close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఈవీఎం.. రేకెత్తిస్తోంది భయం

పనితీరుపై మరోసారి రాజకీయ రగడ
దిల్లీ వేదికగా గళం వినిపిస్తున్న విపక్షాలు
అనుకూల, ప్రతికూల వాదనలతో వేడెక్కుతున్న వాతావరణం

ఈవీఎం... దీని చుట్టూ మళ్లీ పెను వివాదం. ఎన్నికల ప్రక్రియ మొత్తంలో విప్లవాత్మక మార్పులకు దారిచూపిన ఈ యంత్రాలలో కావాల్సిన రీతిలో ఫలితాలను మార్చుకోవచ్చన్న అనుమానాలు పెనుభూతంగా మారాయి. తాజాగా జరిగిన ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలలో చాలావరకు ఈవీఎంలు సరిగా పనిచేయలేదని, వాటిపై నమ్మకం లేదని తెలుగుదేశం పార్టీ వాదిస్తోంది. కనీసం 50 శాతం వీవీప్యాట్‌ స్లిప్పులను కూడా లెక్కించాలని జాతీయ స్థాయిలో ఇతర ప్రతిపక్షాలతో కలిసి డిమాండ్‌ చేస్తోంది. వీటి పనితీరుపై ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చే జరుగుతోంది.

ప్పుడు మనం ఉపయోగిస్తున్న ఈవీఎంలను 1980లో ఎంబీ హనీఫా కనిపెట్టారు. తొలిసారి 1982లో కేరళలోని ఉత్తర పరవూర్‌ నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా ఉపయోగించారు. ఇవి విజయవంతం కావడంతో 1989లో భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌, ఈసీఐఎల్‌ల సహకారంతో ఈవీఎంలను ఎన్నికల సంఘం పూర్తిస్థాయిలో తయారు చేయించింది. తర్వాత 1998 నవంబరులో 16 అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికలలో వాడారు. రాష్ట్రం అంతటా మొత్తం వీటినే వినియోగించడమనేది 1999 గోవా అసెంబ్లీ ఎన్నికలతో మొదలయింది. 2003లో అన్ని రాష్ట్రాల ఉప ఎన్నికలకూ ఈవీఎంలే ఉపయోగించారు. ఈవీఎంను గరిష్ఠంగా 15 ఏళ్లపాటు మాత్రమే ఉపయోగించగలరు.
 

డిజైన్‌, సాంకేతిక పరిజ్ఞానం..

సాధారణంగా ఈవీఎంలో మూడు భాగాలుంటాయి. ఒకటి కంట్రోల్‌ యూనిట్‌, రెండోది బ్యాలెట్‌ యూనిట్‌, మూడోది వీవీప్యాట్‌. వీటిని ఐదు మీటర్ల కేబుల్‌ సాయంతో అనుసంధానిస్తారు.
* బ్యాలెట్‌ యూనిట్‌ మీద ఉండే మీటను నొక్కితే ఓటు నమోదవుతుంది.
* అది వీవీప్యాట్‌లో కనిపిస్తుంది.

* ఈవీఎంలలో ఉండే కంట్రోలర్‌ను ముందుగానే.. అంటే దాన్ని ఉత్పత్తి చేసే సమయంలోనే శాశ్వతంగా ప్రోగ్రాం చేసి ఉంచుతారు. ఉత్పత్తిదారు సహా ఎవ్వరూ వాటిని మార్చలేరు.

* బ్యాటరీ ఆధారంగా పనిచేస్తాయి కాబట్టి విద్యుత్‌ సరఫరా అంతరాయాలతో దీనికి సంబంధం లేదు.
* సాధారణ ఈవీఎంలలో ఒక్కో బ్యాలెట్‌ యూనిట్‌లో 16 మంది అభ్యర్థుల పేర్లుంటాయి (నోటా సహా).

