close

ప్ర‌త్యేక క‌థ‌నం

దేవభూమి... సందడి లేమి

ఉత్తరాఖండ్‌లో నిశ్శబ్ద పోరు
సిట్టింగ్‌ స్థానాలపై కన్నేసిన భాజపా
ప్రచారార్భాటం లేకుండానే పోరాటం
జాతీయ అంశాలకే ఓటర్ల పెద్దపీట
కూచిభట్ల సూర్యప్రకాశ్‌
దేహ్రాదూన్‌ నుంచి ‘ఈనాడు’ ప్రతినిధి

అదరగొట్టే ప్రచారార్భాటాలు ఉండవు. మైకులు కట్టుకుని తిరిగే వాహనాలు అసలే కనిపించవు. బహిరంగ సభలకు తరలింపులు చాలా తక్కువ. ఓటర్లలో కొందరు తమ అభ్యర్థుల మొహాలూ చూసి ఉండరు. కొత్తగా వెళ్లి చూసేవారికి అసలు అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయా అనిపిస్తుంది. ఇదీ దేవభూమిగా పేరొందిన ఉత్తరాఖండ్‌లో తాజా పరిస్థితి. తొలి దశలో... ఈ నెల 11న ఇక్కడి అయిదు లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రంలో సైనిక కుటుంబాలు ఎక్కువగా ఉండడం వల్లనేమో ఓటర్లలో ఎక్కువమంది జాతీయ అంశాలకే ప్రాధాన్యమిస్తున్నారు. స్థానిక సమస్యలకు ఈ ఎన్నికలతో సంబంధమే లేదన్నట్లుగా వారు చెబుతున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ‘ఈనాడు’ ప్రతినిధి పర్యటించినప్పుడు ఈ అనుభవాలు ఎదురయ్యాయి. ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీలు ఈ రాష్ట్రంలో తమ పార్టీల తరఫున ప్రచారం నిర్వహించారు. దేశ భద్రత, ఉపాధి అవకాశాలు, కాంగ్రెస్‌ అవినీతిలపై భాజపా విమర్శలు చేస్తుంటే... నోట్లరద్దు, జీఎస్టీ, రఫేల్‌ కుంభకోణంపై కాంగ్రెస్‌ ఎదురుదాడి చేస్తోంది. తొమ్మిది ప్రాంతీయ పార్టీలున్నా వాటి ఉనికి నామమాత్రం. భాజపా-కాంగ్రెస్‌ మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. ఐదు సిట్టింగ్‌ స్థానాలనూ నిలబెట్టుకోవాలని భాజపా, కనీసం రెండు స్థానాల్లోనైనా గెలుపొందాలని కాంగ్రెస్‌ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఆప్‌ ఈసారి బరిలో లేదు. ఉద్దండులైన బీసీ ఖండూరీ, భగత్‌సింగ్‌ కోషియారిలను భాజపా ఈ ఎన్నికలకు దూరంగా ఉంచింది.

ఆహ్లాదం + ఆధ్యాత్మికత
ఆహ్లాదకరమైన వాతావరణం, అంతకు మించి ఆధ్యాత్మికత... సాక్షాత్తూ దేవతలు నడయాడిన ప్రాంతంగా చెప్పుకొనే ఉత్తరాఖండ్‌ నిత్యం పర్యాటకులతో అలరారుతోంది. గంగోత్రి, యుమునోత్రి, కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌ పుణ్యక్షేత్రాలతో పాటు ధనౌల్టి, మసూరీ వంటి ఆహ్లాదకర ప్రాంతాలకు ప్రసిద్ధి. రాష్ట్రానికి ఓ పక్క నేపాల్‌.. మరోపక్క చైనా సరిహద్దులు. రాష్ట్రం ఆవిర్భవించాక ఇప్పటివరకు నాలుగుసార్లు అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్‌, భాజపా రెండేసి సార్లు విజయం సాధించాయి. ఏ పార్టీ వరసగా రెండోసారి ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. 2002, 2007, 2012 ఎన్నికల్లో కాంగ్రెస్‌-భాజపాల మధ్య ఓట్ల శాతంలో అంతరం తక్కువైనప్పటికీ 2017కి వచ్చేసరికి 10 శాతానికి పెరిగింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఐదు లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకొన్న భాజపా 2017 అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే ఊపు కొనసాగించింది. రాజధానిని మార్చాలన్న డిమాండ్ల నేపథ్యంలో ప్రస్తుతం గైర్‌సైణ్‌లో శాసనసభ నిర్మాణం సాగుతోంది. 2011 లెక్కల ప్రకారం వలసల వల్ల రాష్ట్రంలోని 1034 గ్రామాలు ఖాళీ అవ్వగా 2018కి ఆ సంఖ్య 1768కి పెరిగింది.

