
ప్రత్యేక కథనం
వికటించిన ఇంటర్‌బోర్డు హడావుడి మూల్యాంకనం
రోజుకు ఒక్కొక్కరికీ 30కి బదులు 45 వరకు జవాబుపత్రాలు
త్వరగా ఫలితాలివ్వాలనే ధోరణితోనే అనర్థం
900 మార్కులు దాటినా తప్పారు
తప్పులు నిజమేనా.. గవర్నర్ ఆరా
గందరగోళంపై అధ్యయనానికి కమిటీని నియమించిన ప్రభుత్వం
ఈనాడు - హైదరాబాద్
‘‘గత ఏడాది కంటే ముందే.. ఏపీ కంటే ముందుగానే ఫలితాలు విడుదల చేద్దాం.. ఒకవేళ మార్కులివ్వడంలో అన్యాయం జరిగిందని ఎవరైనా అడిగితే పునఃలెక్కింపు, పునఃపరిశీలన ఉండనే ఉన్నాయి కదా..’ తెలంగాణ ఇంటర్‌బోర్డు ఆలోచన ఇంతకంటే భిన్నంగా లేదు. ఈ ధోరణితోనే హడావుడిగా మూల్యాంకనం చేయించి, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడింది. దీనివల్ల వ్యవహారం ‘రెంటికీ చెడ్డ చందం’గా మారింది. అటు ఫలితాలనూ త్వరగా విడుదల చేయలేకపోయారు. ఇటు లోపాల్లేకుండానూ ఇవ్వలేకపోయారు. విద్యార్థులకు మాత్రం తమ ‘తప్పుల తడాఖా’ చూపించారు. ఫలితాల్లో గందరగోళానికి కారణం మానవ తప్పిదమా? సాంకేతిక లోపమా? అన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. మార్కులు, ఫలితాలు తలకిందులు కావడంతో పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడం.. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగడంతో బోర్డు తప్పిదాల అంశంపై గవర్నర్ నరసింహన్ కూడా దృష్టి పెట్టారు. ఆదివారం ఆయన విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సబ్జెక్టులవారీగా ఉత్తీర్ణులు కానివారి సంఖ్యపై తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మరోవైపు తప్పులపై వాస్తవాలను తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీని నియమించింది. మూడురోజుల్లో ‘అపోహలు తొలగిస్తా’మంటూ ప్రకటించడం విశేషం. ఇంత జరిగినా ఇంటర్‌బోర్డు కార్యదర్శి మాత్రం ఎలాంటి తప్పులూ జరగలేదని ప్రకటించడం గమనార్హం.
వెలుగులోకొస్తున్న తప్పులు
ఫలితాల్లో తప్పిదాలు నిత్యం వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఉదాహరణకు మంచిర్యాల జిల్లాకు చెందిన జి.నవ్య అనే విద్యార్థినికి రెండో సంవత్సరం తెలుగులో 99 మార్కులు రాగా, బోర్డు ఆమెకు సున్నా మార్కులు ఇచ్చింది. తరువాత తప్పును సరిదిద్దుకుంది.
రోజుకు 60 పేపర్లు దిద్దడమా!
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పరీక్షలకు 9.43 లక్షలమంది హాజరయ్యారు. ప్రధాన పరీక్షలు మార్చి 13తో పూర్తయ్యాయి. మొత్తం పరీక్షలు పూర్తికాకముందే మూల్యాంకనం ప్రారంభించారు. సాధారణంగా ఒక్కో అధ్యాపకుడికి రోజుకు 30 చొప్పున జవాబుపత్రాలు ఇస్తారు. మూల్యాంకనం ఆలస్యమవుతుందని భావిస్తే చివరి రెండు మూడు రోజులూ ఆ సంఖ్యను కొద్దిగా పెంచుతుంటారు. ఈసారి మాత్రం మొదటి నుంచే ఎక్కువగా ఇస్తూ వచ్చారు. దీనివల్ల మూల్యాంకనంలోనూ పొరపాట్లు జరిగినట్లు తెలుస్తోంది. చాలామందికి ఆశించిన మేరకు మార్కులు రాలేదు. ఒక్కో అధ్యాపకుడికి రోజుకు 40-45 పేపర్లు ఇవ్వగా, సంస్కృతం పేపర్లు అయితే కొన్నిచోట్ల 60 కూడా ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. ఇంత చేసినా గత ఏడాది కంటే అయిదు రోజులు ఆలస్యంగా ఫలితాలు విడుదల చేశారు. అదీ లెక్కలేనన్ని తప్పులతో.
