close

ప్ర‌త్యేక క‌థ‌నం

పారిశ్రామికవాడల్లో టౌన్‌షిప్‌లు

కార్యాచరణకు ప్రభుత్వ ఆదేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న పారిశ్రామికవాడల్లో కార్మికుల నివాసాల కోసం టౌన్‌షిప్‌లు నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలోనే తొలిసారిగా దీనికోసం సమగ్ర విధానాన్ని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తోంది.పారిశ్రామిక సమీక్ష సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఈ ప్రతిపాదనలపై చర్చించి, సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. దీనిపై కార్యాచరణకు ఆదేశించారు. దీనికి అనుగుణంగా పరిశ్రమలశాఖ, రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది. తెలంగాణ ఆవిర్భావానికి ముందు ఈ ప్రాంతంలో 28 వేల ఎకరాల్లో 147 పారిశ్రామికవాడలున్నాయి. ఇప్పటివరకు వాటిల్లో ఎలాంటి టౌన్‌షిప్‌లు లేవు. చాలామందికి పరిశ్రమలకు సమీపంలో ఇళ్లు లేవు. పారిశ్రామికవాడలకు రవాణా సౌకర్యాలు లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. దీంతో కార్మికులు ఇతర జిల్లాలు, ప్రాంతాల నుంచి వస్తున్నారు.కొందరు ఇళ్లను అద్దెకు తీసుకొని ఉంటున్నారు. ఇవన్నీ మానవ వనరుల కొరతకుదారి తీస్తున్నాయి. 
ఒకే నమూనాలో నిర్మాణాలు 
రాష్ట్రంలో కార్మికుల కోసం నిర్మించే టౌన్‌షిప్‌లన్నీ ఒకే నమూనాలో ఉండాలనే సూచనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటోంది. ఇక్కడ ఇళ్లను అద్దె ప్రాతిపదికన ఇస్తారు. వాటిని కొనేందుకు కార్మికులు ముందుకొస్తే రాయితీ మీద విక్రయించాలనే ప్రతిపాదనను  కూడా  ప్రభుత్వం పరిశీలిస్తోంది. 
సౌకర్యాలపై దృష్టి 
తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్ర ప్రభుత్వం కొత్త పారిశ్రామికవాడలపై దృష్టి సారించింది. 46 వేల ఎకరాల్లో 53 కొత్త పారిశ్రామికవాడల నిర్మాణాన్ని చేపట్టింది. వీటికి ఉన్న డిమాండ్ల దృష్ట్యా అక్కడ కార్మికులకు నివాసప్రాంతాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రాజెక్టుల పరిధిలో ఇళ్లను నిర్మించడం లేదా వాటికి సమీపంలోని స్థలాల్లో ఇళ్లను ఏర్పాటు చేయడం వంటి ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయి. గృహనిర్మాణం వల్ల కార్మికులకు నివాసవసతితో పాటు పరిశ్రమలకు వారు అందుబాటులో ఉంటారు. కార్మికులు తమ భార్యాపిల్లలతో కలిసి జీవించే అవకాశం ఉంటుంది. ఇతరత్రా సమస్యలు పరిష్కారమవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. 
రంగారెడ్డి జిల్లా కందుకూరు వద్ద 19,333 ఎకరాల్లో నిర్మిస్తున్న ఔషధనగరి వద్ద 500 ఎకరాలను కార్మికుల టౌన్‌షిప్‌ కోసం కేటాయించింది. వీటిని ప్రభుత్వం, పారిశ్రామిక సంస్థల సంయుక్త భాగస్వామ్యంతో నిర్మిస్తారు. 
హైదరాబాద్‌ సమీపంలోని దండుమల్కాపూర్‌లో 1200 ఎకరాల్లో దేశంలో తొలి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పార్కును నిర్మిస్తున్నారు. ఇందులో 190 ఎకరాలను టౌన్‌షిప్‌ కోసం కేటాయించారు. 
జహీరాబాద్‌లో నిర్మించే జాతీయ పెట్టుబడులు, ఉత్పాదకమండలి (నిమ్జ్‌)లో 450 ఎకరాలను ఇళ్ల నిర్మాణాలకు ప్రతిపాదించారు. 
తూప్రాన్‌లో ఆహార పార్కు, రాకంచర్ల, బూచినేల్లి, సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం శివనగర్‌లో ఎల్‌ఈడీ పార్కు. పాశమైలారం సమీపంలోని ఇంద్రకరణ్‌లో పారిశ్రామిక పార్కు, మహేశ్వరం మండలంలో ఎలక్టాన్రిక్‌ తయారీ క్లస్టర్లు, ఖమ్మం జిల్లా బుగ్గపాడు వద్ద మెగా ఆహారశుద్ధి కర్మాగారం. 
నిజామాబాద్‌ జిల్లా వేల్పూరులో సుగంధ ద్రవ్యాల పార్కు, సిద్దిపేట జిల్లా బండమైలారంలో విత్తనపార్కు, నల్గొండ జిల్లా మిర్యాలగూడ, పెద్దపల్లి జిల్లా కుందనపల్లి రామగుండంలో ఏర్పాటు చేయనున్న పార్కుల్లోనూ టౌన్‌షిప్‌లను మంజూరు చేయనున్నారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.