close

ప్ర‌త్యేక క‌థ‌నం

యాసంగికి భానుడి సెగ..!

అత్యధికంగా 44.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు
మరో 2 వారాలు కీలకం
పొట్టదశకు చేరిన వరిపైరు
 మండుటెండలతో రైతుల ఆందోళన
వడగళ్లు, గాలులతో మరింత నష్టం

ఈనాడు, హైదరాబాద్‌: భానుడి ప్రతాపం.. భగభగమంటున్న మండుటెండలతో యాసంగి పైర్లు తలవాల్చుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం పలుచోట్ల పగలు గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డు స్థాయిలో 44 డిగ్రీలు దాటింది. 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలుంటే పైర్లు తట్టుకోలేవు. కానీ అత్యధిక శాతం ప్రాంతాల్లో 40 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలుంటున్నాయి. శుక్రవారం కరీంనగర్‌ జిల్లా తాడికల్‌, జగిత్యాల జిల్లా సారంగాపూర్‌లో 44 డిగ్రీలుంది. ఈ ప్రాంతాల్లో పలు పంటలు సాగులో ఉన్నాయి. ఇప్పటికే సాగునీరందించలేక సతమతమవుతున్న రైతులు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో మరింత ఆందోళన చెందుతున్నారు. కొన్నిచోట్ల వడగళ్లు, పెనుగాలులతో అకాల వర్షాలు దెబ్బతీస్తున్నాయి. శుక్రవారం కూడా 21 ప్రాంతాల్లో స్వల్పంగా వర్షాలు పడ్డాయి. ప్రస్తుత యాసంగి(రబీ) సీజన్‌కు సంబంధించి రాష్ట్రంలో అన్ని పంటలు కలిపి 13.38 లక్షల హెక్టార్లకుగాను 11 శాతం తగ్గి 11.87 లక్షల హెక్టార్లలో సాగు చేశారు. పప్పుధాన్యాల సాగు సాధారణం కన్నా 4 శాతం పెరగ్గా ఆహార ధాన్యాల సాగు విస్తీర్ణం 6 శాతం తగ్గింది. ప్రధానమైన వరి సాధారణ విస్తీర్ణం 7.09 లక్షల హెక్టార్లకు గాను 7 లక్షల హెక్టార్లలో నాట్లు వేశారు. సెనగ తప్ప మరే పంట వందశాతానికి మించి సాగుకాలేదు.

నీటి కష్టాలు అధికం
గత జులై నుంచి రాష్ట్రంలో వర్షాలు సరిగా కురవకపోవడంతో గత ఖరీఫ్‌, ప్రస్తుత యాసంగి సీజన్‌లో పంటలకు నీరందించడం అన్నదాతలకు భారంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా గత జూన్‌ నుంచి ఇప్పటివరకూ సాధారణంకన్నా 16 శాతం తక్కువగా వర్షపాతం నమోదైంది. 16 జిల్లాల్లో వర్షపాతం లోటు 20 నుంచి 45 శాతం వరకూ ఉంది. మొత్తం 21 జిల్లాల్లో భూగర్భ జల మట్టాలు తగ్గినట్లు భూగర్భ జలశాఖ వెల్లడించింది. యాసంగి పైర్లను బోర్ల కిందనే ఎక్కువగా సాగు చేశారు. వరి పైరు పొట్టదశలో ఉన్నప్పుడు గింజ గట్టి పడటానికి  నీరు అందించడం కీలకం. ఈ తరుణంలోనే ఎండల వల్ల పైరుకు నీరు అందకపోవడం, అధిక వేడి వల్ల దెబ్బతింటోంది.

ట్యాంకర్లతో తెచ్చి పోస్తున్నారు
సాగునీటి కొరత కారణంగా పలుచోట్ల పైర్లను కాపాడుకోవడానికి ట్యాంకర్లతో నీరు తెచ్చి పోస్తున్నారు. సిద్దిపేట జిల్లా ములుగు వద్ద ఉద్యాన విశ్వవిద్యాలయంలోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో అనేక రకాల కొత్త వంగడాల పండ్ల మొక్కలను పెంచుతున్నారు. ఇక్కడ బోరు వేసి బిందు సేద్యం విధానంలో పరిమితంగానే  నీటిని మొక్కలకు అందించే వ్యవస్థను ఏర్పాటు చేశారు. కానీ ఆ కాస్త నీరూ బోరు నుంచి రాకపోవడంతో ట్యాంకర్లతో తెచ్చి తొలుత నీటి కుండీలో నింపుతున్నారు. అక్కడి నుంచి బిందు సేద్యం గొట్టాల ద్వారా మొక్కలకు పంపుతున్నారు. చాలా ఎక్కువ వ్యయంతో ఈ మొక్కలను సాగు చేస్తున్నందున ఇవి ఎండిపోతే నష్టం అధికంగా ఉంటుందని నీరు ట్యాంకర్ల ద్వారా తెచ్చి సరఫరా చేయాలని ఆదేశించినట్లు ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి పార్థసారథి ‘ఈనాడు’కు చెప్పారు.

ఉన్న నీటినే సద్వినియోగం చేసుకోండి
భూగర్భ జల మట్టాలు తగ్గడం వల్ల బోర్ల నుంచి తక్కువగా నీరు వస్తున్నట్లు మా పరిశీలనలో గుర్తించాం. అధిక ఎండలున్నందున రైతులు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. బోరు నుంచి వచ్చే తక్కువ నీటితో ఎంత మేర విస్తీర్ణానికి అందించవచ్చనేది అంచనా వేసి అంతమేరకు నీరు సరఫరా చేయాలి. ఉదాహరణకు బోరులో నీరు బాగా వస్తుందనే అంచనాతో ఒక రైతు 3 ఎకరాలు సాగు చేశారనుకోండి. ఇప్పుడు నీరు తగ్గినందున ఎకరం పైరు వదిలేసి మిగతా 2 ఎకరాలకే ఉన్న నీటిని సరఫరా చేసి కాపాడుకోవాలి.

- డాక్టర్‌ రాజిరెడ్డి, వాతావరణ శాస్త్రవేత్త, జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం

ఎండకు భయమేసింది.. తోట ముసుగేసింది

మండుటెండలకు పండ్ల తోటలను కాపాడుకునేందుకు అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. నల్గొండ జిల్లా పీఏపల్లి మండలం కోనమేకలవారిగూడేనికి చెందిన కోనశేఖర్‌రెడ్డి తనకున్న రెండెకరాల్లో దానిమ్మ వేశాడు. ప్రస్తుతం మొక్కలు కాయదశకొచ్చాయి. రోజురోజుకు పెరుగుతున్న ఎండలతీవ్రతకు దానిమ్మకాయల పరిమాణం పెరగకపోవడంతో పాటు క్రిమికీటకాలు, పక్షుల బెడదను గమనించిన రైతు బెంగళూరు నుంచి ప్రత్యేకంగా మొక్కల రక్షణ కోసం గ్రోకవర్స్‌ను తెప్పించాడు. వీటిని ప్రతి మొక్కకు వేసి కప్పాడు. ఈ కవర్లు చిరిగిపోవని.. పైగా తెల్లగా ఉండటంతో మొక్కలకు సూర్యకాంతి సమతుల్యంగా అందుతుందని శేఖర్‌రెడ్డి చెప్పాడు. ఈ గ్రోకవర్స్‌ కోసం రూ. 50వేలు ఖర్చు చేసినట్లు వెల్లడించాడు.
- ఈనాడు, నల్గొండ

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.