close

ప్ర‌త్యేక క‌థ‌నం

రాజధానికి మరో మెట్రో హారం

కొత్తగా బీహెచ్‌ఈఎల్‌ నుంచి గచ్చిబౌలి మీదుగా  లక్డీకాపూల్‌ వరకు నిర్మాణం
29 కిలోమీటర్ల పొడవునా ఏర్పాటు
డీపీఆర్‌ సిద్ధం చేస్తున్న దిల్లీ మెట్రో సంస్థ్చ

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి: హైదరాబాద్‌ మహానగరంలోని కీలక ప్రాంతాలను కలిపే మూడో దశ మెట్రో రైలు నిర్మాణానికి రంగం సిద్ధమవుతోంది. 29 కిలోమీటర్ల పొడవున నిర్మించే ఈ కొత్త లైను కోసం దిల్లీ మెట్రో రైలు సంస్థ వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (డీటైల్డు ప్రాజెక్టు రిపోర్టు-డీపీఆర్‌) సిద్ధం చేసే పనిలో పడింది.బీహెచ్‌ఈఎల్‌ నుంచి గచ్చిబౌలి మీదుగా లక్డీకాపూల్‌ వరకు తీసుకొచ్చి ప్రస్తుత మెట్రో లైనులో కలిపేలా డీపీఆర్‌ సిద్ధమవుతోంది. హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ), హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ (హెచ్‌ఎంఆర్‌ఎల్‌) తోడ్పాటు అందించబోతున్నాయి.  హెచ్‌ఎంఆర్‌ఎల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి, బల్దియా ఇంజినీరింగ్‌ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
* మెట్రో మొదటి దశలో 72 కిలో మీటర్ల పొడవున లైను నిర్మించాల్సి ఉండగా 56 కిలో మీటర్ల నిర్మాణం దాదాపుగా పూర్తయింది. ఇప్పటికే మియాపూర్‌-ఎల్బీనగర్‌, హైటెక్‌ సిటీ నుంచి నాగోలు కారిడార్‌లో మెట్రో రైళ్లు తిరుగుతున్నాయి.
* రెండో దశలో గచ్చిబౌలి నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు 22 కిలో మీటర్ల పొడవున మెట్రో లైనును నిర్మించడానికి ఇప్పటికే రంగం సిద్ధమైంది. డీపీఆర్‌ రాష్ట్ర ప్రభుత్వానికి అందింది. దీనిపై రేపోమాపో ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది.
* మూడో దశ కింద కూడా 29 కిలో మీటర్ల మెట్రో లైను నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నది రాష్ట్ర ప్రభుత్వ తాజా ఆలోచన. దిల్లీ మెట్రో రైలు సంస్థ ఇప్పటికే క్షేత్రస్థాయిలో పరిశీలన చేసింది. ఏ రూటులో మెట్రో లైను నిర్మిస్తే నగర ప్రజలకు రవాణా అందుబాటులో ఉంటుందో ఒక అవగాహనకు వచ్చింది.

మూడో దశ మెట్రో ఇలా..
బీహెచ్‌ఈఎల్‌ దగ్గర మెట్రోరైలు ఎక్కితే చందానగర్‌ మీదుగా ఆల్విన్‌ క్రాస్‌ రోడ్డు వరకు జాతీయ రహదారిలో ప్రయాణం సాగుతుంది. తర్వాత హఫీజ్‌పేట వైపు తిరుగుతుంది. కొత్తగూడ, గచ్చిబౌలి, బయోడైవర్శిటీ, కాజగూడ, విస్పర్‌వ్యాలీ, టోలీచౌక్‌, రేతిబౌలి, మెహిదీపట్నం, మాసాబ్‌ట్యాంక్‌ మీదుగా లక్డీకాపూల్‌ చేరుకుంటుంది. అక్కడ ప్రస్తుతం ఉన్న మెట్రోలైనులో కలుస్తుంది.

మియాపూర్‌ నుంచి ఆల్విన్‌ కాలనీ వరకు కూడా
మియాపూర్‌ ప్రధాన స్టేషన్‌ నుంచి బీహెచ్‌ఈఎల్‌ లైనును అనుసంధానించేందుకు వీలుగా మియాపూర్‌ నుంచి ఆల్విన్‌ కాలనీ వరకు దాదాపు రెండు కిలో మీటర్ల మేర కొత్త లైను నిర్మించాలని యోచిస్తున్నారు. ఈ కొత్త లైనును పూర్తి చేస్తే బీహెచ్‌ఈఎల్‌ స్టేషన్‌లో ఎక్కిన ప్రయాణికుడు మియాపూర్‌ మీదుగా ఎల్బీనగర్‌ వెళ్లే అవకాశం ఏర్పడుతుంది. ఆల్విన్‌ కాలనీ క్రాస్‌ రోడ్డు స్టేషన్‌ను మెట్రో జంక్షన్‌ స్టేషన్‌గా మార్చబోతున్నారు. బీహెచ్‌ఈఎల్‌ నుంచి ఒక వైపు ఎల్బీనగర్‌ వరకు, మరోవైపు గచ్చిబౌలి వరకు వెళ్లేలా రెండు రూట్లు ఏర్పడతాయి.