అభ్యర్థి ఎలా ఉంటారో తెలియదు
కుమాన్‌ డివిజన్‌లో చాలా గ్రామాలు పర్వత ప్రాంతంలో విసిరేసినట్లుంటాయి. ఈ ప్రాంతాలకు వెళ్లడానికి రహదారులు కూడా సరిగా లేవు. సముద్ర మట్టానికి సుమారు 3000 మీటర్ల ఎత్తులో ఉండే ఈ గ్రామాలకు ఇప్పటివరకు రాజకీయ నాయకులెవరూ ఓట్ల కోసం రాలేదు. మోదీ, రాహుల్‌ వంటి అగ్రనేతలు వచ్చినప్పుడు తప్పిస్తే మిగిలిన సందర్భాల్లో రాష్ట్రంలో ఎక్కడా రాజకీయ సందడే కనిపించడం లేదు. ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయడం, పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసి అక్కడ హడావుడి చేయడం వంటివీ చాలా తక్కువ. డబ్బులిచ్చి జనాన్ని తరలించడం గురించి చాలా ప్రాంతాల్లో తెలియదు. కొండకోనల్లో ఉన్నవారి కోసం మాత్రం జీపుల్ని పంపిస్తుంటారు. కొన్ని నియోజకవర్గాలు సుమారు 300 కి.మీ. పొడవు వరకు విస్తరించడంతో అన్ని ప్రాంతాల్లో ప్రచారం చేయడమూ కష్టమే.

కాంగ్రెస్‌ నినాదం: ఖండూరి హై జరూరి
వయోభారం, అనారోగ్య కారణాలతో పౌరి గఢ్‌వాల్‌ సిట్టింగ్‌ ఎంపీ, మాజీ ముఖ్యమంత్రి బీసీ ఖండూరీ (భాజపా) ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఖండూరీ తనయుడు మనీశ్‌ కాంగ్రెస్‌ నుంచి బరిలో ఉండడం విశేషం. గత ఎన్నికల్లో బీసీ ఖండూరీ నినాదమైన ‘ఖండూరీ హై జరూరి’ ఇప్పుడు కాంగ్రెస్‌ నినాదమైంది! ఖండూరీ కుమార్తె రీతు ప్రాతినిధ్యం వహిస్తున్న యమకేశ్వర్‌ అసెంబ్లీ నియోజకవర్గం కూడా పౌరి గఢ్‌వాల్‌ పరిధిలోనిదే. దీంతో రాష్ట్రమంతా ఈ నియోజకవర్గంపై ఆసక్తి చూపిస్తోంది. కొన్నాళ్లుగా బీసీ ఖండూరీ ఫోన్‌కి అందుబాటులో లేకపోవడం భాజపా నేతలను కలవర పరుస్తోంది. మాజీ సీఎం హరీశ్‌ రావత్‌ పోటీ చేస్తున్న ఈ నియోజకవర్గాన్ని కాంగ్రెస్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. 2017 శాసనసభ ఎన్నికల్లో హరీశ్‌ రావత్‌ (కాంగ్రెస్‌), అజయ్‌భట్‌ (భాజపా) ఓటమి చెందినా ప్రస్తుతం ఇద్దరూ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 1984 నుంచి గోసంరక్షణ కోసం పోరాడుతున్న గోపాలమణి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.

ఓటింగ్‌ పెంపుపై దృష్టి
గత కొన్ని ఎన్నికల నుంచి ఓటింగ్‌ శాతం తగ్గుతూ రావడంతో దానిని పెంచేందుకు ప్రభుత్వ యంత్రాంగంతో పాటు సామాజిక సంస్థలూ రంగంలో దిగాయి. ఓటర్లలో అవగాహన పెంచుతున్నాయి. రుద్రప్రయాగ్‌ జిల్లా యంత్రాంగం ఓ ప్రత్యేక బారాత్‌ బృందాన్ని ఏర్పాటు చేసింది. ‘ప్రజాస్వామ్య ఊరేగింపు’ పేరుతో నృత్యాలు ఏర్పాటు చేస్తోంది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.