close

ప్ర‌త్యేక క‌థ‌నం

వీరిది ఏదారి?

దిగ్గజ నటులు కమల్‌హాసన్‌ - రజనీకాంత్‌ల ప్రభావం తమిళనాడులో ఎంత!
ఇట్టా సాంబశివరావు
చెన్నై నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి

‘రావాల్సిన సమయంలో కచ్చితంగా వస్తా’నన్నారు... సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌! పురచ్చితలైవి జయలలిత, కలైంజ్ఞర్‌ కరుణానిధిల మరణం తర్వాత తమిళ రాజకీయ తెరపై మెరిసేది ఆయనేనని రజనీ అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ రాజకీయాల్లోకి వచ్చేదెప్పుడో ఆ ‘దేవుడికే ఎరుక’ అంటూ ఆయన వేదాంతం వల్లించారు. శాసనసభ ఎన్నికల్లోనే తలపడతామన్నారు. ఈ క్రమంలోనే... నవ, సమ సమాజాన్ని నిర్మిస్తానంటూ మరో నట దిగ్గజం, ఉలగ నాయకన్‌   కమల్‌హాసన్‌ రాజకీయ అరంగేట్రం చేశారు. తన పార్టీ తరఫున అభ్యరులనూ నిలిపారు.     మరి సార్వత్రిక సమరంలో రజనీ తన నట మిత్రుడికి తోడుగా నిలుస్తారా? లేదంటే వేరుగా పనిచేస్తారా? ఇంతకీ వీరి దారి... ఏ దారి!?

విశ్వరూపం చూపిస్తారా?

‘‘రాజకీయ ప్రవేశం గురించి పలుమార్లు రజనీకాంత్‌తో చర్చించా. అవినీతి నిర్మూలనే మా ఇద్దరి లక్ష్యం. అయితే ఇందుకు మేము ఎంచుకున్న మార్గాలు వేరు. లోక్‌సభ ఎన్నికల్లో రజనీకాంత్‌ మద్దతు మాకు ఉంటుందని నమ్ముతున్నా’’

- కమల్‌ హాసన్‌

తమిళ రాజకీయాల్లో కమల్‌హాసన్‌ సరికొత్త ఒరవడి సృష్టిస్తున్నారు. సినీ రంగంలో ప్రేమ రారాజు (కాదల్‌ మన్నన్‌)గా గుర్తింపు పొందిన ఆయన... ఇప్పుడు లోక నాయకుడు (ఉలగ నాయకన్‌)గా గుర్తింపు పొందారు. 14 నెలల కిందట ‘మక్కల్‌ నీది మయ్యం (ప్రజా న్యాయవేదిక)’ను ప్రకటించి, గెలుపోటముల సంగతిని పట్టించుకోకుండా రాష్ట్రంలోని 37 లోక్‌సభ స్థానాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోనూ అభ్యర్థులను రంగంలోకి దించారు. తమిళనాడులో ఉపఎన్నికలు జరుగుతున్న అసెంబ్లీ స్థానాల్లో 16 చోట్ల అభ్యర్థులను నిలిపారు. వారి విజయం కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

ప్రస్తుతానికి కమల్‌ పూర్తిగా ఎన్నికలపైనే దృష్టిని సారించారు. తనదైన శైలిలో ఓటర్లను ఆకట్టుకునేలా ప్రసంగిస్తున్నారు. భాజపా, అన్నాడీఎంకే, డీఎంకేల వైఖరిని ఎండగడుతున్నారు. విశ్రాంత ఐఏఎస్‌, మాజీ న్యాయమూర్తి, పోలీసు అధికారితో పాటు న్యాయవాదులు, వైద్యులు, వ్యాపారవేత్తలు, సినీ గేయ రచయిత స్నేహన్‌ వంటి వారికి కమల్‌ టికెట్లు ఇచ్చారు. రిపబ్లిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియాకు ఓ లోక్‌సభ సీటును కేటాయించారు. స్వయంగా ఆయన కూడా లోక్‌సభకు పోటీచేస్తారని తొలుత వార్తలొచ్చాయి. కానీ, ప్రచార బాధ్యతల దృష్ట్యా కమల్‌ తన ఆలోచనను విరమించుకున్నారు.

