close

ప్ర‌త్యేక క‌థ‌నం

కర్షకులకు కాసుల కటాక్షం

భూ సమీకరణ లేఅవుట్లకు హెచ్‌ఎండీఏ సిద్ధం
ప్రజా కాలనీగా రూపొందించే ప్రణాళిక
ముందుకు వచ్చిన ప్రతాపసింగారం  రైతులు
ఏడు జిల్లాల పరిధిలో చేపట్టే ఉద్దేశం
రైతులు 50 ఎకరాలు ఇస్తే చాలు లేఅవుట్‌
అభివృద్ధి చేసిన స్థలంలో రైతుకు సగం
ఆసక్తి వ్యక్తీకరణకు నోటిఫికేషన్‌ జారీ
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి

హ్మదాబాద్‌ తరహాలో మహానగర పరిధిలో కూడా హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) నేతృత్వంలో ప్రజా కాలనీలు రాబోతున్నాయి. రైతుల నుంచి భూమిని సమీకరించి ఉన్నతస్థాయి ప్రమాణాలతో లేఅవుట్లుగా అభివృద్ధి చేయబోతున్నారు. ఇందులో కాలనీలు ఏర్పాటు చేసేందుకు హెచ్‌ఎండీఏ తోడ్పాటును అందించబోతోంది. భూ సమీకరణ (ల్యాండ్‌ పూలింగ్‌) పథకానికి హెచ్‌ఎండీఏ ప్రణాళిక సిద్ధమైంది. ఇప్పటికే ప్రతాపసింగారం గ్రామానికి చెందిన రైతులు 200 ఎకరాల భూమిని ఈ పథకం కింద ఇవ్వడానికి ముందుకు వచ్చారు.

రైతుల దగ్గర భూ సమీకరణ, లేఅవుట్లకు మహారాష్ట్ర, గుజరాత్‌లు పెట్టింది పేరు. అహ్మద్‌బాద్‌లో రింగ్‌ రోడ్డు నిర్మాణానికి భూసమీకరణ చేశారు. అనంతరం అక్కడ మహానగరాభివృద్ధి సంస్థ ఈ రింగ్‌ రోడ్డు చుట్టూ భూసమీకరణ కాలనీలను ఏర్పాటు చేసింది. ఇదే తరహాలో హైదరాబాద్‌ చుట్టుపక్కల ఏడు జిల్లాల పరిధిలో ఇదే తరహా భూసమీకరణ లేఅవుట్లను వేయాలని రెండేళ్ల కిందç అప్పటి హెచ్‌ఎండీఏ కమిషనర్‌ చిరంజీవులు తలపెట్టారు. ఇందులో భాగంగా మేడ్చల్‌ జిల్లా ప్రతాపసింగారం రైతులతో అధికారులు మాట్లాడగా 200 ఎకరాలు తమ సొంత భూమి ఇవ్వడానికి వారు ముందుకు వచ్చారు. కొన్ని కారణాల వల్ల ఈ ప్రక్రియ ఆలస్యమైంది. ప్రస్తుత హెచ్‌ఎండీఏ ఇన్‌ఛార్జి కమిషనర్‌, పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్‌ ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం అంగీకరించడంతో వివిధ ప్రాంతాల్లో భూ సమీకరణ కోసం రైతుల నుంచి ఆసక్తి వ్యక్తీకరణకు నోటిఫికేషన్‌ జారీ చేశారు.

50 ఎకరాలున్నా చాలు
ఈ పథకం కింద కనీసం 50 ఎకరాల నుంచి 500 ఎకరాలు ఆపైన రైతులు ఇవ్వడానికి ముందుకు వస్తే చాలు. భూమిని హెచ్‌ఎండీఏ తీసుకుని మౌలిక సదుపాయాలను కల్పిస్తుంది. లేఅవుట్‌లో అభివృద్ధి చేసిన భూమిని 50 శాతం రైతుకు ఇస్తారు. మిగిలిన స్థలాన్ని హెచ్‌ఎండీఏ తీసుకుంటుంది. ఇలా రూపొందిన కాలనీలో తమ వాటా కింద వచ్చే స్థలంలో ప్రైవేటు వ్యక్తులకు ఇళ్లు నిర్మించి విక్రయించే ప్రతిపాదన కూడా గతంలో హెచ్‌ఎండీఏ చేసింది. ఈమేరకు సంబంధిత అధికారులు ప్రణాళికను రూపొందిస్తున్నారు. భూ సమీకరణ ప్రాజెక్టు కోసం శుక్రవారం పత్రికల్లో ప్రకటన ఇచ్చామని హెచ్‌ఎండీఏ ప్రణాళికా విభాగం డైరెక్టర్‌ కె.శ్రీనివాస్‌ ‘ఈనాడు’కు తెలిపారు. తమ కమిషనర్‌ అర్వింద్‌ కుమార్‌ ఈ ప్రాజెక్టును చేపట్టే విషయంలో పట్టుదలగా ఉన్నారన్నారు.  ముందుకు వచ్చే రైతులతో మాట్లాడి భూసమీకరణ ప్రాజెక్టును త్వరితగతిన చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

కాసులు కురిపించిన ప్రాజెక్టు
నాగోలు మెట్రోస్టేషన్‌ దగ్గర కొన్నేళ్ల కిందట ప్రభుత్వం వివిధ ప్రాజెక్టుల గురించి భూసేకరణకు పూనుకోగా అక్కడి రైతులు హెచ్‌ఎండీఏకు భూమిని ఇచ్చారు. రెండేళ్ల కిందట ఇక్కడ దాదాపు 350 ఎకరాల భూమిని సంస్థ అన్ని సౌకర్యాలతో లేఅవుట్‌ను రూపొందించింది. రైతుల వాటా స్థలాలు పోను.. తనవాటా కింద వచ్చిన 67 స్థలాలను నెలరోజుల కిందట హెచ్‌ఎండీఏ వేలం వేయగా దాదాపు రూ.670 కోట్ల మేర నిధులు వచ్చాయి. హెచ్‌ఎండీఏ ఇక్కడ భూమిని అభివృద్ధి చేయకముందు గజం ధర రూ.20 వేలు ఉండగా.. తాజా వేలంలో గరిష్ఠంగా రూ.50 వేలు పలికింది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.