close

ప్ర‌త్యేక క‌థ‌నం

అమరావతి దిక్పాలకులెవరు?

గుంటూరు జిల్లాలో హోరాహోరీ పోరు
బరిలో ఉద్దండులు.. స్థితిమంతులు
గుంటూరు  జిల్లా క్షేత్ర పరిశీలన కథనం
మంగమూరి శ్రీనివాస్‌, పెమ్మసాని బాపనయ్య
గుంటూరు జిల్లా నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధులు

 

ధరణికోట, కొండవీడు..
వంటి చారిత్రక రాజధానులకు నిలయం.
ఆచార్య నాగార్జునుడు నడయాడిన నేల.
నలుగురు ముఖ్యమంత్రులు..
నలుగురు అసెంబ్లీ స్పీకర్లను అందించిన ఖిల్లా
గుంటూరు జిల్లా

పల్నాటి పౌరుషం
మిర్చి ఘాటు..
రంగరించినట్లు ఉంటాయి
ఇక్కడ రాజకీయాలు..

ఎన్నికల వేళ..
రాజధాని అంతర్భాగమైన జిల్లాలో
యుద్ధ వాతావరణం కనిపిస్తోందంటే
అతిశయోక్తి కాదు!
ఇక్కడ బరిలో ఉన్నవారూ
సామాన్యులు కారు..
రాజకీయ ఉద్దండులు,
వ్యాపారులు, పారిశ్రామికవేత్తల
బల ప్రదర్శనలతో జిల్లా రాజకీయాలు
అతి రసవత్తరంగా మారాయి..

ఈ సారి అధిక సీట్లు పొందేందుకు రెండు పార్టీలూ గట్టిగా పోరాడుతున్నాయి.
ఈ పరిస్థితిలో ఎన్నికల ముందు ఓటర్ల మనోగతం తెలుసుకునేందుకు
‘ఈనాడు’ ప్రతినిధులు జిల్లా వ్యాప్తంగా పర్యటించి అందిస్తున్న ప్రత్యేక కథనం ఇదీ..

ఎవరు గెలిచినా తక్కువ మెజారిటీతోనేనని
క్షేత్రస్థాయి పరిస్థితులు చెబుతున్నాయి.
సంక్షేమ పథకాలు ఓట్లు కురిపిస్తాయని తెదేపా ఆశాభావంతో ఉంది.
మంత్రి నారా లోకేశ్‌ మంగళగిరి నుంచి బరిలో దిగడం రాజకీయ వేడిని పెంచింది.
సభాపతి కోడెల, మంత్రులు పుల్లారావు, నక్కా ఆనందబాబు, మాజీ స్పీకర్‌
నాదెండ్ల మనోహర్‌.. ఇంకా పలువురు ప్రముఖులు ఇక్కడ బరిలో ఉన్నారు.

రాష్ట్రంలో తూర్పుగోదావరి తర్వాత అత్యధిక అసెంబ్లీ స్థానాలున్న జిల్లా ఇది

* నియోజకవర్గాలు: 17
* జిల్లాలో అత్యధిక మెజారిటీ: 21,407 (వినుకొండ)
* అత్యల్పం: 12 (మంగళగిరి)

గత ఎన్నికల్లో తెదేపాకు: 12

(వినుకొండ, గురజాల, చిలకలూరిపేట, సత్తెనపల్లి, పెదకూరపాడు, గుంటూరు పశ్చిమ, తాడికొండ, తెనాలి, పొన్నూరు, వేమూరు, ప్రత్తిపాడు, రేపల్లె)

వైకాపా: 5

(నరసరావుపేట, మాచర్ల, మంగళగిరి, గుంటూరు తూర్పు, బాపట్ల)

జన వాక్కు

* కొత్త పార్టీ అధికారంలోకి వస్తే ఎక్కడ ఏముందో దేవులాడుకోవడానికే రెండేళ్లు పడుతుంది. ఈసారి చంద్రబాబుకే ఓటేస్తాం.

-వెంకయ్య, కారంపూడి

* రాష్ట్రం అప్పుల్లో ఉన్నా వృద్ధాప్య పింఛను రూ.2 వేలు ఇస్తున్నారు.
ఇంతకంటే ఎవరు చేస్తారు? చంద్రబాబు మారితే రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కిపోతుంది.

-మాచర్ల నియోజకవర్గం దుర్గిలో ఓ వృద్ధుడు

* పసుపు-కుంకుమ లబ్ధిదారులు చంద్రబాబుకు ఓటేయకుంటే.. మోసం చేయడమే అవుతుంది.

