close

ప్ర‌త్యేక క‌థ‌నం

నిప్పుతో చెలగాటం

అగ్నిమాపకశాఖలో వేధిస్తున్న సిబ్బంది కొరత
ఇప్పటికీ 18 శాసనసభ స్థానాల్లో ఫైర్‌స్టేషన్లు కరవు
ఈనాడు - హైదరాబాద్‌

ఓ వైపు ఎండలు మండుతున్నాయి. ఇదే సమయంలో అగ్ని ప్రమాదాల ముప్పు పొంచి ఉంది. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు కాపాడాల్సిన అగ్నిమాపకశాఖ మాత్రం సమర్థంగా సేవలను అందించలేకపోతోంది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత పరిస్థితి కొంత మెరుగుపడినప్పటికీ ఇంకా ఫైర్‌స్టేషన్లు లేని శాసనసభ నియోజకవర్గాలు 18 ఉన్నాయంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు ఉన్నవాటిల్లోనూ సిబ్బంది కొరత వేధిస్తోంది. గతేడాది గణాంకాలు పరిశీలిస్తే సగటున రోజుకు రూ.70 లక్షలకు పైగా ఆస్తి అగ్నికి ఆహుతైంది. ప్రతి నాలుగు రోజులకు ముగ్గురు చొప్పున అగ్నిప్రమాదాలకు బలయ్యారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 94 ఫైర్‌స్టేషన్లు పనిచేస్తున్నాయి. వీటిలో 28 ఒక్క హైదరాబాద్‌, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లోనే ఉన్నాయి. ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో అయితే ఏడు చొప్పున మాత్రమే ఫైర్‌స్టేషన్లు పని చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 22 మంజూరు చేసింది. ఏదైనా అగ్నిప్రమాదం జరిగితే సమీపంలోని ఫైరింజిన్‌ సంఘటనా స్థలానికి చేరుకోవడానికి కనీసం అరగంట పడుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఫైర్‌స్టేషన్లు దూర ప్రాంతంలో ఉంటున్నాయి.

గ్రామాల్లో ఘోరం
*  ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో ఎక్కడైనా అగ్నిప్రమాదం జరిగితే 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న సత్తుపల్లి లేదంటే వైరా నుంచి అగ్నిమాపక వాహనం రావాల్సిందే.
* భూపాలపల్లిలో ప్రమాదం జరిగితే 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ములుగు నుంచి రావాలి. జిల్లా కేంద్రం అయినప్పటికీ ఇక్కడ ఫైర్‌స్టేషన్‌ లేదు. ఇటీవల మంజూరు చేసినా ఇంకా అందుబాటులోకి రాలేదు.
* భూపాలపల్లి జిల్లా సరిహద్దు ప్రాంతమైన వెంకటాపూర్‌లో ప్రమాదం జరిగితే 100 కి.మీ. దూరంలోని ములుగు నుంచి అగ్నిమాపక శకటం రావాల్సిందే. ఇంచుమించు ప్రతి జిల్లాలోనూ ఇదే పరిస్థితి.

వేధిస్తున్న డ్రైవర్ల సమస్య
అగ్నిమాపకశాఖను సిబ్బంది సమస్య తీవ్రంగా వేధిస్తోంది. మొత్తం 2,222 సిబ్బందికిగాను ప్రస్తుతం 1430 మంది మాత్రమే ఉన్నారు. 792 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో కీలకమైన ఫైర్‌మెన్‌ పోస్టులు 495 ఖాళీగా ఉన్నాయి. ప్రమాదం జరిగితే మంటలు ఆర్పేది వీళ్లే. దీనికంటే ముఖ్యమైన డ్రైవర్‌ పోస్టులు 188 ఖాళీగా ఉన్నాయి. అగ్నిమాపకశాఖ వద్ద అన్ని రకాల వాహనాలు కలిపి (ద్విచక్రవాహనాలు కాకుండా) 340 వరకు ఉన్నాయి. డ్రైవర్లు మాత్రం 387 మందే ఉన్నారు. అధికారుల వాహనాలు నడిపేది కూడా వీరే. వీరిలో ఎవరైనా సెలవు పెడితే వాహనాలు మూలనపడాల్సిందే.

పరిధి 35 కి.మీ.
ఒక్కో ఫైర్‌స్టేషన్‌ కనీసం సగటున 35 కిలోమీటర్ల పరిధిలో పనిచేయాల్సి వస్తోంది. పట్టణప్రాంతాల్లో పక్కపక్కనే ఫైర్‌స్టేషన్లు ఉన్నా ట్రాఫిక్‌ సమస్య కారణంగా ఇక్కడ కూడా ఇంచుమించు అంతే సమయం పడుతోంది. హైదరాబాద్‌ నగరంలో అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు ట్రాఫిక్‌ సమస్యను దృష్టిలో పెట్టుకొని తుంపర్లు వెదజల్లే ద్విచక్రవాహనాలు అందుబాటులోకి తెచ్చారు. అయితే వీటి పనితీరు పరిమితం. ప్రారంభదశలో మంటలు అదుపుచేయడానికి మాత్రమే పనిచేస్తాయి. ఈలోపు అగ్నిమాపక శకటం సంఘటనా స్థలానికి చేరుకోవాల్సి ఉంటుంది.

పాతవాటితోనే సరి
15 ఏళ్ల గడువు పూర్తయిన వాహనాలు వాడకానికి పనికిరావు. పైగా అత్యవసర పరిస్థితుల్లో పనిచేసే అగ్నిమాపక శకటాలయితే ఎప్పుడూ సమర్థంగా పనిచేయాల్సిందే. కానీ ఈ శాఖ వద్ద 15 ఏళ్లు పూర్తయిన అగ్నిమాపక శకటాలు 38 ఉన్నాయి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.