close

ప్ర‌త్యేక క‌థ‌నం

మరాఠ్వాడా..  నేతలకు ఏకరవు

సమస్యలే అజెండాగా పార్టీల పోరు 
సత్యపాల్‌ మేనన్‌ 
లాతూర్‌, ఉస్మానాబాద్‌ల నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి

మరాఠ్వాడా.. మహారాష్ట్రలోని ఈ ప్రాంతం పేరెత్తితే వ్యవసాయ సంక్షోభం మదిలో మెదులుతుంది. కోరలు చాచిన కరవు కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది. నీటి కొరత గుర్తొచ్చి కళ్లలో నీళ్లు తిరుగుతాయి. దశాబ్దాలుగా మరాఠ్వాడాను వేధిస్తున్న ఈ సమస్యలను పాలకులు ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో ప్రభుత్వాలు మారుతున్నా ఈ ప్రాంతవాసుల కన్నీటి వ్యథకు తెరపడట్లేదు. 
రాఠ్వాడా డివిజన్‌ తెలంగాణ, కర్ణాటకలతో సరిహద్దులు పంచుకుంటోంది. ఔరంగాబాద్‌, బీడ్‌, హింగోలి, జాల్నా, లాతూర్‌, నాందేడ్‌, ఉస్మానాబాద్‌, పర్బనీ జిల్లాలు ఈ ప్రాంత పరిధిలోకి వస్తాయి. దాదాపుగా ఈ జిల్లాలన్నింటిలోనూ కరవు తీవ్రంగా ఉంది. మహారాష్ట్రలో రైతన్నలు తమ సమస్యలను పరిష్కరించడం లేదంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తూ గత ఏడాది నాసిక్‌ నుంచి ముంబయికి భారీ ర్యాలీ చేపట్టగా.. అందులో మరాఠ్వాడా ప్రాంత అన్నదాతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి ఓటర్లు కాంగ్రెస్‌-ఎన్సీపీ, భాజపా-శివసేన కూటముల్లో దేనికి పట్టం కడతారనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కరవు, వ్యవసాయ సంక్షోభం, నీటి కొరత వంటి అంశాలు ఈ దఫా ఎన్నికల్లో ఇక్కడ కీలకంగా మారే అవకాశముంది. ఈ నేపథ్యంలో లాతూర్‌, ఉస్మానాబాద్‌ లోక్‌సభ స్థానాల పరిధిలో ‘ఈనాడు’ క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టింది. 
లాతూర్‌.. గొంతు తడవట్లేదు! 
ప్రకృతి కరుణ లేక లాతూర్‌ దశాబ్దాలుగా అల్లాడుతోంది. 1993లో ఇక్కడ విధ్వంసకర భూకంపం సంభవించింది. వేలమందిని పొట్టన పెట్టుకుంది. ఇప్పటికీ నాటి విపత్తు తాలూకు చేదు జ్ఞాపకాలు లాతూర్‌ వాసులను వెంటాడుతున్నాయి. నియోజకవర్గాన్ని వేధిస్తున్న ప్రధాన సమస్య కరవు. వర్షాలు సరిగా పడక భూమి నెర్రెలువారింది. భూగర్భ జలాలు అడుగంటాయి. తాగునీరు దొరక్క జనం అల్లాడుతున్నారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి లాతూర్‌కు రైళ్లలో నీటిని తరలించాల్సిన దుస్థితి తలెత్తుతుండటం అక్కడి నీటి కొరత తీవ్రతకు నిదర్శనం. ఇంతలా కరవు వేధిస్తున్నా లాతూర్‌ రైతులు నీటి అవసరం ఎక్కువగా ఉండే చెరకు పంటలనే సాగు చేస్తున్నారు. ఆపై దిగుబడులు సరిగా రాకపోవడంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇంత జరుగుతున్నా పాలకులు పట్టించుకోవట్లేదు! ప్రత్యామ్నాయ పంటలపై అన్నదాతలకు అవగాహన కల్పించడం లేదు. రాజకీయ నాయకులు తమ తలరాతలు మారుస్తారన్న విశ్వాసం ఏమాత్రం లేదని, వారి నుంచి ప్రయోజనాలు ఆశించి అనేకసార్లు భంగపడ్డామని స్థానికులు నిట్టూరుస్తున్నారు. 
ఎవరికి కట్టేనో పట్టం! 
కాంగ్రెస్‌కు లాతూర్‌ ఒకప్పుడు కంచుకోట. మాజీ ముఖ్యమంత్రులు విలాస్‌రావ్‌ దేశ్‌ముఖ్‌, శివాజీరావ్‌ పాటిల్‌ గతంలో ఇక్కడి నుంచి పార్టీ తరఫున చట్టసభలకు ప్రాతినిధ్యం వహించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం హస్తం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. భాజపా అభ్యర్థి సునీల్‌ బలిరాం గైక్వాడ్‌.. కాంగ్రెస్‌ నేత దత్తాత్రయ్‌ గుండేరావ్‌పై రెండు లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ తరఫున మచ్చింద్ర కామత్‌, కమలనాథుల అభ్యర్థిగా సుధాకర్‌ శ్రంగేర్‌ బరిలో నిలిచారు. నియోజకవర్గ సమస్యలు తీర్చడంలో అటు కాంగ్రెస్‌, ఇటు భాజపా ప్రభుత్వాలు విఫలమైన నేపథ్యంలో ఈ దఫా లాతూర్‌వాసులు ఏ పార్టీకి పట్టం కడతారనేదానిపై ఉత్కంఠ నెలకొంది. 

