close

ప్ర‌త్యేక క‌థ‌నం

రోజులో విజయం!

ఎవరన్నా జీవితంలో కాస్త పైకొచ్చారంటే చాలు.. వాళ్లకు ‘కాలం కలిసొచ్చింది’ అంటాం. ‘మంచి రోజులు వచ్చాయి’ అని భావిస్తాం. మనం ఎలా అనుకున్నా ఈ మాటల్లో ఒక విజయ రహస్యం దాగుంది. వృద్ధిలోకి వచ్చినవారు ప్రతి రోజూ సమయాన్ని ఎలా గడుపుతారో వాళ్ల ఆలోచనలు, అలవాట్లు ఎలా ఉంటాయో కాస్త తరచి చూడటం వల్ల మనకూ ప్రయోజనం ఉంటుందంటున్నారు విశ్లేషకులు.

జీవితంలో మెట్టుమెట్టూ పైకెక్కి విజయ శిఖరాల్ని అధిరోహించిన ఏ ప్రపంచ ప్రముఖుడి జీవితం చూసినా విజయం అనేది వాళ్లకు ఏ ఒక్క రోజులోనో, కొద్ది కాలంలోనో దక్కింది కాదని తేలిగ్గానే తెలిసిపోతుంది. కాస్త లోతుగా చూస్తే.. వాళ్ల విజయం.. నిత్యం వాళ్లు చేసే పనుల్లో, వాళ్ల రోజువారీ అలవాట్లలో, వాటి వెనక ఉండే వారి ఆలోచనల్లో కూడా ఉందని అర్థమవుతుంది. అందుకే ప్రముఖుల దినచర్య గురించి ప్రపంచవ్యాప్తంగా ఎనలేని ఆసక్తి వ్యక్తమవుతోంది! ఈ సందేహాలకు అంతూదరీ ఉండదు. నిజమే, వాళ్లు బిజీగానే ఉంటారు. కానీ కేవలం బిజీగా ఉండటం ఒక్కటే విజయానికి దగ్గర చెయ్యలేదు. అది విజయానికి అంత దగ్గరి దారేం కాదు. అందుకే ఒక్కసారి విజేతల జీవితాల్లోకి తొంగి చూద్దాం.. పదండి..

బెంజమిన్‌ ఫ్రాంక్లిన్‌
పంచాంగంలాగే ప్రతి దిన ప్రణాళిక!

విఖ్యాత రచయిత, దౌత్యవేత్త, రాజనీతిజ్ఞుడు, శాస్త్రవేత్త, ఆవిష్కర్త, తత్వవేత్త, పాత్రికేయుడు, ప్రచురణకర్త, అమెరికా సంయుక్త రాష్ట్రాల వ్యవస్థాపకుల్లో ఒకరు.. ఇలా ఫ్రాంక్లిన్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. అమెరికా చరిత్ర మొత్తం తిరగేసినా ఇంతటి బహుముఖ ప్రతిభావంతుడు మరొకరు కానరారు. 18వ శతాబ్దంలోనే ‘పూర్‌ రిచర్డ్స్‌ అల్మానాక్‌’ పేరుతో మన పంచాంగాల్లాంటి సకల సమాచార గ్రంథాలను ప్రచురించారీయన. మరి ఒక్క మనిషి ఇన్ని రంగాల్లో ఇంతటి ప్రతిభ కనబరచటం ఎలా సాధ్యమైందంటే.. కచ్చితంగా ‘క్రమం తప్పని దినచర్య’ వల్లే! రోజును క్రమ పద్ధతిలో గడపటం చాలా ముఖ్యమని గుర్తించిన ఫ్రాంక్లిన్‌ దీనికోసం చాలా రకాలుగా ప్రయోగాలు చేసీచేసీ, చివరికి ప్రత్యేకంగా ఒక ఛార్టు వేసుకున్నారు. ఆయన ఆత్మకథలో కూడా ముద్రించిన ఈ పట్టిక చాలా ప్రాచుర్యం పొందింది. ఉదయం 5కు లేచి ముందు కాలకృత్యాలు, మౌనంగా ‘పవర్‌ఫుల్‌ గుడ్‌నెస్‌’ను తల్చుకోవటం (ధ్యానంలా), ఆ రోజు కచ్చితంగా చెయ్యాల్సిన పనులను నిర్ణయించుకోవటం, అల్పాహారం.. అన్నీ 8లోపు పూర్తవ్వాలి. ఉదయం 8-12 మధ్య కచ్చితంగా పని. 12-2 మధ్య చదవటం, పద్దులు చూసుకోవటం, భోజనం పూర్తి.      మళ్లీ మధ్యాహ్నం 2 - 6 మధ్య పని. సాయంత్రం 6-10 మధ్య ఈ రోజు నేనేం మంచి పని చేశాను? అన్న సమీక్ష, సంగీతం వినటం, ఇతరులతో మాటామంతీ. రాత్రి 10 నుంచి తెల్లవారుజామున 5 వరకూ నిద్ర. ఎంత ఒత్తిడిలోనైనా ఈ రొటీన్‌ తప్పేది లేదు. విద్యుత్తు ప్రయోగాలు కావొచ్చు, దేశాలతో శాంతి చర్చలు కావొచ్చు... ఏ పనైనా ఆ నిర్దేశిత 8 గంటల్లోనే! ఉరుకులుపరుగుల్లేవు. ఆస్వాదించని ఘడియా లేదు. సన్నిహితులతో గడపటం, సంగీతం వినటం వంటివాటికి తక్కువ ప్రాధాన్యమేం లేదు. ఈ రోజు నేనేం మంచి పని చెయ్యాలి? అన్న ప్రశ్నతో మొదలై.. చేసిన మంచేమిటన్న సానుకూల సమీక్షతో రోజు పూర్తవటం విశేషం. మరి ఇవాళ ఆయన చిత్రం డాలర్‌ నోట్ల మీదా దర్శనమిస్తోందంటే ఆశ్చర్యమేముంది?