ఆ ఇబ్బంది లేకుండా...
మొదటి దశలో మూడు కారిడార్ల కింద మెట్రోను నిర్మించారు. పదేళ్ల కిందట మెట్రో లైను ఎలైన్‌మెంట్‌ నిర్ధారణ సమయంలో ఆనాటి ప్రభుత్వం బల్దియాకు బాధ్యతలను అప్పగించకపోవడంతో రోడ్డు మధ్యలో మెట్రో నిర్మాణం చేస్తూ వెళ్లిపోయారు. దీనివల్ల ఈ మెట్రో రూట్‌లో దాదాపు 70 జంక్షన్లలో ట్రాఫిక్‌ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఖైరతాబాద్‌లాంటి నాలుగు రోడ్ల కూడలిలో ఫ్లైఓవర్‌లను నిర్మించాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. వాటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇప్పుడు కీలకమైన నిర్ణయం తీసుకుంది. డీపీఆర్‌ ఇచ్చే బాధ్యతను దిల్లీ మెట్రో లైను సంస్థకు అప్పగించగా దీనికి హెచ్‌ఎంఆర్‌ఎల్‌, జీహెచ్‌ఎంసీ సహకరించాలని ఆదేశించింది. అందుకే ఈ మూడు సంస్థలు ఉమ్మడిగా క్షేత్రస్థాయిలో పరిశీలించాయి. మొదటి దశలోలా కాకుండా బీహెచ్‌ఈఎల్‌ మెట్రో లైను నిర్మాణంతోపాటే ప్రధాన జంక్షన్లలో ఫ్లైఓవర్‌లను నిర్మించాలని అనుకుంటున్నారు. ఈ కొత్త మెట్రో మార్గంలోని కొత్తగూడలో రూ.260 కోట్లతో, బయోడైవర్శిటీ దగ్గర రూ.100 కోట్లతో, షేక్‌పేట దగ్గర రూ.330 కోట్లతో ప్రస్తుతం ఫ్లైఓవర్‌ల నిర్మాణాన్ని జీహెచ్‌ఎంసీ ప్రారంభించింది. ఈ నిర్మాణాలకు ఇబ్బంది లేకుండా మెట్రో లైను వెళ్తుంది. ఇదే మార్గంలో గచ్చిబౌలి జంక్షన్‌ దగ్గర, రేతిబౌలి దగ్గర ఫ్లైఓవర్‌లను నిర్మించాలని బల్దియా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. మెట్రో ప్రణాళికకు ఇబ్బంది లేకుండా ఈ ప్రాజెక్టుతో కలిపి వీటిని చేపడితే బాగుంటుందన్న ఉద్దేశంలో ఉన్నామని సచివాలయవర్గాలు తెలిపాయి. అలానే మరికొన్ని జంక్షన్లలో ఫ్లైఓవర్‌లతోపాటు, అండర్‌ పాస్‌లను మెట్రో లైను నిర్మాణంతోపాటు చేపట్టాలని భావిస్తున్నామని వివరించాయి. ఇవన్నీ వాస్తవరూపం దాల్చితే ట్రాఫిక్‌ ఇబ్బంది లేకుండా మెట్రోరైలుతో సమానమైన వేగంతో వాహనదారులు కూడా ప్రయాణించే అవకాశం ఉందని చెబుతున్నారు.

20 కిలోమీటర్ల మేర అవసరం లేని భూసేకరణ
కొత్తగా ప్రతిపాదిస్తున్న 29 కిలో మీటర్ల లైనులో 20 కిమీ మేర అసలు భూసేకరణ చేయాల్సిన అవసరం లేదని అధికారులు తేల్చారు. మొదటి దశలో భూసేకరణ వల్లే ప్రాజెక్టు చాలా ఆలస్యమైంది. ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు చాలా వరకు భూసేకరణ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని కాంట్రాక్టు సంస్థకు అప్పగిస్తే వేగంగా నిర్మాణం చేయడానికి వీలుపడుతుందని హెచ్‌ఎంఆర్‌ఎల్‌ ఇంజనీర్లు చెబుతున్నారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.