close

ప్ర‌త్యేక క‌థ‌నం

తృణప్రాయంగా కొనలేం!

గత ఆరునెలల్లోనే 50% పెరిగిన తృణధాన్యాల ధరలు
కొర్రల విత్తనాల క్వింటా ధర రూ.21,600
  నిత్యాహారంలో భాగంగా తీసుకుంటున్న ప్రజలు
  అన్నం కన్నా ఇవే మేలనే ప్రచారం
ప్రత్యేక హోటళ్ల ఏర్పాటు, రుచికర వంటలతో పెరిగిన డిమాండ్‌
ఈనాడు - హైదరాబాద్‌

సామలు, కొర్రలు, అరికెలు, ఊదలు వంటి తృణధాన్యాలకు డిమాండ్‌ బాగా పెరగడంతో వాటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బహిరంగ మార్కెట్‌లో వీటి గరిష్ఠ చిల్లర విక్రయ ధర(ఎమ్మార్పీ) గత ఆరునెలల్లో 50 శాతానికి పైగా పెరిగింది. రోజువారీ ఆహారంలో వరి అన్నం తినే వారు దానిని మానేసి తృణధాన్యాల వైపు మొగ్గుచూపుతున్నందున వీటి ధరలకు రెక్కలొచ్చాయి. రకాన్ని బట్టి కిలో బియ్యం ధర రూ.40 నుంచి రూ.50 దాకా ఉంది. అయినా వాటిని మానేసి కిలో కొర్రలు లేదా సామలు, ఊదలు వంటి వాటి కోసం రూ.70 నుంచి రూ.80 దాకా వెచ్చించి మరీ కొంటున్నారు. ఆరునెలల క్రితం వీటి ధర ఇంతకన్నా 50 శాతం దాకా తక్కువ ఉండేదని మలక్‌పేట టోకు వ్యాపారులు ‘ఈనాడు’కు చెప్పారు. వీటిలో పోషక విలువలు, ఖనిజాలు ఎక్కువగా ఉన్నందున ఆరోగ్యంపై అవగాహన ఉన్నవారు తీసుకుంటున్నారు. ఏడాది క్రితం వరకు ఈ పంటలను పండిస్తే అమ్ముకోలేక, ధర లేక రైతులు నానా పాట్లు పడేవారు. ఇప్పుడు ఈ పంటలు పండించే రైతుల చిరునామాలు అడిగి మరీ కొనే వ్యాపారుల సంఖ్య పెరుగుతోందని మార్కెటింగ్‌ శాఖ అధికారులు తెలిపారు. తొలిసారిగా ఈ పంటలను వచ్చే జూన్‌ నుంచి ప్రారంభమవుతున్న వానాకాలం(ఖరీఫ్‌) సీజన్‌లో రైతులతో పెద్దయెత్తున పండించేందుకు వ్యవసాయశాఖ కూడా ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ పంటల విత్తనాలకు ఏకంగా 65 శాతం రాయితీ ఇస్తామని ప్రకటించింది.

శుద్ధి యంత్రాలు రావడంతో...
కొర్రలు, సామలు, అరికెలు, ఒరిగెలు, రాగులు, జొన్నలు, ఊదలు వంటి పంటల నుంచి ఆహారం తయారుచేసుకునేలా ధాన్యాన్ని పొట్టు ఒలిచి తయారుచేయడం కష్టంతో కూడుకున్న పని. ఒకప్పుడు ఇలా ధాన్యాన్ని మర పట్టించడానికి యంత్రాలు పెద్దగా అందుబాటులో లేక ఈ పంటలకు డిమాండ్‌ ఉండేది కాదు. గత రెండేళ్లుగా రాజేంద్రనగర్‌లోని ‘జాతీయ తృణధాన్యాల పరిశోధనా సంస్థ’(ఐఐఎంఆర్‌) వీటిని మరపట్టేందుకు, నేరుగా ఆహార ఉత్పత్తుల తయారీకి అనేక యంత్రాలను రూపొందించి మార్కెట్‌లోకి తెచ్చింది. ఇడ్లీ, రొట్టెలు, బిస్కట్లు, కేకులు, పాస్తా, సేమియా వంటి ఉత్పత్తులను ఈ పంటలతో తయారుచేయడానికి ఆధునిక పరిజ్ఞానమున్న యంత్రాలను ఐఐఎంఆర్‌ అందుబాటులోకి తెచ్చింది. సాధారణంగా గోధుమ పిండితో రొట్టె చేసినంత సులువుగా పచ్చజొన్న పిండితో క్షణాల్లో రొట్టెలు చేయడం కష్టమని గృహిణులు ఆసక్తి చూపరు. ఈ సమస్యను అధిగమించడానికి నేరుగా జొన్నపిండితో రొట్టె తయారీ యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఇలాంటి యంత్రాలతో పలు హోటళ్లలో తృణధాన్యాలతో తయారుచేసిన రుచికరమైన ఆహారోత్పత్తులను అమ్ముతున్నారు. ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉన్న హైదరాబాద్‌లోని మాదాపూర్‌తో పాటు, నగర ప్రజల ఆహారపు అలవాట్లను దృష్టిలో పెట్టుకుని ఈ పంటల ఆహారోత్పత్తులు విక్రయించే హోటళ్ల సంఖ్య పెరుగుతోంది. వీటికోసమే ప్రత్యేకంగా కొన్ని హోటళ్లు ఏర్పాటయ్యాయి. వరి అన్నం వల్ల మధుమేహం, ఊబకాయం వంటి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయనే ప్రచారం పెరగడం వల్ల దాన్ని తగ్గించడానికి ఈ తృణధాన్యాలను ఆహారంగా తీసుకోవడం పెరుగుతోంది.

