close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఆన్‌లైన్‌ పరీక్ష అనగానే కంగారొద్దు

అవగాహన పెంచేందుకు సదస్సులు నిర్వహించాం
ఎటువంటి అవాంతరాలు లేకుండా  పరీక్షలు నిర్వహిస్తాం
‘ఈనాడు’తో ఎంసెట్‌ కన్వీనర్‌ ఆచార్య ఎన్‌.యాదయ్య
ఈనాడు - హైదరాబాద్‌

కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ) అనగానే కంగారు పడాల్సిన పని లేదని.. కేవలం సరైన జవాబులపై క్లిక్‌ చేస్తే చాలని ఎంసెట్‌ కన్వీనర్‌ ఆచార్య ఎన్‌.యాదయ్య చెబుతున్నారు. విద్యార్థులు ఏం చేయాలో సూచనలన్నీ హాల్‌టికెట్లపై ముద్రించామని, వాటిని క్షుణ్నంగా చదవాలని సూచించారు. గత అనుభవాల దృష్ట్యా ఆన్‌లైన్‌ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు మరిన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. ఈ నెల 3వ తేదీ నుంచి ఎంసెట్‌ ఆన్‌లైన్‌ పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో బుధవారం ఆయన ‘ఈనాడు’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ముఖ్యాంశాలివీ..

ఆన్‌లైన్‌ పరీక్ష అని కూడా తెలియని విద్యార్థులు కొందరు గతేడాది పరీక్ష ప్యాడ్లు తెచ్చుకున్నారు. ఈ సారి ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు?
ఈ సారి రాష్ట్రవ్యాప్తంగా 8 జిల్లాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాం. వరంగల్‌, నల్గొండ, ఖమ్మం, నిజామాబాద్‌లో రెండుసార్లు జరిపాం. ఏప్రిల్‌ 24, 26 తేదీల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రాక్టీస్‌ కేంద్రాలు ఏర్పాటు చేసి నమూనా ఆన్‌లైన్‌ పరీక్షలపై అవగాహన కల్పించాం. అయితే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 8 వేల మంది మాత్రం వినియోగించుకున్నారు. హాల్‌టికెట్లపై పరీక్షలకు సంబంధించి అన్ని సూచనలు చేశాం. వాటిని క్షుణ్నంగా చదవడం ముఖ్యం.

గతేడాది కొన్నిచోట్ల గాలివాన కారణంగా పరీక్షలకు విద్యుత్తు సమస్యలు వచ్చాయి. ఈ సారి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
విద్యుత్తు కోత లేకుండా చూడాలని ఆ శాఖ అధికారులను లిఖితపూర్వకంగా కోరాం. పరీక్షా కేంద్రాల్లో జనరేటర్లు, యూపీఎస్‌లు ఉండాలని పరీక్షా కేంద్రాల బాధ్యతను చూస్తున్న ప్రైవేట్‌ సంస్థకు సూచించాం. మేం కూడా వాటిని స్వయంగా పరిశీలించాం. గతేడాది మొత్తం 84 కేంద్రాలుండగా ఈసారి 94కు పెంచాం. ఈసారి జేఎన్‌టీయూ హైదరాబాద్‌లోనూ పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశాం. ప్రభుత్వ కళాశాలల్లో పరీక్ష నిర్వహించలేం. కనీసం 100 కంప్యూటర్లు ఉంటేనే అది సాధ్యం.

ఏటా ప్రశ్నల్లో తప్పులు దొర్లుతున్నాయి. వాటి నిరోధానికి ఏం చేస్తున్నారు?
తప్పుల్లేకుండా ప్రశ్నపత్రాలు ఇచ్చేందుకు అన్నిచర్యలు తీసుకుంటున్నాం. ఆన్‌లైన్‌ పరీక్షలు కాబట్టి కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా ప్రశ్నలను ఎంపిక చేసి ఇస్తుంది. ఒకవేళ పొరపాట్లు వస్తే ఆ ప్రశ్నకు జవాబు గుర్తించని వారికీ మార్కులిస్తాం. విద్యార్థులు పక్కపక్కన కూర్చున్నా ప్రశ్నలు ఒకే వరుసలో ఉండవు. అందువల్ల చూచిరాతలకు అవకాశం లేదు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలుంటాయి. మొత్తం 160 ప్రశ్నలు.. 180 నిమిషాలు కాబట్టి వేగంగా జవాబుల గురించి ప్రయత్నించాల్సి ఉంటుంది. ఇతర జాతీయ పరీక్షల్లో ప్రశ్నలు తక్కువ ఉంటాయన్నది గమనించాలి.

