, నమ్మకం, విశ్వాసం నిండి ఉన్నాయి. ఏ మారుమూలకెళ్లి చూసినా ఇదే కనిపిస్తుంది. మేం తెచ్చిన గొప్ప మార్పు ఇది. ఇలాంటి మార్పు ఎవరికైనా సంతోషాన్నిస్తుంది.

సమాచార మాధ్యమాలు మారిపోయాయి

ప్రజలను మభ్యపెట్టే పరిస్థితి ఇప్పుడు లేదు. సమాచార మాధ్యమాలు పెరిగిపోయాయి. ప్రజల వద్దకు సత్యం చాలా వేగంగా చేరుతోంది. తన వద్దకు వచ్చిన వాటిలో ఏది నిజమన్నది ప్రజలే బేరీజు వేసుకోగలుగుతున్నారు. ఇదివరకటిలా విశ్లేషణ చేసుకుంటూపోతే తప్పులో కాలేస్తాం. గతం కంటే దేశంలో రహదారుల నిర్మాణం వేగంగా జరుగుతున్నప్పుడు ఉపాధి కల్పన లేదని ఎలా చెప్పగలుగుతారు? ఎన్నడూ లేనంత భారీస్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు దేశంలోకి వచ్చినప్పుడు కచ్చితంగా ఉపాధి లభిస్తూ ఉంటుంది. డాక్టరు, ఇంజినీరు, చార్టర్డ్‌ అకౌంటెంట్‌ లాంటి వృత్తి నిపుణులు గత అయిదేళ్లలో కొత్తగా ఆరు లక్షల మంది వచ్చారు. వీరంతా తమ వృత్తివ్యాపారాలు మొదలుపెట్టినప్పుడు ఒకరిద్దరికైనా ఉద్యోగాలివ్వడం సహజం. ముద్రా యోజన కింద 17 కోట్ల మందికి రుణాలిచ్చాం. వీటన్నింటినీ లెక్కిస్తే ప్రతిపక్షాల ఆరోపణలన్నీ పూర్తి అసత్యమని స్పష్టంగా తేలిపోతుంది.

తెలుగు రాష్ట్రాల గురించి..

విభజన సమస్యల పరిష్కారం కోసమే గవర్నర్‌ కొనసాగింపు

వాజ్‌పేయీ హయాంలో మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పాటుచేశారు. వాటి విషయంలో ఎలాంటి వివాదం రాలేదు. కానీ ఆంధ్రప్రదేశ్‌ విభజనలో మాత్రం కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ స్వార్థం కారణంగానే సమస్యలు వచ్చాయి. ఎన్నికల్లో గెలుపొందాలనే కాంగ్రెస్‌ హడావుడిగా విభజన ప్రక్రియ చేపట్టింది. అలాకాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను, పార్టీలను విశ్వాసంలోకి తీసుకొని అందరినీ ఒకచోట కూర్చోబెట్టి, ఒక్కో అంశంపై సంపూర్ణంగా చర్చించి ఉంటే ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌ తరహాలోనే ఎలాంటి వివాదాలు లేకుండా ముందుకెళ్లే పరిస్థితి ఉండేది. ఇప్పుడు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకరికొకరు ఎదురుపడటానికి ఇష్టం లేని వాతావరణాన్ని సృష్టించారు. అధికారులు కూడా ఒకరినొకరు చూసుకోలేని పరిస్థితి ఉంది. ఇద్దరినీ కలిపి సమస్యలు పరిష్కరించాలని నేను ఎంతో ప్రయత్నం చేశాను. సమావేశాలు ఏర్పాటుచేసి సమస్యలు పరిష్కరించాలని గవర్నర్‌కూ పొడిగింపు (ఎక్స్‌టెన్షన్‌) ఇచ్చాం. ఒకవైపు రాజకీయ ఎజెండాతో చంద్రబాబు వెళ్తున్నారు. అయినప్పటికీ ఏపీ, తెలంగాణల అభివృద్ధికి పూర్తిస్థాయిలో కంకణబద్ధులమై ఉన్నాం. అక్కడి రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారనే దానితో సంబంధం లేకుండా ప్రజల హితం కోసం అన్ని చర్యలూ తీసుకుంటాం. 
రాజకీయ ప్రయోజనం కోసం బాబు మాట మార్చారు 
ఆంధ్రప్రదేశ్‌కు మేం ప్రకటించిన ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభలో  అంగీకరించారు. అనంతరం రాజకీయ ప్రయోజనం కోసం మాట మార్చారు. 
రమణ్‌సింగ్‌ నుంచి చంద్రబాబు నేర్చుకోవాలి 
పోలవరం ప్రాజెక్టును పూర్తిగా కేంద్రమే చేపడుతుంది. పూర్తి డబ్బులు ఇస్తుంది. అక్కడి ప్రభుత్వం ఆ ప్రాజెక్టును ఏటీఎంగా మార్చుకోవడం దురదృష్టకరం. ప్రాజెక్టును త్వరగా పూర్తిచేయడానికి బదులు సాగదీయడంపైనే వారికి ఆసక్తి ఎక్కువగా ఉంది. ఏవైనా నిధులు పెండింగ్‌ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం రుజువులు ఇచ్చిన వెంటనే కేంద్రం నిధులు ఇస్తుంది. అలా చేయడం కేంద్రం బాధ్యత. నేను గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చిన వెంటనే మిగతా నిధులు వచ్చేవి. అమరావతి విషయంలో ఎన్ని వాగ్దానాలు చేశామో అన్నీ పూర్తిచేస్తున్నాం. ఛత్తీస్‌గఢ్‌ రాజధాని నయా రాయ్‌పూర్‌ ఎలా నిర్మితమైందో, దాని నమూనా ఎలా ఉందో మీడియా వెళ్లి ఒకసారి అధ్యయనం చేయాలి. నయా రాయ్‌పూర్‌ నిర్మాణంలో రమణ్‌సింగ్‌ వ్యవహరించిన తీరు నుంచి    చంద్రబాబు నేర్చుకోవాలి. 
కాళేశ్వరానికి జాతీయ హోదాపై.. 
కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చే ఇలాంటి వినతులపై పూర్తిస్థాయిలో అధ్యయనం 
చేసి, ఆలోచించి ముందుకెళ్తాం.

