close

ప్ర‌త్యేక క‌థ‌నం

మోదీ గడ్డపై  ఆడేదెవరు.. ఓడేదెవరు

అన్ని సీట్లలో గెలవడం కమలానికి కష్టమే
అధిక స్థానాల్లో సత్తా చాటాలని కాంగ్రెస్‌ పట్టు
అయితరాజు రంగారావు
గుజరాత్‌ నుంచి ‘ఈనాడు’ ప్రత్యేక ప్రతినిధి

ముఖ్యమంత్రిగా మోదీ అందించిన పాలన ఇప్పుడు గుజరాత్‌లో భాజపాకు కలిసొస్తుందా? గతంలో మాదిరి రాష్ట్రంలోని మొత్తం లోక్‌సభ సీట్లను గెలుచుకుని మళ్లీ సత్తా చాటుతుందా?

భాజపా కంచుకోట, ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో కాంగ్రెస్‌ గట్టి సవాల్‌ విసురుతోంది. సాధ్యమైనన్ని స్థానాలు దక్కించుకొని సత్తా చాటేందుకు పావులు కదుపుతోంది. 12 నియోజకవర్గాల్లో భాజపాకు గట్టిపోటీ ఇస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 26 లోక్‌సభ స్థానాలనూ దక్కించుకొన్న భాజపాకు... ఈసారి ఆ స్థాయి గెలుపు కష్టమేనని విశ్లేషకులు అంటున్నారు. 2017 శాసనసభ ఎన్నికల్లో 99 స్థానాలను దక్కించుకొని బొటాబొటి మెజారిటీతో అధికారం నిలబెట్టుకున్న కమలనాథులకు... ఇప్పుడూ అదే తీరు ఫలితాలు ఎదురవుతాయన్న గుబులు నెలకొంది. గత వైభవాన్ని చాటేందుకు ఆ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. ఈనెల 23న మూడోదశ ఎన్నికల్లో భాగంగా గుజరాత్‌లో పోలింగ్‌ జరుగనున్న క్రమంలో కాంగ్రెస్‌, భాజపాలు జోరుగా ప్రచారం నిర్వహించాయి.

గుజరాత్‌ ముఖ్యమంత్రిగా మోదీ 2001 నుంచి 13 ఏళ్లపాటు సుస్థిర పాలన అందించారు. రాష్ట్రాన్ని ఎక్కువకాలం పాలించిన నేతగా చరిత్రకెక్కారు. పారిశ్రామికాభివృద్ధిలో దేశంలోనే గుజరాత్‌ను ముందుంచారు. 2014లో ఆయన ప్రధాని కావడంలో గుజరాత్‌ పాత్ర కీలమైంది. రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ స్థానాలనూ భాజపాకే కట్టబెట్టి ఆయన పట్ల తమకున్న ప్రేమను గుజరాత్‌ ప్రజలు చాటుకున్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా పురిటిగడ్డ గుజరాతే. ఇంతటి ప్రాధాన్యమున్న రాష్ట్రంలో కాంగ్రెస్‌ నుంచి సవాలు ఎదురుకావడం కాషాయపార్టీకి మింగుడుపడటం లేదు.

కమలానికే పట్టణ ఓటర్ల పట్టం
గుజరాత్‌లో పట్టణ ప్రాంత ఓటర్లు గత శాసనసభ, అంతకుముందు పురపాలక ఎన్నికల్లో భాజపాకు అనుకూలంగా స్పష్టమైన తీర్పునిచ్చారు. 2017 శాసనసభ ఎన్నికల్లో గుజరాత్‌లో లోక్‌సభ కీలక స్థానాలైన అహ్మదాబాద్‌, వడోదర, రాజ్‌కోఠ్‌, సూరత్‌లలో 55 అసెంబ్లీ సీట్లుండగా.. వీటిల్లో పట్టణ ప్రాంతాలెక్కువ కావడంతో భాజపా 44 సీట్లు దక్కించుకుంది. గ్రామీణులు ఎక్కువగా ఉన్న స్థానాలు 127 కాగా, వీటిల్లో కాంగ్రెస్‌ 72, భాజపా 55 సీట్లు గెలుపొందాయి. సౌరాష్ట్ర పరిధిలోని జునాగఢ్‌, అమ్రేలీ, సురేంద్రనగర్‌ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో కాంగ్రెస్‌ అత్యధిక సీట్లను సాధించింది. అంతకుముందు అహ్మదాబాద్‌, వడోదరా, రాజ్‌కోట్‌, సూరత్‌, జామ్‌నగర్‌, భావనగర్‌... మొత్తం ఆరు పురపాలికల్లోనూ భాజపానే విజయకేతనం ఎగురవేసింది.

