close

ప్ర‌త్యేక క‌థ‌నం

గడప దాటితే గండమే..!

27 నెలల్లో రాష్ట్రంలో 4,276 మంది అమ్మాయిల అదృశ్యం
2,448 మంది ఆచూకీ మాత్రమే లభ్యం
మిగతా 1,828 మంది ఏమయ్యారో తెలియదు
దర్యాప్తుపై పోలీసుల ఉదాసీనత
ఈనాడు - అమరావతి

విశాఖ జిల్లా చోడవరం..
ఓ ఎనిమిదో తరగతి విద్యార్థిని ఉదయాన్నే పాఠశాలకు వెళ్లింది. ప్రభుత్వోద్యోగులైన ఆ బాలిక తల్లిదండ్రులు.. రోజంతా పనిచేసి సాయంత్రానికి ఇంటికి చేరుకున్నారు. కన్నకూతురు ఇంకా రాలేదన్న పిడుగులాంటి సమాచారం వారిని భయాందోళనకు గురిచేసింది. సాయంత్రం ఆరైంది.. రాత్రి ఏడు దాటింది.. అర్ధరాత్రయినా ఆచూకీలేదు. తెలిసీతెలియని వయసులో.. లోకంపోకడ పసిగట్టలేని మనసుతో ఆ చిట్టితల్లి ఏమైందోనని ఒక్కటే ఆందోళన. తెలిసిన వారు.. తెలియని వారు తేడా లేకుండా.. చెట్టనకా.. పుట్టనకా.. అంతా గాలించారు. అయినా బాలిక జాడ లేదు. బరువెక్కిన హృదయంతో.. పోలీసుస్టేషన్‌ మెట్లెక్కి ఫిర్యాదు చేస్తే.. ‘మిస్సింగ్‌ కేసేగా’ అంటూ పోలీసులు చిన్నచూపు చూశారు. పాఠశాలలోని ఉపాధ్యాయుడి ప్రమేయం ఉందని అనుమానించినా.. ఎస్‌ఐ పట్టించుకోలేదు. అలా బాలిక అదృశ్యమై.. ఏడాది గడిచిపోయింది.. స్టేషన్‌కు వెళ్లిన ప్రతిసారీ పోలీసుల నుంచి నిర్లక్ష్య సమాధానమే..! చివరికి ఆ తల్లిదండ్రులు రాష్ట్ర డీజీపీని కలిశారు. ఆయన ప్రత్యేక దర్యాప్తు బృందం వేశారు. అప్పటికే పరిస్థితి చేయిదాటి ఒక్క ఆధారమూ సేకరించలేకపోయారు. ఈ ఘటన జరిగి నాలుగేళ్లయింది.. కంటికి రెప్పలా పెంచుకున్న కూతురు ఇన్నేళ్లుగా ఏమైందో తెలియక.. ఆ తల్లిదండ్రులు నిత్యం శోకిస్తూనే ఉన్నారు.

ఎప్పుడన్నా ఎవరన్నా తలుపు తడితే.. కూతురే కొట్టిందేమోనని.. ఇంటి గేటు శబ్దం వినిపిస్తే.. అమ్మాయే అడుగుపెట్టిందేమోనని.. ఆశగా తొంగిచూసిన ప్రతిసారీ కన్నీరే మిగులుతోంది... ఇది ఆ ఒక్క తల్లిదండ్రుల వ్యథే కాదు.. రాష్ట్రంలో బాలికల అదృశ్యం వెనుక ఎన్నో కుటుంబాలు పడుతున్న వేదనకు నిదర్శనం..విచారణలో పోలీసుల నిర్లక్ష్యానికి నిలువుటద్దం. తెలంగాణలోని హాజీపూర్‌ ఘటన నేపథ్యంలో మన రాష్ట్రంలో బాలికల అదృశ్యం వెనుక జరుగుతున్న తంతుపై ‘ఈనాడు’ సమగ్ర కథనం