-పెదకూరపాడు మండలం, 75 తాళ్లూరు గ్రామ రైతు

* కష్టాలెదురైనా చంద్రబాబు కష్టపడి అభివృద్ధి చేశారు. తెదేపాకే ఓటు వేయాలని ఉంది.

-రైతు గరికపాటి కోటేశ్వరరావు, అబ్బినేని గుంటపాలెం, ప్రత్తిపాడు నియోజకవర్గం

చిలకలూరిపేట.. ఎవరిదో వేట
తెదేపా: ప్రత్తిపాటి పుల్లారావు
వైకాపా: విడదల రజని

రాష్ట్ర మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హ్యాట్రిక్‌ విజయం సాధించాలని పట్టుదలతో ఉన్నారు. ఆర్థికంగా పుల్లారావుకు దీటైన అభ్యర్థి కోసం వెతికిన వైకాపా రజనికి టికెట్‌ ఇచ్చింది. పుల్లారావు చేసిన అభివృద్ధి విషయంలో సంతృప్తి వ్యక్తమవుతోంది. నియోజకవర్గానికి అత్యధిక నిధులు సాధించిన వారిలో పుల్లారావు ఒకరని పేరుంది. పట్టణ పేదల కోసం నియోజకవర్గానికి 6,500 ఇళ్లు మంజూరు చేయించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు తమకు కలిసి వస్తాయని తెదేపా భావిస్తోంది. బలమైన సామాజిక వర్గం పార్టీకి అండగా ఉంది. వైకాపా నేత రాజశేఖర్‌కు జగన్‌ మంత్రి పదవి ఇస్తామని బహిరంగంగా ప్రకటించడంతో ఆయన వర్గం రజని గెలుపునకు సహకరిస్తోంది. ఇక్కడ రెండు ప్రధాన పార్టీలు డబ్బు భారీగా ఖర్చు చేసే అవకాశం కనిపిస్తోంది.

వినుకొండ.. ఎవరికి అండ!
తెదేపా: జీవీ ఆంజనేయులు
వైకాపా: బొల్లా బ్రహ్మనాయుడు

తెదేపా జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు హ్యాట్రిక్‌ విజయానికి కృషి చేస్తున్నారు. వైకాపా ఇక్కడ పారిశ్రామికవేత్త బొల్లా బ్రహ్మనాయుడుని పోటీకి నిలిపింది. మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు ఇటీవలే వైకాపాలో చేరడంతో తమ బలం మరింత పెరిగిందని ఆ పార్టీ భావిస్తోంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఆంజనేయులుపై నియోజకవర్గంలో వ్యతిరేకత లేదు. ఎవరు వెళ్లి అడిగినా ఆర్థికంగా ఆదుకుంటారన్న పేరుంది. తెదేపా అధికారంలోకి వస్తే మంత్రి పదవి దక్కుతుందన్న ప్రచారం కలిసొచ్చే అంశం. ఇక్కడ డబ్బుల పంపిణీ గెలుపోటములను ప్రభావితం చేయనుంది. రుణమాఫీ పూర్తి కాలేదన్న అసంతృప్తి రైతుల్లో ఉంది.

మాచర్ల.. పల్నాటి పోరు
తెదేపా: అన్నపురెడ్డి అంజిరెడ్డి 
వైకాపా: పిన్నెల్లి రామకృష్ణారెడ్డి

2009 నుంచి గెలుస్తున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. ప్రజలకు అందుబాటులో ఉంటారన్న పేరు ఉంది. ఆర్థికంగా బలమైన అభ్యర్థి కావాలని భావించిన తెదేపా ఇక్కడ పార్టీ ఇన్‌ఛార్జి కె.చలమారెడ్డి బంధువు అంజిరెడ్డిని ఎంపిక చేసింది. ఆయనకు మాజీ ఎమ్మెల్యేలు కుర్రి పున్నారెడ్డి, లక్ష్మారెడ్డితోపాటు జూలకంటి బ్రహ్మానందరెడ్డి తదితరులు సహకరిస్తున్నారు. నియోజకవర్గం పరిధిలోని కొన్ని మండలాల్లో తన సామాజిక వర్గం ఓటర్లు అధికంగా ఉండటంతో గురజాల అభ్యర్థి యరపతినేని కూడా అంజిరెడ్డిని గెలిపించాలని ప్రచారం చేశారు. ‘2014లో చలమారెడ్డికి చివరి నిమిషంలో టికెట్‌ ఇచ్చారు. ఆయన కేవలం 3,535 ఓట్లతో ఓడిపోయారు. ఈసారి తెదేపా జెండా ఎగరడం ఖాయం’ అని కారంపూడికి చెందిన ఓ యువకుడు అభిప్రాయపడ్డారు.

