close

ప్ర‌త్యేక క‌థ‌నం

భూతాళ మాంత్రికులు

రెవెన్యూలో ఇష్టారాజ్యం
ఒకరిభూమి మరొకరికి బదలాయింపు
మండలాల్లో దుర్భర స్థితిగతులు

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి ప్రాంతం జనవాడ గ్రామంలో సర్వే నంబరు 692లో ఉన్న 3.12 ఎకరాల భూమిని..రెవెన్యూ శాఖ నిబంధనలేవీ పాటించకుండా..అసలు లబ్ధిదారును వదిలి మరొకరికి రాసిచ్చింది. భూ యజమాని ఎస్‌.శ్రీదేవి నుంచి మల్లికార్జున్‌రెడ్డి కొనుగోలు చేసి మ్యుటేషన్‌కు దరఖాస్తు చేసుకోగా, 24.1.2018న ఆయనే.. కబ్జా (ఆధీనం)లో ఉన్నట్లు క్షేత్రస్థాయి వాంగ్మూలం సేకరించి ధ్రువీకరణ పత్రం రాసిచ్చారు. తిరిగి ఇదే భూమిని ఎస్‌.శ్రీదేవి వద్ద మరో ఇద్దరు కొన్నారని, వారు మరో ఇద్దరికి విక్రయించారని, ప్రస్తుతం వారే కబ్జా (ఆధీనం)లో ఉన్నట్లు క్షేత్రస్థాయిలో వాంగ్మూలం సేకరించారని పేర్కొంటూ మరో ధ్రువపత్రం జారీచేశారు. భూమి కొనుగోలు చేసినవారి నుంచి ‘మీ సేవా కేంద్రం’ ద్వారా మ్యుటేషన్‌కు దరఖాస్తు అందితే వారు అర్హులా, కాదా అనేది రూఢీ చేసుకోవాలి. క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టి, అభ్యంతరాలు స్వీకరించాకే ధ్రువపత్రం జారీచేయాల్సి ఉంటుంది. ఈ వ్యవహారంలో రెవెన్యూ సిబ్బంది నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఇట్టే తెలిసిపోతోంది.

చొప్పదండి మండలం రాగంపేటలో సర్వే నంబరు 1151లో ఎర్ర లక్ష్మీరాజమ్మకు 23 గుంటల భూమి (ఉప సంఖ్యలు బీ, డీలలో సగం సగం) ఉంది. కొత్తగా ఇచ్చిన పాసుపుస్తకంలో మాత్రం- ఉప సర్వే సంఖ్య బీ లోనే మొత్తం భూమి ఉన్నట్లు నమోదు చేశారు. ఆమె నిలదీయడంతో,  కొన్నాళ్లు పుస్తకం ఇవ్వకుండా ఆపేశారు. మార్పు చేయకుండానే ఆ తర్వాత పాసుపుస్తకం జారీచేశారు. ‘పాత పాసుపుస్తకంలో ఉన్న సమాచారాన్ని కొత్తపుస్తకంలో మార్పు చేసి రాశారు. ఇది అన్యాయం! ఎన్ని రోజులు తిరిగినా మార్చడం లేదు. నేనేం చేయాలి’ అంటూ ఆమె ఆందోళన చెందుతున్నారు.


రామడుగు మండలం గుండి రెవెన్యూ గ్రామం పరిధిలో కత్తెరపాక నర్సయ్య, శంకరయ్యలకు చెరి 2.09 ఎకరాల భూమి ఉంది. వీరితో పాటు మరో ఇద్దరు పాలివాళ్లకు కూడా అంతే భూమి ఉంది. ఎల్‌ఆర్‌యూపీ సందర్భంగా- ఆ భూమిలో పది గుంటల్లో తనకూ భాగం ఉందని ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో, ఆ నలుగురు రైతులకు పాసుపుస్తకాలు నిలిపివేశారు. 45 ఏళ్లనుంచి సాగులో ఉన్న వారికి పుస్తకాలు, రైతుబంధు సైతం రాకుండా పోయింది.


 

ఈనాడు - హైదరాబాద్‌

ప్రతి గుంటకూ రైతులకు పూర్తిస్థాయి హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం భూ దస్త్రాల ప్రక్షాళన కార్యక్రమం (ఎల్‌ఆర్‌యూపీ) చేపట్టింది. భూ దస్త్రాల నవీకరణ చేపట్టి సమస్యలను పరిష్కరించాలని రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించింది. దీనికి భిన్నంగా క్షేత్రస్థాయిలో కొందరు సిబ్బంది ఎల్‌ఆర్‌యూపీని తమకు అనుగుణంగా మార్చుకుంటుండటం రైతులకు  ఆగ్రహం తెప్పిస్తోంది. అర్హులైన భూ యజమానులను వదిలి ఇతరులకు భూ యాజమాన్య హక్కులు కల్పించిన సంఘటనలు అనేకం. మరికొన్ని చోట్ల పట్టా భూములను ఇతరులకు రాసిచ్చారు. ఇదేమిటంటే ‘సాంకేతికంగా ఇలా జరిగింది. సరిచేస్తా’మంటూ 2018 నుంచీ తిప్పించుకుంటున్న పరిస్థితులు క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నాయి.