పరీక్షా కేంద్రాల్లో ఎటువంటి సౌకర్యాలు అందిస్తున్నారు?
ఎండాకాలం అయినందున తాగునీరు, ఇతర సమస్యలు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. వడదెబ్బ నుంచి ఉపశమనానికి ప్రథమ చికిత్స కిట్‌ ఏర్పాటు చేస్తున్నాం. విద్యార్థులు చేతి గడియారాలు తీసుకురాకూడదు. పరీక్షా కేంద్రంలో గోడ గడియారాలూ ఉండవు. పరీక్ష రాసే కంప్యూటర్‌పైనే ఇంకెంత సమయం మిగిలి ఉందో కనిపిస్తుంది. విద్యార్థులు రఫ్‌ నోట్‌ కోసం 8 పుటల బుక్‌లెట్‌ ఇస్తాం.

ఆన్‌లైన్‌ పరీక్షల కారణంగా పలు విడతల్లో నిర్వహించడం వల్ల ప్రశ్నల మధ్య సమతుల్యత తగ్గదా?
ఆన్‌లైన్‌ పరీక్షలకు కంప్యూటర్లు అవసరం కాబట్టి ఒక్కో విడతకు 30 వేల మంది మాత్రమే రాయగలుగుతారు. భవిష్యత్తులో సామర్థ్యం పెరిగితే పరీక్ష నిర్వహించే విడతలు తగ్గుతాయి. పలు దఫాల వల్ల ఒక ప్రశ్నపత్రం కొంత కఠినంగా, మరొకటి కొంత సులభంగా ఉండే అవకాశం ఉంటుందనే పర్సంటైల్‌ విధానాన్ని ప్రపంచవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. దానివల్ల విద్యార్థులకు నష్టం జరగదు. ఆన్‌లైన్‌ పరీక్షల కారణంగా ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ను ఈనెల 3, 4, 6 తేదీల్లో జరుపుతాం. ఆరో తేదీ ఉదయమే పరీక్ష ఉంటుంది. పరీక్ష రాసి ఆ రోజు స్థానిక ఎన్నికల్లో ఓటు వేయవచ్చు. అగ్రికల్చర్‌ పరీక్షను 8, 9 తేదీల్లో జరుపుతాం. 9న ఉదయం మాత్రమే పరీక్ష ఉంటుంది.

పరీక్ష రోజు ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫారమ్‌ను ఎందుకు తీసుకురావాలి?
పరీక్ష రాసే విద్యార్థులు హాల్‌టికెట్‌, నింపిన ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫారమ్‌, బ్లాక్‌/బ్లూ బాల్‌ పాయింట్‌ పెన్ను, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే కుల ధ్రువీకరణ పత్రం తీసుకురావాలి. దరఖాస్తు చేసిన విద్యార్థులే పరీక్ష రాస్తున్నారా? అన్న పరిశీలన కోసం ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ ఫారమ్‌ తీసుకురామంటున్నాం. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కనీస అర్హత మార్కులు లేనందున ర్యాంకు కేటాయించేందుకు కుల ధ్రువీకరణ పత్రం అడుగుతున్నాం. విద్యార్థులు పరీక్ష కేంద్రం వద్ద బయోమెట్రిక్‌ ద్వారా హాజరు ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే పరీక్ష ప్రారంభానికి గంటన్నర ముందుగా కేంద్రంలోకి అనుమతిస్తాం.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.