నమోదులో నిర్లక్ష్యం
జవాబుపత్రాన్ని మూల్యాంకనం చేసిన అధ్యాపకుడు ఓఎంఆర్ పత్రంలోని 3వ భాగంలో మార్కులు వేస్తారు. అది కూడా బబ్లింగ్ రూపంలో చేస్తారు. అంటే 95 మార్కులు వస్తే 9, 5 గడులను దిద్దుతారు. ఆంగ్లంలో ‘నైన్, ఫైవ్’ అని కూడా రాస్తారు. పొరపాటున ఆంగ్లంలో ‘ఫైవ్, నైన్’ అని రాస్తే విద్యార్థులు నష్టపోతారు. మూల్యాంకనం ముగిసిన వెంటనే ఓఎంఆర్ పత్రాలను ఇంటర్‌బోర్డుకు తీసుకొస్తారు. ఒకవేళ ఓఎంఆర్ పత్రంలో రాసిన దాంట్లో అస్పష్టత ఉంటే ఫలితాలకు ముందే మూల్యాంకన కేంద్రాల్లో ఉండే స్ట్రాంగ్ రూంలకు ఫోన్ చేసి సరిచూసుకుంటారు. ఈసారి మాత్రం ఫలితాలు విడుదలైన తర్వాత స్ట్రాంగ్ రూంలకు ఫోన్లు చేస్తుండటాన్ని బట్టి.. ఇంటర్‌బోర్డు నిర్లక్ష్యం కళ్లకు కడుతోంది. అందుకే భారీ మార్కులు రావాల్సిన వారికి అరకొర మార్కులు వచ్చాయి. విద్యార్థులు పొందిన మార్కులు అప్లోడ్ చేయడంలోనూ నిర్లక్ష్యం చూపారన్న ఆరోపణలున్నాయి. ప్రథమ, ద్వితీయ ఇంటర్లో మొత్తంగా భారీ మార్కులు సాధించిన వారు సైతం ఒకటీ రెండు సబ్జెక్టుల్లో ఒక అంకె (సింగిల్ డిజిట్) మార్కులే పొందారు. తప్పులకు సాంకేతిక లోపమే కారణమైతే ఫలితాల ప్రక్రియ టెండర్ దక్కించుకున్న గ్లోబరీనా టెక్నాలజీస్ సంస్థ నైపుణ్యాన్ని తప్పుబట్టాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
అన్నీ అవాస్తవాలేనట!
ఇంటర్ ఫలితాలు తప్పులతడకగా మారినా ఏ ఒక్క తప్పూ జరగలేదని ఇంటర్‌బోర్డు వాదిస్తోంది. ఈమేరకు ఆదివారం బోర్డు కార్యదర్శి అశోక్ ఒక ప్రకటన విడుదల చేశారు. 21 వేలమంది విద్యార్థుల మార్కులు గల్లంతైనట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని పేర్కొన్నారు. ఆ వివరాలు బోర్డు వద్ద భద్రంగా ఉన్నాయని, తల్లిదండ్రులు ఆందోళన చెందరాదని సూచించారు. సబ్జెక్టుల్లో వచ్చిన మార్కులు, మొత్తం మార్కులు సరిచూస్తే పొంతన ఉండటం లేదనేది అవాస్తవమని తెలిపారు. జవాబు పత్రాలను అర్హత లేని వారితో మూల్యాంకనం చేయించారనడంలో కూడా నిజం లేదన్నారు. మూల్యాంకనం సజావుగా, సక్రమంగా చేయించామని స్పష్టంచేశారు. అయితే 21 వేల మంది ధ్రువపత్రాల్లో ‘ఏఎఫ్’ లేదా ‘ఏపీ’ అని ఉండటంతో వారు తప్పినట్లు చూపారు. ఫలితాల విడుదల తర్వాత వాటిని సరిచేశామని కార్యదర్శి పేర్కొన్నారు. ఇంటర్‌బోర్డు అధికారిక వెబ్సైట్లోనే సరిదిద్దిన ఫలితాలుంటాయని, ఫలితాల విడుదల నాడు ఇచ్చిన సీడీల్లో మాత్రం ఇప్పటికీ ‘ఏఎఫ్, ఏపీ’ అనే వేలాది ధ్రువపత్రాలపై ఉంటుందని ఇంటర్‌బోర్డు వర్గాలు తెలిపాయి.
