Latest Telugu News, Headlines - EENADU
close

ప్ర‌త్యేక క‌థ‌నం

మీ వేలి కొనపై దేశ భవిష్యత్తు

‘ఈనాడు’ ముఖాముఖిలో సుపరిపాలన వేదిక కార్యదర్శి పద్మనాభరెడ్డి

‘‘ఓటరు వేలి కొనపై దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఆలోచించి ఓటు వేయకపోతే బలమైన ప్రభుత్వం ఏర్పడదు. దేశ రక్షణ, ఆర్థిక అభివృద్ధి, ఉపాధి అవకాశాల నేపథ్యంలో ఈ ఎన్నికలు ప్రధానం. నేను ఓటు వేయకపోతే ఏమవుతుందని అనుకుంటే అసమర్థ, బలహీనమైన ప్రభుత్వం ఏర్పడుతుంది. ప్రలోభాలకు లోనుకాకుండా తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలి’’ అని సుపరిపాలన వేదిక (ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌) కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి తెలిపారు. పాలకులు తమను పట్టించుకోవడం లేదన్న భావన నగరాలు, పట్టణాల్లోని మధ్యతరగతి ప్రజల్లో ఎక్కువగా ఉందని.. గ్రామీణ ప్రాంతాల వారికే ఎక్కువ పథకాలు అమలు చేస్తుండటమే ఇందుకు కారణమన్నారు. వ్యవస్థను మార్చే శక్తి ప్రజల్లోనే ఉందని, అందుకే పోలింగ్‌కు 36 గంటల ముందే ప్రచారాన్ని బంద్‌ చేస్తారని తెలిపారు. ఈ సమయంలో అభ్యర్థి గుణగణాలను ఆలోచించుకుని ఓటు వేయాలనేది ఎన్నికల సంఘం సంకల్పమన్నారు. బుధవారం ఆయన ‘ఈనాడు’ ముఖాముఖిలో పలు అంశాలపై మాట్లాడారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే..

మన దేశంలో బ్రిటీష్‌ పద్ధతిలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారు గెలిచినట్లు. దీంతో వచ్చిన ఓట్ల కన్నా.. తిరస్కరించిన ఓట్లు పెద్దఎత్తున ఉన్నా.. అవి ‘చెల్లడం’ లేదు. కానీ, జర్మనీ, స్విట్జర్లాండ్‌ లాంటి దేశాల్లో దామాషా పద్ధతి ఉంది. అక్కడ ప్రలోభాలు ఉండవు.

స్థానిక సంస్థలు, శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో లోక్‌సభ ఎన్నికలు ఎంతో కీలకమైనవి. దేశాన్ని ఆర్థికంగా పరుగులు పెట్టిస్తూ, రక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించే బలమైన ప్రభుత్వం కావాలి. ఇప్పటికే తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో పొరుగు దేశాలతో ముప్పు ఎదుర్కొంటున్నాం. భద్రతతోపాటు అవినీతి రహిత పాలన ఇచ్చే ప్రభుత్వాలు అవసరం. పుంజుకుంటున్న ఆర్థిక వ్యవస్థను నిలబెట్టే పాలన రావాలి. ఇవన్నీ ఓటరు విజ్ఞతతో ఆలోచించాలి. వారసత్వ రాజకీయాలకు కూడా ఎక్కడో ఒక చోట అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది.

అర్హులకు ఓటు లేకపోతే ఈసీ వైఫల్యమే

స్కాండినేవియా దేశాల్లో 100 శాతం ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరుగుతాయి. పుట్టిన వారి వివరాలు ఎన్నికల సంఘానికి పంపుతారు. వారికి 18 ఏళ్లు రావడంతోనే ఎన్నికల సంఘం లేఖ రాస్తుంది. ఫలానా పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకోవచ్చని సూచిస్తుంది. మన దేశంలో ఫాం-6 ద్వారా ఓటు నమోదు చేసుకోవచ్చని చెబుతున్నా.. చాలా లోపాలున్నాయి. అర్హత ఉన్న వ్యక్తికి ఓటు వేసే హక్కు కల్పించలేకపోతే ఎన్నికల సంఘం వైఫల్యంగానే చూడాలి.

* మాకేం అనుకోవడంతో ముప్పు
నగరాలు, పట్టణాల్లో జనం ఓటు వేయడానికి ముందుకు రాకపోవడం ప్రమాదకర పరిణామం. ఏ పార్టీ అధికారంలోకి వస్తే మాకేముందని విద్యావంతులు, మధ్యతరగతి ప్రజలు ఆలోచిస్తున్నారు. సంక్షేమ పథకాలు అందడం లేదన్న భావన పట్టణ ప్రాంతాల్లో కనిపిస్తోంది. ఎవరూ ఇష్టం లేకపోతే నోటాకు వేయాలి. నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే రీపోలింగ్‌ నిర్వహించాలి. దీనిపై చర్చ జరగాలి.

* ఎంపీలు ఏం చేస్తున్నారో చూడాలి
గత ఎన్నికల్లో గెలిచి ఇప్పుడు కూడా పోటీలో ఉన్నవారు ఉంటే వారు పార్లమెంటు సమావేశాల్లో ఏ సమస్యలపై మాట్లాడారనేది చూడాలి. ఎంపీ అభివృద్ధి నిధుల్లో మన రాష్ట్రంలో చాలా మంది సగం నిధులు కూడా ఖర్చు చేయలేదు. దీంతో ఆ తర్వాతి నిధులను కేంద్రం కేటాయించని పరిస్థితి ఉంది.

* ప్రలోభాలతో ఎన్నికలు..
మద్యం, డబ్బు, కుల సంఘాలు, బహుమతులు ఎన్నికల్లో కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఇందుకు రాజకీయ నాయకులనే తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ప్రజలు కూడా ఆలోచించాలి. నాయకులు ఎన్నికలప్పుడే కనిపిస్తారని.. దొరికినప్పుడే వారి నుంచి తీసుకోవాలని ఆలోచిస్తున్నారు. డబ్బు సంచులు, మద్యం తేవొద్దంటూ కొన్ని గ్రామాల్లో యువకులు ప్రచారం చేస్తున్నారు. అన్ని గ్రామాల్లో ఇలాంటి చైతన్యం రావాలి.

* శిక్షలు పడితేనే పంపకాలు ఆగుతాయి
అభ్యర్థులు నిబంధనలకు విరుద్ధంగా భారీగా ఖర్చుచేస్తున్నారు. కానీ, నిబంధనల్లో పేర్కొన్న మొత్తంలో సగం కూడా ఖర్చుచేయనట్లే లెక్కల్లో చూపుతున్నారు. చట్టంలో ఉన్న లొసుగులే దీనికి కారణం. ఎన్నికల సంఘానికి సొంత సిబ్బంది లేరు. నమోదు చేసిన కేసులు చివరి వరకు కొనసాగేలా చూడాలి. 2009లో ప్రలోభాలపై నమోదైన కేసుల్లో కొన్నింటికి లోక్‌ అదాలత్‌లో రూ.10, రూ.20 చొప్పున అపరాధ రుసం విధించారు. 2014లో పది కేసుల్లోనే నిందితుల పాత్రను పోలీసులు చూపగలిగారు. ప్రతి ఆరు నెలలకోసారి ఎన్నికల అధికారి కేసులపై సమీక్ష చేయాల్సి ఉంది. సుప్రీంకోర్టు కూడా ఎన్నికల కేసులను విచారించేందుకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కొందరికైనా శిక్ష పడితే ప్రలోభాలు తగ్గిపోతాయి.

- ఈనాడు, హైదరాబాద్‌

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.