* 2006 నుంచి 2010 వరకు ఉపయోగించిన ఎం2 ఈవీఎంలలో నాలుగు యూనిట్లను అనుసంధానించుకోవచ్చు. అంటే గరిష్ఠంగా 64 మంది అభ్యర్థులకు పనికొచ్చేది.

* కొత్తగా వినియోగిస్తున్న ఎం3 ఈవీఎంలలో 24 బ్యాలెట్‌ యూనిట్లను అనుసంధానించవచ్చు. అంటే 384 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా వీటిని ఉపయోగించవచ్చు.

సయ్యద్‌ షుజా సంచలనం

మెరికాలో ఉంటున్న భారత సంతతి హ్యాకర్‌ సయ్యద్‌ షుజా ఈ సంవత్సరం ప్రారంభంలో పెను సంచలనానికి దారితీశాడు. తలకు ముసుగు ధరించి, లండన్‌ నుంచి స్కైప్‌ ద్వారా విలేకరుల సమావేశం నిర్వహించాడు. 2014 సార్వత్రిక ఎన్నికలలో ఉపయోగించిన ఈవీఎంలను ఒక రాజకీయ పక్షానికి అనుకూలంగా మార్చినట్లు చెప్పాడు. గతంలో తాను ఈసీఐఎల్‌లో పనిచేశానని, ఎన్నికల కమిషన్‌ ఉపయోగించిన ఈవీఎంల రూపకల్పనలో పాలు పంచుకున్నానని వివరించాడు. భాజపాతో పాటు కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ, బీఎస్పీ, ఆప్‌ తదితర రాజకీయ పక్షాలు కూడా వీటిని మార్పించాయని చెప్పాడు. ఇదంతా బయటపడిన తర్వాత తాను ఎలాగోలా ప్రాణాలు దక్కించుకుని విదేశాలకు పారిపోయాననీ, తనతో పాటు పనిచేసిన వాళ్ల మృతదేహాలు మాత్రం.. ఆ తర్వాత కొన్ని రోజులకు ‘అనుకోకుండా’ జరిగిన మత ఘర్షణలలో బయటపడ్డాయని ఆందోళన వ్యక్తంచేశాడు. ఈవీఎంలను హ్యాక్‌ చేయొచ్చని అతడు చెప్పినా, విలేకరుల సమావేశం సమయంలో మాత్రం హ్యాక్‌ చేయలేకపోయాడు.

ఆధునిక ఈవీఎంలో  మరిన్ని జాగ్రత్తలు

ప్రస్తుతం ఎన్నికల సంఘం ఉపయోగిస్తున్నది అత్యాధునికమైన ఎం3 రకం ఈవీఎంలు. మొత్తం 24 బ్యాలెట్‌ యూనిట్లను ఒకదాంతో ఒకటి అనుసంధానించి, ఒకే కంట్రోల్‌ యూనిట్‌లో ఓట్లు నమోదయ్యేలా వీటిద్వారా చేయవచ్చు. అంతేకాదు. భద్రత పరంగానూ ఇవి అత్యున్నత ప్రమాణాలతో కూడుకున్నవి. ఈవీఎంను ట్యాంపర్‌ చేయాలంటే, వాటిలో ఉండే మైక్రోచిప్‌ను మార్చాలి. కానీ ఇలా మార్చేందుకు ప్రయత్నించినపుడు.. ఎం3 ఈవీఎంలలో ఉండే చిప్‌ లోలోపలే కాలిపోతుంది. దానివల్ల కొత్త చిప్‌ అందులో పెట్టడానికి కూడా అవకాశం ఉండదు.

రూ.5 కోట్లిస్తే అసెంబ్లీ స్థానం మీదే..

