close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఉభయ హిందుత్వోపరి

భోపాల్‌లో భాజపా, కాంగ్రెస్‌లది అదే ధోరణి
హిందుత్వమే ప్రధానాంశంగా ప్రజ్ఞ, డిగ్గీ అడుగులు
రాజీవ్‌ రాజన్‌
భోపాల్‌ నుంచి ‘ఈనాడు’ ప్రత్యేక ప్రతినిధి

హిందుత్వలోని భిన్న పార్శ్వాలకు వేదికగా భోపాల్‌ లోక్‌సభ స్థానం నిలుస్తోంది. కరడుగట్టిన, సౌమ్యులైన హిందుత్వవాద అభ్యర్థుల మధ్య ఇక్కడ సమరం సాగుతోంది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌పై సాధ్వి ప్రజ్ఞా సింగ్‌ ఠాకుర్‌ను భాజపా నిలబెట్టిన విషయం తెలిసిందే. వారం క్రితమే ఆమె పార్టీలో లాంఛనంగా చేరారు. హిందుత్వ విషయంలో ఇటీవల కాస్త మెతక వైఖరిని అవలంబించడం ద్వారా భాజపా సంప్రదాయ ఓట్లను కొల్లగొట్టాలనేది కాంగ్రెస్‌ వ్యూహం. కానీ దిగ్విజయ్‌ గతంలో సాధ్విపై ‘కాషాయ ఉగ్రవాదం’ ముద్రను వేయడం ఎన్నికల్లో ప్రచారాంశంగా నిలుస్తోంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్‌ అనుసరిస్తున్న ఈ హిందూ అనుకూల వైఖరి మోసపూరితమైనదని చెప్పేందుకు భాజపా-ఆరెస్సెస్‌ శ్రేణులు ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్‌ అంటే ముస్లింలకు అనుకూలమైన పార్టీ అనే ముద్ర చాలా కాలం నుంచి పాతుకుపోయింది. దానిని చెరిపివేసే ప్రయత్నాల్లో భాగంగా దిగ్విజయ్‌ కూడా ఇటీవల తరచూ దేవాలయాలను సందర్శిస్తూ వస్తున్నారు. గోశాలలకు వెళ్లి ఆవులకు మేత వేయడం, నుదుటన బొట్టు ధరించడం, నర్మదా నది పరిక్రమకు హాజరుకావడం ద్వారా హిందువుల మనసు దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

కాంగ్రెస్‌ అజెండాను ఎండగడతాం: భాజపా

హిందువుల ఓట్లు సాధించేందుకు దిగ్విజయ్‌ చేస్తున్న ప్రయత్నాలు ఓ నాటకమని భాజపా కొట్టి పారేస్తోంది. వివాదాస్పద మత బోధకుడు జకీర్‌ నాయక్‌తో కలిసి ఆయన గతంలో పలుమార్లు కనిపించడం, అంతర్జాతీయ ఉగ్రవాదులైన ఒసామా బిన్‌ లాడెన్‌, హఫీజ్‌ సయీద్‌లను గౌరవంగా సంబోధించడం, బాట్లా హౌస్‌లో ఇండియన్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాదుల కాల్చివేతను బూటకపు ఘటనగా పేర్కొనడం వంటి అంశాలను భాజపా ప్రముఖంగా ప్రచారం చేస్తోంది. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆయన వైఖరి ఎలా ఉండేదో చెప్పడానికి కమలనాథులు ప్రాధాన్యమిస్తున్నారు. ‘ప్రతిసారీ ఎన్నికల్లో దిగ్విజయ్‌సింగ్‌ ఈ నియోజకవర్గంలోని మైనారిటీల ఓట్లు మొత్తం పొందడానికి ప్రయత్నిస్తూ వచ్చేవారు. ఇప్పుడు హిందుత్వ ముసుగు ధరించి, మసీదులకు-దర్గాలకు దూరంగా ఉంటున్నారు. ఇది మైనారిటీల్లో చర్చనీయాంశమయింది. భోపాల్‌ జనాభా దాదాపు 27 లక్షలైతే దానిలో 4 లక్షల మంది వరకు ముస్లింలు ఉంటారు. కాంగ్రెస్‌ ఓటు బ్యాంకులో వీరు చాలా కీలకం. గతంలో సాధ్విపై ఉగ్ర ముద్ర వేసేందుకు డిగ్గీరాజా చేసిన ప్రయత్నాలను హిందువులు ఇంకా మరిచిపోలేదు. సాధ్వికి మేం టికెట్‌ ప్రకటించడంతో దిగ్విజయ్‌ అసలు రూపాన్ని ఎండగట్టినట్లయింది. హిందువులకు ఆయన వ్యతిరేకమనే విషయాన్ని మేం గుర్తు చేస్తున్నాం’ అని భాజపా నేత ఒకరు ‘ఈనాడు ప్రతినిధి’కి తెలిపారు.