జుకర్‌ బర్గ్‌
వాటి మీద ఒక్క క్షణమైనా వృథానే!

ప్రతి రోజూ మనమేం బట్టలేసుకోవాలి, ఏం షూ తొడుక్కోవాలి వంటి విషయాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండకూడదు. ఇలాంటి వాటి మీద సాధ్యమైనంత తక్కువ సమయం వెచ్చించాలన్నదే నా ఉద్దేశం.

ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు, యువతరానికి ఆరాధ్యుడు.. కావాలంటే క్షణానికో ఖరీదైన డ్రస్సు మార్చుకోగలిగిన ప్రపంచ సంపన్నుడు జుకర్‌బర్గ్‌. కానీ ఎప్పుడూ గ్రే రంగు టీషర్టు, నీలం జీన్స్‌, అప్పుడప్పుడు హుడీ.. వీటిలోనే కనబడతాడు. వాడే కారూ చాలాకాలంగా అదే. ఎందుకలా? ఆయన్నే అడిగితే.. ‘‘ప్రతి రోజూ మనమేం బట్టలేసుకోవాలి, ఏం షూ తొడుక్కోవాలి వంటి విషయాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండకూడదు. ఇలాంటి వాటి మీద సాధ్యమైనంత తక్కువ సమయం వెచ్చించాలన్నదే నా ఉద్దేశం. ఆ సమయాన్ని కూడా కొత్త ఆలోచనల మీద, కొత్త నిర్ణయాల మీదే వెచ్చించాలనుకుంటాన్నేను’’ అంటాడాయన. జుకర్‌ బర్గ్‌ వారానికి 60 గంటలు పని చేస్తాడు. ఉదయం 8కి నిద్ర లేస్తూనే మంచం దిక్కుండానే ఒక్కసారి ఫేస్‌బుక్‌, మెసెంజర్‌, వాట్సప్‌.. చకచకా చూసేస్తాడు. ‘‘నిజం చెప్పాలంటే అదో బాధ. నేను కాంటాక్ట్‌ లెన్సులు వాడతా. అవి లేకుండా సరిగ్గా చూళ్లేను. కానీ పొద్దున్నే లేస్తూనే లెన్సుల్లేకుండా ఫేస్‌బుక్‌ చూడాలంటే ఫోను కళ్లకు చాలా దగ్గరగా పెట్టుకుని చూడాల్సి వస్తుంటుంది’’ అంటాడాయన. లేస్తూనే ఒక్కసారి మెయిల్స్‌, మెసేజ్‌లు చూసుకోవటం మంచిదేగానీ దానికే అతుక్కుపోకూడదంటాడు. లేచిన తర్వాత ఒక్కసారి భార్య, పిల్లలతో మాట్లాడటం, తర్వాత వారంలో 3 రోజులు వ్యాయామం. అది లేనిరోజున కుక్కతో బయట పరుగెత్తటం అలవాటు. ప్రపంచంలోనే అతి పెద్ద కంపెనీల్లో ఒకటైన ఫేస్‌బుక్‌ను నడపటం తేలికేం కాదు. అయినా ప్రతి 2 వారాలకో పుస్తకం చదువుతుంటాడు. చైనా భాష మాండరిన్‌ నేర్చుకోవటం, తన ఇల్లు మొత్తాన్నీ కృత్రిమ మేధతో అనుసంధానించటం.. ఇలా ప్రతి ఏడాదీ తనకు తానే  లక్ష్యాలు పెట్టుకుంటాడు. ఇవి తనకు కొత్త ఉత్తేజాన్నిస్తాయంటాడు. ట్వీటర్‌లో కనబడటం     చాలా అరుదు. ఇద్దరు కూతుళ్లతో కలిసి రాత్రిపూట ప్రార్థన చేయటం, దూర ప్రయాణాలకు వెళ్లటం ఇష్టం. కుటుంబ బంధాలు బలంగా ఉండాలని ఎంతగా నమ్ముతాడంటే పాప పుట్టినప్పుడు   ఫేస్‌బుక్‌ ఆఫీసుకు ఏకంగా రెణ్నెల్లు సెలవుపెట్టేసి ఇంటివద్దే ఉండిపోయాడు.