* మ్యుటేషన్‌ నిబంధనలు చెల్లు
భూ విక్రయాలు చోటుచేసుకుంటే, కొనుగోలుదారు మ్యుటేషన్‌ కోసం ‘మీ సేవ’ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తు తహసీల్దారును చేరిన తర్వాత అభ్యంతరాల గురించి విక్రయ, కొనుగోలుదారులకు నోటీసు జారీచేస్తారు. ఆ పత్రాలను గ్రామ పంచాయతీ, తహసీల్దారు కార్యాలయాల్లో ప్రదర్శించాలి. వారం రోజుల అనంతరం సీనియర్‌ అసిస్టెంట్‌, డిప్యూటీ తహసీల్దారు, వీఆర్వోలు మ్యుటేషన్‌కు సంబంధించిన ప్రక్రియను పూర్తిచేస్తారు. వీఆర్వో క్షేత్రస్థాయిలో విచారణ పూర్తిచేస్తారు. పదిరోజుల తర్వాత తహసీల్దారు లబ్ధిదారులకు మ్యుటేషన్‌ సంబంధిత ధ్రువపత్రాలు జారీచేయాల్సి ఉంది. ఈ ప్రక్రియను భూముల ధరలు రూ.కోట్లు పలుకుతున్న రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలో పక్కనపెట్టేశారు. అభ్యంతరాలు ఏవీ స్వీకరించకుండానే భూ యజమానుల పేర్లను వీఆర్వోలు మార్చేస్తుండటం తీవ్ర నిర్లక్ష్యానికి అద్దంపడుతోంది. ఇదే మండలంలోని మహాలింగాపురం, జనవాడ, శంకర్‌పల్లి, తదితర గ్రామాల్లో ఎల్‌ఆర్‌యూపీ సమయంలో రైతుల పేర్లు ఆన్‌లైన్‌లో తప్పుగా నమోదు చేసినట్లు రైతులు ఆరోపిస్తున్నారు.  పాతపాసుపుస్తకాల్లో ఉన్న పేర్లను ఎల్‌ఆర్‌యూపీ ఆన్‌లైన్‌ సందర్భంగా కావాలనే తప్పుగా నమోదుచేú,‡ వాటిని సరిచేసేందుకు తిప్పించుకుంటున్నారంటూ శంకర్‌పల్లి ప్రాంత రైతులు ఆరోపిస్తున్నారు.

* తప్పుల పేరుతో కాలయాపన
కొత్త పాసుపుస్తకాల జారీలో క్షేత్రస్థాయి రెవెన్యూ సిబ్బంది చేస్తున్న కాలయాపన రైతులు తల్లడిల్లేలా చేస్తోంది. పాత దస్త్రాల సమాచారాన్ని ఆన్‌లైన్‌లోకి ఎక్కించేటప్పుడు తప్పుల తడకగా నమోదు చేశారు. ఆ తప్పులతో ప్రచురితమైన పాసుపుస్తకాలనే రైతులకు పంపిణీ చేస్తున్నారు. సరిచేయాలని ప్రశ్నించినవారికి కొత్త పుస్తకాలు ఇవ్వకుండా నెలల తరబడి తిప్పించుకుంటున్నారు. సర్వే సంఖ్యలు, బై నంబర్లు, తండ్రి పేరు, ఇంటి పేరు- ఇలా..తప్పులు దొర్లినవి అనేకం ఉన్నాయి. వీటిని సరిచేయాలంటూ నిత్యం భూ యజమానులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. పాసుపుస్తకం రెండో పేజీలో తప్పులను సరిచేసేందుకు తహసీల్దార్లకు రెవెన్యూశాఖ అవకాశం కల్పించింది. కార్యాలయానికి ఇచ్చిన ప్రింటింగ్‌ యంత్రంలో ఈ సవరణలు చేపట్టడానికి వీలు ఉన్నప్పటికీ చాలాచోట్ల అలా చేయడం లేదని రైతులు ఆక్రోశిస్తున్నారు. కరీంనగర్‌ జిల్లా రామడుగు, చొప్పదండి మండలాల్లో తప్పులు నమోదైన పుస్తకాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయని బాధితులు చెబుతున్నారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.