close

ప్ర‌త్యేక క‌థ‌నం

శతాబ్ది వేళ.. వన్నెతరగని కళ

హైకోర్టు భవనానికి వందేళ్లు 
20న ఘనంగా శతాబ్ది ఉత్సవాలు 
హాజరవనున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 
ఈనాడు - హైదరాబాద్‌

హిందూ-ఇస్లామిక్‌ సంప్రదాయ రీతిలో చూపరులను కట్టిపడేసే నిర్మాణమది. గులాబీ రంగు గ్రానైట్‌, రాతితో నిర్మించిన అద్భుత కళా ఖండమది. అది నిజాం కాలం నాటి కళా నైపుణ్యాలకు నిలువెత్తు సాక్ష్యం. నిర్మాణం పూర్తయి వందేళ్లయినా చెక్కుచెదరని ఆ భవనరాజం. అగ్నిప్రమాదం జరిగినా వన్నె తగ్గని ఉన్నత న్యాయస్థానం భవనమది. 
మూసీ నది ఒడ్డున అత్యంత సుందరంగా నిర్మించిన హైకోర్టు భవనం శత వత్సర వేడుకలకు ముస్తాబవుతోంది. హైదరాబాద్‌ ఏడవ నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ 1920 ఏప్రిల్‌ 20న హైకోర్టు భవనాన్ని ప్రారంభించారు. 1915 ఏప్రిల్‌ 15న ప్రారంభమైన ఈ భవన నిర్మాణం 1919 మార్చి 31నాటికి పూర్తయినా 1920 ఏప్రిల్‌ 20న అధికారికంగా ప్రారంభమైంది. 
పత్తర్‌ఘట్టి నుంచి సైఫాబాద్‌ మీదుగా.. 
నిజాం కాలంనాటి హైదరాబాద్‌పై బ్రిటిష్‌ ప్రభావం ఎక్కువగా ఉండేది. 1800 అక్టోబరులో ఈస్టిండియా కంపెనీతో నిజాం ఒప్పందం కుదుర్చుకున్నారు. అప్పట్లో నిజాం కోర్టు కూడా బ్రిటిష్‌ వారి ఆధ్వర్యంలోనే జరిగేది. సాలార్‌ జంగ్‌ హైదరాబాద్‌ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు సరికొత్త న్యాయవ్యవస్థను రూపొందించారు. హైకోర్టు మొదట పత్తర్‌ఘట్టిలో ఉండగా 1909లో వరదలు రావడంతో లాల్‌బాగ్‌లోని నవాబ్‌ సర్‌ ఆస్మాన్‌ జా దేవిడిలోకి మారింది. 1912లో కలరా వ్యాపించడంతో దేవిడి నుంచి పబ్లిక్‌ గార్డెన్‌ లోకి, 4 నెలల తరువాత చత్తాబజార్‌ లక్కడ్‌కోట్‌లోని సాలార్‌ జంగ్‌ బహదూర్‌ నివాసంలోకి తరలించారు. అక్కడ అనువుగా లేకపోవడంతో 1914లో సైఫాబాద్‌లో నవాబ్‌ సత్రజ్‌ జంగ్‌ నుంచి భవనాన్ని అద్దెకు తీసుకుని అక్కడికి మార్చారు. ఈ దశలోనే భవన నిర్మాణ ఆలోచనకు అంకురార్పణ జరిగింది. 

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా.. 
జైపూర్‌కు చెందిన ఇంజినీరు, ఆర్కిటెక్ట్‌ శంకర్‌లాల్‌ హైకోర్టు భవన నమూనాను రూపొందించగా స్థానిక ఇంజినీరు మెహర్‌ అలీ ఫజల్‌ నిర్మాణ పనుల నిర్వహణ చేపట్టారు. బ్రిటిష్‌ ఇంజినీరు విన్‌సెంట్‌ జె.ఎక్‌ ప్రపంచం మొత్తం పర్యటించి ఎక్కడా లేని విధంగా భవనం నిర్మాణ ఆకృతి రూపొందించారు. దాదాపు రూ.18,22,750 వ్యయ అంచనాతో నవరతన్‌ దాస్‌ కాంట్రాక్ట్‌ పొందారు. నిజాం నవాబు ఇచ్చిన 300 కిలోల వెండితో హైకోర్టు నమూనాను రూపొందించి భవనానికి తాపడం చేశారు. గులాబీ రంగు గ్రానైట్‌, రాతితో అద్భుత కళా ఖండంగా ఈ భవనాన్ని నిర్మించారు. ఇండో-ఇస్లామిక్‌ సంప్రదాయ రీతిలో డోమ్‌ల ఆకృతి ప్రత్యేక ఆకర్షణగా రూపొందించారు. దీనికి నిదర్శనంగా ఇప్పటికీ భవనం పైభాగంలో రాం-రహీô అన్న పదాలు కనిపిస్తుంటాయి. భవన నిర్మాణం, రాతి శిల్పాలన్నీ నిజాంల నాటి కళా నైపుణ్యానికి అద్దంపట్టేలా ఉన్నాయి. మొదట ఆరుగురు జడ్జీలు, బార్‌ అసోసియేషన్‌కు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టారు. 1958 జులై 10న అదనంగా మరో రెండు బ్లాక్‌లను నిర్మించారు. 1976లో మరో బ్లాక్‌, 1998లో బహుళ అంతస్తుల పరిపాలనా భవనాలను నిర్మించారు. హైకోర్టు భవనం పక్కనే నిజాం కాలం నుంచి సేవలందిస్తున్న జజ్గీఖానా (ప్రసూతి ఆస్పత్రి)ను మరో ప్రాంతానికి తరలించి ఆస్పత్రికి చెందిన 9.5 ఎకరాలను 2009లో హైకోర్టుకు అప్పగించారు. అక్కడ ప్రత్యేక బ్లాకు నిర్మాణం చేపట్టారు. 