ఎలాన్‌ మస్క్‌
ప్రతి 5 నిమిషాలకూ ప్రణాళిక

మనం ఎప్పుడూ పనులను ఇంకెంత బాగా చెయ్యగలమని ఆలోచిస్తూనే ఉండాలి, మనల్ని మనం ప్రశ్నించుకుంటూనే ఉండాలి.

నేటి తరం సంభ్రమాశ్చర్యాలతో ఆరాధనగా చూసే వ్యక్తి ఎలాన్‌ మస్క్‌. శాస్త్రవేత్త, ఆవిష్కర్త, సాహసిక వ్యాపారవేత్త.. ఇలా ఆయన గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. గంటకు 1,200 కి.మీ. వేగంతో ప్రయాణించే ‘హైపర్‌లూప్‌’ ఆవిష్కారం నుంచి మనిషిని అంగారకుడి మీదకు పంపి అంతరిక్ష విప్లవం సృష్టించే వరకూ.. మస్క్‌ చేతిలో ఉన్న భారీ ప్రణాళికల జాబితా చూస్తే మనం బిత్తరపోవాల్సిందే. ఒక వైపు టెస్లా, మరోవైపు స్పేస్‌-ఎక్స్‌ వంటి దిగ్గజ కంపెనీలతో బిజీగా ఉన్నా మస్క్‌ రోజూ కచ్చితంగా 6 గంటలు నిద్రపోతారు! ‘‘నిద్ర తగ్గిన రోజున.. నేనెన్ని గంటలు ఎక్కువ పనిచేసినా.. పని ఎప్పటి కంటే తక్కువే అవుతోంది. అందుకే రోజూ రాత్రి 1కి నిద్రపోయి ఉదయం 7కు లేస్తా’’ అంటారాయన. క్షణం ఖాళీ లేకుండా రోజు మొత్తాన్ని ఐదేసి నిమిషాల బ్లాకుల్లా విభజించుకుని వారం మొత్తమ్మీద 85-100 గంటలు పని చేయటం మస్క్‌ ప్రత్యేకత. ఇందులో 80% సమయం ఇంజినీరింగ్‌, డిజైన్‌ మీదే  గడుపుతారు. సోమ-గురువారాలు స్పేస్‌ ఎక్స్‌కు; మంగళ,  బుధవారాలు     టెస్లాకు, శుక్రవారం  రెండు కార్యాలయాలకు వెళతారు. వారంలో అర పూట  ‘ఓపెన్‌ ఏఐ’     అనే లాభాపేక్ష లేని కృత్రిమ మేధ సంస్థ కోసం పని చేస్తారు. ఎంత పని ఉన్నా- శనివారాలు  తన ఐదుగురు కుమారులతో, ఆదివారం ప్రయాణాలు చేస్తూ గడుపుతారు. వారంలో రెండుసార్లు ట్రెడ్‌మిల్‌, బరువులు ఎత్తటంతో సహా చాలా వ్యాయామాలు చేస్తారు. రోజూ షవర్‌ కింద స్నానం తప్పనిసరి, తన జీవితం మీద అతిపెద్ద సానుకూల ప్రభావం చూపే అలవాటు ఇదేనంటారు. ఫోన్‌ కాల్స్‌ అంటే అస్సలు ఇష్టం ఉండదు. అనవసర మెయిల్స్‌ నుంచి తప్పించుకునేందుకు తన మెయిల్‌ ఐడీ కూడా బయట ఎవరికీ చెప్పరు. ఆహారం మాత్రం 5 నిమిషాల్లో ముగిస్తారు, అదీ మీటింగుల మధ్యే. పుస్తకాలు, ముఖ్యంగా ఆత్మకథలను చదవటం మానరు.

