close

ప్ర‌త్యేక క‌థ‌నం

రైళ్లలో ‘ఇబ్బంది’కర ప్రయాణం! 

బోగీల్లో మొదలైన నీటి కొరత 
కొన్నిచోట్ల సరిగా నింపక, మరి కొన్నిచోట్ల అధిక నీటి వాడకంతో 
కాలకృత్యాలు, ఇతర అవసరాలకు సరిపోక ప్రయాణికుల ఇక్కట్లు 
ఈనాడు, హైదరాబాద్‌, విశాఖపట్నం రైల్వేస్టేషన్‌, న్యూస్‌టుడే

దూరప్రాంత రైళ్లలో రిజర్వేషన్‌ దొరకడం ఒక ఎత్తయితే, గమ్యం చేరేవరకు ఇబ్బందులు లేకుండా ప్రయాణించడం మరో ఎత్తు. గంటల తరబడి ప్రయాణంలో మల, మూత్ర విసర్జనకు వెళ్లడం, రాత్రి ప్రయాణమైతే తెల్లవారుజామున పళ్లు తోముకోవడం వంటి అవసరాలు ఉంటాయి. వేసవిలో నీటి వాడకం మరింత అధికంగా ఉంటుంది. అందుకు అనుగుణంగా నీళ్లను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలి. ఈ మేరకు ఏర్పాట్లు పెరగకపోగా కొన్ని రైళ్లలో ప్రయాణం మధ్యలో నీళ్లు అయిపోతున్నాయి. మల మూత్ర విసర్జనకు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. టాయిలెట్లు దుర్గంధభరింతగా మారుతున్నాయి. 

ఆ మార్గాల్లో నీటి కొరత 
రైలు బయల్దేరిన స్టేషన్‌లో అన్ని బోగీలకు నీళ్లు నింపుతారు. ప్రయాణ దూరాన్ని బట్టి మధ్య మధ్య స్టేషన్లలో కొన్నిచోట్ల పూర్తిస్థాయిలో, మరికొన్ని చోట్ల పాక్షికంగా నీళ్లు నింపే ఏర్పాట్లు ఉన్నాయి. వివిధ కారణాలరీత్యా ప్రయాణికుల అవసరాలకు తగ్గట్లు నీళ్లు నింపకపోవడంతో టాయిలెట్లు, వాష్‌బేసిన్లలో నీటి సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా ఉదయం లేవగానే కొన్ని రైలు బోగీల్లో టాయిలెట్లకు వెళ్లడానికి, ముఖం కడుక్కోవడానికి నీళ్లు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటల ప్రయాణం తర్వాత వచ్చే స్టేషన్లలో నీళ్లు నింపేవరకు ఉగ్గుబట్టుకుని కూర్చుంటున్నారు. గుంతకల్లు-దొనకొండ మార్గం, వాడి-వికారాబాద్‌, నిజామాబాద్‌-ముద్కేడ్‌ సెక్షన్‌, ఔరంగాబాద్‌-జాల్నా వంటి మార్గాల్లో.. మహబూబ్‌నగర్‌-కర్నూలు మధ్య, కడప.. శ్రీకాకుళం, పలాస తదితర స్టేషన్లలో సాధారణంగానే నీటి లభ్యత తక్కువగా ఉంటుంది. వేసవి ప్రభావంతో ఈ సమస్య మరింత పెరుగుతోంది. దీంతో ఈ మార్గాల్లో తిరిగే రైళ్లకు దారి మధ్యలో నీళ్లు నింపడం లేదు. ఫిర్యాదులు బాగా వచ్చి ప్రత్యేకంగా అడిగితేనే కొన్ని బోగీలకు నీళ్లు నింపి పంపిస్తున్నారు. 

