close

ప్ర‌త్యేక క‌థ‌నం

మన ఒక్క ఓటుతో నవ్యాంధ్రను నిలబెడదాం

మీ ఓటు ప్రగతికి మేలుకొలుపు భవితకు పొద్దుపొడుపు

హా.. నేను ఓటు వేయాలా..?
నేనొక్కడిని ఓటేయకపోతే ఏమవుతుంది..?
ఇంత ఎండలో వెళ్లి ఓటేయాలా?
పైగా.. ఓటరు చిట్టీలే నా వద్ద లేవు..
ఏ పోలింగ్‌ కేంద్రం వద్దకు వెళ్లాలి.. ఎందుకు ఓటేయాలి..?
నేను ఓటేస్తే.. ఒనగూరే లాభమేంటీ..?
వేయకపోతే కలిగే నష్టమేంటి..?

ఇవేనా మీ ప్రశ్నలు.. ఇదేనా మీ నిర్లిప్తత..?
నిర్లక్ష్యం.. నిస్సత్తువ వదలండి.. ఎందుకంటే..
మీ ఓటే అధికారాన్ని నిలబెట్టడంలో కీలకం కావచ్చు..
మీ ఓటే దుష్టులను దూరంగా ఉంచడంలో ఆయుధం కావచ్చు..
మీలాంటి ఒక్క ఓటే.. చరిత్ర గతిని మార్చింది.. సమాజానికి మేలు చేకూర్చింది..
మీలాంటి ఒక్క ఓటే.. ప్రభుత్వాలను నిలిపింది..
ప్రజాస్వామ్యాన్ని ఎన్నెన్నో మలుపులు తిప్పింది
చరిత్ర పుటల్లో ఇలాంటి ఉదంతాలు ఎన్నో..

నువ్వొక్కడివి ఓటు వేయకపోతే వచ్చే నష్టమేమీ ఉండదని అనుకోవద్దు..
నీ స్వరం వినిపించినా పెద్దగా ఉపయోగం ఉండదని ఎవరైనా అంటే నమ్మవద్దు..
నీ ఒక్కడి ఓటు చరిత్ర గతిని మార్చగలదు..
నీ స్వరం కొన్ని లక్షల మంది ఆలోచనల్ని ప్రభావితం చేయగలదు.

- బరాక్‌ ఒబామా

ఓటిచ్చినప్పుడే ఉండాలి బుద్ధి..
ఎన్నుకొని తలబాదుకొన్న నేమగును?
తర్వాత ఏడ్చినను తప్పదనుభవము..

- కాళోజీ

ఓటు వేయడం అంటే నిబద్ధతతో మనల్ని నిలబెట్టుకోవడమే
- షరొన్‌  సల్జ్‌బర్గ్‌ (అమెరికన్‌ రచయిత్రి)

హక్కు ఉండి ఓటు వెయ్యకపోతే.. ప్రజాస్వామ్యం లెక్కల్లో మనం లేనట్టే.
- నాన్సీ పెలోసీ (అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌)

యువతా..

ఫేస్‌బుక్‌లో ఓ ఖాతా తెరుస్తావ్‌..
వాట్సాప్‌లో గ్రూప్‌ అడ్మిన్‌గా మారిపోతావ్‌..
ఫేస్‌బుక్‌లో వచ్చిన అంశాలకు ‘లైక్‌’లు కొడతావ్‌..
వీటి కోసం ఇప్పటి వరకు ఎన్ని గంటల సమయం వెచ్చించావో ఒక్కసారి లెక్కలేసుకో..
కేవలం అర్ధగంట సమయాన్ని వెచ్చించి
నీ ఓటు మాత్రం వేసుకో..

లే.. మేలుకో!
ఓటుపై నిర్లక్ష్యం వీడు.. ఓటుపై నిస్సత్తువ పారదోలు.
నీవు వేసే ఓటు.. నీ ప్రగతికి మేల్కొలుపు..

ఒక్క ఓటు ప్రభావం..