వారెన్‌ బఫెట్‌
చదువు చక్రవడ్డీలాంటిది!

మనం నిద్రపోతున్న సమయంలో కూడా మన డబ్బులు పిల్లలు పెట్టేలా చూసుకోలేదంటే.. మనం జీవితంలో చివరి రోజు వరకూ కూడా చాకిరి చేస్తూనే ఉండాల్సి వస్తుంది!

తెలివిగా సంపదను పెంచటంలో ఆరితేరిన ఘనుడు, ఆధునిక ప్రపంచానికి పెట్టుబడులు గురువు వారెన్‌ బఫెట్‌. వయసు రీత్యా 90లకు దగ్గరవుతున్నా ఇప్పటికీ ఆయన దినచర్యలో పెద్ద మార్పేం లేదు. గత 40 ఏళ్లుగా ప్రతి రోజూ దాదాపు ఒకేలా గడుపుతున్నారు. రాత్రి 10.45కల్లా పడుకుంటారు. ‘‘నాకు హాయిగా నిద్ర పడుతుంది. అందుకే ప్రతి రాత్రీ కనీసం 8 గంటలు నిద్రపోతా’’ అని చెబుతుంటారు. సంపన్నుల జాబితాలో పైఎత్తున ఉండటం ఒక్కటే అయితే ప్రపంచం బఫెట్‌ను పెద్దగా పట్టించుకునేదికాదేమోగానీ.. సేల్స్‌మన్‌గా జీవితం మొదలుపెట్టి అసమానంగా ఎదిగిన ఆయన ఆలోచనాపరుడిగా, దాతగా, దార్శనికుడిగా కూడా నిలబడటంతో ఆయన మాటలు అంతా రిక్కించి వింటారు. మరి ఇంత పెద్దాయన... రోజులో ఎక్కువ భాగం ఏం చేస్తారు? పగటిపూట 80% సమయం చదువులోనే గడుపుతారు. రోజుకు 500 పేజీలైనా చదవటం చాలా అవసరమని, అలా చదివితేనే విజ్ఞానమనేది చక్రవడ్డీలా పెరుగుతుందని చెబుతుంటారు. ఉదయం 6.45కు లేస్తారు. ఇంటిదగ్గరే వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌, యూఎస్‌ఏ టుడే, ఫోర్బ్స్‌, తర్వాత ఆఫీసులో ఫైనాన్షియల్‌ టైమ్స్‌, న్యూయార్క్‌టైమ్స్‌, ఒమహా వరల్డ్‌ హెరాల్డ్‌, అమెరికన్‌ బ్యాంకర్‌.. ఇలా వార్తాపత్రికలను కనీసం ఐదారు గంటలు క్షుణ్ణంగా చదువుతారు. పగలంతా హెడ్‌లైన్స్‌ చూస్తుంటారు. కార్పొరేట్‌ నివేదికలను జల్లెడ పట్టేస్తుంటారు. 40 ఏళ్లుగా ఒకటే బ్రేక్‌ఫాస్ట్‌. ఆఫీసుకు వెళ్లే దారిలో మెక్‌డొనాల్డ్స్‌ దగ్గర ఆగి, సాసేజ్‌, గుడ్డు, ఛీజ్‌.. ఇలా మూడు రకాల్లో ఏదో ఒకటి తింటారు, వీటి మీద ఏనాడూ 3.17 డాలర్లకు మించి ఖర్చు పెట్టింది లేదు. ఫాస్ట్‌ఫుడ్‌, కోక్‌ అంటే మక్కువ కాబట్టి దానికి తగ్గట్టే వ్యాయామం ఎక్కువ చేస్తారు. దశాబ్దాల క్రితం కొనుక్కున్న చిన్నపాటి ఇంట్లోనే ఉంటున్నారు. సోషల్‌ మీడియాకు దూరం. బ్రిడ్జ్‌ ఆట అంటే ప్రాణం. ఎంతలా అంటే.. ‘‘నేనొకసారి బ్రిడ్జ్‌ ఆడటం మొదలెట్టానంటే నా పక్క నుంచి ఒక అమ్మాయి నగ్నంగా నడిచిపోతున్నా నాకు పట్టదు..’’ అంటారు సరదాగా!