ఎన్నికల ఫలితాలను అనుకూలంగా మార్చేస్తామంటూ పలువురు సీనియర్‌ రాజకీయ నాయకులను కొంతమంది ఎలక్ట్రానిక్‌ నిపుణులు సంప్రదించారని ఇటీవల ఒక ఆంగ్ల పత్రిక బయటపెట్టింది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ఫలితాలను వారికి అనుకూలంగా వచ్చేలా చేసేందుకు నిపుణులు నిర్ణయించిన రుసుం అక్షరాలా రూ.5 కోట్లు! దీని కోసం ముందుగా ప్రోగ్రాం చేసిన ఒక చిప్‌ను ఈవీఎంలలో అమరుస్తారు. మొత్తం ఒక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉపయోగించే వాటిలో కేవలం 20% యంత్రాలకే ఇలా చేస్తారు. దానివల్ల భారీ ఆధిక్యం రాకుండా.. కొద్దిపాటి ఓట్ల తేడాతో అభ్యర్థి విజయం సాధిస్తారు. అయితే ఇది సాధ్యం కాదని, ఈవీఎంలను తయారుచేసే సమయం నుంచి కేంద్రాలకు చేర్చేవరకు పటిష్ఠమైన నిఘా ఉంటుందని ఎన్నికల సంఘం వర్గాలు అంటున్నాయి.

వివాదాలు కొత్త కాదు

* 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈవీఎంల వాడుకను రద్దు చేయాలంటూ భాజపాయే డిమాండ్‌ వినిపించడం గమనార్హం. తర్వాత భాజపాతో పాటు కాంగ్రెస్‌ కూడా ఈ విమర్శల విషయంలో పిల్లిమొగ్గ వేశాయి.

* 2017లో ఉత్తర్‌ప్రదేశ్‌లో శాసనసభ ఎన్నికల తర్వాత బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి ఈవీఎంల పనితీరుపై బాహాటంగా విమర్శలు చేశారు. పంజాబ్‌ ఎన్నికల తర్వాత ఆమ్‌ ఆద్మీపార్టీ కూడా ఈవీఎంలపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈవీఎంలలో మతలబులు చేయడం సాధ్యమేనని ఆరోపించింది. విజయం సాధించినప్పుడు ఎలాంటి అభ్యంతరాలు లేవనెత్తకుండా, ఓడిపోయినప్పుడు మాత్రం విమర్శలు చేస్తుండడాన్ని భాజపా ఆక్షేపిస్తోంది.

* ఈవీఎంలను హ్యాక్‌ చేసి చూపించే అవకాశాన్ని ఈసీ అందరికీ ఇస్తుందన్న ప్రచారంతో 2017లో ఈ అంశంపై విస్తృతంగా చర్చ జరిగింది. ఎలా హ్యాక్‌ చేయవచ్చో ఎవరైనా ముందుకు వచ్చి నిరూపించాలని ఈసీ సవాల్‌ విసిరాక నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ), సీపీఎం మాత్రమే దానికి సంసిద్ధమయ్యాయి. అయితే ఈ రెండు పార్టీలు కూడా హ్యాకింగ్‌ను రుజువు చేసే బదులుగా ఈసీ ఇచ్చిన నాలుగు గంటల నిడివి ఉన్న ప్రదర్శనను వీక్షించి వెళ్లిపోయాయి.

* 2018లో తెలంగాణ, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించిన అనంతరం మరోసారి వీటి పనితీరుపై ఆరోపణలు వెల్లువెత్తాయి.

* ఈవీఎంల పారదర్శకత కోసం పోరాడేందుకు ఏర్పాటైన వీటా అనే సంస్థ సభ్యులు పలు సందేహాలు లేవనెత్తారు.

* 2014 సార్వత్రిక ఎన్నికల్లో వీవీప్యాట్‌లను 8 లోక్‌సభ నియోజకవర్గాల్లో ప్రయోగాత్మకంగా వాడి చూశారు. ఎలాంటి  ఫిర్యాదులూ రాలేదు. ఆ 8 నియోజకవర్గాల్లో ఒకచోట (మిజోరం) స్వతంత్ర అభ్యర్థి నెగ్గారు. పంజాబ్‌ శాసనసభ ఎన్నికల్లో 117కి గానూ 33 సెగ్మెంట్లలో వీటిని వాడారు. మూడోవంతు యంత్రాల్లో సాంకేతిక సమస్యలు కనిపించాయి.