ధర్మానికి-అధర్మానికి మధ్య యుద్ధం: ప్రజ్ఞ

‘ఇది ధర్మానికి-అధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధం. గతంలో దిగ్విజయ్‌ ఒత్తిడి మేరకే యూపీయే సర్కారు నన్ను మాలేగావ్‌ పేలుళ్ల కేసులో అన్యాయంగా ఇరికించింది. ఆయన కారణంగానే నన్ను తొమ్మిదేళ్లపాటు కారాగారంలో ఉంచి, ఎన్నో రకాలుగా వేధించారు.. హిందుత్వను ఉగ్రవాదంతో ముడిపెట్టిన అలాంటి వ్యక్తిని నేను తప్పనిసరిగా ఓడించాలని ప్రపంచవ్యాప్త హిందువులంతా కోరుకుంటున్నారు’ అని ప్రజ్ఞ చెబుతున్నారు. ఆమె అభ్యర్థిత్వాన్ని ప్రధాని మోదీ గట్టిగా సమర్థించుకున్నారు. అనవసరంగా కేసులో ఇరికించి, ‘క్షమించరాని పాపానికి’ ఒడిగట్టినవారందరికీ ఆమె అభ్యర్థిత్వమే సరైన సమాధానమని ఆయన చెప్పారు.

డిగ్గీరాజా వెనుక కమల్‌నాథ్‌ వ్యూహం!

ముస్లింల పక్షపాతిననే ముద్రను చెరిపివేసుకునేందుకు ప్రయత్నిస్తున్న దిగ్విజయ్‌సింగ్‌ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. భోపాల్‌లోని ముస్లింల ప్రాబల్య ప్రాంతాల్లోనైనా ‘హిందూ ఉగ్రవాదం’ అనే అంశాన్ని లేవనెత్తవద్దంటూ పార్టీ శ్రేణులకు ఆయన విస్పష్టంగా ఆదేశాలిచ్చారు. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేతలో పాల్గొనడాన్ని గర్వకారణంగా భావిస్తున్నానని సాధ్వి చెప్పినప్పుడూ ఆ అంశంపై స్పందించకూడదని ఆయన నిర్ణయించుకున్నారు. నియోజకవర్గంలో హిందువుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లోనే దిగ్విజయ్‌ ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. ఆధ్యాత్మిక విషయాల్లో మధ్యప్రదేశ్‌లోని కాంగ్రెస్‌ సర్కారు హిందువులకు ఎలాంటి ప్రయోజనాలు కల్పించిందీ వివరిస్తున్నారు. భోపాల్‌ అభివృద్ధికి ప్రత్యేక మేనిఫెస్టోను ఆయన ప్రకటించినా, ఉభయుల శిబిరాలూ హిందుత్వాన్నే ప్రధాన ప్రచారాంశంగా మలచుకున్నాయనేది సుస్పష్టం. చాలాకాలం నుంచి భోపాల్‌.. భాజపాకు కంచుకోట. 1989 నుంచి భాజపా ఎనిమిదిసార్లు ఇక్కడ నెగ్గింది. 2014లోనైతే ఏకంగా 3.70 లక్షల ఆధిక్యాన్ని సంపాదించింది. రాష్ట్ర పాలనలో డిగ్గీరాజా జోక్యంతో విసుగెత్తిపోతున్న ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ తన పలుకుబడిని ఉపయోగించి, వ్యూహాత్మకంగానే దిగ్విజయ్‌ను కమలనాథుల కంచుకోట నుంచి రంగంలో దించినట్లు కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. దిగ్విజయ్‌ ఓడిపోతే ఆయన్ని నైతికంగా దెబ్బకొట్టినట్లవుతుందని, ఒకవేళ గెలిచినా ఆయన్ని భోపాల్‌ నుంచి దిల్లీకి పంపించేయవచ్చనేది సీఎం వ్యూహంగా పేర్కొంటున్నాయి. మే 12న ఇక్కడ ఎన్నిక జరగనుంది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.