close

ప్ర‌త్యేక క‌థ‌నం

పద్మనాభుని సన్నిధిలో సమరం.. త్రిముఖనంతపురం!

హ్యాట్రిక్‌ కోసం శశిథరూర్‌ ప్రయత్నం
దీటుగా బదులిస్తున్న భాజపా, సీపీఐ
ఎం.ఎల్‌.నరసింహారెడ్డి
కేరళ నుంచి ‘ఈనాడు’ ప్రత్యేక ప్రతినిధి

కేరళలోని తిరువనంతపురం లోక్‌సభ స్థానంలో గత ఎన్నికల్లో దాదాపు ఓటమి అంచు వరకు చేరి, విజయం సాధించిన కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్‌ ఈ ఎన్నికల్లో గెలుపొంది హ్యాట్రిక్‌ కొట్టాలన్న ప్రయత్నంలో ఉన్నారు. అప్పట్లో స్వల్ప తేడాతో ఓటమి పాలైన భాజపా ఈసారి ఎలాగైనా గెలిచి చరిత్ర సృష్టించాలని పోరాడుతోంది. 2004 ఎన్నికలు సహా పలుసార్లు ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన సీపీఐ తమ పట్టును తిరిగి సాధించడానికి చెమటోడ్చుతోంది. యూడీఎఫ్‌, ఎల్‌డీఎఫ్‌, భాజపా మధ్య రసవత్తర పోరు కొనసాగుతోంది. కేరళ నుంచి ఎలాగైనా బోణీ కొట్టాలనే పట్టుదలతో ఉన్న భాజపా ఈ నియోజకవర్గంపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించింది.

అనంత పద్మనాభుడు కొలువుదీరిన నేల
అత్యంత సుసంపన్న ఆలయాల్లో ఒకటిగా భావించే అనంత పద్మనాభస్వామి ఆలయమున్న తిరువనంతపురంలో 68% మంది ఓటర్లు హిందువులే. కేరళలోని ఇతర లోక్‌సభ నియోజకవర్గాలకు భిన్నమైన కూర్పు ఇది. మొదటి నుంచి ఇక్కడ ప్రధాన పోరు కాంగ్రెస్‌-కమ్యూనిస్టుల మధ్యనే అయినా భాజపాకూ కొంత ఓటు బ్యాంకు ఉంది. గత కొన్నేళ్లుగా ఆ పార్టీ ఓటు బ్యాంకు గణనీయంగా పెరగడంతో ప్రధాన పార్టీలకు పోటీదారుగా మారింది. మొదటిసారిగా పోటీ చేసినపుడు శశిథరూర్‌ సులభంగా గెలుపొందినా క్రమేపీ పట్టుకోల్పోతున్నారని శిభు అనే ఉద్యోగి పేర్కొన్నారు. మేధావిగా పేరున్నా కిందిస్థాయి కార్యకర్తలతో సరైన సంబంధాలు లేకపోవడం, కాంగ్రెస్‌లోని ద్వితీయ శ్రేణి నాయకుల్లో ఉన్న అసమ్మతి వంటివి శశిథరూర్‌ విజయంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

ధీమా ఉన్నా... సులభమేనా?
శబరిమల ఉద్యమం, స్థానికంగా ఉన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా హిందూ అగ్రవర్ణాలు పూర్తిగా తమకు దూరమవుతున్నాయని శశిథరూర్‌ భావిస్తున్నారు. దీంతో- భాజపా వల్ల అసలైన హిందుత్వకు నష్టమనే అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. తన వాక్చాతుర్యం, విద్యాధికుల్లో ఉన్న ఆదరణతో తాను మళ్లీ విజయం సాధిస్తానన్న ధీమాతో ఆయన ఉన్నారు. అయితే ఇదంత సులభం కాదని, భాజపా గెలవకుండా చూడాలనే ప్రయత్నంలో ఎల్‌డీఎఫ్‌ సానుభూతి పరుల్లో ఏదైనా కొంత మార్పు వస్తే తప్ప శశిథరూర్‌ గట్టెక్కడం అంత సులభం కాదని శిభు అభిప్రాయపడ్డారు. ఎల్‌డీఎఫ్‌ తరఫున బరిలోకి దిగిన సీపీఐ కూడా ఈ ఎన్నికల్లో బలమైన అభ్యర్థి దివాకరన్‌ను బరిలోకి దిగింది. మాజీ మంత్రి అయిన ఈయనకు నియోజకవర్గంలో మంచి గుర్తింపు ఉంది.