గురజాల ఎవరికి చిక్కేను?
తెదేపా: యరపతినేని శ్రీనివాసరావు
వైకాపా: కాసు మహేష్‌రెడ్డి

ఇక్కడా హ్యాట్రిక్‌ విజయం కోసం యరపతినేని ఉత్సాహంగా పనిచేస్తున్నారు. అభివృద్ధి పనులతోపాటు నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండటం, సొంత ఖర్చులతో ముస్లిం మైనారిటీలను హజ్‌ యాత్రకు పంపడం, వ్యక్తిగతం పలువురికి ఆర్థిక సహాయం చేయడం ఆయనకు కలిసివచ్చే అంశాలు. తాము తెదేపాకే మద్దతు ఇస్తామని వైశ్యులు పట్టణంలో ర్యాలీ చేశారు. మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి కుమారుడు మహేష్‌రెడ్డిని వైకాపా పోటీలో నిలిపింది. పిడుగురాళ్లలో కీలకంగా ఉన్న వైశ్యులను తన వైపు తిప్పుకొనేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు.

నరసరావుపేటలో వైద్యుల పోరు
తెదేపా: డాక్టర్‌ అరవిందబాబు
వైకాపా: డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

తెదేపా కంచుకోటగా ఉన్న ఈ స్థానం 2004 నుంచి ఆ పార్టీకి అందకుండా పోతోంది. ఈసారి కచ్చితంగా చేజిక్కుంచుకోవాలన్న పట్టుదలతో ఉంది. తెదేపా ఆవిర్భావం తర్వాత మొదటిసారి వ్యూహాత్మకంగా ఇక్కడ బీసీని బరిలో నిలిపింది. గతంలో కోడెలతో విభేదాల కారణంగా పార్టీకి దూరమైన నేతలు కొందరు మళ్లీ పార్టీలో చేరారు. అభ్యర్థి కొత్త కావడం, సౌమ్యుడన్న పేరు ఉండటంతోపాటు సంక్షేమ పథకాలు కలిసి వస్తాయని తెదేపా ఆశాభావంతో ఉంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డిపై ఆరోపణలు, వ్యతిరేకత లేకపోవడం కలిసొచ్చే అంశాలు. ఇక్కడ అభ్యర్థులిద్దరూ వైద్యులే కావడం గమనార్హం.

రేపల్లె గోపాలుడు ఎవరు?
తెదేపా: ఎ.సత్యప్రసాద్‌ 
వైకాపా: మోపిదేవి వెంకటరమణ

రేపల్లెను నిలబెట్టుకోవాలని తెదేపా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. వైకాపా అభ్యర్థి.. మాజీ మంత్రి మోపిదేవికి మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జున్‌ మద్దతిస్తున్నారు. జనసేన టికెట్‌ ఆశించి భంగపడిన దేవినేని ఆ పార్టీ వర్గాలను సైతం వైకాపాకు మద్దతివ్వాలని కోరుతున్నారు. తెదేపా అభివృద్ధి పనులు, పసుపు-కుంకుమ, అన్నదాతా సుఖీభవ  పథకాలు బాగున్నాయని రేపల్లె చెందిన చంద్రశేఖర్‌ చెప్పారు.

సత్తెనపల్లిలో పాత ప్రత్యర్థుల పోరు
తెదేపా: కోడెల శివప్రసాదరావు 
వైకాపా: అంబటి రాంబాబు

పాత ప్రత్యర్థులు కోడెల, అంబటి మళ్లీ తలపడుతున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనుల విషయంలో ఓటర్లలో సంతృప్తి వ్యక్తమవుతోంది. గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్న కోడెల.. గతంలో తనకు దూరమైన గ్రామ, మండల స్థాయి నేతలను స్వయంగా కలిసి వారిని ప్రసన్నం చేసుకున్నారు. ‘కోడెల చేసిన అభివృద్ధికి ఇంట్లో కూర్చున్నా గెలవాలి’ అన్న అభిప్రాయం నియోజకవర్గంలో వినిపిస్తోంది. వైకాపా అభ్యర్థి రాంబాబు తనను 2014లో 924 ఓట్లతో ఓడించారని, ఈసారి గెలిపించాలని కోరుతున్నారు.గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వెంకటేశ్వరరెడ్డి ఈ దఫా జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయనకు కొన్ని గ్రామాల్లో సొంత ఓటు బ్యాంకు ఉంది. ఆయన వైకాపా ఓట్లు చీలుస్తారని అంచనా.