ఒకే భవనంలో వివిధ పేర్లతో కొనసాగిన హైకోర్టు 
నిజాం కాలంలో రాయల్‌ ఛార్టర్‌ కింద కొనసాగిన న్యాయస్థానంలో 1928 హైకోర్టు యాక్ట్‌ కింద బెంచ్‌లను ఏర్పాటు చేసి కేసుల విచారణ మొదలుపెట్టారు. అప్పీళ్లపై విచారణకు జ్యుడిషియల్‌ కమిటీ ఏర్పాటైంది. స్వాతంత్య్రం అనంతరం హైదరాబాద్‌ విలీనం తరువాత హైకోర్ట్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ పేరుతో కొనసాగింది. 1956లో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇదే భవనంలో దీపావళి, రంజాన్‌ పండుగల సందర్భంగా 1956 నవంబరు 5న 11 మంది జడ్జీలతో ప్రారంభమైంది. హైదరాబాద్‌ నుంచి 6, హైదరాబాద్‌ రాష్ట్రం నుంచి అయిదుగురు న్యాయమూర్తులతో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఏర్పాటైంది. మొదటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కోకా సుబ్బారావు, మొదటి అడ్వొకేట్‌ జనరల్‌గా దువ్వూరి నరసరాజులు పనిచేశారు. 2014 జూన్‌ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. దీంతో అదే తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు రెండు రాష్ట్రాలకు కలిపి ఉమ్మడి హైకోర్టుగా కొనసాగింది. రాష్ట్రపతి ఉత్తర్వులతో 2019 జనవరి 1న ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు అమరావతిలో ఏర్పాటైంది. ఏపీకి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుకావడంతో తెలంగాణ రాష్ట్ర హైకోర్టుగా కొనసాగుతోంది. న్యాయస్థానాల పేర్లు మారుతూ వస్తున్నా వందేళ్లుగా ఈ భవనం సేవలందిస్తూ వస్తోంది. 
భారీ అగ్నిప్రమాదం 
2009 ఆగస్టు 31న రాత్రి హైకోర్టు ప్రధాన భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. లైబ్రరీ హాలు మొత్తం అగ్నికి ఆహుతైంది. ఇందులో ఇంగ్లీషు లా రిపోర్ట్స్‌, జర్నల్స్‌ అన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. రాష్ట్ర విభజన సమయంలో అప్పటి ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావు పోరాటంతో మద్రాసు హైకోర్టు నుంచి తీసుకువచ్చిన పుస్తకాలన్నీ ఆగ్నికి ఆహుతయ్యాయి. చిత్రాలు, నిజాం కాలం నాటి ఫర్నిచర్‌ కాలిపోయాయి. అనంతరం అదే రూపంలో భవనాన్ని పునరుద్ధరించి 2011 అక్టోబరు 13న ప్రారంభించారు.

సంబరాలకు ఏర్పాట్లు

హైకోర్టు భవనానికి వందేళ్లు పూర్తయిన సందర్భంగా శతాబ్ది ఉత్సవ సంబరాలను నిర్వహించాలని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌తో కలిసి న్యాయమూర్తులందరూ నిర్ణయించారు. ఈమేరకు ఏర్పాట్లన్నీ  చురుగ్గా కొనసాగుతున్నాయి. శనివారం సాయంత్రం జరిగే ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు నుంచి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌రెడ్డి, జస్టిస్‌ లావు నాగేశ్వరరావులు హాజరుకానున్నారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.