* వీవీప్యాట్‌లలో ఏడు సెకన్ల పాటు చీటీ కనిపించాల్సి ఉండగా మూడు సెకన్లు మాత్రమే కనిపిస్తోందన్న ఆరోపణలు తాజాగా వెల్లువెత్తాయి. ఈవీఎంల పనితీరును ప్రశ్నిస్తున్న సాంకేతిక నిపుణుడు వేమూరి హరిప్రసాద్‌ ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు.

మెచ్చుకున్న పరిశోధకులు!

ఒకపక్క మన ఈవీఎంలపై వివాదాలు ఇలా ఉంటే వీటి పనితీరును, విశిష్టతను జర్మనీ పరిశోధకులు మెచ్చుకోవడం ప్రస్తావనార్హం. మాక్సిమిలన్‌ హెర్‌స్టాట్‌, కోర్నిలిస్‌ హెర్‌స్టాట్‌ అనే ఇద్దరు 2014 జులైలో ఈ మేరకు ఒక పరిశోధన పత్రాన్ని వెలువరించారు. ‘అమెరికా వంటి దేశాలు వాడుతున్న యంత్రాలతో పోలిస్తే భారతదేశంలోని ఈవీంఎలు విభిన్నమైనవి. మిగిలిన చోట్ల యంత్రాలు భారీగా, ఖర్చుతో కూడుకున్న క్లిష్టమైన వ్యవస్థలు. భారత్‌లో మాత్రం చాలా సరళమైనవి, వ్యయం తక్కువ, సమర్థత ఎక్కువ’ అని వారు కితాబు ఇచ్చారు.

మార్చడం సాధ్యమేనా?

వీఎంలలో ఉండే చిప్‌లను మార్చడం పెద్ద కష్టమైన పని కాదని, వీటిని తయారుచేయడం దగ్గర నుంచి పోలింగ్‌ కేంద్రాలకు చేర్చేవరకు రకరకాలుగా చేతులు మారతాయని.. ఇంతమంది మనుషులు ఉన్నప్పుడు ఎక్కడైనా వాటిని మార్చవచ్చని ఎథికల్‌ హ్యాకింగ్‌ నిపుణులు చెబుతున్నారు. చిప్‌లో ఉండే సోర్స్‌ కోడ్‌ను మార్చడం ద్వారా ఈవీఎంలో ఫలితాలను ప్రభావితం చేసేందుకు అవకాశం ఉంటుందంటున్నారు. ఎక్కడో వేరేచోట ఉండి.. ఈవీఎంను ముట్టుకోకుండా మాత్రం వాటిని ఏమీ చేయలేరు. ‘ఒక్కో యంత్రం తయారీ సమయంలో వాటిదగ్గర ఉండే వాళ్లకే మిషన్లను మార్చేందుకు అవకాశం ఉంటుంది. భారతీయ డెవలపర్లు, మిషన్ల తయారీదారులు, వాటిలోని విడిభాగాలను సరఫరా చేసే కంపెనీలు, మైక్రోచిప్‌లలోకి సాఫ్ట్‌వేర్‌ను చొప్పించే అత్యంత కీలకమైన పని చేసే విదేశీ కంపెనీలు.. వీటన్నింటిలో పనిచేసే సిబ్బందికి ఈవీఎంలను ట్యాంపర్‌ చేసేందుకు అవకాశం ఉంటుంది. అలాగే, మిషన్ల నిర్వహణ, మరమ్మతులు, పరీక్ష చేసే మెకానిక్‌లు కూడా వాటిలో ఏదైనా పరికరాన్ని అమర్చగలరు. చిన్న పరికరాన్ని ఈవీఎంలో అమరిస్తే, నిమిషాల వ్యవధిలో వాటిని హ్యాక్‌ చేయవచ్చు’ అని ఎథికల్‌ హ్యాకర్లు చెబుతున్నారు. గతంలో ప్రధానమంత్రి కార్యాలయంలోని కంప్యూటర్లు, మాజీ జాతీయ భద్రతా సలహాదారు ఎంకే నారాయణన్‌ వ్యక్తిగత కంప్యూటర్‌ కూడా హ్యాక్‌ అయ్యాయన్న విషయాన్ని వారు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు.