ఉస్మానాబాద్‌.. సర్వత్రా ఉత్కంఠ 
ఉస్మానాబాద్‌ ప్రధానంగా వ్యవసాయ ఆధారిత నియోజకవర్గమే. మరాఠ్వాడాలోని ఇతర జిల్లాల తరహాలోనే ఇక్కడా దశాబ్దాలుగా కరవు వేధిస్తోంది. లాతూర్‌తో పోలిస్తే మాత్రం ప్రస్తుతం ఉస్మానాబాద్‌లో రాజకీయ కోలాహలం ఎక్కువగా కనిపిస్తోంది. అందుకు కారణం.. ఒకే కుటుంబానికి చెందిన(వరుసకు సోదరులు) ఓమ్‌రాజే నింబాల్కర్‌, రానాజగ్జీత్‌ సిన్హా పాటిల్‌ ప్రస్తుతం ఇక్కడ ఎంపీ పదవి కోసం పోటీ పడుతుండటం. నింబాల్కర్‌ శివసేన తరఫున, పాటిల్‌ ఎన్సీపీ నుంచి పోటీలో ఉన్నారు. నింబాల్కర్‌ తండ్రి పవన్‌రాజే హత్య కేసులో పాటిల్‌ తండ్రి పదమ్‌సిన్హా నిందితుడు. దీంతో ఈ ఎన్నికల ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఉస్మానాబాద్‌ స్థానంలో నింబాల్కర్‌పై విజయం సాధించడం పాటిల్‌కు సానుకూలాంశం. అదే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో పదమ్‌సిన్హా పరాజయం పాలవ్వడం గమనార్హం. 

సానుభూతి పనిచేస్తుందా? 
నియోజకవర్గంలో శివసేన, భాజపా, ఎన్సీపీ, కాంగ్రెస్‌ బలాబలాలు కాస్త అటూఇటుగా దాదాపు సమానమే. గత సార్వత్రిక ఎన్నికల్లో మోదీ హవా తోడు కావడంతో భాజపా-ఎన్సీపీ కూటమి అభ్యర్థి ఘన విజయం సాధించారు. ప్రస్తుతం మోదీ హవా పెద్దగా లేనప్పటికీ, తండ్రి హత్యకు గురైన నేపథ్యంలో నింబాల్కర్‌కు సానుభూతి ఓట్లు ఈ ఎన్నికల్లో కలిసొచ్చే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఉస్మానాబాద్‌లో ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ వ్యక్తిగత ప్రాబల్యం ఎక్కువ. ఇక్కడ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడంపై ఆయన ప్రత్యేక దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. హోరాహోరీ పోరు ఖాయమని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఈ ఎన్నికల్లో ఉస్మానాబాద్‌లో వ్యవసాయ సంక్షోభం, ఇతర సమస్యల కంటే రాజకీయపరమైన అంశాలే ఎక్కువ ప్రభావం చూపే అవకాశముందని చెబుతున్నారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.