ఓప్రా విన్‌ఫ్రే
చిన్నచిన్న ఆనందాలే జీవితం!

మనకు దక్కిన దానితో సంతోషంగా ఉంటే ఇంకా ఎక్కువ పొందగలుగుతాం. లేని దాని మీదే దృష్టి పెడుతుంటే.. ఎప్పటికీ కావాల్సినంత పొందలేం!’’ అన్నదే ఓప్రా చెప్పే సూత్రం.

టీవీ వ్యాఖ్యాతగా మొదలుపెట్టి ప్రపంచ ఖ్యాతి, సంపదలను సొంతం చేసుకున్న ఓప్రా విన్‌ఫ్రే.. రోజు గడిపే తీరు చూస్తే జీవితంలోని ప్రతి చిన్న అంశంలోనూ ఇంతటి ఆనందాన్ని పొందచ్చా? అని ఆశ్చర్యం వేస్తుంది. సముద్రం దగ్గర్లోనే 65 ఎకరాల సువిశాలమైన తోటలో ఉంటుంది ఓప్రా ఇల్లు. పొద్దున్నే 7.10కి లేచి.. ఒక్కసారి కిటీకీలోంచి నులివెచ్చటి కిరణాల్లో మెరుస్తున్న తోటను చూస్తారు ఓప్రా. ‘‘దీంతో కాఫీ కూడా తాగక ముందే నాకు బోలెడంత ఉత్తేజం వచ్చేస్తుంది’’ అంటారామె. 8కల్లా బ్రషింగ్‌ చేసుకుని తమ ఐదు కుక్కలను తీసుకుని తోటలోకి వెళతారు. 8.30కల్లా ధ్యానం. ‘‘మా ఇంటిచుట్టూ 3000 చెట్లుంటాయి. ధ్యానం కోసం ఆ మధ్యలోనే ఒక చిన్న రాయి మీద కూర్చున్నప్పుడు నాకింతకంటే ఏం కావాలనిపిస్తుంది’’ అంటారామె. 9కి ఇంటి చుట్టూ పరుగు, కొన్ని వ్యాయామాలు. 10.30కల్లా షూటింగులు, మీటింగులు మొదలెట్టేస్తారు. ఒక్క గురువారం మాత్రం తోటలోకి వెళ్లి పండ్లు కోసుకోటం, దుంపలు తవ్వుకోటం వంటి పనుల్లో నిమగ్నమవుతారు. 12.30కి భోజనం. తమ పెరట్లో పెంచే వీలున్న ఏ వస్తువునూ బయటి నుంచి కొనరు! 1.30కి వాణిజ్య సమీక్షలు. ఎన్ని చెక్కులున్నా తనే సంతకం పెట్టాలి. ‘‘పేదరికం నుంచి వచ్చిన దాన్ని కదా.. నా డబ్బు మరొకరి చేతుల్లో పెట్టలేను. కరెంటు బిల్లుల నుంచి ప్రతిదీ నాకు తెలియాల్సిందే’’ అంటారు. 4 కల్లా తాము ఇష్టంగా కట్టుకున్న టీహౌస్‌కు వెళ్లి పుస్తకాల్లో, కవిత్వంలో మునిగిపోతారు. 6 గంటలకు భోజనం. ఇంతటి ప్రపంచ ప్రఖ్యాత టీవీ తార.. తన జీవితంలో కొన్ని వారాల పాటు అస్సలు ఇంట్లో టీవీ ఆన్‌ చెయ్యకుండానే గడిపేస్తారు! 9.30కి నింపాదిగా స్నానం, నిద్ర. ‘‘అంతా అనొచ్చు.. ఓప్రాలాగా అన్నీ ఉంటే మేమూ ఇలాగే గడుపుతామని. కానీ చాలా ఏళ్లు నేను చీకట్లోనే పనికెళ్లి, మళ్లీ చీకట్లోనే తిరిగొచ్చేదాన్ని. పగటి ఆకాశం ఎలా ఉంటుందో తెలీని రోజులెన్నో! అందుకే ఇప్పుడు నేను ప్రతి చిన్న అంశాన్నీ తీరిగ్గా పట్టించుకుని, వాటి నుంచి కూడా ఆనందాన్ని పొందుతున్నా’’ అంటారామె.

