close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఇదో మాయరోగం

ప్రైవేటుతో కుమ్మక్కయి ఆధునిక పరికరాలను చెడగొడుతున్న సిబ్బంది 
నిర్ధారణ పరీక్షల కోసం పేదరోగులు బయటికి వెళ్లాల్సిన దుస్థితి 
సర్కారీ దవాఖానాల్లో సరికొత్త కుంభకోణం 
ఈనాడు - హైదరాబాద్‌

ర్కారు దవాఖానాలకు వచ్చే పేద రోగులకు సకల వసతులూ కల్పించాలన్న ప్రభుత్వ సంకల్పానికి అవరోధాలు ఎదురవుతున్నాయి. గత ఐదేళ్లలో పెద్దఎత్తున అధునాతన పరికరాలను కొనుగోలు చేసినా.. వాటిని వినియోగించడంలో మాత్రం పలు ఆసుపత్రుల సిబ్బంది నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. చిన్నచిన్న సమస్యలనూ వెంటనే పరిష్కరించడంలో చొరవ చూపించకుండా.. వాటిని మూలకు పడేస్తున్నారు. కొన్నిచోట్ల ప్రైవేటు రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రాలతో కుమ్మక్కయిన సిబ్బంది కొందరు ప్రభుత్వ దవాఖానాల్లోని పరికరాలకు గండి కొడుతున్నారు.. నెలల తరబడి మూలనపెడుతున్నారు. ఫలితంగా రూ.కోట్ల విలువైన ప్రజాధనం వృథా అవడమే కాకుండా రోగులకు ఆర్థికంగానూ భారంగా మారుతోంది. ఇదోరకం కుంభకోణంగా తయారవుతోంది. 
సామాజిక ఆరోగ్య కేంద్రాలు మొదలుకొని బోధనాసుపత్రుల దాకా దాదాపు రూ.400 కోట్ల విలువైన పరికరాలను గత ఐదేళ్లలో ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా పేద రోగులకు ఆర్థిక భారాన్ని తప్పించేందుకు నిర్ధారణ పరీక్షలకు అవసరమైన పరికరాలను నెలకొల్పింది. ఒక్క గాంధీ ఆసుపత్రిలోనే రూ.5 కోట్లతో 128 స్లైస్‌ సీటీ స్కానింగ్‌ యంత్రం, రూ. 1.40 కోట్లతో డిజిటల్‌ ఎక్స్‌రే, రూ.75 లక్షలతో సిమెన్స్‌ హార్మోన్‌ టెస్టర్‌, రూ.75 లక్షలతో బెక్‌మన్‌ కౌల్టర్‌, రూ.60 లక్షలతో హెమటాలజీ సెల్‌ కౌంటర్‌ తదితర అధునాతన పరికరాలను ఏర్పాటు చేసింది. వీటి వల్ల అన్ని రకాల రక్త, మూత్ర, మల పరీక్షలతోపాటు ఇతర స్కానింగ్‌లను కూడా రోగులు ఉచితంగా పొందవచ్చు. అయితే, ఇంత ఖరీదైన పరికరాలను నెలకొల్పినా.. లక్ష్యం సరిగా నెరవేరడం లేదు. చిన్న చిన్న సమస్యలు రాగానే పరికరాలను మూలన పడేస్తున్నారు. అలా ఒక్క గాంధీ ఆసుపత్రిలోనే ఖరీదైన ఎంఆర్‌ఐ సహా దాదాపు 500కుపైగా పరికరాలు వృథాగా ఉన్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థంచేసుకోవచ్చు. ఉస్మానియా ఆసుపత్రిలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ నాలుగు అల్ట్రాసౌండ్‌ సహా దాదాపు 100కి పైగా పరికరాలు నిరుపయోగంగా ఉంచారు. ఈ ధోరణి జిల్లా ఆసుపత్రుల్లోనూ కనిపిస్తోంది. 
ప్రైవేటుతో సిబ్బంది కుమ్మక్కు 
ప్రభుత్వ ఆసుపత్రుల్లోని రోగులను నమ్ముకొనే వాటి పక్కన పదుల సంఖ్యలో నిర్ధారణ పరీక్షల కేంద్రాలను ప్రైవేటు వ్యక్తులు నెలకొల్పారు. ప్రభుత్వమే రూ.కోట్లు కుమ్మరించి అధునాతన పరికరాలను కొనుగోలు చేసి ఉచిత పరీక్షలు నిర్వహిస్తుండడం వారికి మింగుడు పడటం లేదు. దీంతో ప్రైవేటు ప్రయోగశాలల యజమానులు కొందరు ఆసుపత్రి సిబ్బంది, వైద్యులతో కుమ్మక్కై తెర వెనుక మంత్రాంగాన్ని నడిపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పరికరాల్లో ఏదో ఒక సమస్యను కృతకంగా సృష్టించి.. పరీక్షల కోసం ప్రైవేటుకు రోగులను పంపించడంపై కొందరు సిబ్బంది దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఫలితంగా ప్రైవేటు నుంచి పెద్దమొత్తంలో ముడుపులు పొందుతున్నారనే విమర్శలున్నాయి. నెలల తరబడి పరికరాలు పనిచేయకపోయినా.. ఆసుపత్రి బాధ్యులు స్పందించకపోవడంపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 
