close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఆ పురిలో యాదవులే మెయిన్‌

మరోసారి బరిలో ములాయం

త్తర్‌ప్రదేశ్‌ అంటేనే సం‘కుల’ సమరం. అందునా మెయిన్‌పురి వంటి లోక్‌సభ స్థానాల్లోనైతే అదే ప్రధాన ప్రాతిపదిక. ఇప్పటివరకు 18 సార్లు సార్వత్రిక ఎన్నికలు (రెండు ఉప ఎన్నికలు సహా) జరిగితే వాటిలో 13 సార్లు ఒకే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు అక్కడినుంచి నెగ్గుతూ రావడమే దీనికి ప్రబల తార్కాణం. వీరిలో 10 మంది మెయిన్‌పురి సరిహద్దు జిల్లా ఎటావాకు చెందినవారే కావడం మరో విశేషం. నియోజకవర్గంలో దాదాపు 35% మంది ఓటర్లు యాదవులు. 20% మంది రాజ్‌పుత్‌లు. సమాజ్‌వాదీ పార్టీ ఆవిర్భవించక ముందు నుంచీ యాదవులు ఎటు మొగ్గితే అటే ఫలితం కనిపించేది. యూపీ రాజకీయాలను ఒక మలుపు తిప్పిన సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌ ఇక్కడి నుంచి ఇంకోసారి పోటీ చేస్తున్నారు. ఏళ్ల తరబడి ప్రత్యర్థులుగా ఉన్న ఎస్పీ-బీఎస్పీలు ఈసారి ఎన్నికల్లో ఒక కూటమిగా ఏర్పడడంతో ఉభయపార్టీల అగ్రనేతలు ఈ నెల 19న బహిరంగ సభ నిర్వహించారు. 24 ఏళ్ల వైరాన్ని పక్కనపెట్టి ములాయం, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి దీని కోసం ఒకే వేదికపైకి వచ్చారు. ములాయం, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌లతో మాయావతి ఆశీనురాలై తన ప్రసంగంలో నేతాజీపై పొగడ్తలు కురిపించారు.

బోణీ కొట్టని భాజపా
మెయిన్‌పురి నియోజకవర్గం నుంచి ఇంతవరకు ఒక్కసారి కూడా భాజపా విజయం సాధించలేకపోయింది. 1971, 77, 80, 84ల్లోనైతే జనసంఘ్‌ గానీ, భాజపా గానీ ఇక్కడి నుంచి పోటీ చేయలేకపోయాయి. 1991, 96 ఎన్నికల్లో పోటీ చేసిన కమలనాథులు పరాజయం చవిచూశారు. 2014లో మోదీ హవా దేశమంతా, అందునా ఉత్తర్‌ప్రదేశ్‌లో బాగా ఉన్నప్పుడు కూడా కమలనాథులు తమ జెండాను ఇక్కడ ఎగరేయలేకపోయారు.

* దేశమంతా ఉన్నట్లుగానే మొదట్లో ఇక్కడా కాంగ్రెస్‌కు ఆదరణ ఎక్కువగా ఉండేది.

* 1996 నుంచి సమాజ్‌వాదీ హవా మొదలయింది. ఆ ఎన్నికల్లోనే కాకుండా 1998, 99, 2004, 2009, 2014, 2014 ఉప ఎన్నికల్లోనూ సమాజ్‌వాదీయే అక్కడ నెగ్గింది.

* 1996, 2004, 2009, 2014 ఎన్నికల్లో ములాయం ఇక్కడి నుంచే నెగ్గారు.

* తిరుగులేని కంచుకోట అనే ఉద్దేశంతోనే 80 ఏళ్ల ములాయం ఈసారీ అటువైపే మొగ్గారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు మూడుసార్లు ముఖ్యమంత్రిగా సేవలందించడంతో పాటు కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లి రక్షణ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయనకు నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది.

* 2014 ఎన్నికల్లో నెగ్గిన తర్వాత అజాంగఢ్‌కు ములాయం మారడంతో మెయిన్‌పురిలో ఉప ఎన్నిక అవసరమయింది. అప్పుడు ములాయం అన్న మనవడు తేజ్‌ ప్రతాప్‌సింగ్‌ ఇక్కడి నుంచి పోటీ చేసి, ఎస్పీ టికెట్‌పై నెగ్గారు. ఈసారి ఎన్నికల్లో ములాయంపై భాజపా అభ్యర్థిగా ప్రేమ్‌సింగ్‌ శక్యా పోటీ చేయనున్నారు. కాంగ్రెస్‌ నుంచి ఎవరూ పోటీ చేయడం లేదు.

శివపాల్‌ తోడు లేకుండా పోరాటం
ప్రతిసారీ ఎన్నికల్లో ములాయం సింగ్‌కు చిన్న సోదరుడు శివపాల్‌ యాదవ్‌ అండగా ఉంటూ వస్తున్నారు. 8 అసెంబ్లీ ఎన్నికల్లో, అయిదుసార్లు సార్వత్రిక సమరాల్లో నేతాజీ తరఫున అన్ని వ్యవహారాలూ చూసుకున్నది ఆయనే. ములాయం తనయుడు అఖిలేశ్‌తో తలెత్తిన విభేదాల తర్వాత    శివపాల్‌ సొంతంగా ‘ప్రగతిశీల సమాజ్‌వాదీ’ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. ఆయన ఫిరోజాబాద్‌లో ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. నిజానికి ములాయంనూ ఆ పార్టీ తరఫున పోటీ చేయాలని   ఆయన ఆహ్వానించారు. వేర్వేరు పార్టీలుగా విడిపోవడంతో ఈసారి శివపాల్‌ సహకారం ములాయానికి అందడం లేదు. అజాంగఢ్‌ నుంచి పోటీ చేస్తున్న అఖిలేశ్‌, కన్నౌజ్‌ నుంచి బరిలో దిగిన ఆయన భార్య డింపుల్‌ తమతమ సొంత నియోజక     వర్గాలపై దృష్టి సారించారు. మిగిలిన కుటుంబ సభ్యుల పరిస్థితీ ఇలాగే ఉండడంతో ములాయం తమ పార్టీ కార్యకర్తలపై ఆధారపడి ప్రచారం    చేసుకోక తప్పడం లేదు.

 

ఓటర్లు
16,53,065

స్త్రీలు
7,52,492 

పురుషులు
9,00,568 

ఇతరులు
5

పోలింగ్‌ తేదీ
ఈ నెల 23

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.