కారణాలు ఏంటి? 
ప్రధాన స్టేషన్లలో కొన్నిసార్లు పూర్తిస్థాయిలో నీళ్లు పట్టడం లేదు. ఎక్కువ రైళ్లకు 24 బోగీలుంటాయి. అందుకు తగ్గట్లు కొన్ని స్టేషన్లలో సిబ్బంది లేరు. ఒకేసారి రెండు రైళ్లు వచ్చినప్పుడు ప్లాట్‌ఫారాల మధ్య ఎక్కువ దూరం ఉంటే ఈ సిబ్బందే అక్కడికి వెళ్లాల్సి రావడం, సమయం చాలక కొన్నింటికి సరిపెట్టడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. వేసవి ప్రభావంతో కొన్ని స్టేషన్లకు నీటి సరఫరా తగ్గింది. కొందరు ప్రయాణికులు నీటిని వృథా చేయడం కూడా ఓ కారణమే. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలకు రాకపోకలు సాగించే రైళ్లలో కొందరు ప్రయాణికులు.. వేసవి వేడిని తట్టుకునేందుకు బోగీల్లోనే స్నానం చేస్తున్నారు. నల్లాల లీకేజీల కారణంగానూ 20 శాతం నీరు వృథా అవుతుందని ఓ నిపుణుడు పేర్కొన్నారు. 
సికింద్రాబాద్‌లో బయల్దేరిన రైలుకు మళ్లీ నీళ్లు పట్టే సదపాయం గుంటూరులోనో, విజయవాడలోనో ఉంది. మార్గమధ్యలో నీళ్లు అయిపోతే అంతే. దిల్లీ వైపు వెళ్లే రైళ్లకు సికింద్రాబాద్‌ తర్వాత మహారాష్ట్రలోని బళ్లార్ష స్టేషన్‌లోనే నీళ్లు నింపుతారు. 
జనరల్‌ బోగీల్లో కనీసం వందకుపైనే ప్రయాణికులుంటారు. వేసవిలో ప్రయాణాలు అధికంగా ఉంటాయి. ప్రయాణికుల పెరగడం మూలంగా నీళ్లు త్వరగా అయిపోతుంటాయి. 
విశాఖపట్నంలో బయల్దేరిన రైలుకు మళ్లీ నింపేది విజయవాడలోనే. మధ్యలో రాజమహేంద్రవరంలో గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నప్పటికీ ప్లాట్‌ఫారాల కొరత. ఒక బండిని ఆపి నీళ్లు ఎక్కిస్తే వెనుక గోదావరి వంతెనపై రైళ్లను నిలిపివేయాల్సి ఉంటుంది. 
బెంగళూరు నుంచి బయల్దేరి రైలు కాచిగూడకు చేరేందుకు 12 గంటల సమయం పడుతుంది. గుంతకల్లుకు 6 గంటల్లో రైలు చేరుతుంది. కానీ అక్కడ అన్ని బండ్లకు నీళ్లు పట్టడం లేదు. విజయవాడ వైపు వెళ్లే రైళ్లకయితే.. గుంతకల్లు, నంద్యాల తర్వాత దొనకండలోనే నీటి సదుపాయం ఉంది. 
విజయవాడ మీదుగా వెళ్లే ప్రతిరైలుకు ఈ స్టేషన్‌లో నీళ్లు నింపుతారు. గౌతమి వంటి కొన్ని రైళ్లు విజయవాడకు వెళ్లకుండా రాయనపాడు మీదుగా మళ్లిస్తున్నారు. అక్కడ బోగీల్లో నీళ్లు నింపే ఏర్పాట్లు ఇంకా చేయకపోవడంతో ఆ మార్గంలో వెళ్లే రైళ్లలో నీటికొరత వస్తోంది. 
వేగంగా నింపే ఏర్పాట్లు 
ఒక రైల్లో అన్ని బోగీల్లో నీళ్లు నింపడానికి 15-20 నిమిషాలు పడుతుంది. సికింద్రాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం వంటి స్టేషన్లు మినహా మిగిలిన ప్రధాన స్టేషన్లలో 5 నిమిషాలు, చాలాస్టేషన్లలో 2 నిమిషాలే రైలు ఆగుతుంది. నీళ్లు నింపే సమయాన్ని తగ్గించేందుకు ఎక్కువ అశ్వికశక్తి కలిగిన మోటార్లు, వెడల్పు అధికంగా ఉండే పైపులతో నీళ్లు పట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వేవర్గాలు చెబుతున్నాయి.

నానా అవస్థలు పడ్డాం

ర్నాకుళం-పాట్నా ఎక్స్‌ప్రెస్‌లో బుధవారం ఉదయం 10 గంటల నుంచి ఎస్‌-2,3,4తోపాటు మరికొన్ని బోగీల్లో నీళ్లు లేవు. టాయిలెట్లు, వాష్‌బేసిన్లలో నీళ్లు రాక నానా అవస్థలు పడ్డాం. టాయిలెట్లలో తీవ్ర దుర్వాసన. టికెట్‌ తనిఖీ అధికారికి చెప్పినా ఫలితం లేదు.

-కుమార్‌, ప్రయాణికుడు

ఎవరూ పట్టించుకోలేదు

పాట్నా వెళ్లేందుకు ఎర్నాకుళంలో రైలు ఎక్కా. రైలు విజయవాడకు వచ్చినప్పటినుంచి మలవిసర్జనకు ప్రయత్నం చేశా. ముందువెనుక స్లీపర్‌ బోగీల్లో నీళ్లు లేవు. ఎవరికి చెప్పినా పట్టించుకోలేదు. రాత్రి 8.20 గంటలకు విశాఖపట్నం చేరుకున్నాక అతికష్టం మీద జనరల్‌ బోగీలోకి వెళ్లి ఇబ్బంది తీర్చుకున్నా. 

- రాయ్‌, ప్రయాణికుడు

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.