close

ప్ర‌త్యేక క‌థ‌నం

విత్తు నాణ్యతే ముఖ్యం

ప్రైవేటు సంకరజాతి విత్తనాలపై దృష్టి పెట్టండి
విత్తన శుద్ధి ప్లాంట్ల రిజిస్ట్రేషన్‌ బాధ్యత వ్యవసాయశాఖకు అప్పగించండి
ప్రతి జిల్లాలో విత్తన నాణ్యత ప్రయోగశాల ఏర్పాటు
రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థను పటిష్ఠం చేయాలి
రాష్ట్రానికి కేంద్ర వ్యవసాయశాఖ సూచన
ఈనాడు - హైదరాబాద్‌

నాణ్యమైన విత్తనాలను రైతులకు అందించేందుకు పటిష్ఠ కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలుచేయాలని కేంద్ర వ్యవసాయశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్న ఖరీఫ్‌ సీజన్‌లో విత్తన నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టి ముమ్మరంగా తనిఖీలు చేయాలని అన్ని రాష్ట్రాల వ్యవసాయశాఖలకు ఆదేశాలిచ్చింది. విత్తనాల ఉత్పత్తి, సరఫరా, అమ్మకాలు, నాణ్యత తదితర అంశాలపై కేంద్ర వ్యవసాయశాఖ ఇచ్చిన సూచనల్లో ముఖ్యాంశాలు....

* ప్రైవేటు కంపెనీలు మార్కెట్‌లో విక్రయించే సంకరజాతి(హైబ్రీడ్‌) విత్తనాల శుద్ధి ప్లాంట్ల రిజిస్ట్రేషన్‌ అధికారం రాష్ట్ర వ్యవసాయశాఖకు అప్పగించింది. ఇంతకాలం ఈ అధికారం రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థ(ఎస్‌సీఏ)కు ఉంది. ఈ ప్లాంట్లను వ్యవసాయాధికారులు తనిఖీ చేసి రిజిస్ట్రేషన్‌లో తెలిపిన ప్రకారం నాణ్యమైన విత్తన ఉత్పత్తి జరుగుతుందా లేదా అనేది పరిశీలించాలి.
* ప్రతి జిల్లాలో విత్తన నాణ్యత ప్రయోగశాలను తప్పనిసరిగా ఏర్పాటుచేయాలి. రైతులు కొన్న విత్తనాల నాణ్యతను పరీక్షించే అవకాశం ఇందులో ఉండాలి. ప్రతి విత్తన విక్రయ దుకాణం నుంచి వ్యవసాయాధికారులు నమూనాలు సేకరించి నాణ్యతపై ఈ ప్రయోగశాలల్లో తప్పనిసరిగా పరీక్షలు చేయించాలి.
* ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఉన్న ప్రయోగశాలల్లో సిబ్బంది, సదుపాయాల కొరత ఉంది. వాటిని తీర్చడమే కాకుండా ఆధునిక పరీక్షల పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేవాలి.
* వ్యవసాయశాఖ తరఫున ‘విత్తన గ్రామం’ పథకాన్ని అమలుచేయాలి. అంటే అనుకూల వాతావరణమున్న ప్రాంతాల్లోని గ్రామాలను ఎంపిక చేసి అక్కడ విత్తన పంటల సాగుకు రైతులను ప్రోత్సహించాలి. ఈ పథకం కింద ప్రతి రైతుకు 2.5 ఎకరాల్లో విత్తన పంటలు సాగుచేసేందుకు రాయితీలు అమలుచేయాలి.
* ‘జాతీయ ఆహార భద్రతా మిషన్‌’(ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం) పథకం కింద పప్పుధాన్యాల పంటల నూతన వంగడాల సాగుకే ప్రోత్సాహకాలిస్తున్నారు. ఇకనుంచి వరి, గోధుమ పంటలకు కూడా ఇవి పంపిణీ చేయాలి. రాయితీలను రైతులకు నగదు బదిలీ రూపంలో వారి బ్యాంకు ఖాతాల్లోనే జమచేయాలి.
* మూల విత్తన పంటల సాగు నిర్ణీత ప్రమాణాల ప్రకారం జరుగుతుందా లేదా అనేది తనిఖీ చేయడానికి ‘భారత వ్యవసాయ పరిశోధనా మండలి’(ఐసీఏఆర్‌) శాస్త్రవేత్తలతో బృందం ఏర్పాటుచేసి ఇందులో రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రతినిధినీ నియమించాలి.
* విత్తన నాణ్యతను పరీక్షించే వ్యవసాయాధికారులకు ఆధునిక పరిజ్ఞానంపై శిక్షణ ఇచ్చి వారి నైపుణ్యాన్ని పెంచాలి.
* దేశవ్యాప్తంగా సోయాచిక్కుడు మూల విత్తనం కొరత ఉంది. దీన్ని తీర్చేందుకు తక్షణ చర్యలు చేపట్టాలి.
* పదేళ్ల క్రితం నాటి పాత రకాల వరి విత్తనాలను వాడకుండా రైతులను చైతన్యపరచాలి. వాటిపై క్వింటా ధరలో రూ.500 మాత్రమే రాయితీ ఇవ్వాలి. పదేళ్లలోపు కొత్త వంగడాలైతే ఈ రాయితీ కింద రూ.వెయ్యి ఇవ్వాలి.
* ఇంతకాలం మూల విత్తనాలు సాగుచేసేవారికి రాయితీలు లేవు. ఇకనుంచి వారికి కూడా ఇవ్వాలి.
* కొత్త వంగడాలను ప్రభుత్వ లేదా ప్రైవేటు విత్తన కంపెనీలు విడుదల చేసినప్పుడు.. ఈ విత్తన లక్షణాలు, దిగుబడి తీరు, పంట సాగుచేసే యాజమాన్య పద్ధతులు వంటి వివరాలన్నీ ప్రభుత్వ ‘సీడ్‌నెట్‌’ పోర్టల్‌లో విడుదల చేసి అందరికీ తెలపాలి.
* విత్తన ధ్రువీకరణ ప్రక్రియను సరళీకరించాలి. రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థను ఆధునిక వనరులతో పటిష్ఠం చేయాలి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.