మోదీ నామస్మరణే

మోదీని మళ్లీ ప్రధానిని చేయడం ద్వారా దేశంలో సుస్థిరపాలన కొనసాగుతుందని భాజపా చెబుతోంది. గుజరాత్‌లో ఆయన చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు గుర్తుచేస్తోంది. రాష్ట్రంలో అత్యధిక సీట్లను అందించడం ద్వారా మోదీకి బాసటగా నిలవాలని పిలుపునిస్తోంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి పట్ల ప్రజల్లో మోదీపై సానుకూలతే వ్యక్తమవుతోంది. క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం ఉండటం భాజపాకు కలిసొచ్చే అంశం. ఇప్పటికే 5 వేల జనాభాకు ఒకటి చొప్పున మొత్తం 9,500 శక్తి కేంద్రాలను ఆ పార్టీ నెలకొల్పింది. అయితే గ్రామాల్లో ఈ నినాదాన్ని వర్తింపజేయడంలో మాత్రం విఫలమవుతోంది. ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో జరిగినంత అభివృద్ధి గ్రామాల్లో జరగలేదు. ఇప్పటికీ చాలా గ్రామాల్లో సాగునీరు, తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. వ్యవసాయానికి తగినంత కరెంటును ఇవ్వడం లేదనే అసంతృప్తి రైతుల్లో ఉంది. కనీస మద్దతు ధర లేకపోవడంతో ఇటీవల సచివాలయం వద్ద రైతులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు కూడా. గ్రామీణ యువతలో... ముఖ్యంగా దళితుల్లో నిరుద్యోగ సమస్య ప్రధానంగా మారింది. గ్రామీణంలో వైద్యసేవలు కూడా తూతూమంత్రంగా ఉన్నాయి. రాష్ట్రంలో 8.6 శాతమున్న ఆదివాసీల్లో 90 శాతానికి పైగా ప్రజలు ఇంకా పేదరికంలోనే మగ్గుతున్నారు. వీరందరి ఓట్లు భాజపాకు వ్యతిరేకంగా పడే అవకాశాలున్నాయి.

* రాష్ట్రంలో 9.5 శాతమున్న ముస్లింలు ఏళ్ల తరబడి కాంగ్రెస్‌ పక్షాన నిలబడుతున్నారు. కానీ 30 ఏళ్లుగా ఒక్క ముస్లిం కూడా లోక్‌సభకు ఎన్నికవలేదు. బరూచ్‌ నుంచి అహ్మద్‌పటేల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా 1977, 1982, 1984లో గెలుపొందారు. అప్పట్నుంచి మరే ముస్లిం అభ్యర్థి ఎన్నికవలేదు. ఈసారి ఆ స్థానం నుంచి షేర్‌ఖాన్‌ పఠాన్‌ను కాంగ్రెస్‌ నిలబెట్టింది.

* 26 లోక్‌సభ స్థానాలకు పోటీపడుతున్న కాంగ్రెస్‌, భాజపా అభ్యర్థుల్లో కేవలం ఐదుగురు మినహా మిగిలిన అందరూ కోటీశ్వరులే. ఈ ఐదుగురిలో నలుగురు ఆదివాసీలే కావడం గమనార్హం.