ట్వీట్లతో ఆకర్షించి
కమల్‌హాసన్‌ తన రాజకీయ అరంగేట్రానికి ముందే ట్విటర్‌ వేదికగా ప్రజల్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. అన్నాడీఎంకే సర్కారు అవినీతిలో కూరుకుపోయిందంటూ వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. 2017 జులై 18న ‘నిర్ణయం తీసుకుంటే నేనూ ముఖ్యమంత్రినే’ అంటూ ఆయన చేసిన ట్వీట్‌ సంచలనం సృష్టించింది. తర్వాత ఆయన విద్యార్థులతో సమావేశమై వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు. చెన్నై ఎన్నూర్‌ ముఖద్వారం పరిసర ప్రాంతాల్లో పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. క్రమంగా మిగతావర్గాల వారితోనూ మమేకమయ్యేందుకు గట్టిగా ప్రయత్నించారు. 2017 నవంబరులో అభిమాన సంఘం ఏర్పాటుచేసిన వార్షి కోత్సవంలో పాల్గొని రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు. గతేడాది ఫిబ్రవరి 21న పార్టీ పేరును, పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు ఆయన రామేశ్వరంలోని అబ్దుల్‌ కలాం నివాసం నుంచి తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. తనకూ కలలు, ఆకాంక్షలు ఉన్నాయనీ, అందుకే ఆయన నివాసం నుంచి ‘నాళై నమదే’ పేరున రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నట్టు చెప్పారు.

మొహమాటానికి చోటు లేకుండా
పెద్దనోట్ల రద్దును మొదట్లో స్వాగతించినా తర్వాత ఆ    నిర్ణయానికి చింతిస్తున్నట్టు కమల్‌ వెల్లడించారు. ‘హిందూ తీవ్రవాదం’పై ఆయన రాసిన వ్యాసం పట్ల భాజపా నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీనిపై ఉత్తర్‌ప్రదేశ్‌లో కేసు కూడా నమోదైంది. కొడనాడు వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం పళనిస్వామి పదవి నుంచి తప్పుకోవాలని కమల్‌ డిమాండ్‌ చేశారు. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ను ఉద్దేశించి... ‘శాసనసభలో చొక్కా చించుకుని బయటకు రాను’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ప్రజలు తమ సమస్యలను తెలిపేందుకు విజిల్‌యాప్‌ను ఆవిష్కరించారు. పొల్లాచ్చిలో ఓ బాలిక లైంగిక వేధింపులకు గురికాగా... ముందుగా వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

సభలకు స్పందన సరేగానీ...
కమల్‌ బహిరంగ సభలు, రోడ్‌షోలకు స్పందన భారీగానే ఉంటోంది. కానీ వీరిలో ఎక్కువమంది ఆయనను చూడ్డానికి వచ్చినవారేననీ, ఓట్లు వేస్తారా అన్నది అనుమానమేనని కొందరు విశ్లేషకులు అంటున్నారు. అయితే ఆయన మాత్రం ఎన్నికలను ఒక సవాలుగా తీసుకున్నారనీ, ఓటింగ్‌ శాతాన్ని పెంచి పార్టీకి మంచి గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఓ అభ్యర్థి అభిప్రాయపడ్డారు.  మక్కల్‌ నీది మయ్యం తరఫున ప్రముఖ నటులు కోవై సరళ, స్నేగన్‌, శ్రీప్రియ తదితరులు ప్రచారం చేస్తున్నారు. ముఖ్యమంత్రులు కేజ్రీవాల్‌, మమతా బెనర్జీ, పినరయి విజయన్‌లతో కమల్‌ భేటీ అయ్యారు. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవానికి విచ్చేసిన సోనియా, రాహుల్‌గాంధీ   తదితరులతో సంప్రదింపులు జరిపారు.

