close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఏమిటీ పరీక్ష.. చావేనా శిక్ష?

ఇంటర్‌ తప్పినందుకు ఆరుగురు విద్యార్థుల ఆత్మహత్య
తల్లిదండ్రుల దృక్పథమూ మారాలంటున్న నిపుణులు
విద్య మానసికంగా శక్తిమంతుల్ని చేసేలా ఉండాలని సూచన

‘ఓడిపోయినప్పుడు వినమ్రంగా అంగీకరించడాన్ని నేర్పండి.. గెలిచినప్పుడు మనస్ఫూర్తిగా ఎలా ఆనందించాలో చెప్పండి.. ఓటమిలో కూడా కీర్తి ప్రతిష్ఠలు ఉండవచ్చనీ, గెలుపులో నిరాశ ఉండవచ్చనీ వివరించండి….. ఆత్మవిశ్వాసం, ధైర్యం, ఓర్పు గురించి తెలపండి…. విచారంగా ఉన్నప్పుడు నవ్వటం ఎలానో తెలియజేయండి.. కన్నీళ్లు కార్చడం అవమానమేమీ కాదని తెలిసేలా బోధించండి’
 
- ఎప్పుడో 19వ శతాబ్దంలో అబ్రహంలింకన్‌ తన కుమారుడిని పాఠశాలలో చేర్పిస్తూ స్కూలు టీచరుకు రాసిన లేఖలోని సారాంశమిది.
ఇప్పుడు 21వ శతాబ్దంలో ఉన్నాం. మరి మన విద్యార్థులకు ఏం నేర్పుతున్నాం. పరీక్షలే పరమావధిగా మారిన వ్యవస్థలో తప్పామని చిన్నారులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే తప్పెవరిది? మన విద్యావ్యవస్థదా? ప్రభుత్వానిదా? తల్లిదండ్రులదా?

ఇంటర్‌ పరీక్షల ఫలితాలు వచ్చిన కొద్దిగంటల్లోనే రాష్ట్రవ్యాప్తంగా ముగ్గురు ఆత్మహత్యలకు పాల్పడి మృత్యు ఒడి చేరగా.. శుక్రవారం మరో ముగ్గురు తనువు చాలించారు. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు.

ఈనాడు - హైదరాబాద్‌

రీక్షలు పిల్లలకు ప్రాణాంతకంగా మారుతున్నాయి. పరీక్ష తప్పిన తర్వాత తల్లిదండ్రులకు ఎలా ముఖం చూపించాలన్న సంశయం..వారి నుంచి ప్రతికూల స్పందన వస్తుందన్న భయం...అందరూ చిన్నచూపు చూస్తారన్న భావన...వారి బలవన్మరణానికి కారణమవుతోంది. కళాశాలలు, విద్యాశాఖ సైతం పరీక్షల సమయంలో పిల్లల ఒత్తిడిని పట్టించుకోవడంలేదు. కనీసం కౌన్సెలింగ్‌ చేసే దిశగా కూడా ఆలోచించడం లేదు.

ప్రథమ ఇంటర్‌ వారే..
గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి ఇంటర్‌ పరీక్షల ఫలితాలు రాష్ట్రంలో విషాదాన్ని నింపాయి. సాధారణంగా కార్పొరేట్‌ కళాశాలల్లో చదివే వారిపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈసారి ఆత్మహత్యకు పాల్పడిన ఆరుగురిలో ఎయిడెడ్‌, సాధారణ కళాశాలల్లో చదివిన వారే నలుగురున్నారు.

* వరంగల్‌జిల్లా కాజీపేటదర్గా విద్యార్థి  ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలో తప్పడంతో శుక్రవారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

* నిజామాబాద్‌ జిల్లా బోధన్‌కు చెందిన ఓ విద్యార్థిని ఇంటర్‌ రెండో సంవత్సరంల రెండు సబ్జెక్టుల్లో తప్పడంతో గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది.

* హైదరాబాద్‌లోని బన్సీలాల్‌పేటకు చెందిన బాలిక  ప్రథమ సంవత్సరం పరీక్షల్లో తప్పడంతో గురువారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

* హైదరాబాద్‌లోని ఏఎస్‌రావు నగర్‌కు చెందిన విద్యార్థి ఇంటర్‌ ప్రథమ ఎంపీసీ గ్రూపులో తప్పడంతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

* నగరంలోనివెస్ట్‌మారేడ్‌పల్లికి చెందిన విద్యార్థిని గణితంలోఫెయిలయ్యాననిశుక్రవారం ఉరి వేసుకుంది.

* కామారెడ్డిజిల్లారామారెడ్డి మండలకేంద్రానికి చెందిన రెండో సంవత్సరం విద్యార్థిని రెండు సబ్జెక్టులు తప్పడంతో శుక్రవారం రాత్రి తనువు చాలించింది.

* వరంగల్‌జిల్లా సంగెంలో ఇంటర్‌ ప్రథమసంవత్సరంలో ఒక సబ్జెక్టు తప్పడంతో  ఓ విద్యార్థి విష గుళికలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు.