గుంటూరు పశ్చిమ.. గిరి × చంద్రగిరి
తెదేపా: మద్దాలి గిరిధరరావు
వైకాపా: చంద్రగిరి ఏసురత్నం
జనసేన: తోట చంద్రశేఖర్‌

ఇక్కడ ముక్కోణపు పోటీ నెలకొంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి వైకాపాలోకి వెళ్లడంతో.. తెదేపా వైశ్య సామాజిక వర్గానికి చెందిన మద్దాలి గిరిధరరావును బరిలో నిలిపింది. తెదేపాకు మొదటి నుంచి అండగా నిలిచే ఓ బలమైన సామాజికవర్గం ఓటర్లు అధికంగా ఉండటంతోపాటు వైశ్య సామాజిక వర్గం ఓటర్లు, సంక్షేమ పథకాలు విజయాన్ని అందిస్తాయని తెదేపా భావిస్తోంది. అధికంగా ఉన్న బ్రాహ్మణ సామాజికవర్గం ఓటర్లు సైతం తమ వైపు మొగ్గు చూపుతారని ఆ పార్టీ విశ్వసిస్తోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ డీఐజీ ఏసురత్నం కొద్దినెలల క్రితమే వైకాపాలో చేరి టికెట్‌ సాధించారు. వైకాపా ఓటు బ్యాంకుతో పాటు ప్రభుత్వ వ్యతిరేకతపై నమ్మకం పెట్టుకున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన జనసేన అభ్యర్థి చంద్రశేఖర్‌ సైతం గట్టి పోటీ ఇస్తున్నారు. ఇక్కడ ఆ వర్గం ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు.

పెదకూరపాడు.. ఎవరిదో జోరు
తెదేపా: కొమ్మాలపాటి శ్రీధర్‌
వైకాపా: నంబూరి శంకర్‌రావు

తెదేపా అభ్యర్థి శ్రీధర్‌ హ్యాట్రిక్‌ కోసం ఉవ్విళ్లూరుతున్నారు. తెదేపాలో కొందరు ద్వితీయ శ్రేణి నాయకుల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేపై కొంత అసంతృప్తి కనిపిస్తోంది. తాను చేసిన అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలే విజయం అందిస్తాయని శ్రీధర్‌ నమ్ముతున్నారు. వైకాపా అభ్యర్థి శంకర్‌రావు కొన్ని నెలలుగా విస్తృతంగా పర్యటిస్తూ వైకాపా నవ రత్నాల గురించి ప్రచారం చేస్తున్నారు. వైకాపా అభ్యర్థులను మారుస్తుండటం.. నియోజకవర్గానికి ఒక నేతంటూ లేకపోవడం ప్రతికూలంగా మారింది.

గుంటూరు తూర్పు.. ఎటు వైపు తీర్పు?
తెదేపా: నసీర్‌ అహ్మద్‌ 
వైకాపా: మహ్మద్‌ ముస్తఫా

రాష్ట్రంలో ముస్లిం మైనారిటీల ప్రాబల్యం అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో గుంటూరు తూర్పు ఒకటి. ముస్తఫా వ్యక్తిగత ప్రాబల్యం, పార్టీ ఓటు బ్యాంకుతో విజయం సాధిస్తామని వైకాపా అంచనా వేస్తోంది. ఇక్కడ ముస్లింల తర్వాత ఆర్యవైశ్యుల ఓట్లు అధికం. ఆ సామాజిక వర్గానికి చెందిన మద్దాలి గిరికి గుంటూరు పశ్చిమ టికెట్‌ ఇచ్చినందున తమకు కలిసివస్తుందని తెదేపా ఆశలు పెట్టుకుంది.