భాజపా అనుకూల నియోజకవర్గాలు

1.రాజ్‌కోఠ్‌ 2.పంచమహల్‌ 3.భావ్‌నగర్‌ 4.అహ్మదాబాద్‌ తూర్పు 5.అహ్మదాబాద్‌ పశ్చిమ 6.గాంధీనగర్‌ 7.ఖేడా 8.బరూచ్‌ 9.సూరత్‌ 10. బార్డోలీ 11.వడోదరా 12.దాహోద్‌ 13.వాల్సాడ్‌ 14.నవ్‌సాడ్‌.

అసంతృప్తి ఎందుకు?

ఆనందీబెన్‌ పటేల్‌ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో లుకలుకలు ప్రారంభమయ్యాయి. ఆమె ముఖ్యమంత్రిగా ఉన్నా, చక్రం తిప్పేది మాత్రం అమిత్‌షానే కావడంతో వర్గపోరు తారస్థాయికి చేరింది. తర్వాతి పరిణామాల్లో ఆనందీబెన్‌ను మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా పంపి, ఆమె స్థానంలో అమిత్‌షా వర్గీయుడైన విజయ్‌ రూపాణీకి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు. ఇప్పటికీ షా-బెన్‌ వర్గాల మధ్య అంతర్యుద్ధం కొనసాగుతూనే ఉందని... ఫలితంగా పాలన గాడి తప్పి, ప్రజా సమస్యలు పరిష్కారం కావడంలేదనే విమర్శలున్నాయి. దీనికితోడు జనాభాలో 14% ఉన్న పాటీదార్లు తమ రిజర్వేషన్‌ ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయత్నించారంటూ భాజపాపై నిప్పులు చిమ్ముతున్నారు.

ఎవరేం చెబుతున్నారు?

* భాజపా: మోదీ చేసిన అభివృద్ధి. సుస్థిర పాలన. శాంతి భద్రతల పరిరక్షణ. ఆర్థికంగా బలహీనవర్గాలకు రిజర్వేషన్లు.

* కాంగ్రెస్‌: వ్యవసాయ సంక్షోభం. కరవు సహాయక చర్యల్లో భాజపా సర్కారు వైఫల్యం. రైతులకు రుణాలు మంజూరు కాకపోవడం. తాగు, సాగునీటి సమస్య. పంటలకు కనీస మద్దతు ధర లభించకపోవడం. ఎరువుల ధరలు పెరగడం.

పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ
-ఎస్‌.మురళీకృష్ణ, గుజరాత్‌ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి

లోక్‌సభ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశాం. 51,851 పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటుచేశాం. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాం. భద్రతా దళాలను, పర్యవేక్షణాధికారులను రంగంలోకి దించాం. ధన, మద్య, ఇతర ప్రలోభాలను నియంత్రించేందుకు 1,280 నిఘా బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయి. ఇప్పటివరకూ సుమారు రూ.10 కోట్ల నగదును, రూ.10 కోట్ల విలువైన మద్యాన్ని, రూ.500 కోట్ల విలువైన మాధక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నాం.

మొత్తం లోక్‌సభ స్థానాలు: 26
గతసారి భాజపా గెలుచుకున్నవి: 26
మొత్తం అసెంబ్లీ స్థానాలు: 182
భాజపా: 99
కాంగ్రెస్‌: 77
ఇతరులు: 6
మొత్తం జనాభా: 6.3 కోట్లు
ఓటర్లు: 4.3 కోట్లు
పురుషులు: 2.25 కోట్లు
మహిళలు: 2.05 కోట్లు

2014లో భాజపాకు వచ్చిన ఓట్లు: 60.1%
కాంగ్రెస్‌కు: 33.5%
ఇతరులకు: 6.4%

కాంగ్రెస్‌ గట్టిపోటీ ఇస్తున్న స్థానాలు

1.సురేంద్రనగర్‌ 2.ఆనంద్‌ 3. ఛోటా ఉదయ్‌పుర్‌ 4.సబర్కాంఠ 5.బనస్కాంఠ 6. పఠాన్‌ 7. మహెసన 8.అమ్రేలీ 9.జునాగఢ్‌ 10.కచ్‌ 11.జామ్‌నగర్‌ 12.పోర్‌బందర్‌.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.