* మొదటి సంవత్సరం ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల విద్యార్థిని పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

నిపుణులు చెప్పే కారణాలు

* ఇదే చదవాలి...మీ కోసం అన్నీ సౌకర్యాలు కల్పించాం. అయినా ఎందుకు చదువుకోరు అన్న విధంగా తల్లిదండ్రులు పిల్లల పట్ల వ్యవహరిస్తున్నారు. మేం అన్నీ చేస్తున్నాం కాబట్టి ఉత్తమ మార్కులు, ర్యాంకులు తెచ్చుకోవాలి...పెట్టిన ఖర్చుకు ప్రతిఫలం తీసుకురావాలి అంటూ వ్యాపార దృక్పథంతో ఆలోచిస్తూ పిల్లలపై ఒత్తిడి పెంచుతున్నారు. పిల్లలకు ఏది ఇష్టమో దాన్ని చదువుకోవడానికి అవకాశం ఇవ్వడం లేదు.

* పరీక్షలకు ముందు ఏమాత్రం ఆడుకున్నా...టీవీ చూసినా పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చినా...తప్పినా నీ సంగతి చెబుతా అంటూ కోపగించుకుంటారు. దాంతో దురదృష్టవశాత్తూ తప్పితే అంతకుముందు మాటలు గుర్తుకు వచ్చి ఆత్మహత్యకు పాల్పడుతుంటారు. 

* పరీక్షలు తప్పినప్పుడు తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న ఆశలను వమ్ము చేశామని పిల్లలు భావిస్తున్నారు. 

* విద్యార్థులు అపజయాల్ని తట్టుకునేలా...మానసికంగా దృఢమైన వారిగా మార్చేలా ఇప్పటి విద్య ఉండటం లేదు. పెద్దలూ విజయగాథల్ని చెప్పడం లేదు.

* ప్రభుత్వం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో పరీక్షలు, ఒత్తిడి తదితర అంశాలపై అవగాహన కల్పించడంపై దృష్టి పెట్టడం లేదు. కౌన్సెలింగ్‌ చేయడంపైనా నిర్లక్ష్యం వహిస్తోంది.

* తల్లిదండ్రులు తమ పిల్లల్ని మార్కులు, ర్యాంకుల యంత్రాలుగా చూస్తున్నారు. మార్కులు, ర్యాంకులే విజయానికి కొలమానాలుగా చూస్తున్నారు.

* ఇటీవల కాలంలో పిల్లలు సున్నిత మనస్కులుగా మారుతున్నారని, తాము ఆశించినది జరగకుంటే తట్టుకోని పరిస్థితికి వస్తున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఉచిత కౌన్సెలింగ్‌ ఇస్తాం

ఇంటర్‌ పరీక్షల్లో తప్పి మానసికంగా కలత చెందుతున్న వారికి బాలల హక్కుల సంఘం తరఫున ఉచిత కౌన్సెలింగ్‌ నిర్వహిస్తాం. కౌన్సెలింగ్‌ కావాలనుకునే వారు 9391024242 అనే నంబరుకు ఫోన్‌ చేసి రావొచ్చు. చదవాలి లేదా చావాలి అన్న ధోరణితో వ్యవహరిస్తున్న విద్యాసంస్థలపై క్రిమినల్‌ కేసులు  పెట్టాలి.

- అచ్యుతరావు, గౌరవ అధ్యక్షుడు, బాలల హక్కుల సంఘం

ఇప్పుడు పాసైనా జీవితంలో ఓడిపోతారు

చిన్నప్పటి నుంచి దండించే వాతావరణంలో పెరిగిన వారు పరీక్షలు తప్పినప్పుడు ఆత్మహత్యకు పాల్పడతారు. తల్లిదండ్రులు కొడతారేమో?...సమాజం చిన్నచూపు చూస్తుందేమో?...మిత్రులు, చుట్టుపక్కల వాళ్లు నవ్వుతారేమో?..అన్న మానసిక భయం విద్యార్థులను వెంటాడుతుంది. చిన్నప్పటి నుంచి నీకు ఏమీ చేతకాదు...నీవెప్పుడూ ఇంతే...అన్న మాటల మధ్య పెరిగిన వారిలో ప్రతికూల భావనలు ఎక్కువగా ఉంటాయి. ఒక్కొక్కరిలో ఒక్కో స్థాయిలో సామర్థ్యం ఉంటుంది. అంతకుమించి వారి నుంచి ఆశిస్తే ఒత్తిడికి గురవుతారు. అలాంటి వారిని ప్రోత్సహించే విధానాలు తెలుసుకొని వారిని మానసికంగా బలవంతుల్ని చేయాలి. లేకుంటే ఇప్పుడు మార్కులు ఎక్కువ వచ్చినా ఏదైనా సమస్య ఎదురైనప్పుడు దాన్ని ఎదుర్కోలేరు.  అందుకే సమస్యల్ని తట్టుకునేలా విద్య ఉండాలి.

- డాక్టర్‌ రాధికా ఆచార్య, క్లినికల్‌ సైకాలజిస్టు, మా హాస్పిటల్‌

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.