రాష్ట్రంలో బాలిక అదృశ్యం ఎంతో వేదనను మిగుల్చుతోంది. కొన్ని వేల కుటుంబాలలో పిల్లలు మాయమవుతున్న తీరుతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. కంటికి రెప్పలా కాచుకున్న తమ పిల్లలు ఏమయ్యారో తెలియక అంతులేని క్షోభ మధ్యే బతుకీడుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గత మూడేళ్లలో అదృశ్యమైన 18 ఏళ్లలోపు బాలికల్లో 1,828 మంది ఆచూకీ ఇప్పటికీ తెలియని అయోమయ స్థితి. వారు ఎక్కడున్నారో, ఏమయ్యారో అంతుపట్టని దుస్థితి. 2017 జనవరి నుంచి ఈ ఏడాది మార్చి వరకూ రాష్ట్రంలో 4,276 మంది బాలికలు అదృశ్యం కాగా  2,448 మంది ఆచూకీ మాత్రమే లభ్యమైంది. తప్పిపోయిన వారిలో 42.57శాతం మంది జాడ ఇప్పటికీ తెలియని ఆందోళనకర పరిస్థితి. పోలీసు శాఖ సమస్య తీవ్రతను గుర్తించలేకపోతోంది. మూలాలను ఛేదించి దాని వెనుకనున్న వ్యవస్థీకృత దందాను బయటపెట్టలేకపోతోంది. ఈ ఉదాసీనత ఫలితంగానే అదృశ్యమవుతున్న బాలికల సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. కొన్ని సందర్భాల్లో వారి కథ విషాదాంతమవుతోంది. నేరాల పెరుగుదలకు కారణమవుతోంది.

ఫిర్యాదిచ్చేందుకు వెళితే సూటిపోటి మాటలే!
బాలికలు కనిపించటంలేదంటూ ఫిర్యాదు ఇవ్వటానికి వెళ్లే తల్లిదండ్రులకు ఎక్కువ సందర్భాల్లో పోలీసుల నుంచి సూటిపోటి మాటలే ఎదురవుతున్నాయి. కొన్నిచోట్ల ఛీదరింపులు, ఛీత్కారాలు తప్పటం లేదు. కొందరు పోలీసులు అసలు ఫిర్యాదులను స్వీకరించకపోవటం, కేసులు నమోదు చేయకపోవటం, దర్యాప్తుపై దృష్టిపెట్టకపోవటం వంటివి నిత్యకృత్యమవుతున్నాయి. అదృశ్యమవుతున్న బాలికల జాడను కనిపెట్టే విషయంలో ఇవన్నీ ఆటంకాలవుతున్నాయి. 2017 జనవరి నుంచి ఈ ఏడాది మార్చి వరకూ రాష్ట్రవ్యాప్తంగా 4,276 మంది బాలికలు అదృశ్యం కాగా.. 3,528 కేసుల్లోనే ఎఫ్‌ఐఆర్‌లు నమోదుకావటం గమనార్హం.

సత్వర స్పందన కరవు!
బాలికలు అదృశ్యమైనట్లు కేసులు నమోదైనా సత్వర దర్యాప్తు జరగటం లేదు. మీడియాలో సంచలనమైతోనే లేదా ఉన్నతాధికారుల ఒత్తిడి ఉంటేనో తప్ప  పోలీసులు దర్యాప్తుపై దృష్టిపెట్టటం లేదు. మిగతా కేసులను పట్టించుకునే పరిస్థితి ఉండటం లేదు. ఎక్కువ సందర్భాల్లో బాధితులు వారంతట వారు ఇంటికి చేరుకోవటమో లేదా తల్లిదండ్రులో, కుటుంబ సభ్యులో వెతికి వారి ఆచూకీ కనుక్కోవటమో జరుగుతోంది. దర్యాప్తు జాప్యమవుతున్న కొద్దీ ఆధారాలు లభించక అదృశ్యం కేసుల పరిష్కారం మరింత జటిలమైపోతోంది. పిల్లల ఆచూకీ కోసం పోలీసుస్టేషన్‌కు పదేపదే వెళ్లేవారికి అప్పుడు సైతం ఛీత్కారాలు తప్పటం లేదు.