* ఓటమికైనా సిద్ధమేగాని... డబ్బులు మాత్రం పంచను
* కులరహిత సమాజాన్ని నిర్మిస్తా
* రాజకీయాలను ప్రక్షాళన చేస్తా
* ప్రభుత్వశాఖల్లో అవినీతిని నిర్మూలిస్తా
* విద్యా రంగంలో సమానత్వాన్ని, అంతర్జాతీయ ప్రమాణాలను తీసుకొస్తా

- ఎన్నికల ప్రచారంలో కమల్‌హాసన్‌

కబాలి వస్తారా?

‘‘కమల్‌ను నా  రాజకీయ పోటీదారునిగా భావించలేదు. ఆయన మంచి మిత్రుడు. సహ నటుడు. ఇప్పటికీ నా ఆప్తమిత్రుడు. మా ఇద్దరి మధ్య స్నేహాన్ని చెడగొట్టకండి.’’

-  రజనీకాంత్‌

‘‘నేను ఎప్పుడు ఎలా వస్తానో ఎవ్వరికీ తెలియదు. రావాల్సిన సమయంలో కచ్చితంగా వస్తా’’- ఇది ఓ సినిమాలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ చెప్పే డైలాగ్‌. నిజ జీవితంలో ఆయన రాజకీయరంగ ప్రవేశానికి ఇదే నాందిగా మారింది. 1995లో జయలలిత అధికారంలో ఉన్నప్పుడు ‘బాంబు పేలుళ్ల సంస్కృతి విస్తరించింది’ అంటూ ఓ కార్యక్రమంలో రజనీకాంత్‌ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. రాజకీయాల్లోకి రజనీ రాకపై ఆనాడు మొదలైన చర్చ... 2017 డిసెంబరులో కార్యరూపం దాల్చింది. కానీ ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలకు మాత్రం ఆయన దూరంగానే ఉన్నారు. అలాగని ఏ పార్టీకీ మద్దతు ప్రకటించలేదు. అయితే ముత్తు మద్దతును మరో సీనియర్‌ నటుడు కమల్‌ ఆశిస్తున్నారు.

తమిళ రాజకీయాల్లో రజనీకాంత్‌ వ్యవహారశైలి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 1995లో బాంబు పేలుళ్ల సంస్కృతి గురించి ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడినప్పుడు ఆయనతో ఉన్న మంత్రి ఆర్‌.ఎం.వీరప్పన్‌ను నాటి ముఖ్యమంత్రి జయలలిత పదవి నుంచి తప్పించారు. 1996 శాసనసభ ఎన్నికల సందర్భంగా... ‘జయలలిత మళ్లీ అధికారంలోకి వస్తే తమిళనాడును దేవుడు కూడా కాపాడలేడు’ అంటూ డీఎంకే-టీఎంసీ కూటమికి మద్దతుగా రజనీ ప్రకటన చేశారు. ఆ కూటమి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తరువాత ఎన్నికల్లో రజనీ ప్రభావం కనిపించలేదు. సూపర్‌స్టార్‌ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ఖాయమని వార్తలొచ్చినా... ఆయన మౌనంగానే వ్యవహరిస్తూ వచ్చారు. ‘మీరు ఎప్పుడు రాజకీయ పార్టీని ప్రారంభిస్తారు?’ అంటూ మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే.. ‘అది దేవుడికే తెలుసు’నంటూ వేదాంత ధోరణిలో సమాధానమిచ్చేవారు. 2017 డిసెంబరు 31న చెన్నైలో అభిమానులతో మాట్లాడుతూ... ‘నేను రాజకీయాల్లోకి రావడం ఖాయం. కాలం శాసించింది. రానున్న శాసనసభ ఎన్నికల్లో పార్టీని ప్రారంభించి తమిళనాడులోని 234 నియోజకవర్గాల్లోనూ పోటీచేస్తాం’ అని ప్రకటించారు. దీంతో ఆయన రాజకీయ ప్రవేశంపై సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. రాజకీయాల్లోకి రావడం తథ్యమని చెప్పిన తర్వాత ‘కాలా’, ‘2.ఓ’, ‘పేట’ చిత్రాల్లో రజనీ నటించారు. రాజకీయరంగ ప్రవేశం ప్రకటన తర్వాత రజనీ అభిమానుల సంఘాన్ని రజనీ మక్కళ్‌ మండ్రం (రజనీ పీపుల్స్‌ ఫోరం)గా మార్చేశారు. యూట్యూబ్‌ ఛానల్‌నూ నిర్వహిస్తున్నారు. ఫోరం లోగోలో తామరపువ్వు ఉన్నందున భాజపా ‘బి’ టీం అన్న విమర్శలొచ్చాయి. దీంతో దానిని తొలగించారు. ఒంటరిగానే ఎన్నికలను ఎదుర్కొంటామని రజనీకాంత్‌ ప్రకటించినప్పటికీ... సైద్ధాంతికంగా తమకు సరిపోయారంటూ భాజపా, ఇతర పార్టీల నేతలు ఆయనతో చేతులు కలిపేందుకు ప్రయత్నించారు.