స్టీవ్‌ జాబ్స్‌
ఉదయపు శక్తి వృథా కానివ్వద్దు!

నాకు ఉదయం లేస్తూనే చాలా ఉత్సాహంగా ఉంటుంది. అప్పుడు ఆఫీసుకు బయల్దేరితే ఆ శక్తి అంతా ప్రయాణంలోనే వృథాపోతుంది. అందుకే 6 గంటలకల్లా లేచి.. పిల్లలు లేవక ముందే ఇంట్లోనే కొంత పనిచేసేస్తా’’

టెక్నాలజీ అన్నది ‘యాపిల్‌’లా ఏకకాలంలో అందంగా, పొందికగా, సర్వసమర్థంగా ఉండొచ్చని నిరూపించి, ప్రపంచాన్ని సమ్మోహనపరిచిన సంచలన సాంకేతిక రుషి... స్టీవ్‌ జాబ్స్‌. ఆయన రోజు ఎలా గడిపేవారు? ఓసారి స్టాన్‌ఫోర్డ్‌లో మాట్లాడుతూ ‘‘గత 33 ఏళ్లుగా ప్రతి రోజూ లేస్తూనే అద్దం ముందు నిలబడి నా జీవితంలో ఇదే ఆఖరి రోజైతే.. అప్పుడూ నేనివాళ చెయ్యబోతున్న పనులనే చేస్తానా? అని ప్రశ్నించుకుంటున్నా. ఎప్పుడన్నా వరసగా 2, 3 రోజులు ‘కాదన్న’ సమాధానం వచ్చిందంటే మాత్రం పద్ధతి మార్చుకోవాలనే అర్థం’’ అని చెప్పారు. స్టీవ్‌ 6 గంటలకే లేచి ఇంట్లోనే పని మొదలెడతారు. 7.30కి కుటుంబ మంతా కలిసి డ్రైఫ్రూట్స్‌, సాలడ్స్‌ తింటారు. అక్కడ్నుంచి పిల్లలు స్కూలుకు వెళితే జాబ్స్‌ మళ్లీ పనిలోకి వెళ్లిపోతారు. దాదాపు 2 గంటలు ఇంటి నుంచే పని చేసి, అప్పుడు ఆఫీసుకు చేరేవాళ్లు. ప్రతిరోజూ నల్ల టీషర్టు, బ్లూ జీన్సే! ఆఫీసులో సోమ, బుధవారాలు తప్పనిసరిగా కీలక సారధులతో సమావేశమై సమీక్ష చేసేవాళ్లు. అంత పెద్ద సాంకేతిక దిగ్గజమైనా ఆయనేనాడూ స్కైప్‌, వీడియో ఛాట్‌ల వంటివి ఇష్టపడింది లేదు. ‘‘ముఖాముఖీ కలవాలి. కళ్లలోకి చూడాలి, చెప్పేది వినాలి, కోపమొస్తే అరవాలి, అవసమైతే హత్తుకోవాలి. నిజాయతీగా మనస్సులో ఏం ఆలోచిస్తున్నారో తెలియాలి’’ అనేవారు. మధ్యాహ్నం ఆపిల్స్‌, క్యారెట్ల వంటివే తినేవారు. 1.30-3 మధ్య పూర్తిగా డిజైన్‌ ల్యాబ్‌లో తలమునకలు. 3 గంటలకు మెయిల్స్‌, ఫోన్‌ కాల్స్‌ చూసుకునేవాళ్లు. తన మెయిల్‌ ఐడీని అందరికీ చెప్పేశారు. దీంతో ఫిర్యాదులు, ఫీడ్‌బ్యాక్‌లు చాలానే వచ్చేవి. సగటున రోజూ ఒక 100 మెయిల్స్‌, 10 ఫోన్‌ కాల్స్‌కు బదులిచ్చేవాళ్లు. సాయంత్రం 5.30కి ఇంటి దగ్గర కుటుంబంమంతా భోజనానికి కూర్చునేది. 6.30 నుంచీ నడక. రాత్రి 10 గంటలకు సంగీతం వింటూ నిద్రకు ఉపక్రమించటం! తీవ్ర అనారోగ్యంతో మరణించే వరకూ కూడా ఇదే జాబ్స్‌ దినచర్య. పార్టీలకూ వెళ్లే వారు కాదు. పని, కుటుంబం తప్పించి తనకేం పట్టవని జాబ్స్‌ స్వయంగా చెప్పేవాళ్లు!