ఆఫ్రికాలోనూ అనుమానాలు

ఈవీఎంల పనితీరుపై అనుమానాలు మన దేశంలోనే కాదు ఆఫ్రికాలోనూ ఉన్నాయి. భారత్‌లో తయారైన ఈవీఎంలను బోట్స్‌వానాలో వినియోగించినప్పుడు అక్కడా ఇలాంటి అనుమానాలే వ్యక్తమయ్యాయి. అధికార పార్టీకి అనుకూల ఫలితాలను రాబట్టేలా ఈవీఎంలను వినియోగించారని విపక్షాలు ఆరోపించాయి. బోట్‌్్సవానా ఈసీ మాత్రం భారతదేశ ఈవీఎంలను గట్టిగా సమర్థించింది.

* ఈవీఎంలను వాడిన, ప్రయోగించిన దేశాలు ఇప్పటి వరకు 31 ఉన్నాయి. వాటిలో నాలుగు దేశాలు మాత్రమే దేశవ్యాప్తంగా వాటిని వాడాయి. 11 దేశాలు కొన్ని ప్రాంతాల్లోనే వినియోగించాయి. మూడు దేశాలు వాటి వాడుకకు స్వస్తి పలికాయి. ప్రయోగాత్మకంగా చూసిన మరో 11 దేశాలు ఆ పద్ధతికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నాయి. కజకిస్థాన్‌ 2011లో ఈవీఎంలకు మంగళం పాడింది. ఇంటర్నెట్‌ ఓటింగ్‌లో ముప్పు ఎక్కవంటూ ఫిన్లాండ్‌ తేల్చింది.

* నెదర్లాండ్స్‌, రొమేనియా వంటివి వివిధ దశల్లో ఈవీఎంల నుంచి వెనక్కి మళ్లాయి.

* జర్మనీలో 2005లో ఈవీఎంలను ప్రయోగాత్మకంగా ఉపయోగించారు. 2007లో వీటిని అక్కడి కోర్టు నిషేధించింది. కంప్యూటర్‌ ఆధారిత ఓటింగులో పౌరులకు ప్రోగ్రామింగ్‌ పరిజ్ఞానం అవసరమని, అది లేనందున ఈ వ్యవస్థను వాడడం తగదని న్యాయస్థానం పేర్కొంది.

* కెనడాలో ఫెడరల్‌ ఎన్నికలలో ఈవీఎంల ఉపయోగంపై సమీక్షలు జరిపి, వాటిని వాడకూడదని నిర్ణయించారు.
* ఐర్లండ్‌లో 2010 నుంచి ఈవీఎంల వాడకం ఆపేశారు.
* దక్షిణ కొరియాలో బ్యాలెట్‌ పేపర్ల లెక్కింపునకు మాత్రమే యంత్రాలు వాడుతున్నారు.

* అమెరికాలో కొన్ని రాష్ట్రాలలో యంత్రాలు వాడుతుండగా మరికొన్ని మాత్రం వద్దను కున్నాయి.
* యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో  స్కాట్లండ్‌లో మాత్రం 2007 నుంచి బ్యాలెట్‌ పత్రాల లెక్కింపునకు యంత్రాలు ఉపయోగిస్తున్నారు.

- ఈనాడు ఎన్నికల విభాగం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.