ఒంటరి పోరు..
లోక్‌సభ ఎన్నికల్లో రజనీకాంత్‌ పోటీ చేస్తారని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే తాము శాసనసభ ఎన్నికల్లో మాత్రమే పోటీ చేస్తామని రజనీ విస్పష్టం చేశారు. దీంతో ఆయన మద్దతు పొందేందుకు పలు పార్టీలు తెరవెనుక ప్రయత్నాలు సాగించాయి. కమల్‌హాసన్‌ మాత్రం బహిరంగంగానే రజనీకాంత్‌ మద్దతు ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. అయితే తాను అడగకుండానే మద్దతిస్తే అది గొప్ప విషయమని, రజనీకాంత్‌ తనకు మద్దతిస్తారని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రత్యామ్నాయ శక్తిగా..
డీఎంకే, అన్నాడీఎంకే అగ్రనేతలు కరుణానిధి, జయలలిత లేనందున... ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు రజనీలాంటి వారికి అవకాశముంటుందని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే- సినీ, రాజకీయ రంగాల మధ్య చాలా వ్యత్యాసముందనీ, రాజకీయాల్లో రాణించడం అన్న దానికి కాలమే సమాధానం చెబుతుందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. రజనీకాంత్‌, కమల్‌హాసన్‌ ఇద్దరూ భాజపాకు ‘బి’ టీములనే ఆరోపణలొచ్చాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఎవరికీ మద్దతులేదని, అయితే తమిళనాడు నీటి సమస్యను తీర్చుతారని ఎవరిపై నమ్మకముందో వారికే ప్రజలు ఓటేయ్యాలంటూ రజనీకాంత్‌ చేసిన ప్రకటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

తగిన సమయం కాదని
పార్టీ పేరు, జెండా, ముందస్తు ప్రణాళిక, సన్నద్ధత లేకుండా లోక్‌సభకు పోటీచేయడం సరికాదన్న ఉద్దేశంతోనే ఈ ఎన్నికలకు రజనీ దూరంగా ఉన్నారని భావిస్తున్నారు. పార్టీని తొలుత క్షేత్రసాయి నుంచి బలోపేతం చేయాల్సిన అవసరముందని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. అయితే రజనీ రాజకీయ ప్రకటన తర్వాత కమల్‌హాసన్‌ రాజకీయ పార్టీని స్థాపించి, లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దిగడం గమనార్హం.

సినీ రంగంలో రజనీ-కమల్‌ మధ్య ఆహ్లాదకర పోటీ ఉంది. 1978లో కమల్‌ నటించిన ‘ఇళమై ఊంజలాడుగిరదు’, రజనీ నటించిన ‘భైరవి’ చిత్రాలు ఒకేరోజు విడుదలయ్యాయి. ‘ఇళమై ఊంజలాడుగిరదు’ (తెలుగులో వయసు పిలిచింది) చిత్రంలో రజనీకాంత్‌ ప్రతి నాయకుడి పాత్ర పోషించారు. ఆ తర్వాత కూడా వీరిద్దరు నటించిన చిత్రాలు ఒకే రోజు విడుదలయ్యాయి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.