close

ప్ర‌త్యేక క‌థ‌నం

జలియన్‌వాలా బాగ్‌ నెత్తుటి చరితకు నూరేళ్లు

నిస్సహాయులపై తూటాల వర్షం!
ఇప్పటికీ క్షమాపణలు చెప్పని బ్రిటన్‌
నేడు స్మారకాన్ని సందర్శించనున్న ఉపరాష్ట్రపతి
స్మారక స్టాంపు విడుదల
చెరగని జలియన్‌వాలా బాగ్‌ జ్ఞాపకాలు

ప్రపంచ చరిత్రలోనే అత్యంత దారుణాల్లో ఒకటి..
బ్రిటిష్‌ హయాంలో నిస్సహాయులైన వేలాది మందిపై
నిర్దాక్షిణ్యంగా తూటాల వర్షం కురిపించిన రాక్షసత్వం.
అదే జలియన్‌వాలాబాగ్‌ మారణకాండ.
నాటి నరమేధానికి సరిగ్గా వందేళ్లు.

ఆ రోజు 1919 ఏప్రిల్‌ 13..
పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో 6-7 ఎకరాల్లో విస్తరించిన తోట జలియన్‌వాలాబాగ్‌. పంజాబీ ఉత్సవమైన వైశాఖీని జరుపుకోవడానికి దాదాపు 15,000 నుంచి 20,000 మంది అక్కడకు చేరుకున్నారు. అలాగే ప్రజలను అణగదొక్కే కఠినమైన నాటి రౌలత్‌ చట్టానికి వ్యతిరేకించేందుకు కూడా చాలామంది కలిశారు. అప్పట్లో ఇద్దరు జాతీయ నేతలు సత్యపాల్‌, డాక్టర్‌ సైఫుద్దీన్‌ కిచ్లూల అరెస్టు, దేశ బహిష్కారాన్ని ఖండిస్తూ సంఘీభావం తెలిపేందుకు కూడా వారంతా తరలివచ్చారు. అయితే వైశాఖి ఉత్సవాన్ని జరుపుకోవడానికి వచ్చినవారికి మాత్రం అప్పుడు ఏం జరుగుతుందనేది తెలీదు. మహిళలు, పిల్లలు కూడా అక్కడ ఉన్నారు. అలాంటి తరుణంలో కల్నల్‌ రెజినాల్డ్‌ డయ్యర్‌ ఆదేశాలతో దాదాపు 50మంది సైనికులు జలియన్‌వాలాబాగ్‌లోకి ప్రవేశించి బయటకు వెళ్లే దారులన్నీ మూసివేశారు. అక్కడ గుమిగూడిన వారిపై విచక్షణ రహితంగా 10 నిమిషాల పాటు కాల్పులు జరిపారు. బయటకు వెళ్లడానికి వీల్లేని పరిస్థితుల్లో నెత్తురోడుతున్నా కొందరు పార్కు గోడలపైకి ఎక్కేందుకు విఫలయత్నం చేశారు. కొందరు అక్కడే ఉన్న నూతిలోకి దూకేశారు. బ్రిటిష్‌ రికార్డుల ప్రకారం నాడు 379 మంది ప్రాణాలు కోల్పోయినట్లు చెబుతున్నా.. దాదాపు వెయ్యి మంది వరకు బలైపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఏకంగా 1650 రౌండ్ల తూటాలు పేల్చారంటే ఎంత కర్కశంగా వ్యవహరించారన్నది తెలుస్తుంది.

సిగ్గుచేటే..: బ్రిటిష్‌ ప్రధాని
జలియన్‌వాలాబాగ్‌ మారణకాండ బ్రిటిష్‌ ఇండియన్‌ చరిత్రలోనే సిగ్గుచేటుగా బ్రిటిష్‌ ప్రధాని థెరిసా మే బుధవారం వ్యాఖ్యానించారు. అయితే ఆమె అధికారికంగా ఎలాంటి క్షమాపణ చెప్పలేదు. నాటి అమానుషత్వానికి వందేళ్లయిన సందర్భంగా ఓ ప్రకటన చేశారు. 1997లో జలియన్‌వాలాబాగ్‌ను సందర్శించే ముందు.. రాణి ఎలిజబెత్‌-2 భారత్‌తో తమ గత చరిత్రలో ఈ దురాగతం ఓ బాధాకరమైన ఉదాహరణగా పేర్కొన్న విషయాన్ని థెరిసా మే ఆ ప్రకటనలో ప్రస్తావించారు.

జలియన్‌వాలాబాగ్‌ను సందర్శించనున్న ఉపరాష్ట్రపతి

ఈనాడు, దిల్లీ: దేశ ప్రజల్లో స్వాతంత్య్ర కాంక్షను మరింతగా రగిల్చిన జలియన్‌వాలాబాగ్‌ దురంతానికి శనివారంతో వందేళ్లు పూర్తి కానుంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆ ప్రాంతాన్ని శనివారం సందర్శించి, అమరవీరులకు నివాళులు అర్పించనున్నారు. దీనికి సంబంధించిన ఛాయాచిత్రాలతో కేంద్ర సమాచార శాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శనను సందర్శిస్తారు.స్మారక తపాలాబిళ్ల, స్మారక నాణేలను ఆయన విడుదల చేయనున్నారు.

విచారం కాదు.. క్షమాపణలు చెప్పాలి!

జలియన్‌వాలాబాగ్‌ దురంతంపై బ్రిటన్‌ విచారం వ్యక్తం చేయడం కాకుండా క్షమాపణలు చెప్పాలని నాడు ప్రాణాలు కోల్పోయిన వారి సంబంధీకులు, తదితరులు డిమాండ్‌ చేస్తున్నారు.

తగిన గౌరవాన్ని పొందలేకపోతున్నాం..

‘‘మా తాత లాలా హరిరామ్‌ న్యాయవాది.. నాడు తూటాలకు నేలకొరిగారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా తగిన గౌరవాన్ని పొందలేకపోతున్నాం. పంజాబ్‌ ప్రభుత్వం మాకు స్వాతంత్య్ర సమరయోధుల కార్డు  ఇచ్చినా ఎవరూ గుర్తించడం లేదు. వందేళ్ల తర్వాత ప్రభుత్వం నిర్వహించే కొవ్వొత్తుల ప్రదర్శనకు ఆహ్వానించేందుకు మాత్రం అధికారులు మమ్మల్ని సంప్రదించారు.’’ 

- మహేశ్‌ బెహల్‌ (73)

మా మామ 18ఏళ్ల వయసులో..

‘‘మా మామ మేలారామ్‌ 18ఏళ్ల వయసులో నాటి దారుణానికి బలై పోయారు. ఆ ఘటనను కథలుగా వింటూ పెరిగాను. ఆయన నూతిలో పడిపోయారని, శరీరం నిండా తూటా గాయాలున్నాయని చెబుతుంటారు. ఎందరో స్వాతంత్య్ర సమరయోధులు కూడా ప్రాణాలు కోల్పోయారు. బ్రిటిష్‌ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలి.’’ 

- కృష్ణ చోహాన్‌ (86)
- దిల్లీ/అమృత్‌సర్‌

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.