బాపట్ల.. పాత ప్రత్యర్థులే
తెదేపా: అన్నం సతీష్‌ 
వైకాపా: కోన రఘుపతి

బాపట్ల రాజకీయం హోరాహోరీగా ఉంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన అన్నం సతీష్‌.. తెదేపా అభ్యర్థిగా మరోసారి బరిలో ఉన్నారు. ఎమ్మెల్సీ హోదాలో ఆయన బాపట్ల అభివృద్ధికి కృషి చేశారన్న గుర్తింపు ఉంది. ఇక్కడ అత్యధికంగా 58 వేల ఓట్లు ఉన్న ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల మద్దతు కీలకం. వారిని ప్రసన్నం చేసుకునేందుకు అన్ని పార్టీలు యత్నిస్తున్నాయి. చంద్రబాబు పాలన మెరుగ్గా ఉందని, మళ్లీ తెదేపా పాలన వస్తేనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని భావిస్తున్నామని కర్లపాలెం మండలం యాజలి గ్రామానికి చెందిన శివయ్య, రత్నకుమారి దంపతులు చెప్పారు.

మంగళగిరి.. హోరాహోరీ
తెదేపా: నారా లోకేశ్‌ 
వైకాపా: ఆళ్ల రామకృష్ణారెడ్డి

రాష్ట్ర రాజధాని ప్రాంతానికి కలిసి ఉన్న మంగళగిరిలో నెగ్గి చరిత్ర సృష్టించాలని తెదేపా పోరాడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌ బరిలో ఉండడంతో వైకాపా గట్టి పోటీ ఎదుర్కొంటోంది. అధికంగా ఉన్న బీసీ వర్గాల మద్దతు ఇక్కడ కీలకం. తనను గెలిపిస్తే హైటెక్‌ సిటీ మాదిరిగా మంగళగిరిని మారుస్తానని లోకేశ్‌ ఇస్తున్న హామీలపై విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారుల్లో ఆసక్తి వ్యక్తమవుతోంది. తెదేపా గెలిస్తే తమ నియోజకవర్గం రాష్ట్రస్థాయిలో అభివృద్ధిలో ఆదర్శంగా ముందుంటుందని భావిస్తున్నట్లు పెద్ద వడ్లపూడికి చెందిన రైతు రామయ్య చెప్పారు. వైకాపా అధికారంలోకి వస్తే రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి ఇస్తానని, గెలిపించాలని జగన్‌ కోరారు.

పొన్నూరులో ఉద్దండుల పోరు
తెదేపా: ధూళిపాళ్ల నరేంద్ర (సిట్టింగ్‌) 
వైకాపా: కిలారి రోశయ్య

వరుసగా ఐదుసార్లు నెగ్గిన నరేంద్ర.. అభివృద్ధి పనులే మళ్లీ గెలిపిస్తాయనే ధీమాతో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్‌, వైకాపా, జనసేన పార్టీల అభ్యర్థులంతా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. వారి మధ్య ఓట్లు చీలి తెదేపాకు అనుకూలిస్తుందనే అంచనా ఉంది. వైకాపా టికెట్‌ ఆశించి భంగపడిన రావి వెంకటరమణపై ప్రజల్లో సానుభూతి ఉంది. ఆయనకు నష్టం జరిగిందని ఆయన అనుచరులు అసంతృప్తితో ఉన్నారు. ఇవన్నీ తమకు కలిసి వస్తాయని తెదేపా వర్గాలు భావిస్తున్నాయి. గత ఐదేళ్లలో అనేక ఇబ్బందులున్నా చంద్రబాబు రాష్ట్రాభివృద్ధికి కృషి చేసినందున మళ్లీ అండగా ఉంటామని వెల్లటూరు గ్రామానికి చెందిన రైతు రాఘవేంద్ర చెప్పారు.

తెనాలి గాలి ఎటు?
తెదేపా: ఆలపాటి రాజేంద్రప్రసాద్‌
వైకాపా: ఎ.శివకుమార్‌ 
జనసేన: నాదెండ్ల మనోహర్‌

గత ఎన్నికల్లో పోటీ పడిన ఆ ముగ్గురూ మళ్లీ బరిలో ఉన్నారు. మాజీ సభాపతి నాదెండ్ల మనోహర్‌ జనసేన నుంచి పోటీ చేస్తుండడంతో.. ఈ స్థానం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. గతంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రస్తావించి మనోహర్‌ ఓట్లు అడుగుతున్నారు. అయితే 2014లో ఓడిపోయిన తరువాత ఆయన తెనాలికి దూరంగా ఉన్నారని ఓటర్లలో అసంతృప్తి ఉంది. ఎమ్మెల్యే ఆలపాటి పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టారు. రాజధాని ప్రభావంతో తెనాలి ప్రాంతంలో భూముల రేట్లు బాగా పెరిగాయని, అభివృద్ధి బాగా జరుగుతోందని డ్రైవర్‌ అరుణ్‌ తెలిపారు. డ్వాక్రా మహిళల్లో సానుకూలత ఉందని లక్ష్మీ అనే మహిళ చెప్పారు.