బిల్‌ గేట్స్‌
ఎవరు వారించినా ఆ పని నాకిష్టం!

మీతో ప్రతినిత్యం సన్నిహితంగా ఉన్నవాళ్లు సంతోషంగా ఉన్నారా? వాళ్లు మిమ్మల్ని ప్రేమిస్తున్నారా? లేదా? అన్నదే మీ విజయానికి కొలమానం’’ అంటారు గేట్స్‌.

ఈ భూమండలం మీదే అత్యంత సంపన్నుడు, మైక్రోసాఫ్ట్‌ సామ్రాజ్యాధినేత బిల్‌ గేట్స్‌ రోజు ఎలా గడుపుతారు? ముందు ముగింపు నుంచి మొదలెడదాం. ప్రతి రాత్రీ భోజనం చేసి, పడుకోబోయే ముందు బిల్‌ గేట్స్‌ తమ ఇంట్లో గిన్నెలు కడిగి, వాటిని శుభ్రం చేస్తుంటారు. ‘‘ఇంట్లో నన్ను వద్దని వారిస్తుంటారుగానీ ఈ పని చెయ్యటం నాకిష్టం’’ అంటారు గేట్స్‌. మైక్రోసాఫ్ట్‌ బాధ్యతలను తగ్గించుకుని.. మానవాళి అభ్యున్నతి కోసం దాతృత్వ కార్యక్రమాలను చేపట్టి భార్య మిలిండాతో కలిసి ప్రపంచమంతా తిరుగుతున్న గేట్స్‌.. ఇప్పటికీ ఇంటివద్ద ఉంటే మాత్రం తన దినచర్యను కచ్చితంగా పాటిస్తారు. పుస్తక పఠనం ఒక్కటే మనల్ని చురుగ్గా ఉంచుతుందని నమ్మే గేట్స్‌.. ఏడాదికి 50 పుస్తకాలైనా చదువుతారు. వాటి గురించి ‘గేట్స్‌ నోట్స్‌’ పేరుతో బ్లాగులో రాస్తారు. ‘‘సమస్యేమంటే పుస్తకాలు చదువుతూ రాత్రి పొద్దుపోయే వరకూ మేల్కొని ఉన్న రోజున.. మర్నాడు ఇబ్బందిపడతా. నాకు రోజూ 7 గంటల నిద్ర అవసరం. అప్పుడే పనులన్నీ సక్రమంగా చెయ్యగలుగుతా’’ అని చెబుతారు గేట్స్‌. లేస్తూనే  రోజూ ట్రెడ్‌ మిల్‌ మీద ఒక గంట వ్యాయామం చేస్తూ రకరకాల వైజ్ఞానిక వీడియోలు చూస్తుంటారు. ఇష్టమైతే ఇంటి పక్క కోర్టులో టెన్నిస్‌ ఆడతారు. తర్వాత పత్రికలు తిరగేస్తారు. ‘‘ఉదయాన్నే చదవటానికి ఆసక్తికరమైనది ఎదురుగా ఉండటం గొప్ప విషయం’’ అంటారాయన. వేగంగా పని మొదలెట్టాలని చూస్తూ.. చాలాసార్లు బ్రేక్‌ఫాస్ట్‌ మానేస్తుంటారు. పని గంటలను ఐదైదు నిమిషాలుగా విభజించుకుని, ప్రతి నిమిషానికీ ప్రణాళిక వేసుకోవటం గేట్స్‌ అలవాటు. మధ్యాహ్న భోజనంలో ఇష్టమైన ఛీజ్‌ బర్గర్‌ ఉంటే చాలు. పని, చదువు.. ఈ రెండూ లేనప్పుడు తమ ముగ్గురు పిల్లలతో గడుపుతారు. కొడుకును తీసుకుని క్షిపణి కేంద్రాల వంటి ప్రదేశాలకు వెళుతుంటారు. ప్రతి ఏడాది మొదట్లో కొన్ని లక్ష్యాలు పెట్టుకుంటారు. ఈ ఏడాది విద్యారంగంలో టెక్నాలజీని వాడటం ఎలా? అన్న సవాల్‌ మీద పని చేస్తున్నారు.