ప్రోబ్‌.. విరిగిందా..? విరగ్గొట్టారా..? 
సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలోని పాథాలజీ ప్రయోగశాలలో అత్యంత అధునాతనమైన ‘ఫైవ్‌ పార్ట్‌ హెమటాలజీ సెల్‌ కౌంటర్‌’ పరికరాన్ని అమర్చారు. దీని ఖరీదు సుమారు రూ.60 లక్షలు. సమగ్ర రక్త పరీక్ష(సీబీపీ) సమాచారాన్ని ఈ పరికరం నిమిషాల్లో అందజేస్తుంది. అయితే, నిపుణులే ఆశ్చర్యపోయే విధంగా ఈ పరికరం పాడైంది. పరీక్ష ఫలితాలను వెల్లడించడంలో అత్యంత కీలకంగా వ్యవహరించే ‘ప్రోబ్‌’ అనే అంతర్భాగం విరిగిపోయింది. దాదాపు 30 ఏళ్ల వైద్యసేవల్లో ‘ప్రోబ్‌’ విరిగిపపోవడమనేది ఇంత వరకూ చూడలేదని నిమ్స్‌ విశ్రాంత పాథాలజీ వైద్యనిపుణులు ఆశ్చర్యం వ్యక్తంచేయడం గమనార్హం. ఇది లేకుండా నిర్ధారణ పరీక్షల ఫలితాలు వెల్లడయ్యే పరిస్థితి లేదు. మరో గత్యంతరం లేకపోవడంతో ‘సీబీపీ’ పరీక్షలు చేయించుకోవాల్సిన ఓపీ, ఐపీ రోగులు ఆసుపత్రి వెలుపలున్న ప్రైవేటు ప్రయోగశాలలకు వెళ్లాల్సి వచ్చింది. గాంధీ ఆసుపత్రిలో ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ అంశంపై దృష్టిపెట్టిన సర్కారు.. యుద్ధప్రాతిపదికన దీన్ని మరమ్మతు చేయించింది. ‘ప్రోబ్‌’ను ఉద్దేశ పూర్వకంగానే కొందరు ఆసుపత్రి ఉద్యోగులే విరగొట్టారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 
తక్షణ మరమ్మతులు, చర్యలు 
గాంధీ ఆసుపత్రిలో పరికరంలో అంతర్భాగం విరిగిపోయిన ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఈ విషయాన్ని తీవ్రంగానే తీసుకొన్నారు. పరికరాల నిర్వహణలో సమస్యలను తక్షణమే చక్కదిద్దాలని నిర్ణయించారు. గాంధీలో ‘ప్రోబ్‌’ విరిగిపోవడం వెనుక సిబ్బంది పాత్రపైనా విచారణ జరిపించనున్నారు. 
ఓ పరికరం పనిచేయకపోతే.. మొదటి బాధ్యుడిగా సంబంధిత విభాగాధిపతి, సిబ్బందినే పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించారు. 
మరమ్మతుకు కారణాలు తెలుసుకొని, ఉద్దేశపూర్వకంగా పాడుచేయడానికి ప్రయత్నించారని తేలితే.. సంబంధిత విభాగాధిపతి, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. 
ప్రైవేటు ప్రయోగశాలలకు సంబంధించిన వ్యక్తులెవరూ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో సంచరించకుండా తగిన చర్యలు తీసుకోవాలని అన్ని ఆసుపత్రుల బాధ్యులకు ఆదేశాలు జారీచేశారు. 
నిర్దిష్ట నిర్ధారణ పరీక్షల పత్రాలు అన్ని ఆసుపత్రుల్లోనూ అందుబాటులో ఉండే విధంగా, ప్రత్యేక విధానంలో ముద్రించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 
ముఖ్యంగా ప్రైవేటు ప్రయోగశాలలతో కుమ్మక్కై ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరికరాలను పాడుచేసే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని, అన్నిచోట్లా సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసే విధంగా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. 
ఐదేళ్లలో వైద్యపరికరాలపై ఖర్చు: రూ. 400 కోట్లు 
గాంధీ ఆసుపత్రిలో: రూ. 5 కోట్లు

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.