వైకాపా, తెరాసల మద్దతుపై...

మాకు గతం కంటే ఎక్కువ సీట్లు లభిస్తాయి. పూర్తిస్థాయి మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ ఏకాభిప్రాయంతో దేశాన్ని ముందుకు  నడిపించాలన్నదే మా అభిమతం. ఈఆలోచనతోనే ఏ పార్టీ  వచ్చినా, అందరినీ కలుపుకొని ముందుకెళ్తాం. దేశంలో ఒక్క ఎంపీ ఉన్న పార్టీని కూడా కలుపుకొని వెళ్లడానికి   ప్రయత్నిస్తాం.

రైతులు నిజం తెలుసుకుంటున్నారు

దేశంలో వేర్వేరు చోట్ల రైతుల ఆందోళనలు జరిగాయన్నది నిజం. వాస్తవాలు తెలియగానే వారికి విశ్వాసం కలిగింది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి వ్యవసాయానికి అనుబంధ రంగాలను ప్రోత్సహించాలని నిర్ణయించాం. అన్నదాతను సౌర విద్యుత్తుతో అనుసంధానించి ఇంధన శక్తి ప్రదాతను చేస్తాం. కోళ్లు, చేపలు, పశువుల పెంపకందారులకు మద్దతిస్తాం. వీటన్నింటి కోసం మేం సమగ్ర విధానంతో ముందుకు వెళుతున్నాం.

పెద్దనోట్ల రద్దుతో ఎంతో మేలు

పెద్దనోట్ల రద్దు మాట ఇందిరాగాంధీ హయాంలో కూడా వచ్చినా ఆమె భయపడిపోయారు. ఆర్థికంగా అది సరైనదిగా కనిపించినా రాజకీయంగా దుస్సాహసం అవుతుందని, ఎన్నికల్లో ఎప్పటికీ గెలవలేమని ఆమె భావించారు. అందువల్లే అప్పట్లో ఆ పని చేయలేకపోయారు. చేసి ఉంటే రుగ్మతలు ఇంతలా వ్యాపించి ఉండేవి కావు. మన్మోహన్‌ సర్కారు హయాంలో అధికారుల మంచాల కింద నోట్ల కట్టలు దొరికేవి. అలాంటివాటిని నిర్మూలించడానికే మేం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నాం. దానివల్ల చాలా మేలు జరిగింది. రహస్య అరల్లో దాగిన రూ.లక్షల కోట్లు బయటకు తీయాల్సి వచ్చింది. 3 లక్షల సూట్‌కేసు కంపెనీల బాగోతం బయటపడింది.

రఫేల్‌పై అబద్ధాలను మీడియానే ఆపాలి

రఫేల్‌పై న్యాయస్థానంలో పూర్తిస్థాయి విచారణ జరిగింది. పార్లమెంటులో చర్చ సందర్భంగానూ దీనికి సంబంధించిన వివరాలన్నీ వెల్లడించాం. అదే విషయం కాగ్‌కూ, సుప్రీం కోర్టుకూ చెప్పాం. ప్రతిచోటా మాకు క్లీన్‌చిట్‌ లభించింది. అయినప్పటికీ కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం అబద్ధాలు చెబుతూనే వస్తున్నారు. దీనిపై మీడియా కూడా ఆలోచించాలి. ఎలాంటి ఆధారాల్లేని ఈ అంశాన్ని ఎందుకు సాగదీస్తున్నారు? దీనిపై నీళ్లు ఎందుకు చల్లడంలేదు? గత ఏడాది కాలంలో పత్రికలు, టీవీలను చూడండి. పూర్తి సాక్ష్యాధారాలు లభించి, వ్యక్తులు జైలుకెళ్లిన అగస్టా హెలికాప్టర్ల కుంభకోణానికి ఎంత ప్రాధాన్యం ఇచ్చారో, రఫేల్‌కు ఎంత కేటాయించారో తెలుస్తుంది. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు బెయిల్‌పై తిరుగుతున్నారు. ఈ కేసులో ప్రభుత్వం చెబుతున్నది నిజం అని కోర్టులో ప్రతిసారీ తేలింది. అలాంటి అంశానికి మీడియా ఎంత ప్రాధాన్యమిచ్చింది? వీళ్లు బెయిల్‌పై ఎందుకున్నారు? అన్న చిన్నవార్తను కూడా ఎందుకు ఇవ్వడం లేదని మీడియాను అడుగుతున్నాను.