తాడికొండ.. ఎవరికి వేస్తుందో దండ?
తెదేపా: టి.శ్రావణ్‌కుమార్‌ 
వైకాపా: ఉండవల్లి శ్రీదేవి

రాష్ట్ర రాజధాని నగరాన్ని ఇక్కడే ఏర్పాటు చేయడంతో స్థానిక రైతులు, ప్రజల్లో తెదేపాపై అభిమానం ఉంది.   సిట్టింగ్‌ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ మరోసారి బరిలో ఉన్నారు. ఇతర పార్టీల అభ్యర్థులంతా తొలిసారి పోటీ చేస్తున్నవారే. ఈ నియోజకవర్గానికి చెందిన ఆరుగురు నేతలను గుంటూరు జిల్లాలో వివిధ స్థానాల్లో వైకాపా నిలిపింది. వారందరి ప్రభావంతో ఇక్కడ పార్టీకి ఓట్లు పడతాయనే ధీమా వైకాపాలో ఉంది. ప్రపంచస్థాయి రాజధాని నగరం నిర్మిస్తున్నందున ఇక్కడి ప్రజల్లో తెదేపాకు ఆదరణ ఉందని తాడికొండకు చెందిన రైతు షబ్బీర్‌ అహ్మద్‌ చెప్పారు. భూముల ధరలు బాగా పెరిగాయని, తమ ఆర్థిక స్థితిగతిని మార్చేసిన తెదేపాకే ఓటు వేస్తామని మందడం గ్రామానికి చెందిన రైతు లావు కోటేశ్వరరావు వివరించారు.

ప్రత్తిపాడు తీర్పు ఎటు?
తెదేపా: డొక్కా మాణిక్య వరప్రసాద్‌
వైకాపా: సుచరిత

గుంటూరు నగర శివారులో కొంత కలిసి ఉన్న ప్రత్తిపాడు నియోజకవర్గంలో నగర ఓటర్ల ప్రభావం అధికం. నియోజకవర్గంలో 2.50 లక్షల ఓట్లుంటే అందులో లక్ష మంది వరకూ గుంటూరు గ్రామీణ మండలానికి చెందినవారే. వీరి మద్దతు జయాపజయాలను నిర్ణయించనుంది. మాజీ మంత్రి డొక్కాపై ప్రజల్లో సదభిప్రాయం ఉంది. గత ఎన్నికల్లో తెదేపా నుంచి నెగ్గిన రావెల కిషోర్‌ ఈసారి జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగారు. వైకాపా అభ్యర్థి సుచరిత 2009లో ఎమ్మెల్యేగా నెగ్గినా నియోజకవర్గ అభివృద్ధికి పెద్దగా ఏం చేయలేదని ప్రత్తిపాడుకు చెందిన వ్యాపారి ఒకరు చెప్పారు. 2014లో ఓటమి పాలయ్యాక నియోజకవర్గానికి చాలాకాలం రాలేదని చెబుతున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ప్రధాన పోటీ వైకాపా, తెదేపాల మధ్యే ఉంది. తెదేపా మళ్లీ అధికారంలోకి వస్తేనే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని పుల్లడిగుంట గ్రామానికి చెందిన రైతు ఉప్పుటూరి రాములు చెప్పారు.

వేమూరు.. ఎవరిదో జోరు
తెదేపా: నక్కా ఆనంద్‌బాబు 
వైకాపా: ఎం.నాగార్జున

పాత ప్రత్యర్థులు మరోసారి తలపడుతున్నారు. రూ.1500 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు తనను గెలిపిస్తాయని సిట్టింగ్‌ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి నక్కా ఆనంద్‌బాబు నమ్మకంతో ఉన్నారు. ఆయన పట్ల గ్రామాల్లో సానుకూలత వ్యక్తమవుతోంది. జనసేన అభ్యర్థి ఎ.భరత్‌భూషణ్‌ ఓట్లను చీల్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లక్షా 94 వేల ఓట్లున్న ఈ స్థానంలో 55 వేల మంది డ్వాక్రా మహిళలకు పసుపు-కుంకుమ పథకం కింద సాయం అందింది. వీరంతా తెదేపా పట్ల సానుకూలంగా ఉన్నారని అనంతారం గ్రామానికి చెందిన డ్వాక్రా మహిళలు వెంకటేశ్వరమ్మ, చిట్టెమ్మ చెప్పారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.