 

చివరాఖరికి..
ఇదీ విజేతల అనుదిన సూత్రం!

ఎంత బిజీగా గడుపుతున్నా.. నిద్ర, కుటుంబం, వ్యాయామం, చదువు.. ఈ నాలుగింటికీ  సమయం కేటాయించటం వల్ల పని సామర్థ్యం, పనిలో నాణ్యత మెరుగు పడుతుందేగానీ ఇవి పనికి అవరోధాలు కావన్నది విజేతల  దినచర్య చెబుతున్న విస్పష్ట సూత్రం!!

బిల్‌ గేట్స్‌.. జుకర్‌బర్గ్‌.. స్టీవ్‌ జాబ్స్‌.. వారెన్‌ బఫెట్‌.. ఓప్రా విన్‌ఫ్రే... జీవితంలో వీరంతా విజేతలు కావొచ్చు. ప్రపంచ సంపన్నులుగా అసమాన శిఖరాలనూ చేరుకుని ఉండొచ్చు. కొందరు పొద్దున్నే ఆరింటికే లేస్తుండొచ్చు.. కొందరు 8 వరకూ లేవకపోవచ్చు. కొందరు పండ్లూ కూరలే తింటుండొచ్చు.. మరికొందరు మీటింగుల మధ్య 5 నిమిషాల్లోనూ తిండి అయ్యిందనిపిస్తుండొచ్చు.. ఎవరి అలవాట్లు వారివే కావొచ్చు గానీ ఈ విజేతల జీవితాల నుంచి మనం గ్రహించటానికి వీలున్న సూత్రాలేమైనా ఉన్నాయా?? కచ్చితంగా ఉన్నాయంటున్నారు మనస్తత్వ విశ్లేషకులు! అవేమిటో చూద్దాం!!
* మొదటిది క్రమం తప్పని దినచర్య. ఎవరి దైనందిన అలవాట్లు చూసినా.. తామెంత బిజీగా ఉన్నా కూడా.. ప్రతి రోజూ క్రమం తప్పకుండా ఒక పద్ధతిని పాటించటమన్నది అందర్లో స్పష్టంగా కనబడుతుంది.
* రెండోది మనసు ఉత్తేజంగా, పని సామర్థ్యం ఎక్కువగా ఉండే ఉదయాన్ని ఎవరూ వృథాగా పోనివ్వటం లేదు. ఉదయాన్నే ఏం చెయ్యాలన్న ప్రణాళిక చాలా పకడ్బందీగా ముందే తయారు చేసుకుంటున్నారు. ఉదయం ఉత్సాహభరింతగా మొదలైతే ఆ రోజు వృథాగా గడిచిపోయే అవకాశాలు చాలా తక్కువ. అందుకే ఉదయపు ప్రణాళిక ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి.
* మూడోది, రోజులో ప్రతి నిమిషమూ ముఖ్యమైనదే అని గుర్తించటం. రోజు మొత్తాన్ని గంటలు, నిమిషాలుగా విభజించుకుని ప్రణాళిక వేసుకోవటం, ముఖ్యంగా చేసే పని మీదే అకుంఠిత దీక్షతో.. తదేకంగా దృష్టి పెట్టటం.. అందరిలో కచ్చితంగా కనబడే లక్షణం. దృష్టి మరలకుండా ఉండేందుకు వీళ్లు దుస్తుల వంటి వాటి మీద కూడా ఎక్కువ సమయం వృథా చేసుకోవటం లేదు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.