సీబీఐ దుర్వినియోగానికి నేనే బాధితుడిని

రాజ్యాంగ వ్యవస్థల ధ్వంసం గురించి ఆరోపణలు చేసేవారు ముందు తమ గురించి తాము తెలుసుకోవాలి. కాంగ్రెస్‌ ఎజెండాను ముందుకు తీసుకెళ్లడానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనుమతించకపోతే ఆయనకు వ్యతిరేకంగా అభిశంసన తీర్మానం పెట్టడం, ఎన్నికలలో ఓడిపోతే ఎన్నికల సంఘాన్ని, ఈవీఎంలను తిట్టడం మీరు చూశారు. తమ ప్రయోజనాలకు గొడుగు పట్టకపోతే వారు వ్యవస్థలపై దుమ్మెత్తిపోస్తారు. మేం మాత్రం వ్యవస్థలను బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నాం. సీబీఐలో ఏదో జరుగుతున్నట్లు తెలియగానే కమిటీ  సమావేశం ఏర్పాటుచేసి కొత్త డైరెక్టర్‌ను నియమించాం. గత ప్రభుత్వ హయాంలో జరిగిన సీబీఐ దుర్వినియోగానికి నేనే ప్రత్యక్ష బాధితుడిని. నాకు వ్యతిరేకంగా న్యాయవ్యవస్థను ఎలా దుర్వినియోగం చేశారో తెలుసు. అందులోనూ నేనే బాధితుడిని. అందుకే వ్యవస్థలన్నీ స్వతంత్రంగా నడవాలని మేం కోరుకుంటున్నాం. అదే దిశలో ముందుకెళ్తున్నాం.

ఆర్థిక నేరగాళ్లను వెనక్కు రప్పించి తీరుతాం

గత 70 ఏళ్లలో కాంగ్రెస్‌ హయాంలో ఎంతమంది ఆర్థిక నేరగాళ్లు దేశం నుంచి పారిపోయారు? వారిని రప్పించడానికి ఏం చేశారన్న వివరాలను మీడియా బయటకు తీయాలి. పారిపోయిన వాళ్ల కోసం కాంగ్రెస్‌ పార్టీ గీతాలు ఆలపిస్తూ చేతిలో పతాకం పట్టుకొని పరుగులు తీస్తోంది. కానీ మా ప్రభుత్వం మిషెల్‌, సక్సేనా, తల్వార్‌ లాంటి ఆర్థిక నేరగాళ్లను విదేశాల నుంచి పట్టుకొచ్చిందన్న విషయాన్ని ఎందుకు గుర్తుచేయరు? చట్టబద్ధమైన మార్గాలన్నింటినీ ఉపయోగించుకొని నేరగాళ్లను తిరిగి రప్పించడానికి మేం కంకణబద్ధులమై ఉన్నాం.

ఇదే నా లక్ష్యం..

దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడం, ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించడం, వారి అభివృద్ధి కోసం అవకాశాలు సృష్టించడమే నా ఏకైక ప్రాధమ్యం.

ఔను.. కాపలాదారుడినే

నేనో కాపలాదారుగా ఉంటానని 2014 ఎన్నికల ప్రచారంలో చెప్పాను. నాకు దేశ కాపలాదారు పని ఇప్పించండి, దేశ ఖజానాపై ఎవరి చేయి పడకుండా చూస్తానని ఆనాడే వాగ్దానం చేశాను.
మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఎందుకు తేలేకపోయామంటే.. 
దీనికి 2/3 వంతు మెజారిటీ కావాలి. ఇప్పటికీ ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం. దానికి కట్టుబడి ఉన్నాం.
ఉగ్రవాదులు ఎక్కడున్నా తుదముట్టిస్తాం 
ఉగ్రవాదాన్ని పూర్తి స్థాయిలో నాశనం చేయాలన్న కృత నిశ్చయంతో ఉన్నాం. ఉగ్రవాదులకు పాలు, నీళ్లు, తిండి దొరుకుతుంటే వారు ఎలా అంతరించిపోతారు? ఉగ్రవాదులకు నష్టం కలిగించేందుకు ఎక్కడెక్కడ ఏమేం చేయాలో అన్నీ చేస్తాం.
జాతీయ భద్రత..ఎన్నికల కోసం కాదు 
జాతీయ భద్రతను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం లేదు. 
దేశ హితం కోసమే చేస్తున్నాం.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.