* కర్ణాటక రాష్ట్రంలోని సంతెమరహళ్లి శాసనసభ నియోజకవర్గం నుంచి జేడీఎస్‌ అభ్యర్థిగా 2004లో నిర్వహించిన ఎన్నికల్లో ఎ.ఆర్‌.కృష్ణమూర్తి. ఒక్క ఓటుతోనే ఓడిపోయారు. ఆ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్‌.ధ్రువనారాయణ్‌ 40,752 ఓట్లు సాధించగా.. కృష్ణమూర్తి 40,751 ఓట్లను పొందారు. దీంతో కృష్ణమూర్తి ఒక్క ఓటుతో ఎమ్మెల్యే సీటును కోల్పోయారు.

* రాజస్థాన్‌లో 2008లో నిర్వహించిన శాసనసభ ఎన్నికల్లో నాథ్‌ద్వర శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ సి.పి.జోషి పోటీ చేశారు. ఆయనకు 62,215 ఓట్లు లభించాయి. ఇతని ప్రత్యర్థి, భాజపా అభ్యర్థి కల్యాణ్‌సింగ్‌ చౌహాన్‌కు 62,216 ఓట్లు వచ్చాయి. కేవలం ఒక్క ఓటుతో సి.పి.జోషి పరాజయం పాలయ్యారు.

* వాజ్‌పేయీ ప్రభుత్వం 1999లో ఒక్క ఓటు తేడాతోనే కూలిపోయింది.
* ఒక్క ఓటు తేడాతోనే అమెరికాలో 1776లో జర్మన్‌కు బదులు ఇంగ్లిష్‌ అధికార భాషగా మారింది.

* ఇంగ్లాండ్‌లో 1714లో ఒక్క ఓటు తేడాతోనే కింగ్‌జార్జ్‌-1 పీఠమెక్కారు.

* 1800లో థామస్‌ జెఫర్సన్‌, 1824లో జాన్‌ క్వీన్స్‌ ఆడమ్స్‌, 1876లో రూథర్‌ఫర్డ్‌ హెమ్స్‌.. ఎలక్టోరల్‌ కాలేజీలో ఒక్క ఓటు తేడాతోనే అమెరికా అధ్యక్ష పదవులను అధిష్ఠించారు.

* 1923లో జర్మనీ నాజీ పార్టీ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో  ఒకే ఒక్క తేడాతో అడాల్ఫ్‌ హిట్లర్‌ ప్రత్యర్థి ఓడిపోయారు. లేదంటే ప్రపంచ చరిత్రనే వేరుగా ఉండేది..
ఈ ఉదాహరణలు చాలు.. మీ లాంటి ఒక్క ఓటు ఎంతో విలువైందని, పదునైందని, మహత్తరమైందని తెలుసుకోవడానికి..
ఇంకెందుకు ఆలస్యం.. పదండి ముందుకు..
పదండి పోలింగ్‌ కేంద్రానికి..!

ప్రతి ఓటూ కీలకమే అని చెప్పేందుకు గతంలో మన రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో వెల్లడైన ఈ ఫలితాలే నిదర్శనం.

1989లో..

* అనకాపల్లి ఎంపీగా కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసిన కొణతాల రామకృష్ణ కేవలం 9 ఓట్ల తేడాతో తెదేపా అభ్యర్థి అప్పల నరసింహంపై గెలుపొందారు.

2014లో..

* మంగళగిరి అసెంబ్లీ స్థానంలో వైకాపా ఎమ్మెల్యేగా గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డి కేవలం 12 ఓట్ల ఆధిక్యంతో తెదేపా అభ్యర్థి గంజి చిరంజీవిపై విజయం సాధించారు.
* శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి కంబాల జోగులు 512 ఓట్ల మెజార్టీతో తెదేపా అభ్యర్థి ప్రతిభాభారతిపై గెలుపొందారు.
* తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో జగ్గిరెడ్డి వైకాపా తరఫున పోటీ చేసి తెదేపా అభ్యర్థి సత్యానందరావుపై 714 ఓట్లతో గెలుపొందారు.
* చిత్తూరు జిల్లా నగరి నుంచి పోటీ చేసిన ఆర్‌.కె.రోజా తన సమీప ప్రత్యర్థి, తెదేపా అభ్యర్థి గాలి ముద్దుకృష్ణమ నాయుడుపై కేవలం 858 ఓట్ల తేడాతో గెలిచారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.