హాజీపూర్‌ ఘటన మనకో పాఠం కావాలి!
బాలికల అదృశ్యం కేసుల నమోదు, దర్యాప్తు విషయాల్లో పోలీసు అధికారుల నిర్లక్ష్యం భవిష్యత్తులో ఎంతటి దారుణ నేరాలకు దారితీస్తుందో చెప్పేందుకు ఇటీవల తెలంగాణలోని హాజీపూర్‌లో వెలుగుచూసిన ఘటనలే నిదర్శనం. ఆ గ్రామంలో నాలుగేళ్ల కిందట కల్పన అనే బాలిక అదృశ్యమైంది.ఆమె తల్లిదండ్రులు అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేసినా వారి నుంచి పెద్దగా స్పందన లేదు. తర్వాత అదే గ్రామంలో మనీషా, శ్రావణి అనే మరో ఇద్దరు బాలికలూ కనిపించకుండా పోయారు. శ్రావణి అదృశ్యం కేసు దర్యాప్తులో ఆమె హత్యాచారానికి గురైనట్లు తేలింది. నిందితుడు శ్రీనివాసరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించినప్పుడు..కల్పన, మనీషాలపై అత్యాచారానికి పాల్పడి హత్యచేసింది కూడా అతగాడేనని తేలింది. అదే నాలుగేళ్ల కిందట కల్పన అదృశ్యమైనప్పుడే పోలీసులు సరిగ్గా స్పందించి సత్వర దర్యాప్తు చేసుంటే శ్రీనివాసరెడ్డి ఉన్మాదానికి మరో ఇద్దరు అమాయక బాలికల జీవితాలు బలైవుండేవి కాదు. అందుకే ఈ ఘటన ఏపీ పోలీసులకు ఒక పాఠం కావాలి. అదృశ్యం కేసుల విషయంలో నిర్లక్ష్యం, ఉదాసీనతలు వీడి..సత్వర దర్యాప్తుపై దృష్టిపెట్టాలి. సమస్య మూలాలను పట్టుకొని ఒక్క కేసును పరిష్కరించగలిగినా.. ఎంతోమంది బాలికలను ముప్పు నుంచి తప్పించే వీలుంటుందనేది గ్రహించాలి.

మిస్సింగ్‌ కేసులు.. విషాదాంతాలు
ఆంధ్రప్రదేశ్‌లో అదృశ్యమవుతున్న బాలికల్లో చాలా మంది కథలు విషాదాంతాలవుతున్నాయి. కొందరు లైంగిక దోపిడీ బారినపడి వ్యభిచార గృహాల్లోనో, అక్రమ రవాణా ముఠాల చేతుల్లోనే మగ్గిపోతున్నారు..మరికొందరు బలవంతపు పెళ్లిళ్ల పేరిట మోసపోతున్నారు.

ఇంకొందరైతే.. దుర్మార్గుల దాష్టీకానికి ప్రాణాలు కోల్పోతున్నారు. తెలిసీతెలియని వయసు కావటం, ఎదురుతిరిగే పరిస్థితి లేకపోవటంతో ఈ వయసు బాలికలను దుర్మార్గులు ఎక్కువగా లక్ష్యంగా చేసుకుంటున్నారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా.. బాలికల అదృశ్యం కేసులను పోలీసులు బాధిత కుటుంబాల వ్యక్తిగత సమస్యగా చూస్తున్నారు. ఇందులో వ్యవస్థీకృత ముఠాల పాత్ర ఏమైనా ఉందా? అనేదానిపైన లోతుగా వెళ్లటం లేదు. గతంలో జరిగిన సంఘటనలనూ కూలంకషంగా విశ్లేషిస్తే.. ఈ అదృశ్య కేసుల వెనుకనున్న అసలు కథలు వెలుగుచూస్తాయి. కానీ, ఆ దిశగా అంతగా ప్రయత్నాలు  జరగటం లేదనటం చేదు నిజం.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.