సీపీఐలో ఆశలు
గత ఎన్నికల్లో భాజపా రెండో స్థానంలో నిలబడింది. సీపీఐకీ దానికి దగ్గరగానే ఓట్లు వచ్చాయి. వరదల వల్ల తీవ్రంగా నష్టపోయినపుడు మెరుగైన పునరావాస చర్యలు చేపట్టడం, మత్స్యకారులను ఆదుకోవడం ఈ ఎన్నికల్లో తమకు బాగా కలిసి వస్తాయని సీపీఐ భావిస్తోంది. భాజపా అభ్యర్థి కుమనమ్‌ రాజశేఖరన్‌ ఈ నియోజకవర్గానికి సుపరిచితుడు. గత ఎన్నికల్లో స్పల్ప తేడాతోనే ఓడిపోవడం, కాంగ్రెస్‌ అభ్యర్థి పట్ల ఆ పార్టీలోనే అసమ్మతి ఉండటం, శబరిమల ఉద్యమం ద్వారా నాయర్లు... ఇతర వర్గాలు పూర్తిగా తమవైపు రావడం సానుకూలంశాలని ఆ పార్టీ కార్యకర్త మంజు అభిప్రాయపడ్డారు. రాజశేఖరన్‌ పట్ల వ్యక్తిగతంగా వ్యతిరేకత లేకపోయినా       రాజగోపాల్‌కు ఉన్నట్లు అన్ని వర్గాల్లో ఆయనకు సానుకూలత లేదని అనిత అనే రచయిత పేర్కొన్నారు. పెద్దనోట్ల రద్దు,  జీఎస్టీ కారణంగా చిన్న వ్యాపారులు, పర్యాటక రంగంపై ఆధారపడిన వారిలో మోదీ పట్ల వ్యతిరేకత ఉంది. వీటన్నిటిని దాటి శబరిమల ఉద్యమం ద్వారా హిందువుల్లో పెరిగిన సానుభూతితో ఎక్కువ ఓట్లు లభిస్తేనే భాజపా గెలుపు వీలవుతుంది. మొత్తంగా ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది.

 

ఎప్పుడూ ముక్కోణమే

తిరువనంతపురం లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిసారి ముక్కోణపు పోటీయే జరుగుతోంది.

* 2009 లోక్‌సభ ఎన్నికల్లో మొదటిసారిగా పోటీ చేసిన శశిథరూర్‌ లక్ష ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో సీపీఐ 2.26 లక్షల ఓట్లతో రెండోస్థానంలో నిలవగా, భాజపాకు 86వేల ఓట్లు మాత్రమే వచ్చాయి.

* 2014లో కాంగ్రెస్‌ అభ్యర్థి శశిథరూర్‌కు 2,97,806 ఓట్లు రాగా, భాజపా అభ్యర్థి ఓ.రాజగోపాల్‌కు 2,82,336, సీపీఐ అభ్యర్థి బెన్నెట్‌ అబ్రహాంకు 2,48,941 ఓట్లు వచ్చాయి.

* 2009 కంటే 2014లో భాజపా ఓట్లు గణనీయంగా పెరగడంతోపాటు సీపీఐ అభ్యర్థి మూడో స్థానంలోకి వెళ్లారు. తాజా ఎన్నికల్లో రాజగోపాల్‌ పోటీ చేయడం లేదు.

ఓటర్లు 
13.66 లక్షలు

పురుషులు
6.60 లక్షలు

స్త్రీలు
7.06 లక్షలు

ఇతరులు  34

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.