ఆకాశాన్నంటుతున్న విత్తనాల ధరలు
పంటలకు డిమాండ్‌ పెరగడంతో తృణధాన్యాల విత్తనాల ధరలు సైతం ఆకాశాన్నంటుతున్నాయి. కొర్రల్లో రెండు రకాలున్నాయి. సాధారణ కొర్రల విత్తనాల ధర క్వింటా రూ.8,600 కాగా అందెకొర్రల ధర రూ.21,600కు చేరింది. పచ్చజొన్నల విత్తనాల ధర అధికారికంగానే క్వింటాకు రూ.15,600 అని వ్యవసాయశాఖ ప్రకటించింది. సాధారణ జొన్నల ధర ఇంతకన్నా రూ.3 వేలు తక్కువగా రూ.12,600 ఉంది. రాగుల ధర రూ.18,600కు చేరింది. కర్ణాటకలో రాగులు సహా ఇతర తృణధాన్యాల పంటలను అధికంగా పండించడంతో పాటు వాటిని మద్దతు ధరకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కొంటోంది. ఇప్పుడు పలు తృణధాన్యాల విత్తనాలను ఇతర రాష్ట్రాల నుంచి కొని ఇక్కడి రైతులకిచ్చి పంట సాగుచేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

 

ఒకేసారి తినకూడదు

పోషక విలువలు అధికంగా ఉన్నాయని ఇంతకాలం వరి అన్నం తినేవారు ఒకేసారి దాన్ని పూర్తిగా మానేసి వీటిని తినరాదు. వయసును బట్టి తృణధాన్యాల ఆహారాన్ని ఏ స్థాయిలో తీసుకోవాలనేది నిర్ణయించాలి. 19 ఏళ్లలోపు వయసు ఉండే వారికి అధిక ఫైబర్‌ అవసరం లేదు. పూర్తిగా వరి అన్నం మానేసి తృణధాన్యాలనే పెట్టరాదు. 20 ఏళ్ల వయసు పైబడిన వారు వీటిని రోజూ ఆహారంలో ఒకపూట తీసుకుంటే మేలు. అలాగే జీవనశైలి వ్యాధులు.. హైపర్‌టెన్షన్‌, కొవ్వు అధికమై ఊబకాయంతో బాధపడేవారు, మధుమేహ రోగులు వంటి వారు వీటిని క్రమం తప్పకుండా రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి.

- డాక్టర్‌ హైమావతి, ప్రొఫెసర్‌, ఆహార, పోషక విలువల విభాగం, జయశంకర్‌ వర్సిటీ

ఆదాయం పెరిగేందుకు మంచి మార్గం

ప్రస్తుతం మనదేశంలోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్‌లో సైతం తృణధాన్యాల పంటలకు బాగా డిమాండ్‌ పెరుగుతోంది. ఇప్పటికే ఉత్తరాదితో పాటు కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల రైతులు ఈ పంటలను పండించి ఆదాయం పొందుతున్నారు. తెలుగు రైతులు కూడా వీటి సాగును పెంచితే మంచిది. అనేక రకాల మేలైన వంగడాలు, శుద్ధి యంత్రాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. పచ్చజొన్నలకు మన మార్కెట్లలో అధిక డిమాండ్‌ ఉంది. క్వింటా రూ.5 వేలకు పైగా చెల్లించి కొంటున్నారు. ఇతర వాణిజ్య పంటలకన్నా వీటిపై దృష్టి పెడితే రైతులకు ఆదాయం పెరుగుతుంది. మా సంస్థ తరఫున ఆధునిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చి పలు కంపెనీలకు, హోటళ్లకు ఇస్తున్నాము. పలు రాష్ట్రాల వారు ఈ పరిజ్ఞానం కోసం మా సంస్థను సంప్రదిస్తున్నారు.

- డాక్టర్‌ దయాకర్‌రావు, ప్రధాన శాస్త్రవేత్త, భారత తృణధాన్యాల పరిశోధన సంస్థ, రాజేంద్రనగర్‌

 

 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.