తప్పులు నిజమేనా.. గవర్నర్ ఆరా ఇంటర్మీడియట్ ఫలితాలు తప్పులతడకగా ఉన్నాయని, మార్కుల్లో అన్యాయం చేశారని విద్యార్థులు, తల్లిదండ్రులు ఇంటర్‌బోర్డు కార్యాలయంవద్ద ఆందోళన చేసిన నేపథ్యంలో గవర్నర్ నరసింహన్ ఆదివారం విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషి, విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి, ఇంటర్‌బోర్డు కార్యదర్శి అశోక్ పాల్గొన్నారు. ‘ఫలితాల్లో తప్పులు నిజమేనా?’ అని గవర్నర్ ప్రశ్నించారు. అధికారులు వివరణ ఇచ్చారు. సబ్జెక్టుల వారీగా ఎంతమంది తప్పారో నివేదించాలని గవర్నర్ ఆదేశించినట్లు తెలిసింది. |
కమిటీ నియామకం ఫలితాల గందరగోళంపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ముగ్గురితో కమిటీని నియమించింది. ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డి వెల్లడించారు. ఆయన విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, ఇతర అధికారులతో ఆదివారం సమీక్షించారు. ఫలితాల్లో లోపాలపై ‘అపోహలను తేల్చేందుకు’ టీఎస్టీఎస్ ఎండీ వెంకటేశ్వర్రావు ఆధ్వర్యంలో కమిటీని నియమించామని తెలిపారు. హైదరాబాద్ బిట్స్ ఆచార్యుడు వాసన్, ఐఐటీ హైదరాబాద్ సహాయ ఆచార్యుడు నిశాంత్ కమిటీ సభ్యులుగా ఉంటారని చెప్పారు. సత్వరమే దర్యాప్తు జరిపి మూడు రోజుల్లో నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశిస్తున్నట్లు మంత్రి తెలిపారు. కొంతమంది అధికారులు ‘అంతర్గత తగాదాలతో’ కొన్ని అపోహలు సృష్టించినట్లు తమ దృష్టికి వచ్చిందని జగదీష్‌రెడ్డి చెప్పారు. ఫలితాలపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మార్కుల్లో అన్యాయం జరిగిందని భావిస్తే విద్యార్థులు పునఃలెక్కింపు, పునఃపరిశీలనకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎటువంటి పొరపాటు జరిగినా సరిదిద్దుతామని, ఏ ఒక్క విద్యార్థికీ నష్టం జరగకుండా చూస్తామని తెలిపారు. |
మూడు రోజుల్లో అపోహలు తొలగిస్తాం |
900 మార్కులు దాటినా తప్పారు ఇంటర్ రెండేళ్లకూ కలిపి మొత్తం మార్కులు 900 దాటాయి. అయితే ద్వితీయ ఇంటర్లో కేవలం ఒక సబ్జెక్టులో అతి తక్కువ మార్కులు రావడం వల్ల వారు తప్పారు. అలా 900 మార్కులు దాటినవారు 10 మంది తప్పారు. ఈ మార్కులు సరైనవేనా? పొరపాటా? అనేది ఇంటర్‌బోర్డే తేల్చాల్చి ఉంది. |
మరిన్ని

దేవతార్చన
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- పోలీసులపై పూల జల్లు
- నాడు స్వప్నిక.. నేడు దిశ!
- ‘హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోవాలి’
- ‘ఆ బుల్లెట్లు దాచుకోవాలని ఉంది’
- ఊరెళ్లి వచ్చేస్తానన్నాడు..